Wednesday, March 7, 2012

కొత్త కోణాల్లో రాష్ట్రాల పునర్‌విభజన---హరగోపాల్


కొత్త కోణాల్లో రాష్ట్రాల పునర్‌విభజన
JAI-Andhra talangana patrika telangana culture telangana politics telangana cinema
గత నెల 21,22వ తేదీలలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాష్ట్రాల పున ర్ వ్యవస్థీకరణ మీద ఒక జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాలా అంశాలపై చర్చ నడిచింది. ఈ ప్రారంభ సమావేశంలో తెలంగాణపై నేను మాట్లాడాను. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాని, ఇక్కడ జరిగిన ఉద్యమాల గురించి గాని జాతీయస్థాయిలో అవగాహన లేదు. సమాచారం కూడా లేదు. ఈ దేశంలోని ప్రసార సాధనాలు ముఖ్యంగా ఢిల్లీ ఇంగ్లిష్ ఛానల్స్‌కు ఢిల్లీలో ఎవరైనా తుమ్మినా.. వారే కానీ ఇతర ప్రాంతాలలో మొత్తం దేశ రాజకీయాలను కుదిపివేసిన సంఘటనలు వార్తలు కావు. బాలగోపాల్, కన్నబీరన్, శంకరన్ లాంటి వ్యక్తుల మరణాలు కూడా వార్తలు కాకపోవడం దుర్మార్గం. కొన్ని మరణాలు దేశానికే పెద్ద లోటు. కానీ మీడియాకు దాంతో పనిలేదు. 

తెలంగాణ ఉద్యమ చారివూతక నేపథ్యాన్ని, జరిగిన ఉల్లంఘనలను, పాలమూరు జిల్లా ప్రజల వలసలను, కరువును, కృష్ణానీటి పంపిణీలో జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరికి అది కనువిప్పుగా కూడా ఉంది. ఈ విషయాలు మాకు తెలియవు. ఎందుకు జాతీయ మీడియా దాని గురించి చర్చించడం లేదు అన్నప్పుడు మన జాతీయ మీడియాకు ప్రజాసామ్య విలువలు, సంస్కృతి, చారివూత క అవగాహన శూన్యం అని చెప్పవలసి వచ్చింది. ఎంత కాలం చెక చెక అరవడం తప్పించి, ప్రజల జీవన్మరణ సమస్యల మీద ఏ మాత్రం స్పృహ లేకపోవడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం.

ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.పి. సింగ్ తన ప్రసంగంలో భాషా రాష్ట్రాలు కావాలనే డిమాండ్ తెలుగు వాళ్ల నుంచే మొట్టమొదట వచ్చిందని, భాషా రాష్ట్రాలను విభజించాలనే డిమాండ్ కూడా ఆ ప్రజల నుంచే వచ్చింది అని వ్యాఖ్యానించాడు. జె.ఎన్.యు.కు చెందిన డాక్టర్ ఆశాసారంగి భాషా రాష్ట్రాల మీద మాట్లాడుతూ ఒక భాష రాష్ట్ర నిర్మాణానికి కాని నిలకడకు కాని సరిపోవడం లేదని, భాష ఆ ప్రాంత ప్రజలను ఐక్యం చేస్తుందని ఆశించినా ఫలితం రాలేదని.. దేశంలో దాదాపు 21 ప్రాంతాలలో తమకు తమ రాష్ట్రం కావాలని, భాష ప్రమాణంగా సరిపోదనే వాదన బలంగా ముందుకు వచ్చిందని విశ్లేషించారు. ఆమె ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి భాషా రాష్ట్రాల మీద పరిశోధన చేశారు. భాష ఒక రాష్ట్ర నిర్మాణానికి ఎందుకు సరిపోవడం లేదనే చర్చ జరిగింది.

ప్రతి భాషలో మాండలికాలున్నాయని, ఎలాగైతే భిన్న భాషల మధ్య అంతరమే కాక అంతరాలు ఉన్నాయో, ఒకే భాషలో కూడా అంతరాలున్నాయి. ఒక మాండలికం మరొక మాండలికం కంటే ఉన్నతమని, కొన్ని మాండలికాలలో వెనకబడిన వాళ్ల భాష అనే ఒక ఎగుడుదిగుడు ఆలోచన ఒకే భాష మాట్లాడుతున్నాం అనుకునే వాళ్ల మధ్యే ఉంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఉంది. ఒకే భాషలోని మాండలికాలలో ఏది ప్రామాణికం అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. భాషా శాస్త్రజ్ఞులు ఈ ప్రమాణం ఎలా నిర్ణయిస్తారో నాకు తెలియదు. కానీ రాజకీయార్థిక కోణం నుంచి ఆర్థికంగా ఎదిగిన వారు, లేదా ఆర్థికంగా ‘అభివృద్ధి’ చెందిన ప్రాంతంలో మాట్లాడే భాష ప్రామాణికమవుతుంది.

ఈ విషయంలో తెలుగు భాషనే ఉదాహరణగా తీసుకుంటే కృష్ణా జిల్లా భాష దాదాపు ప్రామాణికమై, పాఠ్యపుస్తకాలలో, సాహిత్యంలో, సినిమా డైలాగులలో, మీడియాలో ఉపయోగించబడుతున్నది. దీని ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో ఆలోచిస్తే, తెలంగాణ ఛానల్‌లో తెలంగాణ భాషను ఉపయోగిస్తున్నప్పుడు తెలంగాణకు చెందిన నాబోటి వాడికి కూడా కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ఇది నాకుండే సామాజిక నేపథ్యం వల్ల కావచ్చు. లేదా నా విద్యారంగ శిక్షణ వల్ల కావచ్చు. అల్లం రాజయ్య లాంటి రచయితలు సాహిత్యాన్ని తెలంగాణలోని పేద ప్రజల భాషలో రాసి, వాళ్ల భాషకు ఒక గౌరవవూపదమైన స్థానం కల్పించారు. 

భాష గురించి ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతంలోని మాటలు మరో ప్రాంతంలో భిన్న అర్థాలు కలిగి ఉంటాయి. తెలంగాణలో నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని పదాలు ఆంధ్ర ప్రాంతం వాళ్లకు బూతు పదాలుగా అనిపిస్తాయి. కొన్ని పదాలకు అర్థాలే తెలియ వు. నేను హైస్కూళ్లో చదువుకునే కాలంలో ‘స్వయం పాలన’ రోజు సోషల్ టీచర్‌గా ఆరవ తరగతితికి వెళ్లినప్పుడు పంటల గురించి పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు అని పుస్తకంలో ఉంది. రాగులు అంటే ఏమిటో నాకు తెలియదు. ఉపాధ్యాయుడి పాత్ర కాబట్టి ఎవరైనా విద్యార్థి ‘రాగులు’ అంటే ఏమిటి అని అడిగితే జవాబు తెలియకపోతే ఎలా అని ఇద్దరి ముగ్గురిని అడిగాను. వాళ్లు కూడా తమకు తెలియదు అని అన్నారు.

మహబూబ్‌నగర్‌లో పండే పంటల్లో జొన్నలతో పాటు మా పొలంలో తైదలు పండించేవారు. రాగులు అంటే తైదలే కావచ్చు అని అనుకున్నాను. అలాగే కాకినాడ పిజి సెంటర్, శ్రీకాకుళం పిజి సెంటర్లకు వెళ్లినప్పుడు గొర్రెలు, బర్రెల కొరకు అప్పు ఇస్తున్నారు అంటే కాకినాడలో బర్రెలు అంటే ఏమిటి అని అడిగారు. అక్కడ వాటిని గేదెలు అంటారు. శ్రీకాకుళంలో గేదెలు అంటే అవేమిటి అని వాళ్లు అడిగారు. భాషలోనే ఇలా తేడాలుండడం సహజం. ఇది అన్ని భాషలకు వర్తిస్తుంది. ఒకే వస్తువుకు లేదా అంశానికి భిన్నపదాలుండడం భాష సుసంపన్నతను, వైవిధ్యాన్ని తెలుపుతుంది. అది అసలు సమస్య కాదు. ఎవరు మాట్లాడే పదాలు గొప్ప లేదా ఎవరి పదాలు తక్కువ అనే వివక్ష దగ్గర సమస్య ప్రారంభమవుతుంది. సుసంపన్నమైన, దరివూదమైన భాష అనడంలో సాంస్కృతిక అంశం కంటే ఆర్థిక అంశానికి చెందిందని వాడే పదాల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నులది సంపన్న భాష దరివూదులది దరివూద భాష. ఇది సారాంశం.

భాషలో అంతరాలు, అంతస్తులు, అసమానతలు సామాజిక సంబంధాలు ప్రజాస్వా మ్య సంస్కృతిని దెబ్బతీస్తాయి. నిజానికి వైవిధ్యాన్ని గౌరవించి, దాన్ని సగర్వంగా చెప్పుకోగలిగిన సంస్కృతి ఉంటేనే భాష మనుషులను కలిపి ఉంచగలుగుతుంది. అందుకే భాషా రాష్ట్రాలు,భావ సమైక్యతని, కలిసి ఉండాలనే ఆకాంక్షను బలోపేతం చేయలేకపోయాయి. ఆర్థిక అసమానతలు పెరిగిన కొద్దీ మనుషుల అవగాహన మారుతుంది. అందుకే ప్రాంతీ య అసమానతలు పెరిగిన కొద్దీ భాషా రాష్ట్రాల భావన బలహీనమై, తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకుంటామని, ఇతరుల ఆధిపత్యాన్ని సహించేది లేదు అనే చెతన్యం పెరిగింది. ఈ వాదనను ముందుకు తీసుకవచ్చినప్పుడు, సెమినార్‌లో చాలా మంది దీనితో ఏకీభవించారు. ఈ అంశంపై మరింత లోతైన చర్చ జరగాలని కూడా భావించారు. అయితే కొత్త రాష్ట్రాల డిమాండ్ పెరిగితే ఎన్ని రాష్ట్రాలని ఏర్పాటు చేస్తారు? అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. భాషా రాష్ట్రాల ప్రమాణం కేవలం భాషే అయినంత కాలం కొత్త రాష్ట్రాల డిమాండ్ తప్పదు.

అంటే దేశంలో రాష్ట్రాల నిర్మాణాన్ని కొన్ని కొత్త కోణాల నుంచి, కొత్త ప్రమాణాల నుంచి చూడవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పష్టంగా, అస్పష్టంగా 21 ప్రాంతాలలో ఈ డిమాం డ్ ఉన్నది. వాటికి కారణాలను వెతకవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరవూపదేశ్‌లో మాయావతి ఆ రాష్ట్రాన్ని నాలు గు రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రకటన చర్చకు వచ్చింది. ఈ ప్రకటనకు తెలంగాణ డిమాండ్‌కు సంబంధం ఉందా అని చర్చవచ్చినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హిమాంశురాయ్, ఈ రెంటికి తేడా ఉందన్నాడు. మాయావతి ప్రకటన పై నుంచి తీసుకున్న నిర్ణయమని, తెలంగాణ డిమాండ్ ప్రజల ఆకాంక్ష నుంచి వచ్చిందని, ఈ తేడాను గుర్తించవలసి ఉంటుందని అని వివరించాడు.

హిమాంశురాయ్ తన ప్రసంగంలో మరొక అంశాన్ని ముందుకు తీసుకువచ్చాడు. కొన్ని ప్రాంతాలలో కొత్తగా ఎదుగుతున్న వ్యాపారవర్గాలు కూడా ఇలాంటి డిమాండ్ల తో ముందుకు వస్తున్నాయి. బిజెపి లాంటి జాతీయపార్టీలు, వేటికైతే వ్యాపారవర్గాలలో చాలా మద్దతు ఉందో, ఆ పార్టీ లు ప్రాంతీయ ఉద్యమాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని, అంటే జాతీయవాదం, ప్రాంతీయవాదంతో జతకలవడం, జాతీయస్థాయి వ్యాపార వర్గా లు, ప్రాంతీయ వ్యాపార వర్గాల అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నాయి అన్నాడు. ఈ అంశంలో కూడా తెలంగాణ భిన్నంగా ఉంది. బిజెపి లాంటి పార్టీల మద్దతు కోరుతున్నారేమో కాని బిజెపి మతతత్వ రాజకీయాలను తెలంగాణ రాజకీయ పోరాట చైతన్యం అంగీకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నే. .

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌డ్డి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేశాడు. కొంత స్పందన కూడా వచ్చింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌తో పోటీపడుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు సవాలే. అయితే కిషన్‌డ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిజెపి నుంచి ప్రధాని అభ్యర్థిగా తాను నరేంవూదమోడీని సమర్థిస్తానని అన్నాడని పత్రికల్లో వచ్చింది. అది నిజం కాదేమో అని అనుకుంటున్నాను. ఇది నిజమే అయితే ఆయన అర్థం చేసుకోవలసింది, గుజరాత్ మానవ హననం తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 12 గంటలు జరిగిన సదస్సులో వందలాదిమంది అక్కడి సంఘటనలకు కనీళ్లుపెట్టుకున్నారు. ఇది తెలంగాణ మానవత్వం. దీన్ని విస్మరించే రాజకీయాలకు తెలంగాణలో అవకాశాలు ఉండడంకష్టం. 
మొత్తంగా ఈ సెమినార్‌లో చాలా మంది తెలంగాణ విషయంలో ఒక స్పష్టత ఏర్పడిందని, ఈ విషయం గురించి జాతీయస్థాయిలో ఎక్కువ చర్చ చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జాతీయస్థాయిలో ప్రజాభివూపాయాన్ని ఎలా సమీకరించగలమన్నది తెలంగాణ ఉద్యమం ముందున్న పెద్ద సవాల్.

పొఫెసర్ హరగోపాల్
నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ dated  08 /03 /2012 

No comments:

Post a Comment