Sunday, March 11, 2012

ధార్మిక విప్లవకారుడు - కదిరె కృష్ణ



భారతదేశ చరిత్రలో మధ్యయుగం (క్రీ.శ. 700- 800) విచిత్రమైంది, వివాదాస్పదమైందే కాక విప్లవాత్మకమైంది కూడా. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అనేక పరిణామాల ప్రభావం భారతదేశంపై ఎప్పుడూ కాస్తంత ఎక్కువే ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్యయుగ కాలంలో సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చరిత్ర రంగస్థలం మీద పాత్రలు చాలా విచిత్రంగా తారుమారయ్యాయి. క్రీ.శ.632లో జన్మించిన మహమ్మద్ ప్రవక్త, తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ప్రపంచా న్ని మరొక్కసారి ఒక కుదుపు కుదిపాడు. 

ఆయన మరణానంతరం మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతం తిరుగులేని రీతిలో వేగం పుంజుకుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా దేశాల రాజకీయ, సాం స్కృతిక ఆధ్యాత్మిక సామాజిక రంగాలను తీవ్రంగా ప్ర భావితం చేసింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ప్రకారం ఇస్లాం జైత్రయాత్ర పశ్చిమాసియాలో ప్రారంభమై ఉత్తర ఆఫ్రికా గుండా స్పెయిన్ దాకా సాగింది. 

ఈ పరిణామ క్రమంలో భాగంగానే క్రీ.శ. 712లో అరబ్బులు మన దేశంలోని సింధు రాష్ట్రాన్ని జయించారు. దీంతో భారతదేశంలో అరబ్బుల రాజకీయాధికారానికి పునాదులు పడ్డాయి. మరోవైపు పశ్చిమ తీరంలో అరబ్బుల చేత అనేక వ్యాపార కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఈ దరిమిలా ఇస్లాం మతం భారతదేశమంతటా వ్యాపించిన ఫలితంగా సమాజంలోని అన్ని రంగాల రూపురేఖలు మారిపోయాయి. భాష, కళలు, ఆర్థిక, రాజకీయ, మత రంగాలలో కొత్త భావనలు ప్రభవించాయి. 

క్రీ.శ. 1000 సం.లో గజనీ మహమ్మద్, 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ దండయాత్రతో ముస్లిం రాజులు రాజకీయ అధికారాన్ని పూర్తిస్థాయిలో కైవసం చేసుకున్నారు. దరిమిలా ఇస్లాం మత సాంస్కృతిక ఆచార సంప్రదాయాలు భారత సంస్కృతిలో విడదీయరాని భాగమైపోయాయి. పైగా ఇస్లాం మతంలోని సమానత్వం, సౌభ్రాతృత్వం భావనలు సమాజంలోని కింది కులాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఈ కారణంగా ఇస్లాం మతంలోకి వలసలు నానాటికీ పెరుగుతూపోతున్న నేపథ్యంలో ఆ మతంలోని ఛాందసవాదులు(Conservatives) మత భ్రష్టత్వనెపంతో ఈ మార్పులను వ్యతిరేకించారు. ఫలితంగా మతాన్ని సరళీకరించి, దేవుణ్ణి సామాన్యునికి చేరువ చేసే ఒక ఉదారవాదవర్గం (Liberals) పుట్టకొచ్చింది. ఈ రకంగా మత నియమాలు పాటించకుండానే దేవుణ్ణి ఆరాధించవచ్చుననే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మతాన్ని మసీదు నుంచి దర్గాకు ట్రాన్స్‌ఫార్మ్ చేశారు. ఈ బోధనలే సూఫీ మతంగా చరిత్రలో విలసిల్లుతున్నాయి. 

ఇలా సూఫీ మత ప్రవక్తల బోధనల ప్రభావంతో నాటికి అమల్లో ఉన్న కుల వ్యవస్థ దాని అరాచకత్వం, బ్రాహ్మణ వర్గాల కఠోర హింసా ప్రవృత్తి, దండనలతో విసిగిపోయిన కింది కులాల ప్రజలు ఈ మతం దిశగా దృష్టి సారించారు. సూఫీ మతంలోని స్వేచ్ఛ, సమానత్వం, ఏకేశ్వోరాపాసన, మానవత విలువలకు ఆకర్షింపబడి శ్రామిక కులాల ధీమంతులు అంటరానితనం, ఎగుడు దిగుడు వ్యవస్థ వాటి మానస పుత్రులైన అసమానత, అవమానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ క్రమంలో కొందరు ప్రవక్తలుగా మారిపోయారు. 

అటువంటి వారిలో సంత్‌కబీర్ (దూదేకుల/నేత), కర్ణాటక నుంచి చర్మకారుడు హరలయ్య, స్త్రీ వాది అక్క మహాదేవి, మహారాష్ట్ర నుంచి దర్జి వాడైన నామదేవ్, గ్రామ సేవకుడు ఛోకమేళ, కిరాణా వర్తకుడు తుకారాం, కూరగాయల వ్యాపారి సవతామాలి, ఉత్తర భారతం నుంచి తిరుగుబాటు రాకుమారి మీరాబాయి, కుమ్మరి గోరా, మంగలి సేనా, చెప్పులు కుట్టే సంత్ రవిదాస్ ముఖ్యులు. వీరిలో మిక్కిలి ప్రతిభావంతులు, భావితరాలను బాగా ప్రభావితం చేసిన వారిలో రవిదాసు, కబీర్, తుకారామ్‌లు ప్రధాన మైనవారని చెప్పుకోవచ్చు. 

విచిత్రమేమిటంటే వీరంతా క్రింది కులాలవారే. భక్తిని ఆయుధంగా చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలు చేసిన సుజనులు. ప్రజలకు అర్థమయ్యే భాషలో గేయాలు పాడుతూ వాటిలో భక్తి తత్వాన్ని రంగరించి సామాజిక వైరుధ్యాలను, రుగ్మతలను నిరసిస్తూ ప్రజలను చైతన్య పరచడం వీరి విశిష్టత. చరిత్రలో భక్తి ఉద్యమంగా చిత్రీకరించబడినా నిజానికి ఇది కుల నిర్మూలన, సామాజిక విప్లవం. 

లోకం లోతైందే కాదు అనూహ్యమైంది కూడా. మానవుని ఊహకందనిది ఒక్క భవిష్యత్తు మాత్రమే. ఏ మతమైతే తమ అణచివేతకు కారణమైందో ఆ మతాన్ని సంస్కరించి రక్షించే బాధ్యతను బాధితులే స్వీకరించారు. సరిగ్గా అలాంటివాడే సంత్ శిరోమణి గురు రవిదాస్. క్రీ.శ. 15వ శతాబ్దంలో వారణాసిలో సంతోఖ్‌దాస్, కల్సిదేవి దంపతులకు జన్మించిన రవిదాస్, కబీర్‌ను తన మార్గదర్శకంగా ఎన్నుకున్నాడు. వృత్తిరీత్యా చెప్పులు కుట్టేవాడైన గొప్ప జ్ఞానిగా గుర్తింపు పొందాడు. ఆయన రాసిన సాంఘిక సంస్కరణోద్యమ గేయాలు నేటికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 

నేటికీ లక్షల సంఖ్యలో ఆయనకు శిష్యులున్నారు. ఆయన పేరున స్థాపించబడిన సంత్‌రవిదాసీ మతం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. బహుముఖీన ప్రతిభ విస్తరిల్లిన వ్యక్తిత్వం రవిదాసుది. కవి, గాయకుడు, మానవతా వాది, శాంతస్వభావి, నిగర్వి, మత సంఘ సంస్కర్త అయిన రవిదాసు పాటలు, పంక్తులు సిక్కుల మత గ్రంథమైన గ్రంథ్‌సాహెబ్‌లో సిక్కుల 5వ మత గురువు అర్జన్‌దేవ్ చేర్చాడంటే రవిదాసు ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వివిధ దేశాల్లో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో విద్యార్థులు, యువకులు నేటికీ ఆయన బోధనలపట్ల ప్రభావితులై ఆత్మగౌరవంతో హయ్‌సంత్ రవిదాసీ హై అని చెప్పుకుంటారు. 

జాత్-పాట్ ఫూచే నహి కోయి, హరి కా భజే సో హరి కా హై (కులం ఏమిటని అడుగకు ఎందుకంటే ప్రతివాడు దేవునివాడే) అంటూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, లింగ వివక్షను, కులహంకారాన్ని దుయ్యబట్టి సమస్త రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజాన్ని కడిగిపారేసిన వాడు రవిదాస్. 'తోహి మోహి, మోహి తోహి అంతర్‌కైసా' (నువ్వు నేనూ, నేనూ నువ్వు మనందరం మానవులమే మధ్యలో ఈ బేధాలేలా?) అంటూ రవిదాస్ గానం చేశారు. మానవులంతా సమానమే, ఆత్మపరమాత్మల పరమార్థం మానవత్వమేనంటూ మనసు పవిత్రమైతే ఏ తీర్థయాత్రలకు వెళ్ళనవసరం లేదని, అవన్నీ వృధాప్ర యాసగా కొట్టిపారేసి ధార్మిక వ్యవస్థలో విప్లవం సృష్టించాడు. 

'క మధురా, క ద్వారకా, క కాశిహరిద్వార్, రవిదాస్
ఖో జా దిల్ ఆప్నా, తేహ్ మిలియా దిల్‌దార్
మన్ ఛంగా తౌ కతోటి మీన్ గంగా' అని ఆయన గానం చేశాడు. రవిదాస్ ప్రాథమిక భావనలను వర్ణిస్తూ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త బ్రజ్‌రంజన్ మణి ఇలా అన్నారు."Sant Ravidas Conception of God-As 'deliverer of the poor', 'uplifter of the lowly' and 'purifier of the defiled'". 

చత్తీస్‌ఘడ్ మహారాణి ఝులిబాయి, సంత్‌రవిదాస్‌కు శిష్యురాలు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామానికి హతాశులైన సంప్రదాయ బ్రాహ్మణులు రాజు వద్దకు వెళ్ళి రవిదాసు అంటరానివాడని, అతడు దేవుని బోధనలు చేయుటకు అనర్హుడని, అట్టి వానివద్ద శిష్యరికం మహాపరాధం అని ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజు విచారణ జరిపి రాజ్యంలోని మేధావులను, పండితులను సమావేశపరచి ఆ సభలోనే రవిదాసును ఘనంగా సన్మానించాడు. ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ముందు వరుసలో తానుండి ఊరేగింపు చేశాడు. 

ప్రఖ్యాత విదూషిమణి, రాజకుటుంబీకురాలైన మీరాబాయి ఆయన శిష్యురాలే. ఇలా సమానత్వం, అంతరాలు లేని సమాజ నిర్మాణ ప్రేమ, మానవత దృక్పధం ఆదర్శ సమాజానికి శిరోధార్యమని, అరమరికలు లేని హృదయ సౌభాగ్యం ఆత్మగౌరవంతో కూడిన సమాజమే ధార్మిక వ్యవస్థను నిలుపుతుందని రవిదాస్ సగర్వంగా చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని చమార్లు ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో అంతర్జాతీయ సమ్మేళనం తలపెట్టడం ఎంతైనా హర్షదాయకం. ఇక ముందు రవిదాసును మార్గదర్శకంగా తీసుకొని ఐక్యత, చైతన్యంతో నవ సమాజానికి పునాదులేయాలని ఆశిద్దాం 

- కదిరె కృష్ణ 

కమిటీ మెంబర్, సంత్ రవిదాసు అంతర్జాతీయ సమ్మేళనం
(గురు రవిదాస్ 635వ జయంతి సందర్భంగా)
Andhra Jyothi News Paper Dated : 11/03/2012 

No comments:

Post a Comment