పెయినే మార్గంలో ఐలయ్య
'హిందూ మతానంతర భారతదేశం'పై జరుగుతున్న చర్చలో భాగంగా 'ఆత్మ విమర్శా? అంతర్యుద్ధమా?' (జనవరి17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసం వచ్చింది. చాలా మౌలికమైన అంశాలను వ్యాసకర్త అరవిందరావు (రిటైర్డ్ డిజిపి) ప్రస్తావించారు. 13 ప్రశ్నలు ధర్మాధిపతులకూ, ఐదు ప్రశ్నలు హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారికీ సంధించారు. ప్రభుత్వానికి తెలియవలసిన మూడు అంశాలను కూడా సూచించారు. థామస్ పెయినే (1734-1804) చేసిన క్రైస్తవమత విమర్శ గురించి- ఫ్రెంచ్ విప్లవాన్ని (1789-99) విశ్లేషిస్తూ కామన్ సెన్స్, రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాలను పెయినే రాశారు. ఇవి ప్రధానంగా మానవ హక్కుల గురించి చెబుతున్న గ్రంథాలు.
ఆ సందర్భంలో మత మౌఢ్యం గురించి అక్కడి అప్పటి క్రైస్తవం గురించి తీవ్ర విమర్శలు చేసి ఉండవచ్చు. 'రైట్స్ ఆఫ్ మాన్' గ్రంథం చదివి జ్యోతిరావ్ ఫూలే (1827-90) మానవహక్కుల గురించి తెలుసుకున్నారు. భారతదేశంలోని శూద్ర, అతి శూద్ర ఉద్యమాలకు ఆద్యుడు మహాత్మా ఫూలే. మేధావులలో ఋజుత్వానికీ, మతాలలోని లోపాలు తెలియబరచటానికీ సంబంబంధం ఉండి ఉండవచ్చు. లేకపోతే లేకపోనూ వచ్చు. విప్లవాల విశ్లేషణ ఒక విధంగా మూల్యాంకనం. విప్లవాలకు దారితీసిన అసంతృప్తుల గురించి ఆలోచన అవసరం. ఆ విశ్లేషణలో సమాజంలోని అనేక అంశాలు చెప్పవలసివుంటుంది. ఆ క్రమంలో మతంలోని మూఢాచారాలను విమర్శించటం అనివార్యమవుతుంది. థామస్ పెయినే లాంటి రచయితల గురించి సమాజానికి చెప్పవలసే ఉంటుంది. కంచ ఐలయ్య రచన ఆ పద్ధతిలోనే సాగింది. ఒక మతాన్ని అందులోనూ తానున్న మతాన్ని విమర్శించటం వల్ల మిగతా మతాలకు ఏజెంట్లుగా కనబడతారనటం అర్థం లేని మాట. ప్రపంచంలో ఏ మత విశ్వాసాలనూ అనుసరించని వారు జనాభాలో 16.4 శాతం ఉన్నారట. మత వ్యతిరేకులు, నాస్తికులు 4.3 శాతం ఉన్నారట.
దళిత అధ్యయనాలు, మానవహక్కుల అధ్యయనాలూ చేసే సంస్థలపై వ్యాసకర్త చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. శతాబ్దాలుగా అతిహీనమైన దశలో ఉంటూ వచ్చిన దళితులు నేడు అంతో ఇంతో చదువుకుని పైకి వచ్చి తమ హక్కుల గురించి తెలుసుకోవాలనుకోవటం వర్ణ సమాజానికి కంటగింపుగా ఉంది. 'మన దేశంలోని విచ్ఛిన్నకర శక్తులు, మేధావులు, వేర్పాటు వాదులు లాంటివారు' పొరుగురాజ్యాల పాలసీలను అమలుపరచటానికి రచనలు చేసే వారిలాగా కనిపించటమూ, పొరుగువారి ఆదేశాల మేరకు దళితులను రెచ్చగొట్టే రచనలు చేస్తున్నారనుకోవటమూ భ్రమ ప్రమాదాలే.
వర్ణ వ్యవస్థ హిందూ సమాజపు మౌలిక లక్షణం. ఆ జీవన విధానాన్నే మతంగా స్థిరపరిచారు. దానిని మార్చటానికి ఎవరూ ఒప్పుకోవటం లేదు. వర్ణ ధర్మం ఉండాలి, అంటరానితనం పోవాలన్నారు గాంధీ. ఇప్పటికీ అదే ఆలోచన. ఉత్సవ విగ్రహాలపై చూపే శ్రద్ధ లాంటిదే ఆచరణలో కనబడుతున్నది. ఆ ధోరణి మారాలంటున్నారు ఐలయ్య. దానికి ఇంత కలవరపాటు అవసరమా? - డా.బి.విజయభారతి,
రచయిత్రి
ఐక్యతకు పునాదులేవీ?
'హిందూ మతానంతర భారతదేశం'పై చర్చలో పాల్గొంటున్న హిందూ మతావలంబికులు, కార్యకర్తలు 'కులవ్యవస్థ'ను సామాజికాంశంగానూ, సాధారణ విషయంగానూ వాదించటం ప్రజాస్వామ్య వాదులను విస్మయానికి గురిచేస్తున్నది. 'కుల వ్యవస్థ' వల్ల కులాసాగా ఉండేవారు, లాభాలూ పొందుతున్నవారూ, ఆర్థిక, సా మాజిక గౌరవాల్ని, ప్రయోజనాలు పొందేవారు ఆ వ్యవస్థను గొప్ప గా ప్రకటిస్తారు. మనది ప్రజాపాలన అనీ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అనీ, కులాల పేరిట 'నిర్మించిన' మన శ్రామిక విధానం, 'పని విభజన'కు ప్రపంచంలోని అత్యున్నత రూపం అని చెప్పుకుంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కుల వ్యవస్థ దుష్పరిణామాల వల్ల తరతరాలుగా నష్టపోయిన కులాల, ప్రజల మనోభావాలతో వీరికి ఎలాంటి సానుభూతి ఉండదు. 'హిందువులం, బంధువులం, గంగాసింధు బిందువులం' అనే నినాదం ఎంత ఆర్షణీయంగా ఉందో దాని వెనుక తరతరాల దళితుల ఆక్రోశాల వేదనలను తొక్కేసే కుతంత్రం దాగివుంది. నిజంగా హిందువులందరూ బంధువులయితే అస్పృశ్యుల్ని ముట్టుకున్న అగ్రవర్ణాల వారు గంగలో మునిగి ప్రక్షాళన ఎందుకు చేసుకోవాలనుకుంటారు? నిజంగా హిందువులందరూ బంధువులయితే, అదే బంధువులపై రోజూ జరిగే అత్యాచారాలు, హత్యాకాండలకు పాల్పడుతున్న సాటి అగ్రవర్ణ బంధువుల పట్ల ఒక నీతి, దురాగతాలకు గురైన కులస్తులు/ బంధువుల పట్ల విదురనీతి ఎందుకు మన సమాజంలో నిత్యకృత్యమవుతుందో వీరు చెప్పాలి.
'మహాసముద్రం ఇంకిపోతుందా?' అంటూ ధీమాగా ప్రశ్నిస్తున్న గీతాంజలిమూర్తి (ఫిబ్రవరి 23, ఆంధ్రజ్యోతి)కి ఆధునిక జీవితంలో జరిగే మార్పులు, కులాంతర వివాహాలు ఆనందాన్నిస్తున్నాయి. త్రిదండి స్వాముల సహస్ర హోమాల సందర్భంగా, అందరికీ అన్ని కులాల వారికీ భోజనాలు అందజేయటం -బహుశా 'భిక్ష' ఆనందాన్ని కల్గించిందట. అలాగే శ్రామికకులాల వారిని దేవాలయాలలోకి రానివ్వకపోవటానికి వారు 'ఆచారాలు' పాటించక పోవటమేనట. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి కారకులైన ఈ కులాల వారికి సమాజంలో ఎలాంటి స్థానం ఉందన్న ప్రశ్నకు వారు ఏమి జవాబు చెప్తారు? శ్రామిక కులాలు అభివృద్ధిలో తమ వాటా ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది? ఆశ్రమాలలో దళితులు, వెనకబడిన వర్గాల/కులాల వారికి ఎలాంటి స్థానం ఉంది? ప్రసాదం అందుకునే స్థాయేనా? లేక ఆశ్రమాలను నిర్వహించే స్థాయా? ఐలయ్య గానీ, మరొకరుగానీ అడుగుతున్న ప్రజాస్వామ్యయుత ప్రశ్న ఏమిటంటే సమాజంలో (గౌరవం పొందగల స్థానాల్లో) దళితుల, వెనకబడిన కులాల వారి స్థానం ఎక్కడ? అనేది. దీనికి జవాబు దొరకాలి. అంతేగానీ అంబేద్కర్ చేత రాజ్యాంగం రాయించామనీ, హిందూమతంలోని కరుణ, అహింసల ఆధారంగా గాంధీ స్వాతంత్య్రం తెచ్చారనీ చెప్పటం పాఠకులు, ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
- అలవాల గవర్రాజు
హిందుత్వ పునరుద్ధరణ
కంచ ఐలయ్య 'హిందూ మతానంతర భారతదేశం' పై చర్చలో భాగంగా రిటైర్డ్ డిజిపి అరవింరదారావు 'ఆత్మ విమర్శా? అంతర్యుద్ధమా?' (జనవరి 17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసం రాశారు. 'మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని చెప్పడం వల్ల ప్రతిపక్షికి మీరే ఒక ఆయుధం ఇచ్చినట్లవుతుంది. మీకు మతమే లేదు అని ఎదుటివాడు వాదించే అవకాశం మనమే ఇస్తున్నాం' అని ధర్మాధిపతుల నుద్దేశించి సంధించిన ఒక ప్రశ్నలో అరవిందరావు పేర్కొన్నారు. పీఠాధిపతులు హిందూ ధర్మం అంటుండగా మీరు హిందూ మతం అంటున్నారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
తాను హిందూ మతాన్ని వినియోగించుకొంటున్న వినియోగదారుడినని అరవి ందరావు అన్నారు. ఒక మతస్థుడిని వినియోగదారుడని ఎవరూ అనరు. మతం అనేది ఏమైనా ఉతికే యంత్రమా? లేక పదర్థాలను చల్లబరచేదా? 'ఉపనిషత్తులు చెప్పిన ఉదార, తాత్త్విక సత్యాలను పక్కనబెట్టి కర్మకాండలో చెప్పిన యజ్ఞం, ఆచారాలకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవే హిందూ మతం అని భావించే ప్రమాదం ఉంది' అంటే హిందూ మతం ఉదారస్వభావం కలది అనే అర్థం వస్తుంది. శూద్రుడు వేదం చదివితే నాలుక కోశారు. వేదం వింటే చెవుల్లో సీసం పోశారు. ఉదార స్వభావం అంటే ఇదేనా? అంటరానితనం కూడా ఉదార స్వభావమేనా?
'ఒకే మతాన్ని సమర్థించడం వల్ల మీరు మిగతా మతాలకు ఏజెంటుగా కనబడడం లేదా?' అంటున్నారు. ఫ్రాన్స్‌లో క్రైస్తవ మతాన్ని విమర్శిస్తారు ముస్లిం మహిళల బురఖాను నిషేధించడం గురించి. రష్యాలో భగవద్గీతను నిషేధించడం గురించి క్రైస్తవమతాన్ని విమర్శిస్తారు. ఇరాన్‌లో షియా మత సంప్రదాయాలకి వ్యతిరేకంగా, సౌదీ అరేబియాలో సున్నీ మతానికి వ్యతిరేకంగా విమర్శిస్తారు. అలాగే మధ్యప్రదేశ్‌లో పాఠశాలల మైనారిటీ విద్యార్థులపై బలవంతంగా భగవద్గీతను రుద్దడాన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించని వాడు హిందూ మతోన్మాది అవుతాడు. మీలాంటి వాళ్ళు రష్యాలో భగవద్గీతను నిసేధించడాన్ని ఖండిస్తారు. మధ్యప్రదేశ్‌లో భగవద్గీతను బలవంతంగా చదివిస్తే కేరింతలు కొడతారు! దళిత హక్కులన్నా, పౌర హక్కులన్నా, మైనారిటీల హక్కులన్నా ద్వేషమే మీకు.
దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మేధావులు, వేర్పాటు వాదులకు పొరుగుదేశాల నుంచి ధనం వస్తున్నదని ఆరోపిస్తున్నారు. కానీ గుజరాత్ నరమేధం జరిగినపుడు విదేశాలనుంచి కోట్ల రూపాయల్ని కుమ్మరించారు. అది సరైనదే మీ దృష్టిలో. పొరుగుదేశాల నుంచి ధనం వస్తుందన్నారు కదా. మరి ఆ దేశాలపేర్లు ఎందుకు చెప్పరు? కారంచేడు, చుండూరు, వేంపెంట గురించి, ఖైర్లాంజి గురించి వ్యాసాలు వచ్చాయి. పుస్తకాలు వచ్చాయి. ఇవి దళితులిని రెచ్చగొట్టే రచనలట! ఊచకోతలు జరిగితే జరగవచ్చు కాని వాటి గురించి రాయకూడదు. రాస్తే విదేశీయుల రెచ్చగొట్టించి రాయించారంటారు. ఇదొక అబద్ధం.
- అల్‌ఫతా (విరసం)
సర్వమతాలకు తల్లి
కంచ ఐలయ్య అభిప్రాయంలో హిందూమతానంతర భారతదేశం ఉండే అవకాశం లేదు. ఆ మాట కొస్తే హిందూయిజం లేకుండా ప్రపంచానికీ, మానవ మనుగడకీ అస్తిత్వం లేదు. ఐలయ్యది అసహనంతో పెల్లుబికిన ఊహ మాత్రమే. 'ఆంధ్రజ్యోతి'లో వెలువడుతున్న వ్యాసాలు హిందూ మతం సమగ్ర నిర్వచనంపై తెర లేపాయి. నేటి ఆర్థిక సామాజిక రుగ్మతలన్నింటికీ హిందూ మతమే కారణమని నిర్ధారణకు రావడం కొంటెతనమే అవుతుంది. హిందూ అనే శబ్దం వేదాలలో కాని, పురాణాలు, ఇతిహాసాలలోకాని లేనే లేదు. నేడు కనబడుతున్న కుల వ్యవస్థ వేద కాలంలో అసలే లేదు. 'హిందు' పదం ముస్లిం పాలకుల కాలంలోనే రూపం దాల్చిందనేది నిర్వివాదాంశం.
ముస్లిం పాలకుల చలువ వల్లనే హిందువులు కాఫిర్లని పిలువ బడ్డారనే విషయం ఐలయ్య, భూక్యా నాయక్‌లకు క్షుణ్ణంగా తెలుసు. భగవద్గీతలో చాతుర్వర్ణాల ప్రస్తావన ఉంది. అది కేవలం వృత్తుల పరంగా చేసింది మాత్రమే. ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఈ క్లాసిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వర్ణమంటే రంగు అని గానీ, కులం అని గానీ అర్థం కాదు. అది కుల వ్యవస్థే అయితే నేటి ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామిక వర్కర్ల వంటివారని అర్థం చేసుకోవాలి. ఏ కొందరో చరిత్రలో తప్పులు చేసి మతానికి ద్రోహం చేస్తే అది మతం నేరం ఎలా అవుతుంది?
హిందూ మతం గురించి కొంత మంది ప్రముఖుల అభిప్రాయాలు పరిశీలిద్దాం. వైజ్ఞానికుడు ఐన్‌స్టీన్ - 'నేను భగవద్గీత చదివి భగవంతుడు విశ్వ సృష్టి చేసిన విధానం అర్థం చేసుకన్నాను. ఆ తర్వాత మిగతా సిద్ధాంతాలన్నీ శుష్కమైనవేనని నాకు విశదమయింది'. సాహిత్యకారుడు ఆల్డస్ హక్స్‌లీ- 'భగవద్గీత మానవుని ఆధ్యాత్మిక మనుగడకు అంచెలంచెలుగా వెలువరించిన గొప్ప సందేశం. సమగ్ర సైద్ధాంతిక ప్రవాహం. భారతావనికే కాక యావత్ మానవాళికీ అవపరమైన మార్గదర్శి'. రాజనీతిజ్ఞుడు జవహర్‌లాల్ నెహ్రూ- 'మనిషి మనుగడకే అవసరమైన ఆధ్యాత్మిక పునాదికి భగవద్గీత ప్రతీక. విశ్వం పరమావధికి అంతిమ లక్ష్యానికి భగవద్గీత మార్గం'. కాలానుగుణంగా శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధితో సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి మతమూ మారాలి; మారడానికి సంసిద్ధంగా ఉండాలి.
ఆ విధంగా హిందూ మతం ఇలాస్టిక్‌గా ఉండబట్టే వేల సంవత్సరాల నుంచి అజరామరంగా మనుగడ సాగిస్తూ ఉంది. హిందూ మతం మానవాళికి ఎంతో ప్రసాదించింది. సున్నా నుంచి అనంతం వరకు, జడం నుంచి పరమాణువు వరకు బ్రహ్మ సంకల్పం నుంచి అనంత సృష్టి రహస్యాల వరకు ఎన్నో ప్రకృతి రహస్యాలను ఆవిష్కరించింది. విభేదాలను సృష్టించి భారత సమాజాన్ని ఛిన్నా భిన్నం చేసిన ఘనత వలస పాలకులదే. మహర్షులు వాల్మీకి, వ్యాసుడు పూజ్యులయిన దళితులు. శ్రీకృష్ణుడు స్వయాన యాదవుడు (బిసి) వీరందరినీ బ్రాహ్మణులతో సహా హిందువులందరూ పూజిస్తున్నారు. ఎందుకో మరి కంచ ఐలయ్య, భూక్యానాయక్‌లు హిందూయిజంపై నిప్పులు చెరుగుతున్నారు?
- బి. రామ్ మోహన్ రెడ్డి
అధ్యక్షులు, తెలంగాణ సేవాసమితి
Andhra Jyothi News Paper Dated : 2/3/2012
Andhra Jyothi News Paper Dated : 2/3/2012
No comments:
Post a Comment