మేల్కొన్న మనుషులే చరిత్ర సృష్టిస్తారు
బరిగాళ్లను ఉక్కుముళ్లమీద నడిపించిన ఫ్యూడల్ వ్యవస్థను సవాల్ చేసినప్పుడు రక్తసిక్త అధ్యాయం. అరిగోసకు గురయిన గోసిగాళ్లు, గొంగడి గాళ్లే చరిత్ర నిర్మాతలన్న సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51). అదొ క యుద్ధం. ఒక చరిత్ర. నిజాంతో మొదలైన వీరోచిత పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. కొనసాగుతూ ఉన్నది. ఈపోరాటం ఇతివృత్తంగా కథలు, నవలలు,కవిత్వం,నాటకాలు, ప్రజాకళారూపాలు అసంఖ్యాకంగా వచ్చాయి. గౌతంఘోష్ దర్శకత్వంలో బి.నరసింగరావు నిర్మించిన ‘మా భూమి’ సినిమా 23-03-1979నాడు విడుదలయింది. అంటే 32 సంవత్సరాల తర్వాత కూడా ‘మాభూమి’ ‘మన భూమి’ అనిపించే ప్రాసంగికతను కలిగి ఉన్నది.
ఫ్యూడల్ భూస్వాముల క్రౌర్యం, దోపి డీ బడుగు బలహీనవర్గాల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. దౌర్జన్యంగా పేదల భూములను ఆక్రమించే క్రమంలో హత్య కు గురైన నిర్భాగ్యులకు లెక్కేలేదు. పాశవికమైన పన్నులు, వెట్టిచాకిరి, మానభంగాలు నిరుపేదలను సమిధలను చేశా యి. నిరాక్షిశయులను చేశాయి. ఆంధ్ర మహాసభ (సంగం) వీరి పక్షం వహించడంతో ప్రాణాలతో మాత్రమే మిగిలిన వాళ్లలో చైతన్యం రగిలింది. కుందుర్తి, సోమసుందర్, ఆరు ద్ర, కాళోజీ, దాశరథుల కవితాసంపుటాలే కాక ఆళ్వారుస్వామి, మహీధర రామమోహనరావు, బొల్లిముంత శివరామకృష్ణ, లక్ష్మీకాంత మోహన్, రంగాచార్యుల నవలలు కూడా ఈ ఇతివృత్తంతోనే వచ్చాయి. ఈ నవలలమీద మౌలిక విశ్లేషణలతో వచ్చిన అరుదైన పరిశోధన వరవరరావు ‘తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల’. ఇది ఆ తర్వాత ఎందరో పరిశోధకులకు మార్గదర్శనం చేసింది.
కవి, రచయిత, చిత్రకారుడు, ఫోటోక్షిగాఫర్ మాత్రమే కాక సంగీతం కూడా బాగా తెలిసిన నరసింగరావు మంచి పాఠకుడు కూడా. తెలంగాణ ఇతి వృత్తం గా వచ్చిన కిషన్‌చందర్ జైత్రయాత్ర వారికి స్ఫూర్తినిచ్చింది. నవలలోని పరిమిత అంశాన్ని మొత్తం తెలంగాణ పోరాటానికి విస్తరించి సినిమా తీయాలనే లక్ష్యంతో వారు ముందుగా మృణాల్‌సేన్‌ను కలిశారు. చిన్న బడ్జెట్‌తో తాను సినిమా తీయలేనని గౌతంఘోష్ అయితే బాగుంటుందని ఆయ సలహా ఇచ్చారు. గౌతంఘోష్‌కు అప్పటికి కొన్ని డాక్యుమెంటరీలు తీసిన అనుభవం మాత్రమే ఉన్నది. ‘హంగ్రీ ఆటమ్’ అన్న డాక్యుమెంటరీకి అవార్డ్‌కూడా లభించింది. పూర్తిస్థాయి సినిమాకు దర్శకత్వం వహించటం ఇదే మొదలు.
ఆ మాటకొస్తే నిర్మాత నరసింగరావుకు కూడా ఇదే మొదటి సినిమా.‘పథేర్ పాంచాలి’ తీసేముందు సత్యజిత్‌రాయ్ ఆలోచించినట్లే ఈ దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు సహజంగా నటిస్తారని అనుకున్నట్టుంది. రోడ్డుమీద క్రికె ట్ ఆడుకుంటున్న సాయిచంద్‌ను పట్టుకున్నారు. అప్పుడు పోలీస్‌శాఖలో ఉన్నతోద్యోగం కోసం చదువుకుంటున్న సాయిచంద్ సంక్లిష్టమైన హీరో పాత్ర ను చేయలేనని వెనుకంజ వేశారు. నీతోమేమున్నామని దర్శక నిర్మాతలు భరో సా ఇవ్వటంతో సాయిచంద్ హీరోగా బుక్కయ్యారు. మొదట్లో కొంత బెరుకుగా అనిపించినా రానురాను భేష్ అనిపించుకున్నారు. భూపాల్, రామిడ్డి, యాదగిరి, రాంగోపాల్, రాజేశ్వరి, గద్దర్, హంస మొదలైన నటీనటులతో సినిమా మొదలైంది. నటీనటులలో చాలామంది తొలిసారి వెండితెరమీద వెలగినవారే. భూపాల్, శకుంతల పాత్రలు చిన్నవే అయినా చిరకాలం గుర్తుండిపోతాయి. కళా దర్శకుడిగా వైకుంఠం చేసిన తొలి సినిమా కూడాఇదే.
మా భూమి ఇతివృత్తానికి వస్తే.. యువరైతు రామయ్య(సాయిచంద్) నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి తిరుగుబాటు బాట పట్టినవాడు. అత డు ప్రేమించిన అమ్మాయి (హంస) పెత్తందార్ల లైంగికదాహానికి లొంగిపోక తప్పదు. ఇది తెలిసిన రామయ్య ప్రతీకారంతో రగిలిపోయి..ఊరువదిలి సూర్యాపేట చేరుకుంటాడు. ఉర్దూకవి మగ్దూం మొహియుద్దీన్‌కు ప్రతీకగా రూపొందిన మగ్బూల్ అనే కమ్యూనిస్టు నాయకుని దగ్గర రామయ్య ఉద్యమ పాఠాలు నేర్చుకొని, తిరిగి ఊరు చేరుకుంటాడు. గ్రామకమిటీలను ఏర్పరిచి విప్లవకార్యాచరణకు పూనుకుంటాడు. దొర గడీని ఆక్రమించి దస్తావేజులు చింపేసి దున్నేవాడిదే భూమి అన్న ఉద్యమ నినాదాన్ని అమలు చేస్తాడు.
ఆవే శ ప్రవృత్తి ఉన్న నాగయ్య (బి.నరసింగరావు) జైలునుంచి విడుదల అవుతా డు. రజాకార్ల హింసాకాండకు అంతులేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యాన్ని దింపటంతో 194 సెప్టెంబర్‌లో నిజాం లొంగిపోతాడు. నిజాం గద్దె దిగాడు కనుక ఉద్యమం ఆపేయాలని ఒక వర్గం, కర్షక కార్మిక రాజ్యం ఏర్పడలేదు కనుక కొనసాగించాలని మరో వర్గం భావిస్తాయి. ఉద్యమకారులకు భయపడి ఊళ్లు విడిచి తలదాచుకున్న భూస్వాములు కాంగ్రెస్ తీర్థం తీసుకొని ఖద్దరు ధరించి, గాంధీటోపీలతో ఊళ్లలోకి ప్రవేశిస్తారు. సైనికదళాలతో తలపడ్డ రామయ్య వీరమరణం పొందుతాడు. ఉద్యమం కొనసాగించాలనే కృతనిశ్చయంతో దళాలు అడవిలోకి ప్రవేశించటంతో సినిమా ముగుస్తుంది. కర్షక కార్మిక రాజ్యం ఏర్పడేదాకా పోరాటం సాగుతూనే ఉంటుందన్నది సూచన.
నరసింగరావుకు తాను తీయదలిచిన సినిమాకు సంబంధించిన రాజకీయ, సాంస్కృతిక అంశాల అవగాహన పూర్తిగా ఉన్నది. కానీ సినిమా కళకు సంబంధించిన అవగాహన సాంకేతికమైన నైపుణ్యం లేదు. ఇక్కడి వాడు కాకపోయి నా వామపక్ష భావాలున్న వాడు కాబట్టి గౌతంఘోష్ తెలంగాణ సంక్షిష్ట అంశాల ను అవగాహన చేసుకొని వాటిని తన ప్రజ్ఞతో సినిమా మాధ్యమంలోకి మలచగలిగారు. ఆ తర్వాత తాము తీసిన ఏసినిమాలోనూ ఈ టెక్నిక్‌ను తిరిగి వాడుకోలేదు. అవార్డుల పరంగా చూస్తే జాతీయస్థాయిలో రెండవ ఉత్తమ ప్రాంతీయ చిత్రం(190), ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రిప్ట్ విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ తెలుగు చిత్రంగా సినీ హెరాల్డ్ అవార్డు మాభూమి గెలుచుకుంది.
కార్లొవివరీ(చెకొస్లొవేకియా), కైరో, సిడ్నీ, తాష్కెం ట్‌లలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడి గౌరవాలను అందుకున్నది. ఈ సిని మా అనుభవం పునాదిగా గొప్ప సినిమాల సారాంశాన్ని కలకలిపి తనదైన జీవితావగాహనతో దర్శకుడిగా రంగుల కల, దాసి వంటి గొప్ప చిత్రాలను నరసింగరావు తీశారు. ఈ సినిమాలతో నరసింగరావుకు గుర్తింపు ఎలా ఉన్నా ఎన్నటికీ తీరని అప్పులు మాత్రం మిగిలాయి. అయితే.. కళ కళకోసం కాదు ప్రజల కోసమని నమ్మి నరసింగరావు తనదైన ఉన్నత మార్గాన్ని ఎప్పుడూ వదలలేదు. ఫక్తు వ్యాపార సినిమా మార్గాన్ని ఎంచుకోలేదు. తన సినిమాలకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. 30 ఏళ్లకిందట కేవలం 5 లక్షలతో తీసిన సినిమా అయినా.. దోబిగా జమీన్, మదర్ ఇండియా, లగాన్ వంటి సినిమాల సరసన గౌరవవూపదమైన స్థానాన్ని ‘మాభూమి ’సాధించింది. నవ్య సినిమా, సమాంతర సినిమా వంటి పేర్లకంటే ప్రజాసినిమా అన్న పేరే మాభూమికి సరిపోతుంది. ఇది మేల్కొన్న మనిషికథ. మేల్కొన్న మనిషి వీరుడవుతాడు. ఆ వీరుడు చరిత్ర సృష్టిస్తాడు.
-అమ్మంగి వేణుగోపాల్, 9441054637
(మాభూమి సినిమాకు 32 ఏళ్లు నిండిన సందర్భంగా..)
నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ DATED : 23 /03 /2012
No comments:
Post a Comment