'చిన్న, చిన్న పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపించి ప్రజలకు పని సంస్కృతిని పెంపొందించాలని' పారిశ్రామిక వేత్తలను కోరిన తాత్త్వికుడు నారాయణ గురు. మనుషుల విద్యాస్థాయిలో, ఆర్థిక స్థితిగతుల్లో భేద భావాలుండవచ్చు కాని మానవులంతా ఒక్కటేనని ఆయన ప్రకటించారు. ఎన్ని భాషలు, సంస్కృతులు, కులాలు ఉన్నప్పటికీ మానవ జాతి మౌలికమైన, అసలైన కులం మానవత్వమేనన్నది నారాయణ గురు సందేశం.
మానవుడికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు ఉండాలన్న అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీ నారాయణ గురు ఒక అపురూప సామాజిక తత్త్వవేత్త. 'కులం గురించి అడగకు, చెప్పకు, ఆలోచించకు'... 'కులం ఏదైనప్పటికీ మనిషి ఎదగాలి'... అని ఉద్భోదించిన శ్రీనారాయణ గురు కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న 'చెంపజంటి' అనే ప్రాంతంలో 'ఎజవ' అనే అత్యంత వెనుకబడిన కులంలో 1856లో జన్మించాడు. కులం, మతం పేరుతో ఆ కాలంలో ఈ తెగవారు దారుణంగా అణిచివేయబడ్డారు.
నారాయణ గురు కాలంలో కుల భావన తప్పు గాదు. ఇతర కులాల వారు విధించే పరిధులు మూర్ఖంగా ఉండేవి. శూద్రులు శరీరం పై భాగంలో వస్త్రాలు ధరించడానికి వీలులేదు. మతపరమైన కార్యకలాపాల్లో జంతుబలి ఉండేది. ఇతర అగ్రకులాల వారికి దూరంగా ఉండవలసివచ్చేది. పరిధులు అతిక్రమించిన వారికి శిక్షలు కఠినంగా ఉండేవి. కేవలం అగ్ర వర్ణ హిందువులు మాత్రమే ప్రభుత్వోద్యోగాలకు అర్హులు. హత్యానేరం వంటి వాటి నుంచి, బ్రాహ్మణులకు తప్పించుకొనే వెసులుబాటు ఉండేది. శూద్రులు మొదలైన హిందూ కులేతరులకు చిన్న నేరాలకు సైతం మరణ శిక్ష వంటి కఠినమైన శిక్షలు అమలుపరిచే వారు.
ఈ విధమైన అత్యంత దారుణ పరిస్థితుల మధ్య పెరిగిన శ్రీ నారాయణ గురు తన 23వ ఏటనే నిమ్న, అంటరాని కులాల విద్యార్థుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఆధ్యాత్మిక, మత సంబంధిత అంశాల అధ్యయనం పట్ల అత్యంత ఆసక్తి కనబరిచే నారాయణన్ క్రమంగా 'వైరాగ్య స్థితి'లోకి మారడం ప్రారంభించాడు. తాను పెళ్ళాడిన కాలి అమ్మకు విడాకులు ఇచ్చి ఇంటినుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మానవత్వం గురించి అధ్యయయనం చేశాడు. పేదల జీవితాలకు దగ్గరయి వారిలో ఒకడుగా జీవించాడు. వారి సమస్యలు తెలుసుకొన్నాడు. మానవత్వానికి దగ్గరయినప్పుడు ఆయన ఎన్నో గొప్ప సత్యాలను గ్రహించాడు. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని తెలుసుకొన్నాడు. అనారోగ్యకర ఆలోచనలతో ఈ దైవత్వాన్ని అణిచేస్తున్నామని భావించాడు. వర్ణ వ్యవస్థ, మను ధర్మాలను వ్యతిరేకించి వాటిని రూపుమాపడానికి పూనుకొన్నాడు. వీటికి ప్రత్యామ్నాయంగా శ్రీనారాయణ ధర్మాన్ని ప్రచారం చేశాడు. దీనికోసం 'శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం' (ఎస్ఎన్‌డిపి) అనే ఒక సంస్థను స్థాపించాడు.
వర్ణ ధర్మం చేసిన హాని :- మను ధర్మ వ్యవస్థ సమాజాన్ని విభజించింది. బ్రాహ్మణులు అగ్ర స్థానంలోనూ శూద్రులు అట్టడుగున ఉంటారు. క్షత్రియులు, వైశ్యులు మధ్యస్థంగా ఉంటారు. వీరికి అదనంగా పంచములు ఉంటారు. వీరు అంటరానివారు లేదా కులహీనులు. నారాయణ గురు కాలంలో కేరళలో కుల వ్యవస్థ పతాక స్థాయిని చేరింది. అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణుల్లో కూడా చాలామంది సనాతన, సంప్రదాయ ఆచారాల బారిన పడ్డవారే. బహు భార్యాత్వం, స్త్రీలు అవివాహితులుగా మిగిలిపోవడం వంటివి జరిగేవి. శూద్రుల్లోనూ, అస్పృశ్యుల్లోను అనేకానేక అవమానాలకు గురయిన వారు ఎంతో మంది. ఈ పరిస్థితులను చూసిన స్వామి వివేకానంద కేరళను 'మతిస్థిమితం కోల్పోయిన వారి ఆశ్రమం'గా వర్ణించాడు.
నారాయణ గురు ఈ దురవస్థను చూసి చలించిపోయాడు. అద్వైత సిద్ధాంతం ఆధారంగా ఆయన ఒక నూతన 'ధర్మాన్ని' ప్రతిపాదించాడు. ప్రపంచంలోని అన్ని జీవుల్లో ప్రకాశించేది ఒకే సార్వత్రిక జీవాత్మ. వర్ణ వ్యవస్థ ఈ మౌలిక ఏకత్వాన్ని విస్మరించింది. బలవంతపు భేద భావం అద్వైతాన్ని నిరాకరించడమే అవుతుంది. అంటరానితనం, వర్ణ వ్యవస్థలు అద్వైత విధానానికి ఆటంకాలే.
మానవత అంతా ఒకే బాటను అనుసరిస్తుంది. కాబట్టి, అద్వైతం ఆధారంగా నారాయణ గురు ఈ ఏకత్వ తత్వ సిద్ధాంతాన్ని లేవనెత్తాడు. ఈ తత్వం కేరళ సామాజిక వ్యవస్థలో ఒక అద్భుతాన్ని సృష్టించింది. 'అలువ' ప్రాంతంలో స్థాపించిన ఆశ్రమానికి ఆయన 'అద్వైతాశ్రమమని' నామకరణం చేశాడు.
నారాయణ గురు గొప్ప సామాజిక ఉద్యమకారుడిగా పనిచేశాడు. కాని ఈ ఉద్యమం శాంతియుతమైంది. కేరళ అంతటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. 'నాను', నాను స్వామిగా, నారాయణ గురుగా, గురుస్వామిగా అంతిమంగా దేవుడిగా మిగిలిపోయాడు.
నారాయణ గురు సిద్ధాంతాలు :-
* అందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం.
* ఎవరి కులమూ అడగకు. ఎవరికీ నీ కులం చెప్పకు. కులం గురించి ఆలోచించకు.
* మనిషి తనకు నచ్చిన మతం అనుసరించుకొనే స్వేచ్ఛ ఇవ్వాలి.
* మతం ఏదైనా, మనిషి తనంత తాను ఎదగాలి.
* విద్య ద్వారా స్వేచ్ఛ, ఏకత్వం ద్వారా బలం, పరిశ్రమల ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూరతాయి
'మానవుడు ఏ పని నిర్వహించినా అది తన సంతోషం, మానసిక ఆనందం కోసమే. ఇది సార్వత్రిక సత్యం. అన్ని మత సిద్ధాంతాలు, నమ్మకాలు, భావనలు మానవుల సంతోషం కోసం పాటుపడతాయి. ఇది మానవ ప్రయత్నాలన్నింటిలోకి అతి ముఖ్యమైన అంశం. అత్యంత ఆవశ్యకమైన ఈ భావనను అందరూ అంగీకరించవలసిందే'నని నారాయణ గురు ప్రపంచానికి తెలియజెప్పారు.
'మనిషి తన ఆనందం కోసం చేసే ప్రయత్నం, కృషీ ఇతరులకూ సంతోషకరం కావాలి' అంటాడు నారాయణ గురు. 'ఒరు జాతి, ఒరు మతం, ఒరు దేవమ్ మనుష్యమ్' అంటూ దేవుడి ముందు మనుషులంతా సమానమే నారాయణ గురు సిద్ధాంతం సర్వదా ప్రశంసనీయమైంది.
గురు అన్నింటికంటే మరో ముఖ్యమైన అంశాన్ని ప్రకటించారు. 'ఇక గుళ్ళు, గోపురాలు నిర్మించడం తగ్గించాలి. దేవాలయాలు, దేవుళ్ళపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. వీటి నిర్మాణంలో పెద్ద మొత్తాలు వెచ్చించడం భావ్యం కాదు. పాఠశాలలు నిర్మించండి. అవే పెద్ద దేవాలయాలు, వాటి నుంచి సంస్కృతి, విజ్ఞానం నేర్చుకొంటాం. ప్రేమ, సమ భావనను నేర్చుకొంటాం' అని నారాయణ గురు అందరి కంటే ఉన్నతంగా ఆలోచించాడు. 'చిన్న, చిన్న పరిశ్రమలు, కర్మాగారాలు స్థాపించి ప్రజలకు పని సంస్కృతిని పెంపొందించాలని' పారిశ్రామిక వేత్తలను కోరాడు నారాయణ గురు.
మనుషుల విద్యాస్థాయిలో, ఆర్థిక స్థితిగతుల్లో భేద భావాలుండవచ్చు కాని మానవులంతా ఒక్కటేనని ప్రకటించారు గురు. ఎన్ని భాషలు, సంస్కృతులు, కులాలు ఉన్నప్పటికీ మానవ జాతి మౌలిక మైన, అసలైన కులం మానవత్వమేనని ఒక అపురూపమైన సందేశం ఇచ్చారు. 'ఒక ఆవు రంగు, రూపు వంటి బాహ్య స్వరూపం వేరయినా అన్ని ఆవులూ ఇచ్చే పాలు ఒకటే. ఇదే తత్వం మనుషులకూ వర్తిస్తుంది' అన్నాడు. నారాయణగురు ధర్మ, తత్వ సిద్ధాంతాలు ఆయనకు మహాత్మా గాంధీ, బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతీరావు ఫూలే, ఇ.వి.రామస్వామి నాయకర్ వంటి ఆధునిక భారతదేశ తత్వవేత్తల సరసన నిలబెట్టాయి. నారాయణ గురు 1928 సెప్టెంబర్ 20న కేరళలోని తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఊరు వర్కలలో పరమపదించారు.
ప్రపంచం ఒక తత్వవేత్తను కోల్పోయింది. ఒక సామాన్యరైతు బిడ్డ 'అసన్, యోగి, గురు' అంతిమ లోకానికి చేరుకొన్నాడు. గొప్ప తత్వవేత్తలయిన మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ టాగూర్ వంటి వారి సరసన నిలబడగలిగిన వాడుగా నారాయణ గురును ప్రఖ్యాత ఫ్రెంచ్ సాహిత్యకుడు రోమెయిన్ రోలండ్ అభివర్ణించారు.
గురు ప్రతిపాదిత - 'ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం, సిద్ధాంతం'; కులం- 'అడగకు, చెప్పకు, ఆలోచించకు' అన్న తత్వం; 'విద్య ద్వారా స్వాతంత్య్రం, వ్యవస్థ ద్వారా సమగ్రత, శ్రమ ద్వారా అభివృద్ధి' నినాదానికి సార్థకత చేకూరాలంటే వాటిని ఆచరించడం ద్వారా మాత్రమే సుసాధ్యం.
- దామోదర్ రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
(మార్చి 11న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో జరిగే శ్రీ సంత్ శిరోమణి గురు రవిదాస్ అంతర్జాతీయ సమ్మేళనం సందర్భంగా...)
Andhra Jyothi News Paper Dated: 10/3/2012
Andhra Jyothi News Paper Dated: 10/3/2012
No comments:
Post a Comment