Wednesday, March 7, 2012

బహుజన విజయం



ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాన్ని భిన్నం గా చూడాలె. మిగతా రాష్ట్రాలలో కనిపించేది కేవలం గెలుపు ఓటములు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో కాకలు తీరిన యోధులు ములాయం, మాయావతి సాగించిన పోరాటం ఆయా సామాజిక వర్గాలు సాధించిన పురోగతికి సంకేతం. 
లోహియా భావధారకు వారసునిగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్ అత్యంత చతురుడైన రాజకీయ వేత్త. నెహ్రూ కుటుంబం మొదలుకొని వీపీ సింగ్ వరకు వివిధ పార్టీల తలపండిన నాయకుల మధ్య తమ మనుగడను కాపాడుకొని, ప్రబల శక్తిగా స్థిరపడడం సాధారణ విషయం కాదు. అయితే సమాజ్‌వాది పార్టీ నేతగా ఆయన ఎదుగుదలను, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పార్టీ సాధించిన విజయాన్ని సామాజిక న్యాయ శక్తుల చైతన్యం నుంచి విడదీసి చూడలేము.

ఈ నేపథ్యంలో మాయావతి పార్టీ ఓటమిని ఎట్లా చూడాలనే ప్రశ్న తలెత్తవచ్చు. ఐదేళ్ళ కిందట మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ అధికారంలోకి రావడం దళితుల విజయానికి ప్రతీక. భారత ప్రజాస్వామ్య పరిణతికి ఆ విజయం తార్కాణంగా నిలిచింది. కానీ ఐదేళ్ళ తరువాత మాయావతి పార్టీ పరాజయాన్ని మాత్రం దళిత ఉద్యమం వెనకడుగు వేయడంగా చూడకూడదు. ఐదేళ్ళ కిందట పరాజయం పొందిన ములాయం పార్టీ ఇప్పుడు ఘన విజయం సాధించింది. ఎన్నికలలో గెలుపు ఓటములు సాధారణమే. వాటి ప్రాతిపదికన దీర్ఘకాలిక విస్తృత ఉద్యమాన్ని అంచనా వేయకూడదు. 

జనతా ప్రయోగం తరువాత పార్టీ విచ్ఛిన్నమయ్యే కొద్దీ సామాజిక న్యాయ శక్తులు మరింత బలపడుతాయని దివంగత మాజీ ప్రధాని వి.పి.సింగ్ సూచన ప్రాయంగా చెప్పారు. ఉత్తర భారతాన లాలూ, ములాయం తదితరుల ఆవిర్భావం వెనుకబడిన తరగతుల రాజ్యాధికార కాంక్షకు సంకేతంగా చెప్పవచ్చు. బీహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆగమనాన్ని ఒక ఎన్నికల అంశంగా కాకుం డా సామాజిక పరిణామంగా గుర్తించాలె. వారు ఎన్నికలలో ఓడిపోయినా చరిత్ర గతిని వెనుకకు మరల్చడం ఎవరి వల్లా కాదు. బీజేపీ ఒక దశలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంవూతిగా చేసినా, ఈసారి ఉమాభారతిని ముందు పెట్టుకున్నా ఈ వాస్తవాన్ని గుర్తించడమే. 1960 దశకంలో సంయుక్త సోషలిస్టు పార్టీ ఛత్రం కింద సామాజిక న్యాయ శక్తులు అధికారం చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్దయగా దెబ్బ తీసింది. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలు నిరోధించలేని స్థాయికి దళి వెనుకబడిన వర్గాలు చేరుకున్నాయి.

మాయావతి గతంలో బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఐదేళ్ళ కింద అధికారంలోకి వచ్చిన తీరు అసాధారణమైనది. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో- దళితులు, ముస్లింలతో పాటు అగ్రవర్ణాలను కూడా కలుపుకొని- భిన్న సామాజిక వర్గాల ఆమోదంతో మాయావతి అధికారం చేపట్టగలిగారు. మాయావతి నిర్మించింది కొత్త కూటమేమీ కాదు. గతంలో ఇందిరాగాంధీ బ్రాహ్మణులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలను కాటగట్టి సులభంగా అధికారంలోకి వచ్చే ఫార్ములాను రూపొందించుకున్నారు. మాయావతి ఈ ఫార్ములానే తలకిందులు చేసి దళితులను నాయకత్వ స్థానంలో నిలిపారు. దళితులు సార్వజనీన ఆమోదంతో అధికారం పొందడమే రాజకీయాలలో మారిన పోకడకు సూచన! ఈ పరిణామానికి కొనసాగింపే మళ్ళీ వెనుకబడిన తరగతులకు చెందిన ములాయం యూపీలోని అన్ని ప్రాంతాలలో సార్వజనీన ఆమోదంతో అధికారం చేపట్టడం. 

కాన్షీరామ్ ఉన్నప్పుడు బీఎస్పీ, ఎస్పీ ఉమ్మడి సంఘటనగా అధికారం చేపట్టే ప్రయోగం కూడా సాగింది. ఐదేళ్ళ కాలం నిండక ముందే పొత్తు విచ్ఛిన్నమైంది. భిన్న ప్రయోగాలతో దళితులు, వెనుకబడిన తరగతులు అధికారం కోసం పెనుగులాడుతున్న సంధి కాలమంతా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. చివరికి ఉత్తర ప్రదేశ్ రాజకీయ రంగంలో ఒక వైపు దళితులు, మరోవైపు వెనుకబడిన తరగతులు నాయకత్వ స్థానంలో నిలిచిన తరువాత సుస్థిరత ఏర్పడింది. నాలుగు వందలకు పైగా అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ సాధించి మాయావతి రాష్ట్ర చరివూతలో మొదటిసారిగా ఐదేళ్ళు అధికారంలో కొనసాగారు. ఈ క్రమంలోనే ములా యం అసాధారణ రీతిలో 224 స్థానాలు గెలుచుకోగలిగారు. 1991లో బీజేపీ ఉద్వేగాలను రెచ్చగొట్టినప్పుడు కూడా 221 స్థానాలే తెచ్చుకోగలిగింది. కానీ ఇప్పుడు ములాయం ఉద్వేగాలకు అతీతంగా అగ్రవర్ణాల ఆమోదం కూడా పొంది ఈ విజయం సాధించారు. ఉత్తర ప్రదేశ్ సమరంలో ఎస్పీ, బీఎస్పీ రెండూ హోరాహోరీగా పోరాడాయి. ఎస్సీతో పోలిస్తే బీఎస్పీకి ఓట్లు రెండున్నర శాతమే తక్కువ వచ్చా యి. బీఎస్పీ ఎనభై స్థానాలకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ బలమైన పార్టీగానే నిలిచింది. ఈ రెండు పార్టీల హోరులో కాంగ్రెస్, బీజెపీ మనుగడ కాపాడుకోవడానికి తంటాలు పడ్డాయి. 

ఇప్పుడు అగ్రవర్ణాలు- దళితులు లేదా వెనుకబడిన తరగతులు అధికార ఫలంలో భాగస్వామ్యం కోసం చేస్తున్న పోరాటాన్ని ఆమోదించి, సర్దుబాటుకు సిద్ధపడుతున్నాయి. దళితులు, వెనుకబడిన తరగతుల నాయకత్వాలు కూడా అగ్రవర్ణాల వ్యతిరేక వైఖరిని విడనాడి వారిని కలుపుకుపోతున్నాయి. ఒకప్పుడు అగ్రవర్ణాల వారు సార్వజనీన ఆమోదంతో ఎన్నికయినట్టుగానే, ఇప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల వారు గెలుపొందుతున్నారు. దళిత, వెనుకబడిన కులాల నాయకులను ఆయా కులాలకే కుంచింప చేసి, విభజించి పాలించే కుటిల నీతికి కాలం చెల్లింది. బహుజనులు విస్తృత ఆమోదంతో ప్రధాన స్రవంతి రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు. రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ చారివూతక పరిణామాన్ని ఎవరూ ఆపలేరు. నాడు మాయావతి, నేడు ములాయం గెలుపు ఇస్తున్న సంకేతం ఇదే. ఇరు వర్గాల జయాపజయాలను విడదీసి చూడకూడదు.
నమస్తే తెలంగాణా సంపాదకీయం Dated -08 /03 /2012 

No comments:

Post a Comment