తరాలు మారుతున్నా స్త్రీపురుషుల మధ్య అంతరాలు మాత్రం మారడంలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వందేళ్ళు దాటినా మహిళల బతుకులు అధ్వాన్నంగానే ఉన్నాయి. గణనీయమైన ఆర్థికాభివృద్ధి రేటు సాధిస్తున్నా, ప్రపంచ శతకోటీశ్వర్లలో భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా దేశంలోని మహిళల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతూనే ఉంది. అవమానాలు, మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, నిత్యం దేశంలో ఏదో ఒక చోట మహిళలపై జరిగిపోతూనే ఉన్నాయి.
వివిధ రూపాల్లోని లైంగిక హింసల నివారణ కోసం చేసిన చట్టాలన్నీ అమలుకు నోచుకోక కాగితాలకే పరిమితమై పోతున్నాయి. మహిళలపై అణచివేత కొత్త కొత్త రూపాలలో ముందుకొస్తున్నదే గానీ ఏ మాత్రం తగ్గడంలేదు. సమాజంలో సగంగా ఉన్న స్రీలు ప్రపంచవ్యాపితంగా రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. ఆసిడ్ దాడులు, గృహ హింస, వరకట్న వేధింపులు, పరువు హత్యలు, భ్రూణ హత్యల పేరిట వారికి అభద్రత ఎదురవుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర సకల జీవిత రంగాల్లో స్త్రీలపై పురుషాధిపత్యం కొనసాగుతూనే ఉంది. సమాజంలోని వర్గ, కుల అణచివేతలతో పాటు మహిళలు అదనంగా పురుషాధిక్యతకు గురవుతున్నారు.
1857లో న్యూయార్క్‌లోని బట్టలు, దుస్తుల పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అమానుషమైన పనిపరిస్థితులకు (లింగ, వర్గ దోపిడి) వ్యతిరేకంగా చేసిన పోరాటంనుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవతరించింది. అయితే మహిళా దినోత్సవాలు క్రమంగా ఆనాటి స్ఫూర్తిని కోల్పోయి నేడు ఫ్యాషన్ షోలు, ముగ్గుల పోటీలు, పురస్కారాలకు పరిమితమైనాయి. ఆనాటి పోరాటం అసంపూర్తిగానే ఉండి పోయింది. అయితే ఇన్నేళ్ళుగా వివిధ రూపాల్లో సాగిన మహిళా ఉద్యమాలు పూర్తిగా నిరర్ధకం కాలేదు.
చదువుల్లోను, ఉద్యోగాల్లోను, సామాజిక ఉద్యమాల్లోనూ స్త్రీలు ముందంజలో ఉన్నారు. రాజకీయాల్లో, వ్యాపారరంగంలో, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో స్త్రీల శక్తిసామర్ధ్యాలను, ప్రతిభను వ్యక్తిగత స్థాయిల్లో సమాజం గుర్తిస్తోంది. మరోవైపు సామాజికంగా నేటికీ వారిపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజం నేటికీ స్త్రీని పిల్లల్ని కనే యంత్రంగా, కుటుంబపు పనిమనిషిగానే చూస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని, ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను చిదిమేస్తోంది.
'ఆకాశంలో సగం'గా కీర్తించే స్త్రీ ప్రపంచ సంపదలో ఒక్క శాతానికి మాత్రమే హక్కుదారుగా ఉంది. సంపద సృష్టిలో పురుషునికంటె స్త్రీలే అధికంగా కష్టపడుతున్నారు. ప్రపంచ పనిగంటలలో మహిళల శ్రమ 67 శాతంగా ఉన్నప్పటికీ ఆదాయంలో వారు కేవలం పది శాతం మాత్రమే పొందుతున్నారు. అనుత్పాదక గృహ శ్రమ రూపంలో వారు పెద్దఎత్తున శ్రమదోపిడికీ గురిఅవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ భ్రూణ హత్యలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తిలో అగ్రగాములుగా ఉన్న చైనా, భారత్‌లు స్త్రీ భ్రూణ హత్యలలో కూడా అగ్ర స్థానంలో ఉన్నాయి.
దశాబ్ద కాలంలో చైనాలో రెండున్నర కోట్ల భ్రూణ హత్యలు జరుగగా, భారత్‌లో ఒకటిన్నర కోట్లు జరిగాయి. స్త్రీ-పురుష నిష్పత్తి ప్రమాదకరమైన స్థాయికి పడిపోయి, మరో సామాజిక విపత్తు ముంచుకొస్తోంది. ఆర్థిక సంస్కరణల ఫలితంగా పారిశ్రామిక రంగ ప్రాధాన్యం పెరిగి, వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అత్యధిక గ్రామీణ కుటుంబాలు బతుకుదెరువు కోసం పట్టణాల బాట పట్టారు.
దాంతో వ్యవసాయ సంస్కృతి స్థానంలో స్వలాభంతో కూడిన డబ్బు సంబంధాలు ప్రబలంగా ముందుకు వచ్చాయి. ఆడశిశువు ఆర్థికంగా లాభసాటి కాకపోవడం, పైగా వరకట్న భారం కారణంగా భ్రూణ హత్యలు పెరిగిపోయాయి. గత ఏడాది న్యూస్ వీక్ అనే ప్రముఖ పత్రిక మహిళ స్థితిగతులపై రూపొందించిన 165 దేశాల జాబితాలో భారత్ 141వ స్థానంలో ఉంది. దక్షిణాసియా దేశాల్లో కంటె భారత్‌లో స్త్రీల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభపు ప్రతికూల ప్రభావం స్త్రీ, శిశువులపై ప్రధానంగా ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలలో 'వాల్ స్ట్రీట్ ఉద్యమం', 'అరబ్ వసంతం' ఉద్యమాల్లోను, లాటిన్ అమెరికా దేశాల్లో విద్యార్థి, కార్మిక తదితర పీడిత ప్రజల ఉద్యమాల్లోను, రష్యా, ఆసియా దేశాల్లో అవినీతికి, ఆర్థిక విధానాలకు వ్యతిరేక ఉద్యమాల్లోను మహిళలు అగ్రభాగాన నిలబడి పోరాడుతున్నారు. దేశంలో సెజ్‌లకు, వివిధ వివాదాస్పద అభివృద్ధి ప్రాజెక్టులకు, గనులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లోను, భూమి, నీరు, అడవి తదితర సహజ సంపదలకోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ ప్రజాఉద్యమాల్లోను, ప్రాంతీయ ఉద్యమాల్లోను మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ ఉద్యమాలను అణచివేయడంలో పాలకుల ఆకృత్యాలకు, అత్యాచారాలకు స్త్రీలు, పిల్లలు ప్రధానంగా బలై పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళా ఉద్యమం వివిధ సామాజిక పోరాటాల్లో మరింతగా అంతర్భాగమై పోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మహిళా కార్యకర్తలపై జరుగుతున్న లైంగిక హింసను, ఇతర హింసలను ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్యమ దిక్షా దినంగా జరుపుకోవాలి.
Andhra Jyothi News Paper Dated 08/03/2012
No comments:
Post a Comment