ఉదయించిన సూరీడు
ఇరవై మూడు సంవత్సరాల చిన్న జీవితంలో యావజ్జాతిలో స్వాతంత్య్ర జ్వాలను రగిలించిన వీరుడు సర్దార్ భగత్‌సింగ్. ఆయన అమరత్వం సాధించి నేటికి 81 సంత్సరాలు గతించిపోయాయి. మనల్ని చీల్చుకుని వెళ్లిపోయిన ఇవాళ్టి పాకిస్థాన్‌లో ఒక రాష్ర్టం పంజాబ్. అందులోని లాయల్‌పూర్ జిల్లా ఖట్‌ఖర్ కలాన్ గ్రామంలో సాధారణ సింధూజాట్ కుటుంబంలో 1907 సెప్టెంబర్ 28న భగత్‌సింగ్ అనే వెలుగు మొలక మొగ్గ తొడిగింది. ఈ మొలకే అనతికాలంలో మహా విప్లవ జ్వాలగా పరిణమిస్తుందని తండ్రి కిషన్‌సింగ్ కానీ, తల్లి విద్యావతి కానీ ఎంత వరకు ఊహించారో తెలియదు.
భగత్‌సింగ్ తన 12వ ఏట 1919 ఏప్రిల్ 13న లో అమృత్‌సర్‌లోని జలాయన్‌వాలాబాగ్‌లో జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ దురంతరం తర్వాత ప్రజలంతా పంజా బ్‌లో అన్ని పట్టణాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. 1922లో ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీ చౌరాలో రెండు వేల మంది ఉద్యమ కారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పింది. పోలీసు కాల్పుల్లో ఉద్యమకారులు పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. దాదాపు 22 మంది పోలీసులను స్టేషన్‌లో బంధించి సజీవ దహనం చేశారు. ఈ ఘటనతో గాందీజీ సహాయ నిరాకర ణోద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. ఇది భగత్‌సింగ్‌ను ఆయన ఆనుయాయులను కలచివేసింది. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో భగత్‌సింగ్ తదితర విప్లవకారులు విభేదించారు.
భగత్‌సింగ్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యాడు.
రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మొదలైన వారు విప్లవ కార్యక్రమాలను అమలు పరిచేవారు. వారిమీద సోషలిస్ట్ భావాల ప్రభావం కూడా ఉంది.1928లో భారత్‌లో అప్పటి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసేందుకు సర్‌జాన్ సైమన్‌తో బ్రిటిష్ సర్కారు ఓ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు మిన్నుముట్టాయి. లాహోర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ నిరసనకు నాయకత్వం వహించారు. ఆయనపై పోలీసులు లాఠీ ఝళిపించారు. తీవ్ర గాయాలతో లాలా లజపతిరాయ్ కొన్నాళ్ల తర్వాత కన్నుమూశాడు. ఈ ఘటనకు భగత్‌సింగ్ ప్రత్యక్ష సాక్షి. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్ అనుయాయులు నిశ్చయించుకున్నారు. లాలాను చిత్రహింసలకు గురిచేసిన పోలీసు చీఫ్ స్కాట్‌ను కాల్చి చంపాలని డిసెంబర్ 17న భగత్‌సింగ్, ఆజాద్, రాజ్‌గురు పధకం వేశారు కానీ పొరపాటున స్కాట్‌కు బదులు సాండర్స్‌ను కాల్చారు. పోలీసులు వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో మారు వేషంతో తప్పించుకున్నారు.
1929 ఏప్రిల్ 8న పారిశ్రామిక వివాదాల బిల్లుపై సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సభాధ్యక్షు డు విఠలబాయ్ పటేల్ ఓటింగ్ ఫలితాన్ని ఇక ప్రకటించబోతారనగా భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు ఇద్దరూ చెరో బాంబును పార్లమెంట్‌లో విసిరారు.పార్లమెంట్ భవనమంతా పొగతో నిండిపోయింది. అందరూ నలువైపుల నుంచి పలుగురు తీశారు. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి, కార్మిక వర్గం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు ఇస్తూ భవనంలో కరపత్రాలను వెదజల్లారు. బాంబులు వేసిన కొద్ది సేపటికి పోలీసులు అట్టహాసంగా వచ్చారు.
ఒక సార్జంట్ ముందుకు వచ్చి భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లను అరెస్టు చేశాడు. భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లపై హత్యానేరారోపణపై విచారణ జరిపించి యావజ్జీవ శిక్ష విధించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడని భగత్‌సింగ్‌పై మరో 24 కేసులు నమోదు అయ్యాయి. 1930 అక్టోబర్ 3న ట్రిబ్యునల్ తన 50 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరిస్తూ రాజ ద్రోహానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని ఆదేశించింది. 1931 మార్చి 23 రానే వచ్చింది. బ్రిటిష్ పాలకులు వేళకాని వేళలో రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్, అతని సహచరులు రాజగురు, సుఖ్‌దేవ్‌లను ఉరికొయ్యపై ఎక్కించి ఉరి తీశారు. దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన ఆ విప్లవ ధృవతారలు నేటి యువతరానికి ఆదర్శంగా చెప్పవచ్చు.
మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి
సూర్య న్యూస్ పేపర్ DATED 23 /03 /2012
No comments:
Post a Comment