Wednesday, March 14, 2012

కేంద్రంలోనూ ఇక బడుగుల పాలన!--Paluri Ramakrishnaiahakhilesh-yadav
ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల వెలువడగా, కాంగ్రెస్‌ పార్టీ మణిపూర్‌ రాష్ర్టంలో పూర్తి మెజారిటీ సంపాదించి ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఉత్తరాఖండ్‌లో ఇతరులతో కలిసి ప్రభుత్వం స్థాపించనున్నది. దేశ ప్రధానమంత్రి పదవికి అర్రులు చాస్తున్న యువనేత రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల కోసం సంవత్సర కాలం నుంచి విశ్వప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజాకర్షణ గల తన సోదరి ప్రియాంక గాంధీని ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలోకి దించారు. అయినా చివరకు ఉత్తర ప్రదేశ్‌లో నాల్గవ స్థానంలోనే ఉండిపోవడంతో భవిష్యత్తులో ఈ రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినట్లేననిపిస్తోంది. ఇది ఇలా ఉండగా, ఒకప్పుడు రామజన్మభూమి వివాదంతో, బాబ్రీ మసీదును కూల్చి అందలమెక్కిన భారతీయ జనతాపార్టీ కూడా యూపీలో కేవలం మూడవ స్థానాన్నే ధృవపరుచుకొంది. మొదటి రెండు స్థానాలను ఇటు ఎస్పీ, అటు బీఎస్పీ మార్చుకొన్నాయి.

sukhbirs
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో గమనించాల్సిన విశేషమేమిటంటే, స్వాతంత్య్రం వచ్చినప్పటి ినుంచి దేశంలో అతి పెద్ద రాష్ర్టంగా కొనసాతోంది. దేశ రాజకీయాలను శాసించే విధంగా, అత్యధిక సంఖ్యలో ప్రధానమంత్రులను అందించింది. అటువంటి ఈ ఉత్తరప్రదేశ్‌ రాష్ర్ట పాలన ఇటీవల పూర్తిగా బడుగుల చేతిలోకెళ్ళిందనేందుకు ఏ మాత్రం సందేహం లేదు. దక్షిణ భారత దేశంలో పెరియార్‌ రామస్వామి నాయకర్‌ నిర్వహించిన సామాజిక ఉద్యమంతో, తమిళనాడు రాష్ట్రంలో పాలన బడుగు పార్టీలైన ఇటు ఏఐఏడిఎంకే, అటు డీఎంకే రాజకీయ పార్టీల నాయకత్వానికే పరిమితమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌పార్టీ, భారతీయ జనతాపార్టీ నేటికీ ఈ ప్రాంతీయ, బడుగు పార్టీలకు తోక పార్టీలుగా పొత్తులతో తమ ఉనికిని మాత్రం చాటుకొంటూ వస్తున్నాయి.ఈ స్ఫూర్తితో ఉత్తర భారత దేశంలో రామ్‌ మనోహర్‌ లోహియా అనుచరులైన ములాయం సింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు దేశంలో అతిపెద్ద రాష్ట్రాలయిన ఉత్తర్‌ప్రదేశ్‌, బీహారు రాష్ట్రాలలో బడుగుల పాలనకు అంకురార్పణ జరిపారు.

కాన్షీరామ్‌ అధ్యక్షతన ఏర్పడిన బహుజన్‌ సమాజ్‌ పార్టీతో, శాశ్వతంగా ఉత్తరప్రదేశ్‌ పాలన బడుగుల కైవశమయింది. అయితే బీహారులో మాత్రం లాలూ ప్రసాద్‌ అధ్యక్షతన ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ పరిపాలన అనంతరం, జనతాదళ్‌ (యునైటెడ్‌) తరపున నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించినా ఆ పార్టీకి మద్దతుదారుగా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో కొనసాగుతోంది. అయితే, ఈ కొనసాగింపు కూడా బీహారులో వచ్చే శాసనసభ ఎన్నికల వరకే ఉండాలనీ, తదనంతరం బడుగుల నాయకత్వ పార్టీలయిన జెడి (యు) లేక రాష్ట్రీయ జనతాదల్‌ పూర్తి మెజారిటీ తెచ్చుకొని ఉత్తరప్రదేశ్‌లో వలె పాలనా పగ్గాలు బడుగుల స్వాధీనంలోనే ఉండాలనీ దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఆకాంక్షిస్తున్నారు. 

naredramodi
జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అంచలంచెలుగా మిగిలిన అన్ని రాష్ట్రాల మీద పట్టు కోల్పోయి, దేశంలో బడుగుల పాలన వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించవచ్చు. ఇప్పటికే ఒడిషా వీటినుండి విముక్తి పొందగా, పంజాబ్‌లోని అకాళీదల్‌ కూడా వచ్చే ఎన్నికల నాటికి స్వతంత్రంగా పాలనాధికారాన్ని కైవశం చేసుకోగలిగే పరిస్థితిలోకి రాబోతున్నదనేది నిస్సందేహం. ఇక గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలలో భారతీయ జనతాపార్టీ పాలనాధికారాన్ని కలిగి ఉన్నా, ముఖ్యమంత్రులుగా బీసీ నేతలే కొనసాగుతున్నారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దశలో ఒడిషా, పంజాబ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో కూడా బడుగు నాయకులు జాతీయ పార్టీలకు స్వస్తి పలికి, ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసుకొంటే, ఉత్తరప్రదేశ్‌, బీహారు, తమిళనాడు రాష్ట్రాల వలె పాలనాధికారాన్ని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
ఇక జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే- బడుగులు అధికారానికి కూత వేటు దూరంలో ఉన్నాయడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇందుకు విరుద్ధంగా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బడుగులు ఇంతవరకూ రాజకీయాల్లో అగ్రశ్రేణి నాయకులుగా ఎదగలేకున్నారు. వామపక్షాల నుంచి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి కేవలం ఇంతవరకు బ్రహ్మణ వర్గమే పాలనాధికారాన్ని చేపట్టి ఉంది. అయినా ఇక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కనుక, దేశంలో బడుగుల పాలనలో ఉన్న రాష్ట్రాలను చూసి చైతన్యం చెంది, ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని పాలనాధికారాన్ని చేపట్టేందుకు వీలుంది.

nitish-kumar-
ఈ దిశ లోనే ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల పాలన కూడా ఇంకా అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అందుకుగల కారణాలను విశ్లేషిస్తే- గతంలో కొన్ని శూద్ర కులాలు పాలనాధికారాన్ని చేపట్టిన తరువాత, విపరీత అక్రమ పద్ధతులలో ధనార్జన చేశాయి. ఇతర సోదర బీసీ కులాలలను విస్మరించి కేవలం తన సామాజిక వర్గాలకే పాలనాధికారం దక్కే విధంగా శాసనసభ సీట్లలో సింహ భాగం తమ కులాలవారికే కేటాయించుకొని, రాజకీయాన్ని వృత్తిగా చేసుకొన్నాయి. వ్యాపారరీతిలో ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికలలో విజయం సాధించి పాలనాధికారాన్ని చేజిక్కుంచుకుంటూ ఉన్నాయి. ఈ సిద్ధాంతానికి జాతీయపార్టీ కాంగ్రెస్‌తో బాటు, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌లు కూడా మినహాయింపు కాదనేది అందరికీ తెలిసిన నిగూఢ సత్యం. అందువల్ల రాష్ర్టంలో పాలక పక్షాలయిన రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాలు, ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను, అటు మిగతా అగ్ర కులాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలనూ పాలనకు దూరంగా ఉంచుతూ ఒకప్పటి తమ వెనుకబాటు తనాన్ని మరిచిపోయి, ఎల్లకాలం తమవర్గాలే పాలనాధికారం పొందాలనే వ్యూహాలను ఎప్పటి కప్పుడు రూపొందిం చుకొం టున్నాయి. ఈ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులలో మాది రిగా తమ వర్గాలకు ఉమ్మడి రాజకీయపార్టీని ఏర్పాటుచేసుకొని పాలనాధికారాన్ని చేపట్టాలి.కేరళ రాష్ర్టంలో అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్‌ సంకీర్ణ పక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి స్వతంత్రంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యత సాధించి పాలనాధికారాన్ని శాశ్వతంగా కైవశం చేసుకొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలి.
paluri-ramakrishnaiah
ఈ విధంగా అన్ని రాష్ట్రాలలో, అధిక సంఖ్యాకులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఐక్యతతో రాష్ర్ట పాలనను చేపడితే 2019 నాటికి కేంద్రంలో కూడ ప్రధాన మంత్రి పదవిని ఒక బడుగు నాయకుడు చేపట్టగలడు. అప్పుడే దేశవ్యాప్తంగా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది. సామాజిక న్యాయంతో సుస్థిరపాలన చోటుచేసుకుంటుంది. డా బి.ఆర్‌. అంబేడ్కర్‌, మహాత్మ జ్యోతిరావు పూలే కన్న కలలు నిజమవుతాయి.

రచయిత బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌, యూడీఎఫ్‌ అధ్యక్షు

No comments:

Post a Comment