Wednesday, March 28, 2012

పాఠాలు నేర్వని పార్టీలు! - తెలకపల్లి రవి



చరిత్ర బుద్ధిమంతులకు మార్గం చూపిస్తుంది, బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అన్నది సుపరిచితమైన నానుడి. మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఈ పరమ సత్యాన్ని పదే పదే నిరూపిస్తుంటాయి. విజయం వరించినప్పుడూ పరాజయం పరాభవించినప్పుడూ కూడా పరి పరి విధాల విన్యాసాలలో మునిగిపోయి ప్రజలను నిరుత్సాహ పరుస్తుంటాయి. మొన్నటి ఉప ఎన్నికలలో విజయం సాధించిన టిఆర్ఎస్ నుంచి దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ తెలుగుదేశంల వరకు ప్రజల తీర్పును సరిగ్గా స్వీకరించారా అర్థం చేసుకున్నారా అని సందేహం కలుగుతుంది. 

వరంగల్‌లో భోజ్యా నాయక్ ఆత్మహత్య అనంతర పరిణామాలు, శాసనసభలో ప్రతిష్ఠంభన పునరావృతులూ చూస్తుంటే మన నేతల రీతులు అంత సులభంగా మారేవి కావని స్పష్టమవుతుంది. తాము గతం కన్నా మెరుగు పడ్డామని తెలుగుదేశం చెప్పడం, వారికన్నా మేము మెరుగ్గా వున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. 

తెలంగాణ ప్రాంతంలోని ఆరు స్థానాలు, నెల్లూరు జిల్లా కోవూరు ఎక్కడా ప్రభుత్వ పక్షమైన కాంగ్రెస్ గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం గాని గెలవలేకపోయాయి. తెలుగుదేశం తెలంగాణలో మూడు చోట్ల డిపాజిట్ కోల్పోతే కాంగ్రెస్ కొన్ని చోట్ల మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రెండు పార్టీల శాసనసభ్యులను చేర్చుకుని ఈ ఉప ఎన్నికలకు కారణమైన టిఆర్ఎస్ నాలుగు చోట్ల విజయం సాధిం చి మహబూబ్‌నగర్‌లో మాత్రం బిజెపి చేతిలో ఓడిపోయింది. 

నాగర్‌కర్నూలులో తెలుగుదేశం మాజీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి తెలంగా ణ నగారా తరపున స్వతంత్రుడుగా ఎన్నికైనాడు. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ సారి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఉప ఎన్నికల ఫలితాలు వూహించనివి కాదు గాని వాటి ప్రకంపనాలు మాత్రం వూహించిన దానికంటే తీవ్రంగా వున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలకు పరిణామాలకు సూచికలని చెప్పాలి. 

ఉద్యమాలలోనూ విమర్శలు వివాదాలలోనూ టిఆర్ఎస్ ముందున్నా రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశంల తర్వాతి స్థానమే అన్నది నిన్నటి మాట. కేంద్రం అనిశ్చిత వైఖరిని ఉపయోగించుకుంటూ తెలుగుదేశం అస్పష్టతను ఎండగడుతూ ఆ పార్టీ క్రమేణా ప్రథమ లేదా ప్రధాన శక్తిగా ముందుకొస్తున్నదని ఉప ఎన్నికలు నిర్ద్వందంగా తేల్చేశాయి. అభిప్రాయానికి ప్రస్తుత ఫలితాలు ఆస్కారమిస్తున్నాయి. భవిష్యత్తులో తమ స్థానాలను కాపాడుకోవాలనుకుంటే మరింత మందికి ఆకర్షణీయమైన గమ్యంగా ఆ పార్టీ తయారైంది. 

ఆకర్ష ప్రక్రియలతో వలసలకు కేంద్ర బిందువు కానుంది. విజయం సాధించినప్పటికీ తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో టిఆర్ఎస్ వూపు కొంత తగ్గిందనే భావన కూడా ఎంతో కొంత నిజం. గెలిచిన అభ్యర్థుల ఆధిక్యతలు తగ్గడం, తెలుగుదేశం రెండు చోట్ల డిపాజిట్టు తెచ్చుకోవడం, మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఇందుకు నిదర్శనాలు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని చెప్పే సిపిఎం మూడు చోట్ల పోటీ చేసి ఇదివరికటి పరిమితమైన స్వంత ఓట్లను నిలబెట్టుకోగలిగింది. తెలంగాణ సమస్యపై ఇంతగా దోబూచులాడి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన కాంగ్రెస్ ఎక్కువ చోట్ల ద్వితీయ స్థానంలో వచ్చింది. టిఆర్ఎస్ రాజకీయ విజయాన్ని గుర్తిస్తూనే ఈ భాగాన్ని కూడా పేర్కొంటే వారికి ఆగ్రహం వస్తున్నది. 

సిపిఎం తప్ప మిగిలిన వారికి వచ్చిన ఓట్లన్నీ తెలంగాణ వాదానికి వచ్చినట్టే భావించాలని వాదిస్తున్నారు. మీరు ద్రోహులంటే మీరు దొంగలని ఆరోపించుకున్న పార్టీల నేతలకు వచ్చిన ఓట్లన్నీ ఒకే తరహాలో చూడమంటే కుదిరేపని కాదు. అసంబద్దమే. తెలంగాణ వాదం పేరిట జరుగుతున్న రాజకీయంలో టిఆర్ఎస్ ప్రథమ స్థానంకాగా కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో వుంది. ఇంకా ఏం తేల్చుకోలేని సందిగ్ధ తెలుగుదేశం విశ్వసనీయత మరీ కష్టం. ఉప ఎన్నికల ఫలితాల సారాంశం ఇదే. 

ఇక బిజెపి మతతత్వ రాజకీయాలకు ప్రాంతీయ వాదాన్ని సామాజిక సమీకరణలను తోడు చేసుకుని విజయం సాధించింది. తన ఏలుబడిలోని కర్ణాటక గుజరాత్‌లలోనే ఉప ఎన్నికలలో దెబ్బతిన్న పార్టీ ఇక్కడ విజయం సాధించడం ఆశ్చర్యకరమే. ఇది ఆందోళనకరమని బి.వి.రాఘవులు నేరుగానే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జెఎసి వేదికలో సాగిన అంతర్మధనం, వచ్చిన భిన్నాభిప్రాయాలు కూడా విస్మరించరానివి. 2009 ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకముందే కెసిఆర్ మహాకూటమిని వదలి ఎన్‌డిఎ వైపు పరుగులు తీశారు. తర్వాత కాలంలో పార్లమెంటులో కూడా బిజెపి మద్దతు తీసుకున్నారు. కాని తర్వాత వారికి మద్దతు దక్కలేదు. అద్వానీ రథయాత్ర గులాబీ దళాన్ని ఆకర్షించలేదు. 

ఇంకా పలు సందర్భాల్లో ఉభయుల మధ్య పొరపొచ్చాలు కనిపిస్తూనే వున్నాయి. కెసిఆర్ తెలంగాణ జనాభా పొందిక రీత్యా మైనారిటీల ఓట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను దూరం వుంచుతున్నారనే ఆగ్రహం బిజెపిది. మైనారిటీ ఓట్లకు ముప్పు తెచ్చుకోకుండా చూసుకోవడంతో పాటు జాతీయ ముద్ర వల్ల ఆ పార్టీ స్థానాలు ఎగరేసుకుపోకుండా చూడాలనే జాగ్రత్త కెసిఆర్‌ది. ఏమైనా ప్రాంతీయ తత్వం మతతత్వం కూడా కలగలపి రాజకీయం చేయడం ఎలా సాధ్యమో అర్థమవుతుంది. ఈ ఫలితం అన్నిచోట్లా పునరావృతం అవుతుందనే ఆశల్లో బిజెపి నేతల ఆశకు ఆధారాలు తక్కువే. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ నాయకులు కూడా తమ స్వంత వేదికను ఏర్పాటు చేసుకుని స్థానం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తూ తీవ్ర పరిభాషలో మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ తమకు చేరువ కావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. 

కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం 17 స్థానాల పోరాటంలో వారికి ఉత్సాహమివ్వొచ్చు గాని తేడాలు చాలా వుంటాయి. కోవూరులో కూడా వారు ఆశించిన ప్రకటించిన ఆధిక్యత రాలేదు. అయితే తెలుగుదేశం తన నుంచి ఫిరాయించిన నాయకుడి స్థానాన్ని తిరిగి రాబట్టుకోలేకపోవడం వారి ఆత్మ స్థయిరాన్ని దెబ్బతీసే అంశమే. ఈ ఫలితాలకు కొంచెం ముందుగా జరిగిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కూడా తెలుగుదేశంలో అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నది. ఇప్పటికే అనిశ్చితి అంచులలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌నూ, కిరణ్ ప్రభుత్వాన్ని ఉప ఫలితాలు కుదిపేస్తున్నాయి. 

మంత్రి రవీంద్రారెడ్డి రాజీనామా లేఖ పంపితే ఉప ముఖ్యమంత్రి రాజ నరసింహతో సహా పలువురు ముఖ్యమంత్రి తప్పుకోవాలని చెప్పేశారు. తెలంగాణ ఎంపీల సవాలు మరీ తీవ్రంగా వుంది. కోస్తా జిల్లాల ఎంపీలు అంతకన్నా ముందే అధిష్ఠానానికి అసమ్మతి వినిపించి వచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ కలహాల నిలయంగా వుంది. ముఖ్యమంత్రి వర్గీయులూ రంగంలోకి దూకి శాయశక్తులా సమర్థిస్తున్నా కలహాగ్ని చల్లారడం లేదు! 

ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అనిశ్చితికి స్వస్తి చెప్పి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే గాని పరిస్థితి మారదు. అందుకుబదులుగా ఈ పరిణామాన్ని తమ పదవీ రాజకీయాల కోసం వినియోగించుకునే పాకులాట కాంగ్రెస్‌లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ మధ్యలో అవినీతి కేసులలో కోర్టుల నోటీసులు... మాజీ మంత్రి శంకర్‌రావు ముఖ్యమంత్రి, మరికొందరిపై ఎర్రచందనం అవినీతి కేసు వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆవేదనా స్వరాలు తీవ్రం చేశారు. అవినీతిని ఎదుర్కొనే విషయంలోనూ చర్యలు లేవు. 

మరోవైపు తాను అధికారంలోకొస్తే అవినీతిని నిర్మూలిస్తానని జగన్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ఆయనపై దర్యాప్తు నెమ్మదించిందన్న కథనాలకు తగినట్టే కొత్త చర్యలు వేగంగా జరగడం లేదు. రేణుకా చౌదరి తప్ప కాంగ్రెస్ నేతలెవరూ ఆయన అరెస్టును గురించి చెప్పడం లేదు. పైగా కాంగ్రెస్, టిడిపి నేతలు పలువురు తాము జగన్ పార్టీ వైపు చూడటం లేదని వివరణలిచ్చుకోవలసిన స్థితి. నిజానికి ఆ రెండు పార్టీల ముఖ్యుల బంధువులు, సన్నిహితులు చాలా మంది జగన్‌తో వుంటున్నారు. ఈ దఫా ఉప ఎన్నికలలో పరకాల కూడా వుంటుంది గనక టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది వెల్లడవుతుంది. ఏది ఎలా వున్నా ప్రభుత్వంలోనూ రాజకీయాలలోనూ పెను మార్పులు వస్తాయనే ఆయా పార్టీల నాయకులు నమ్ముతున్నారు. 

ఏ రాజకీయ పార్టీలైనా సమగ్ర దృష్టితో విశాల ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలే తప్ప తాత్కాలిక మనుగడ కోసం అవకాశవాదానికి అభద్రతా వ్యూహాలకు పాల్పడటం మంచిది కాదు. కాని శాసనసభలోనూ బయిటా పరిణామాలు చూస్తే ఆవిధమైన ఆశావిశ్వాసాలు కలక్కపోగా ఆందోళనే పెరుగుతుంది. ప్రాంతీయ ఉద్వేగాలను పెంచడం, జగన్ వందిమాగధ స్తోత్రాలు తీవ్రం చేయడం ప్రజల ఆకాంక్షకు విరోధాభాస అనిపిస్తుంది. బహుశా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌పై సమష్ఠి ఆందోళన వంటివి ఈ సమయంలో పార్టీలను పట్టాలెక్కించడానికి ప్రజా సమస్యలపై పోరాటానికి మార్గదర్శకమవుతాయి. 

- తెలకపల్లి రవి
Andhra Jyothi News Paper Dated : 29/03/2012 

No comments:

Post a Comment