Friday, March 9, 2012

ఆగ్రహమూ, నిగ్రహమూ---Sampadakiyam
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ‘మిలియన్ మార్చ్’ జరిగి నేటికి ఏడాది నిండింది. వలసవాదులు ఆధిపత్య స్వభావంతో ఈ మహత్తర ఘటనను విధ్వంసంగా చూపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనేక విధాలుగా మిలియన్ మార్చ్ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోడానికి, ఉద్యమ గతిని నిర్దేశించుకోవడానికి ఈ మిలియన్ మార్చ్ అధ్యయనాంశంగా ఉపయోగపడుతుంది. 

తెలంగాణ ఉద్యమం ఊరూరా వాడవాడనా బహుముఖాలుగా ఇప్పటికీ సాగుతున్నది. ఊళ్ళలో వృత్తుల వారీగా నిరాహార దీక్షలు పట్టడం మొదలుకొని హైదరాబాద్ నడి బజారులోకి వచ్చి వంట చేసుకోవడం దాన్క అనేక విధాల నిరసన వ్యక్తీరణ సాగుతున్నది. అయితే ప్రజలలో ఆగ్రహం ఉండి కూడా నిగ్రహం పాటిస్తున్నారా? ఉద్యమ నాయకులు వారిని నియంవూతిస్తున్నారా? ప్రజలు అవకాశం వస్తే ఆగ్రహాన్ని ఏ స్థాయిల్లోనయినా వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదలైన సందేహాలు ఉండేవి. తెలంగాణ ప్రజల ఆగ్రహ స్థాయిని గ్రహించడానికి మానుకోట వంటి ఘటనలు ఉపయోగపడతాయి. కానీ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను తొలగించడంలో వారి చైతన్యం, పరిణతి, ఆగ్రహం, నిబ్బరం మిళితమై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం అంతటా విస్తరించినప్పటికీ, భిన్న వర్గాలు, సైద్ధాంతిక శక్తులు పాల్గొంటున్నప్పటికీ, ఒక్క కుతికెతో కదులుతున్నది. పైకి చెప్పుకోని ఒక అవగాహన అందరిలో తొణకిసలాడుతున్నది. ఆర్థిక పరమైన దోపిడీ మొదలుకొని, సాంస్కృతిక అణచివేత వరకు అన్నీ తెలంగాణ ప్రజలు అవగాహన చేసుకుని ఉన్నారు. వలస పాలకులు తమ ఆధిపత్యాన్ని సుస్థిరపరచుకోవడానికి ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టారనే అవగాహన కూడావారికి ఉన్నది. అయితే తెలంగాణ ఆకాంక్షను వలస ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు వినిపించడానికి మాత్రమే మిలియన్ మార్చ్‌ను తలపెట్టారు. అదొక ప్రజాస్వామిక కార్యక్షికమం. మన రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమైతే, ప్రజల శాంతియుత, ప్రజాస్వామిక నిరసనకు సహకరించాలె. వేదిక చూపించి అక్కడ నిరసన వ్యక్తీకరించడానికి ఏర్పాట్లు చేయాలె. కానీ వలస ప్రభుత్వానికి ఆ సంస్కారం లోపించింది. తన నిరంకుశ స్వభావాన్ని బయట పెట్టుకున్నది. జిల్లాల నుంచి తరలి వస్తున్న అనేక మందిని నిర్బంధించింది. హైదరాబాద్ గల్లీలలో అప్రకటిత నిషేధం అమలు పరిచింది. ఉద్యమ నాయకులందరినీ ప్రభు త్వం నిర్బంధించింది. అయినప్పటికీ, బడితె పాలనకు ఒక పరిమితి ఉంటుందని, ప్రజల చైతన్యాన్ని నివారించలేదని మిలియన్ మార్చ్ నిరూపించింది. 

అనేక వ్యూహాలతో విడిగా, గుంపులుగా ఉద్యమకారులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోగలిగారు. వారిలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నా, దారిలో ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. ఉద్యమ నాయకత్వం నిర్బంధంలో ఉన్నప్పటికీ జనం ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా-ముందుగా తమ కార్యక్షికమంలో లేనప్పటికీ- వలసవాద ప్రతీకలుగా ఉన్న కొన్ని విగ్రహాలను తొలగించి వేశారు. కొన్ని ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను సైద్ధాంతిక కారణాలపై కూలగొట్టవద్దని కొందరు కోరినప్పుడు గొడవ లేకుండా వదలి పెట్టారు. ఆంధ్ర సంపన్నులు ఉంటున్న ప్రాంతాలు సమీపంలోనే ఉన్నా ఉద్యమకారులు అటువైపు మళ్ళి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. అనుక్షణం వివేచనతో వ్యవహరించారు. ఉద్యమకారులు ట్యాంక్ బండ్‌పై ఆంధ్ర విగ్రహాలను తొలగించడాన్ని తెలంగాణ ప్రజానీకం యావత్తూ హర్షించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో బడబాగ్ని రగులుతున్నది. వారిలో ఆగ్రహం ఉన్నది. కానీ సమయం, సందర్భం తెలుసుకుని వ్యవహరించే వివేచన కూడా వారికి ఉన్న ది. అవసరం వచ్చినప్పుడు ఆగ్రహాన్ని ఎంత మేరనైనా ప్రదర్శించగలరనే హెచ్చరిక కూడా మిలియన్ మార్చ్‌లో ఉన్నది. 

వలస ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకున్న పరిణతిలో ఆవగింజ వంతైనా లేదు. మిలియన్ మార్చ్ జరిగి ఏడాది గడిచింది. వలస ప్రభుత్వానికి ఇదొక అవకాశం. కనీసం ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను పెట్టడంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికైనా పూనుకోవడం విజ్ఞత. మళ్లీ కొత్తవి పెట్టేముందు వివక్షకు తావు లేకుండా తెలంగాణ వైతాళికుల విగ్రహాలు కొన్ని పెట్టాలె. వలస ప్రభుత్వం ప్రతిష్ఠించదలచుకోవాలే కానీ తెలంగాణ ప్రముఖులకు కొదవలేదు. అలనాడే తొలి స్వాతంత్య్ర సమరంలో కొదమ సింహమై పోరాడి బలైన తుర్రెబాజ్ ఖాన్ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై లేదు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, గిరిజన వీరుడు కొమురం భీము వలస వాదుల కంటికి కనిపించరు. పెత్తందారులను దోచి, పేదలకు పంచిన మహావీరుడు సర్వా యి పాపన్న విగ్రహం పెట్టరు. ప్రముఖ రచయిత, ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామిని, రజాకార్లను ఎదిరించిన ప్రాణాలను పణంగా పెట్టిన పాత్రికేయుడు షోయెబుల్లా ఖాన్‌ను గుర్తించరు. గులామీ కీ జిందగీ సే మౌత్ అచ్చీ హై అని నినదించిన తెలంగాణ నాయకుడు కె.వి. రంగాడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టరు. తెలంగాణ నీళ్ళను దోచుకుంటూ కాటన్ విగ్రహం పెట్టుకుంటారు తప్ప నిజాంసాగర్ కట్టించిన ఇక్కడి ఘనత వహించిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్‌ను తలువరు. 

హైదరాబాద్ నడిబొడ్డున గల చిరాన్ ఫోర్ట్ ప్యాలస్‌కు, వందలాది మంది తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపించిన కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టి, ఆయన విగ్రహాన్ని నిలబెట్టారు. తెలంగాణ గడ్డపై వలస పాలకులు తమ ప్రాంతపు విగ్రహాలే పెట్టుకోవడం ఎంత వరకు సమర్థనీయం? అణచివేతకు గురవుతున్న ప్రజలు వలస పాలకుల ఆధిపత్య చిహ్నాలను తొలగించడం ప్రపంచమంతటా సాగుతున్నది. అమెరికాలో మూలవాసులు కొలంబస్ విగ్రహాలను పడగొట్టారు. మధ్యఆసియా దేశాల వారు సోవియట్ చిహ్నాలను తొలగించారు. ఇదే సంప్రదాయాన్ని తెలంగాణ జనం కొనసాగించారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ తమకు న్యాయం జరగాలని ఇంత తీవ్రంగా తెలంగాణ ప్రజలు కోరిన తరవాత కూడా వలస పాలకులు ఈ ఏడాది కాలంలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టకుండా, మళ్ళీ తమ ఆధిపత్య చిహ్నాలనే పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటుండడం మాత్రం క్షమించరాని నేరం.

Namasete Telangana Sampadakiyam Dated : 10/03/2012 

No comments:

Post a Comment