Tuesday, March 20, 2012

దళితులకు మొండిచెయ్యి



2012-13సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ 1,45854 కోట్లల్లో సాంఘిక సంక్షేమానికి 5 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో 1.83 శాతం 2,677 కోట్లు కేటాయించి గతం కంటే పెంచినట్లు అంకెల గారడి చేశారు. ప్లాన్‌ బడ్జెట్‌లో 1719 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి గత రాష్ట్ర బడ్జెట్‌ కన్నా 30 శాతం అదనంగా నిధులు పెంచుకున్న ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఒక శాతం నిధులు పెంచకపోవడం శోచనీయం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి దళితవాడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
2011 జనగణన ప్రకారం దళితులు రాష్ట్రంలో 18 శాతం దాకా ఉన్నారు. కులవృత్తులు చేసుకోవడంతోపాటు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలలో సన్న, చిన్నకారు రైతులుగాను, ఎక్కువ శాతం కూలీలు, మూడవ రంగం భవన నిర్మాణం రంగంలో కూలీలుగా చిన్న చిన్న పట్టణాలు, నగరాలకు వలసలు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల అసమానతలు తగ్గించి ఆర్థిక స్వావలంబనకు స్వయం ఉపాధి, కులవృత్తులను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవడానికి, భూమి కొనుగోలు, భూమి అభివృద్ధి, చిన్న తరహా సాగునీరు, ఉద్యాన వనాలు, మైక్రో వ్యవసాయం, పశుసంవర్థక, సఫాయి, కర్మచారి, వెట్టిచాకిరి జోగినిలు, నిరుద్యోగ యువతకు శిక్షణ పథకాలను రుణాలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 51:49 నిష్పత్తితో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యూల్డు కులాల సహాకార ఆర్థిక సంస్థను 1974లో ఏర్పాటు చేశాయి. గత 36 సంవత్సరాలలో 4125.69 కోట్ల సహాయాన్ని 49,63,135 మంది దళితులకు అందించాయి. 17,80,842 మందికి 1,176.82 కోట్లు బకాయిలను పూర్తిగా మాఫీ చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రకటించారు. మరోవైపు దళితులకు రాష్ట్ర షెడ్యూల్డు కులాల సహాకార ఆర్థిక సంస్థ నుండి అందిస్తున్న సబ్సిడీలు, రుణాలు, పథకాలను అన్నింటిని రద్దు చేస్తూ జివో నెం. 492ను జారీచేశారు. కార్పోరేషన్‌ను పూర్తిగా మూసివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నది. లక్షల కోట్లు రైతులకు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు, సౌకర్యాలు 2008-09లో 4.20లక్షల కోట్లు ఇచ్చిన ప్రభుత్వాలు దళితులకు, పేదలకు కేవలం లక్ష కోట్లు కేటాయించలేక పోతున్నాయి.


రాష్ట్ర ఎస్సీ కార్పేరేషన్‌ వివిధ కులవృత్తులకు సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, చర్మకారులు తోళ్ల శుద్ధి, చెప్పులు కుట్టుకునే వారికి బంకులు, భూమిలేని నిరుపేదలకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడం, చిన్న కమతాలు ఉన్న వారికి భూమి అభివృద్ధి, చిన్న తరహా సాగునీటి సౌకర్యం కల్పించడం, ఉద్యానవనాలు, మైక్రో వ్యవసాయం, పశుసంవర్థక పథకాలకు పూర్తి సబ్సిడిలను అందించడం, సఫాయి, కర్మచారి, వెట్టిచారికి, జోగినిలకు పునారావాసానికి భూమి, రుణాలు అందించడం, నిరుద్యోగ యువతకు శిక్షణ పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. సబ్సిడీ, రుణాలు ఇవ్వకుండా యూనిట్‌ విలవతో సంబంధం లేకుండా 10 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అరకొరగా రుణాలు, సబ్సిడిలు ఇచ్చే సంస్థ నుండి సలహాలు మాత్రమే ఇచ్చే విధంగా మార్పు చేశారు. అనేక ఆందోళనలు, పోరాటాల ఫలితంగా సబ్సిడీ 10వేలకు బదులుగా 30వేలకు పెంచుతూ జివో నెం. 127ను జారీ చేసింది. రైతులు, మహిళలు, పారిశ్రామిక వేత్తలకు తదితర రంగాలకు ఇస్తున్న పావలా వడ్డి పథకాన్ని జివో నెం. 95 ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. 1974నుండి మార్జిన్‌ మనీ రుణాలు 824.83 కోట్లు, గ్రాంట్లు 1022.66కోట్లు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి రుణాలు 321.50కోట్లు, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిస రుణాలు 65.98కోట్లు, బ్యాంకు రుణాలు 2,435.65కోట్లు మొత్తంగా 4,670.62కోట్లు మాత్రమే ఇచ్చారు.


ఎస్సీ కార్పోరేషన్‌కు 208 కోట్లు మాత్రమే కేటాయించారు. బడ్జెట్‌లో పైసా కేటాయించకుండానే ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పేర్కొనడం హాస్యాస్పదం. ఎస్సీ కార్పోరేషన్‌ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లతో ప్రణాళిక రూపొందించి దళితుల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే సంకల్పానికి పూనుకోవాలి. జోగిని మహిళల పునరావాసం, వెట్టిచాకిరి నిర్మూలన పథకాలకు కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయిస్తే 3 లక్షలు కూడా ఖర్చు చేయడకుండా కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. కులాంతర వివాహలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సహాలను 2008-09లో కేంద్రం 1.65కోట్లు, రాష్ట్ర ప్రణాళికలో 66లక్షలు, ప్రణాళికేతర 53లక్షలు కేటాయించగా కేవలం ప్రణాళికేతర ఖర్చులు 65లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. 2009-10లో కేంద్రం 1.65కోట్లు, 33లక్షలు తగ్గించి ప్రణాళికలో 33లక్షలు, ప్రణాళికేతర 53లక్షలు కేటాయించగా కేవలం ప్రణాళికేతర ఖర్చులు 1.51కోట్లు, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకాలను 10వేల నుండి 50 వేలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2010-11లో కేంద్రం 8.25కోట్లు, రాష్ట్ర ప్రణాళికలో 33లక్షలు, ప్రణాళికేతర 53లక్షలు కేటాయించగా కేవలం 56 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.


2006 లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల దళితులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల సేకరణకు 2007-08లో 500 కోట్లు కేటాయించి111కోట్లు, 2008-09లో 227 కోట్లు కేటాయించి 169.10 కోట్లు, 2009-10లో 60 కోట్లు కేటాయించి 45 కోట్లు, 2010-11లో 60 కోట్లు కేటాయించి 30 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాల్స్‌, అంబేద్కర్‌ విగ్రహాల స్థాపనకు 2008-09లో 2 కోట్లు కేటాయించి 50 లక్షలు, 2009-10లో 2 కోట్లు కేటాయించి 50 లక్షలు ఖర్చు చేసింది.
2012-13సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ 1,45854 కోట్లల్లో సాంఘిక సంక్షేమానికి 5 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో 1.83 శాతం 2,677 కోట్లు కేటాయించి గతం కన్న పెంచినట్లు అంకెల గారడి చేశారు. ప్లాన్‌ బడ్జెట్‌లో 1719 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి గత రాష్ట్ర బడ్జెట్‌ కన్న 30 శాతం అదనంగా నిధులు పెంచుకున్న ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఒక శాతం నిధులు పెంచకపోవడం శోచనీయం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి దళితవాడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జలయజ్ఞంకు 3 వేల కోట్లు ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 114 కోట్లు, హుస్సేన్‌సాగర్‌ ఆధునీకరణకు 24 కోట్లు, మెట్రో రైల్‌ నిర్మాణానికి 85 కోట్లు, పార్కుల ఆధునీకరణకు కేటాయించిన నిధులను దళితుల ప్రత్యేక ప్యాకేజి కిందకు మార్చాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత సంఘాలు, సంస్థలు ఆందోళనలకు ప్రభుత్వం స్పందించక పోవడం గర్హనీయం.దళితుల సంక్షేమానికి గాల్లో దీపంలా కాకుండా ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించాలి, ఎస్సీ కార్పోరేషన్‌ను బలోపేతం చేస్తే దళితుల్లో స్వయం ఉపాధితోపాటు నిరుద్యోగాన్ని నిర్మూలన చేయవచ్చు. రాజీవ్‌ యువకిరణాలు పథకానికి 700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దళితుల్లో నిరుద్యోగులకు 100 కోట్లు కేటాయించలేదు.
(బి.గంగాధర్‌ రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి)
-నేటి వ్యాసం
Prajashakti News Paper Dated : 20/03/2012 

No comments:

Post a Comment