ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపుపై దళిత, ఆదివాసీలు సమరశంఖం పూరించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధుల సాధనకోసం హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు సాగిన ధర్నా, అనంతరం జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభించింది. దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో ఎక్కువ భాగం వేరే పద్దులకు మళ్ళించడం లేదా అసలు ఖర్చు చేయకుండా మురగబెట్టడమనేది ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. సబ్ ప్లాన్ కేటాయింపులు లేకపోవడమో, ఖర్చు చేయకపోడమో మాత్రమే కాదు సార్వజనీన కార్యక్రమాలకు చేసిన వ్యయంలో కొంత భాగాన్ని సబ్‌ప్లాన్ ఖర్చుగా చూపిస్తున్నారు. రహదారలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి వాటి ఖర్చు కూడా సబ్‌ప్లాన్‌లో చూపిస్తున్నారు.
సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, మళ్ళింపుల వ్యవహారంపై గతంలో కేంద్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర సర్కారును తప్పు పట్టింది. బడుగులకు నేరుగా ప్రయోజనం కలిగించే పథకాలు, కార్యక్రమాలకు ఖర్చయ్యే సబ్ ప్లాన్‌కు కేటాయింపులు జరపకుండా ఉన్న నిధులను సైతం సర్కారు దారి మళ్ళించడాన్ని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా దళిత, ఆదివాసీ సంఘాలు సబ్‌ప్లాన్ నిధుల వ్యవహారంపై వివిధ రూపాల్లో ఉద్యమించాయి.
ఉప నిధుల దారి మళ్ళింపులో కుల వివక్ష కొనసాగడం మాట ఎలా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని బడుగు నేతలు అందరూ ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులు నోడల్ ఏజెన్సీలకు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్న రాష్ట్ర సర్కార్ వైఖరిపై వివిధ వర్గాల నాయకులు, మేధావులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు చట్టబద్ధతను పరిశీలించేందుకు మంత్రుల కమిటీ వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
బడ్జెట్ ద్వారా బడుగుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కోసం, వారి పని పరిస్థితులు, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం 1979లో సబ్‌ప్లాన్ వ్యూహాన్ని రూపొందించారు. మూడు దశాబ్దాల క్రితమే ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్‌ల రూపకల్పనకు కేంద్రం నిర్ణయించింది. జనాభా దామాషాను బట్టి షెడ్యూల్డ్ కులాలకు 16.2 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్‌లో కేటాయించవలసి ఉన్నది.
బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిలకు 23 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యయం ఎన్నడూ 8 శాతానికి మించకపోవడం అన్యాయం. సబ్‌ప్లాన్ నిధుల సక్రమ వినియోగ బాధ్యత నోడల్ ఏజెన్సీకి కట్టబెట్టాలని కేంద్ర ప్రణాళిక సంఘం మార్గ నిర్దేశం చేసింది. బడుగుల బడ్జెట్ నిధుల పర్యవేక్షణ కోసం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఆ ఏజెన్సీ పనిచేయాల్సి ఉన్నది. మన పాలకులు ఆ ఏజెన్సీలను ఆచరణలో నీరుగార్చి వేశారు. ప్రభుత్వం, బ్యాంకుల నిరాదరణ కారణంగా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమై పోయాయి.
మన రాష్ట్రంలో 2008లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నోడల్ ఏజెన్సీలను నియమించి నిధులు కేటాయించినా నామమాత్రంగా కూడా ఖర్చు చేయలేదు. పులివెందుల అభివృద్ధికి, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్‌సాగర్ ఆ«ధునికీకరణకు ఆ నిధులను మళ్ళించారు. ఆ నిధులను మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద కాంట్రాక్టర్లకు వైఎస్ఆర్ పందేరం చేశారు. 1992నుంచి ప్రభుత్వంలోని ఇతర ఖాతాలకు తరలి వెళ్ళిన దళిత, ఆదివాసి సంక్షేమ నిధుల మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఉన్నట్లు ఉద్యమకారుల అంచనా. సంక్షేమ నిధులు భారీ ఎత్తున తరలి వెళ్ళిన కారణంగా రాష్ట్రంలో సాంఘిక సంక్షేమం, బడుగుల విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
సబ్ ప్లాన్ నిధులను కేటాయించిన మేరకు యథాతథంగా కనీసం వైద్యం కోసమైనా ఖర్చు చేసి ఉంటే వందలాది ఆదివాసులు బతికి ఉండేవారు. దాంతో సబ్‌ప్లాన్ నిధుల సక్రమ వినియోగం కోసం మహారాష్ట్ర, కర్ణాటక తీరులో మన నోడల్ ఏజెన్సీని కూడా పనిచేయించాలన్న డిమాండు ముందుకొచ్చింది. అయితే సబ్‌ప్లాన్‌కు, నోడల్ ఏజెన్సీకి చట్టబద్ధత లేకపోతే, ప్రభుత్వం మీద దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అగత్యమేమీ ఉండదు. ఈ నేపథ్యంలో సబ్‌ప్లాన్‌కు, నోడల్ ఏజెన్సీలకు చట్టబద్ధత కావాలని దళిత సంఘాలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దళితుల సంక్షేమం కోసం నిర్దేశించిన సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ చెప్పినట్టుగా సామాజిక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రాదేశిక నియోజకవర్గాల వల్ల ఎస్‌సి, ఎస్‌టిలకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయాలంటే సామాజిక విభజన ప్రాతిపదికన నిధులను కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సార్వజనీన సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం సాధ్యం కాదు. అలా చేసేందుకు ప్రయత్నించడం న్యాయం కాదు. దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై నిలదీయాల్సి ఉంది. ఎస్‌సి, ఎస్టీల సబ్ ప్లాన్‌పై చట్టసభలలో చర్చించి నిధుల రక్షణకోసం తగిన చట్టం తీసుకురావలసి ఉంది.
Andhra Jyothi News Paper Dated : 27/03/2012
No comments:
Post a Comment