Thursday, March 8, 2012

కమ్యూనిజమా, కమర్షియలిజమా?--Nirukonda Prasad



ఇప్పటికే రాష్ట్రం అవినీతి పరుల, అవకాశవాదుల చేతుల్లో విల విల లాడుతున్నది. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించుకోవడానికి ఏ కొంచెమైనా ఆలోచన చేయకుండా తమ ఓట్లు, సీట్లు పెంచుకోవడానికి మాత్రమే ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని సీపీఎం, టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఓటు బ్యాంకు రాజకీయాలు శాపంగా మారాయి. నీతులు చెప్పే వామపక్షాల మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. వారు కమ్యూనిజాన్ని కమర్షియలిజంగా మార్చారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. భ్రష్ఠు పట్టిపోయిన అవినీతి, అసమర్ధ, అవకాశవాద రాజకీయ వ్యవస్థను చక్కదిద్దడానికి కృషి చేయకుండా తామూ అందులోనే భాగంగా వ్యవహరిస్తుండడం విచారకరం. 

వామపక్షాల ఐక్యత, స్వతంత్ర పోరాటాలు అంటున్నారు. కానీ వామపక్షాల ఐక్యత ప్రకటనలు చేసేందుకే కాని ఆచరణ కోసం కాదనేదే ఇప్పటిదాకా రుజవైంది. కమ్యూనిస్టులు నిరాశతో, దురాశతో తమ పతనానికి తామే బాటలు వేసుకుంటున్నారనేది అభిమానుల ఆవేదన. గత కొన్నేళ్ళుగా కమ్యూనిజం అనే చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్న వారి నైజాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో వారిని దూరం పెడుతూనే ఉన్నారు. అయినా వారి నిర్ణయాల్లో మార్పు రావడం లేదు. విలువలు, విశ్వాసాలు, సిద్ధాంతాలకంటె స్వార్ధ రాజకీయ ప్రయోజనాలమేరకే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎప్పటికప్పుడు ఏ కొత్త పార్టీ కనుపించినా వారికి పండుగే. వీరి సిద్ధాంతాలు, విలువలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులతోనే కాలగర్భంలో కలిసిపోయాయా అనిపిస్తున్నది. 

కేసీఆర్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రాంత ప్రజల్ని దూషించి, మరో ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్ర ఐక్యతను దెబ్బ తీసి, రాజకీయ పార్టీలను, ప్రజలను రెండుగా చీల్చి రాజకీయాలు నెరపుతున్న దశలో ఆయన నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుని ప్రజల్ని ఉద్ధరిస్తామంటే ప్రజలు నమ్మేదెలా? అంతే కాక తెలంగాణపై ఏ విషయం చెప్పకుండా దాటవేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పొత్తు పెట్టుకుంటారన్న వార్తలపై కాని, జగన్‌, కేసీఆర్‌ ఫోన్‌ సంభాషణలపై వస్తున్న వార్తలపై కాని- ఇంతవరకూ ఆ ఇద్దరు నేతలూ ఖండించనూ లేదు, ప్రజలకు ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. మరి ఇదే నిజమైతే తెలంగాణపై ఏమీ తేల్చకుండా జగన్‌తో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు చెప్పాలి.

అదే విధంగా కోస్త, సీమ ప్రజలను దుర్భాషలాడుతూ వేదికలపై జాగో, బాగో అంటూ దండెత్తి తెలుగు ప్రజల్ని చీల్చడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్‌తో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో జగన్‌ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 2009 ఎన్నికలు తెలంగాణలో ముగియగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటు వేస్తే హైదరాబాద్‌ వెళ్ళాలంటే వీసాలు తీసుకోవలసి వస్తుంది తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించిన సమైక్యాంధ్రవాది తనయుడు టీఆర్‌ఎస్‌తో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో వివరించాలి. 

వామపక్షాలు రెండూ ప్రజాసమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామంటూ ప్రజలకు వాగ్దానాలు చేస్తుంటాయి కానీ వారిలో సఖ్యత నేతి బీర చందమే. ఏ అంశంలోనూ ఒకే వైఖరి తీసుకోలేని వ్యవహరణ వారిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ తర్వాత మొదటిసారి రాష్టమ్రంతటా జరిగిన శాసన సభ ఎన్నికలనాటినుంచి వామపక్షాల బలాన్ని పరిశీలిస్తే అది క్షీణిస్తూనే వస్తున్నదని బోధపడక మానదు. 1962 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 32 స్థానాలు గెలుచుకోగా, 1967 ఎన్నికల్లో 19 స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. సీపీఐ 103 శాసనసభ స్థానాల్లో పోటీచేసి 10 సీట్లు గెలుచుకుంది, 7.61 శాతం ఓట్లు పొందింది. సీపీఎం 82 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 9 స్థానాలను 7.61 శాతం ఓట్లను పొందింది. 1972 శాసన సభ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌ పార్టీతో సర్దుబాటు చేసుకుని 59 నియోజక వర్గాల్లో పోటీ చేసి 9 స్థానాలు, 6 శాతం ఓట్లు పొందింది.

సీపీఎం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయగా 1 స్థానాన్ని గెలుచుకుంది. 3 శాతం ఓట్లు పొందింది. 1978 శాసన సభ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీలతో సర్దుబాట్లు చేసుకుని పోటీ చేశాయి. సీపీఐ 30 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాలు గెలుచుకుని 2.44 శాతం ఓట్లను సాధించింది. సీపీఎం 22 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు, 2.64 శాతం ఓట్లు రాబట్టుకుంది. 1983లో కొత్తగా ఏర్పడిన తెలుగు దేశం పార్టీని రెండు పార్టీలూ కలసి 90 స్థానాలు కోరాయి. అయితే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడి స్వతంత్రంగానే పోటీ చేశాయి. సీపీఎం 5 స్థానాల్లో, సీపీఐ 4 స్థానాల్లో గెలిచి రెండు పార్టీలూ కలసి 4.68 శాతం ఓట్లు పొందాయి. 

1985 మధ్యంతర ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్నాయి. సీపీఎం 15 స్థానాల్లో పోటీచేసి 11 స్థానాలను, సీపీఐ 12 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాలను గెలుచుకున్నాయి. ఐతే తెలుగు దేశం మద్దతుతో తమ స్థానాల సంఖ్య పెంచుకున్నాయే తప్ప వాటి సొంత బలం కాదు. 1989లో కూడా ఈ రెండు పార్టీలూ తెలుగు దేశంలో పొత్తు పెట్టుకున్నా- తెలుగు దేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. సీపీఐ 2.48 శాతం ఓట్లతో 7 స్థానాలను, సీపీఎం 2.29 శాతం ఓట్లతో 4 స్థానాలు గెలుచుకున్నాయి. 1994 శాసన సభ ఎన్నికల్లో సీపీఐ తెలుగు దేశం మద్దతుతో 21 స్థానాలలో పోటీ చేసి 19 స్థానాలు గెలుచుకుని 3.39 శాతం ఓట్లు తెచ్చుకుంది. 

సీపీఎం కూడా తెలుగు దేశం మద్దతుతోనే 16 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాలను, 2.96 శాతం ఓట్లను సాధించింది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశంతో విభేదించి ఒంటరిగా పోటీచేసిన సీపీఐ 45 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలవకపోగా (1.62 శాతం ఓట్లు), సీపీఎం 48 స్థానాలకు పోటీ చేసి 2 సీట్లు, 1.70 శాతం ఓట్లు పొందింది. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ 12 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాలు, 1.53 శాతం ఓట్లు పొందగా, సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు, 1.84 శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ 4 స్థానాల్లో గెలిచి 1.76 శాతం ఓట్లు తెచ్చుకోగా, సీపీఎం 1 స్థానంలో గెలిచి 1.43 శాతం ఓట్లు సాధించింది. 

ఈ విధంగా పొత్తుల ముచ్చట్లోకూడా వామపక్షాలు నామమాత్ర ఓట్ల శాతంతో నెట్టుకొస్తున్నాయి. వామపక్షాల పోరాటాలకు ప్రజలు మద్దతు తెలుపుతారు తప్ప ఓట్లు అదే స్థాయిలో వేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటినుంచి ఒక్క కాంగ్రెస్‌ పార్టీ తప్ప మరే పార్టీ అధికారం పొందలేకపోయింది. 1983లో పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ మాత్రమే రాష్ట్రంలో దాదాపు 17 సంవత్సరాలు అధికారంలో ఉండగలిగింది. వామపక్షాలకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గతంలో వారికి స్థిరమైన ఓటర్ల మద్దతు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ వారి మాటలు సిద్ధాంతాలు, ఆచరణ నమ్మే తరం తరిగిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. 2004 నుంచి 8 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి గాని, ప్రజావ్యతిరేక నిర్ణయాలపైగాని, రైతాంగ సమస్యలపై గాని వామపక్షాలు చేసిన పోరాటాలేమిటో వారే వివరించాలి. 2004కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జమానా అవినీతి జమానా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

nerukoda
బషీర్‌బాగ్‌ కాల్పులపై కాంగ్రెస్‌తో కలసి పెద్ద ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి సహాయపడ్డారు. అధికారంలోకి వచ్చాక డా వైఎస్‌ వామపక్షాలను ముప్పు తిప్పలు పెట్టడంతో ఆ పార్టీకి దూరం జరిగారు. ఖమ్మం జిల్లాలో భూపోరాటం నిర్వహించిన సీపీఎం కార్యకర్తలపై ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపించి 7గురి మృతికి కారణమయింది. ఇప్పటికైనా వామపక్షాలు ఎన్నికలలో ఓట్లు, సీట్లకోసం కాకుండా ప్రజాశ్రేయస్సు దృష్టితో ఇతర పార్టీలతో మిత్రత్వాలు నెరపి సిద్ధాంతాలకోసం నిలబడే శక్తులుగా నిరూపించుకోవాలి.

Surya News Paper Dated : 08/03/2012 

No comments:

Post a Comment