Friday, March 23, 2012

ముందడుగు - సంపాదకీయం



సాధారణ చట్టాలు వేరు, వ్యక్తిగత వ్యవహారాల చట్టాలు వేరు. ఎంతటి నిరంకుశ పాలన అయినా, పౌరుల వ్యక్తిగత జీవనాన్ని నియంత్రించే విషయంలో వెనుకడుగు వేస్తుంది, ఎంతో కొంత స్వయం ప్రతిపత్తిని అనుమతిస్తుంది. సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి దారుణ దురాచారాల విషయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం కానీ, దేశీయ సంస్థానాల పాలకులు కానీ ఆచితూచి అడుగులు వేశారు, సంబంధిత ప్రజావర్గాల నుంచి డిమాండ్ వచ్చిన తరువాతే చట్టాలు చేశారు. వ్యక్తిగత వ్యవహారాల చట్టాలు సున్నితమైనవి కాబట్టే, మన దేశంలో ఇంకా వివిధ మతవర్గాల ప్రాతిపదికపై వ్యక్తిగత చట్టాలున్నాయి. 

వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు మొదలైన అంశాలలో ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు వేరు వేరు సాంస్క­ృతిక నేపథ్యాల ఆధారంగా ఉంటాయి. సమాజం మారుతూ ఉన్నప్పుడు వాటిలోనూ మార్పులు వస్తాయి. తగిన సమయంలో, బహుళామోదం ఉన్నదనుకున్నప్పుడు సంస్కరణలు సమాజంలోను, తరువాత చ ట్టాల్లోనూ జరుగుతాయి. ప్రజలు సన్నద్ధంగా లేనప్పుడు చట్టాలు చేసినా, సమాజంలో మార్పులు వచ్చిన తరువాత కూడా వాటికి చట్టబద్ధత ఇవ్వకున్నా- అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. స్వలింగ సంపర్కుల విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య సాగుతున్న చర్చ- వ్యక్తిగత సంబంధాలలో కొత్త స్థితిగతులకు అనుగుణంగా చట్టాలను సవరించే ప్రయత్నంలో భాగమే. ఒకపక్క సరొగసీ పెరిగిపోతుండగా, దానికి చట్టబద్ధత లేకపోవడం వల్ల వచ్చే సమస్యలేమిటో ఈ మధ్యనే ఒక జమైకన్ స్త్రీ ఎదుర్కొన్న సంకటపరిస్థితి నిరూపించింది. 

శుక్రవారం నాడు కేంద్రకేబినెట్ 1955 నాటి హిందూ వివాహచట్టానికి, 1954 ప్రత్యేక వివాహాల చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ సవరణల ప్రకారం విడాకుల ప్రక్రియ సరళతరం అవుతుంది. విడాకులు కావాలని ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు, వారి మధ్య సయోధ్యావకాశాలను పరిశీలించడానికి నిర్ణీతంగా ఇచ్చే ఆరుమాసాల నుంచి పద్దెనిమిది మాసాల గడువును ఇప్పుడు సడలిస్తారు. న్యాయమూర్తి విచక్షణ ప్రకారం ఆ గడువును నిర్ణయించవచ్చు, తక్షణం కూడా విడాకులు మంజూరు చేయవచ్చు. వివాహం ఇక పునరుద్ధరించడం సాధ్యపడదు-అన్న నిర్ధారణ కూడా విడాకులకు ఒక కారణంగా న్యాయస్థానాలు అనుమతించవచ్చు. 

అయితే, ఈ ప్రాతిపదికపై భర్తలు వాదిస్తే, దాన్ని భార్యలు వ్యతిరేకించవచ్చు. కానీ, భార్య అదే ప్రాతిపదికపై విడాకులు కోరితే, భర్త దాన్ని వ్యతిరేకించడానికి లేదు. విడాకులు మంజూరుచేస్తున్నప్పుడు భర్త ఆస్తిలో భార్యకు వాటా లభిస్తుంది. ఎంత వాటా అన్నది ఆయా వ్యాజ్యాల ఆధారంగా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. విడాకుల సందర్భంగా ఆస్తుల పంపకం జరిగితే, సొంత పిల్లలకు, దత్తత చే సుకున్న పిల్లలకు సమానంగా వాటాలు లభిస్తాయి. 

2010లో వివాహచట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. తరువాత దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించారు. వివాహ పునరుద్ధరణ అసాధ్యం అన్న ప్రాతిపదికమీద విడాకులు మంజూరు చేయవచ్చని, అయితే, సయోధ్యకోసం విధించే గడువును కొనసాగించాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. సిఫార్సులను ఆమోదిస్తూనే, కేంద్రకేబినెట్, గడువును న్యాయస్థానాల విచక్షణకు వదిలివేసింది. తక్షణ విడాకులకు కూడా వెసులుబాటు కల్పించింది. 

1955లో మొదటిసారి విడాకుల చట్టం తెచ్చినప్పుడు- భారతీయ సమాజం దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించలేదు. సమాజంలో అప్పటికే విడిపోవడాలు, విడాకులు ఉన్నాయి. కానీ, దానికి చట్టబద్ధత కల్పించడానికి పురుషాధిక్య సమాజం సంకోచించింది. కానీ, ముందుచూపుతో ప్రభుత్వం ఆ చట్టాన్ని తెచ్చింది. సమాజంలో వస్తున్న అనేక మార్పులు వ్యక్తిగత సంబంధాలను, కుటుంబ సంబంధాలను మార్చివేస్తున్నది. స్త్రీలలో అక్షరాస్యత, విద్యాధిక్యత, ఆర్థిక స్వావలంబన పెరిగే కొద్దీ, సాంప్రదాయిక భావాల ప్రాబల్యంలో ఉన్న పురుషప్రపంచం స్త్రీలను అణగదొక్కడానికి మరింతగా ప్రయత్నం చేయనారంభించింది. 

స్త్రీలలో చైతన్యం పెరుగుతున్నా మరోవైపు స్త్రీలపై అత్యాచారాలూ పెరగడం- అందువల్లనే. అదే సమయంలో స్త్రీల విషయంలో నూతన సంస్కారంతో, సమభావంతో వ్యవహరించే పురుషుల సంఖ్య, కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీల ప్రాతినిధ్యం పెరుగుతోంది. రాజకీయాలలో స్త్రీల సంఖ్యను పెంచడం కోసం రిజర్వేషన్లు కావాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగాలనే ధైర్యమూ కోరికా ఉన్న స్త్రీలు పెరుగుతున్నారు. 

ఒంటరిగా జీవించాలనుకునే స్త్రీలు ఈ రోజు సర్వసామాన్యంగా కనిపిస్తున్నారు. సహజీవనం మరింత ప్రజాస్వామికంగా ఉండడం కోసం, ఎటువంటి తంతూ లేకుండా కలసి ఉండే జంటల సంఖ్య కూడా పెరుగుతున్నది. మారుతున్న సామాజిక చిత్రపటం సరికొత్త సమస్యలకు కారణమవుతోంది, సరికొత్త విలువలను, చట్టాలను కోరుకుంటోంది. కేంద్రం కొత్తగా ప్రతిపాదిస్తున్న సవరణలు - అటువంటి ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో ఒక చిన్న ముందడుగు మాత్రమే. 

దుర్భరంగా మారిన దాంపత్యం నుంచి వేరుపడాలనుకునే స్త్రీలకు సానుకూల అవకాశాలను కల్పించడం, అదే సమయంలో అన్యాయంగా భార్యలను వదిలివేసే పురుషులకు దాన్ని కష్టతరం చేయడం- కొత్త సవరణల ఉద్దేశ్యం. సాధించినవాటిని స్వాగతిస్తూ, చట్టాలు మరింతగా బాధితులకు న్యాయం చేసేవిధంగా రూపొందడానికి పౌరసమాజం, మహిళాసంఘాలు కృషిచేయవలసి ఉన్నది.

Andhra Jyothi News Paper Dated    : 24/03/2012 

No comments:

Post a Comment