మార్చి 6. ఆ రోజు ఉదయం ఆరు గంటలకే నొయిడాలోని 'హెడ్‌లైన్ టుడే' స్టూడియోలో నాతో పాటు మణిశంకర్ అయ్యర్, దీపాంకర్ గుప్తా (కులం ప్రధానం కాదంటూ కుల లెక్కలు చెప్పే సోషియాలజీ ప్రొఫెసర్; న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు), సిద్ధార్థ్ వరద రాజన్ ('ది హిందూ' ఎడిటర్), సంజయ్ ఝా (మరో కాంగ్రెస్ మేధావి), వియల్ నర్సింహారావు (బిజెపి మేధావి), సంజయ్ కుమార్ (ఈ ఎన్నికలను సరిగా ప్రెడిక్ట్ చేసిన సెఫాలజిస్ట్), జావీద్ అన్సారీ (ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించిన జర్నలిస్ట్) ఉన్నారు.
ఈ ఎన్నికలపై రెండు రోజులు చర్చించాలని ముందే చెప్పి మమ్మల్ని పిలిచారు. స్టూడియో తయారీ జరుగుతుండగా హెడ్‌లైన్స్ ప్రెడిక్షన్, సియన్‌యన్ ప్రెడిక్షన్‌పై చాలా సేపు చర్చించాం. సమాజ్ వాదీ పార్టీకి ఎక్కువలో ఎక్కువగా 215, తక్కువలో తక్కువగా 195 సీట్లు వస్తాయని సంజయ్ కుమార్ తన సంఖ్యాశాస్త్రాన్ని కొంత నమ్మకంతోనే చెబుతున్నాడు. యోగేంద్ర యాదవ్ ఎస్‌పికి 235 నుంచి 250 వరకు వస్తాయని చెప్పాడు. ఇందులో ఏది నిజమైనా మంచిదే కాని బిజెపికి మాత్రం 50 దాటొద్దనేది నా కోరిక. సంజయ్ దానికి గరిష్ఠంగా 56 సీట్లు ఇచ్చాడు. అందుకే నేను ఆయనపై అసంతృప్తితో ఉన్నాను.
ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలయింది. నేను ఎన్నికల కౌంటింగ్‌ను అంత శ్రద్ధగా, నిమిష నిమిషం, అంకె అంకె ఎప్పుడూ చూడను. కానీ ఆ రోజు చూడక తప్పదు. నేను బహుజన్ సమాజ్ పార్టీ అభిమానిని, బిజెపి వ్యతిరేకిననే 'హెడ్ లైన్స్ టుడే' వారు నన్ను పిలిచారు. కౌంటింగ్ మొదలైన పావుగంటకి అన్ని పార్టీలకు '0' ఉండగా బిజెపి లీడ్ చూపెడుతుంది. యాంకర్ రాహుల్, సంజయ్ కుమార్‌ని ఇది ఎలా? అని అడుగుతున్నాడు. ఇవి పోస్టల్ బ్యాలెట్ల లీడ్‌లు మాత్రమే అని సంజయ్ చెబుతున్నాడు.
బిజెపికి 100 సీట్లు గనుక వస్తే తెలంగాణ ప్రజలు ఎంత మోసపోతారో అనే అంశం నన్ను వేధిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో 100 వచ్చినాయి, తెలంగాణలో 100 ఇవ్వండి. ప్రత్యేక పరిపాలన మీ చేతిలో పెడతామని బిజెపి చెబుతుంది. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంటులో ఉన్న యువతకు బిజెపి మతం మత్తు మందు రుద్దితే, ప్రత్యేక తెలంగాణే మా ఏకైక లక్ష్యం అనే 'ముడుపుల పాయ పార్టీ' దాని వైపు సంపూర్ణంగా చేరే అవకాశముంది. బిజెపి కూడా పైసలతో ప్రపంచాన్నే కొనెయ్యవచ్చు అనినమ్మే పార్టీ. దీనికి తోడు మరో అంశం అతి కీలకంగా జత అవుతుంది. అదే చిన్న రాష్ట్రాల అంశం.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి గెలిస్తే చిన్న రాష్ట్రాల నినాదం పెద్దదౌతుంది. ములాయం సింగ్ ఇతర అంశాలతో పాటు చిన్న రాష్ట్రాల అంశం మాయావతిని దెబ్బతీసింది. ఆ విషయంలో కూడా బిజెపి ఏ మాత్రం నమ్మదగ్గ పార్టీకాదు. ఈ స్థితిలో తెలంగాణ సంగతి ఏంటి అని ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే అవకాశం ఏ మాత్రం లేదు. అందుకోసం ఉసికొల్పబడ్డ సెంటిమెంట్‌కు ఎంతో మంది బలయ్యారు. అందులో పూర్తిగా అమాయకులు బలయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క తెలంగాణ సాధన కోసం మాత్రమే పుట్టిన పార్టీ. అదొక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండాతో ఆ పార్టీ కుటుంబ నాయకత్వం ఊహించినంత డబ్బుని, ఆస్తుల్ని, పలుకుబడిని సంపాదించింది. ఉద్యమాల్లో ప్రజలు నష్టపోయారు. మధ్యస్థ నాయకత్వం తెలంగాణ వస్తుందని నమ్మి ఆస్తులనమ్మి, ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. భవిష్యత్‌ను కోల్పోయిన తల్లితండ్రులు ఉన్నారు. ఆ కుటుంబాల్ని అటు ఉద్యమ నాయకులు గాని, ఒక్క ఎజెండాతో పుట్టి గుమ్ములు నింపుకున్న పార్టీ గాని, ప్రభుత్వం గాని ఆదుకునే దాఖలాలు లేవు.
కాంగ్రెస్‌లో అంచనా లేక అతిగా తెలంగాణ గురించి మాట్లాడిన నాయకులు మునిగే పరిస్థితి వచ్చింది. అందులో ముగ్గురు బిసిలు (కె. కేశవరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ) కావడం దురదృష్టకరం. రెడ్లు, వెలమలు అతి జాగ్రత్తగా పదవులు కాపాడుకున్నారు. అందులో జైపాల్ రెడ్డి, జానారెడ్డి ముందంజలో ఉన్నారు. తమ అనుచరులను, బంధువులను ఉద్యమంలో ఉంచినట్లే ఉంచి అన్ని వైపులా అధికారానికి, ఆస్తులకు కంచెలు నిర్మించుకున్నారు. కేశవరావు, మధుయాష్కీలు నాలికకు పొద్దులేని నాయకులయ్యారు. వాళ్ళే కెసిఆర్ మనుషుల చేత టాంక్ బండ్ మీద దెబ్బలు తిన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఎమోషన్ తప్ప ఎత్తుగడలు ఉండవనడానికి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఊపు, ఉర్రూత, చావు, చతికలబడడం మన కళ్ళకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
ఈ మధ్య కాలంలో అంబేద్కర్‌ను ఆదర్శంగా పెట్టుకొని కొంత మంది దళిత నాయకులు ఎత్తుగడ నాయకులుగా ఎదుగుతున్నారు. తెలంగాణలో రాజనర్సింహ ఆ కోవకు చెందిన వాడుగా కన్పిస్తాడు. గతంలో కూడ దామోదరం సంజీవయ్య ఆ కోవ నాయకుడుగా ఈ రాష్ట్రంలో ఎదిగాడు. తెలంగాణ సమస్యతో బాగా నష్టపోయింది బిసిలు. నాయకత్వ స్థానాల్లో దేవేందర్ గౌడ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తమ రాజకీయ స్థాయిల్ని గందరగోళ పర్చుకున్నారు. తెలంగాణ ప్రత్యక రాష్ట్రమైతే రాజకీయ అధికారం బిసి నాయకత్వం చేతుల్లోకి మారుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువవుతాయనే ఒక ఆశ ఆ క్రమంలోనే పెరిగింది.
కాని తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రమౌతుందా, కాదా అనే జాతీయ స్థాయి అంచనా చాలామందిలో లేకపోవడం వల్ల ఒక పెద్ద నష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూశాకనైనా వీరందరికీ దేశ పరిస్థితి అర్థం కావాలి. 2009 డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ తన రాష్ట్ర ప్రభుత్వ రక్షణ రాజకీయం చేస్తే టిఆర్ఎస్, దానిచుట్టూ ఉన్న కొద్ది మంది సంపాదన రాజకీయం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక 2014లో మళ్ళీ యూపీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం అంతకన్నా లేదు. సోనియా, రాహుల్‌ల ఏక పక్ష నిర్ణయాలను, యూపిఏ భాగస్వాములను చిన్నచూపు చూసే ఆలోచనలకు అడ్డుకట్ట బడింది.
ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు ఏం చెయ్యాలి? అనేది ప్రశ్న. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు 20,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 'తెలంగాణ కౌన్సిల్' పెట్టాలనే కాంగ్రెస్ ఆలోచనకు కూడ బ్రేక్ పడే అవకాశముంది. గత పదేళ్ళలో తెలంగాణ అభివృద్ధి బాగా ఆగిపోయింది. విద్యారంగం కుప్పకూలింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో కాంగ్రెస్‌కు వచ్చిన కష్టాలు, టిఆర్ఎస్‌కు అదనపు ఆదాయాన్ని ఓటు బలాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ వస్తుందనే నమ్మకం లేకపోతే ప్రజలు టిఆర్ఎస్‌కు ఓటు వెయ్యరు. అప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌లోనో, బిజెపిలోనో విలీనమై కుటుంబ ఆస్తుల్ని, రాజకీయహోదాని కాపాడుకొనే స్థితిలో పడుతుంది.
దాని చుట్టూ ఉండి ఆస్తులు సంపాదించుకున్న నాయకులు, మేధావులు ఆస్తుల రక్షణలో పడతారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటువేసి గెలిపిస్తే ఎక్కువ సీట్లను చూపించి ఆ కుటుంబం ఎక్కువ ధన సంపాదన చేస్తుంది. ఏ కుల వర్గాలను అభివృద్ధి చేసే ఎజెండా ఆ పార్టీకి లేదు. ప్రపంచంలో ఏ పార్టీ, ఈ విధంగా ఒక్క ఎజెండాతో బతుకదు. కాని తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం వస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్ని రాజకీయ శక్తులు, మేధావులు మాట్లాడుతున్నందు వల్ల ఈ పార్టీ బలపడింది.
ఈ దశలో తెలంగాణ సెంటిమెంటుతో వెలమలు ఒక కులంగా, టిఆర్ఎస్ ఆ కుల ప్రతినిధి పార్టీలా లాభపడ్డారు. గత ఇరవై ఐదు సంవత్సరాలలో టిడిపి ఇచ్చిన పాక్షిక అండతో (ఈ ప్రాంతంలో కమ్మలు ఎక్కువగా లేనందువల్ల) బిసిలు గ్రామస్థాయి నుంచి ఎదిగారు. ఈ బిసిలను టిఆర్ఎస్ పూర్తిగా ముంచింది. ముందే చెప్పినట్లు ఇతర పార్టీలలోని బిసి నాయకత్వం కూడా 'తెల ంగాణతో' రాజకీయం చెయ్యరాక కుప్పకూలారు. ఇప్పుడు తెలంగాణలోని బిసిల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఈ ఉప ఎన్నికలల్లోనైనా గ్రామ స్థాయి దళిత-బహుజన ఆదివాసి తెలంగాణ ప్రజలు తమ దినాదినాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటెయ్యకపోతే 'చెండేషియా యాగం'లో సమిధల్లా బలౌతారు. తెలంగాణ రాకపోయినా తమ పిల్లలకు ఇంగ్లీషు విద్య, గ్రామాల్లో నీటి వనరు, విద్యుత్తు, పంటల్లో మార్పు తెచ్చుకునే ఆలోచన మీ జీవితాన్ని బాగు చేస్తుంది. పిల్లలకు కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు కావాలి. ప్రతి అంశంలో సెంటిమెంట్ మూఢనమ్మకంతో దేన్ని సాధించలేము.
తెలంగాణలో విద్యారంగం బాగా వెనుకబడివుందని శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. కనుక 2012-13 ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీతో తెలంగాణలోని అన్ని రంగాలను, ముఖ్యంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే ఉమ్మడి ఒప్పందానికి రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు రావడం మంచిది. ఉత్తరప్రదేశ్‌లో తమ ఓటు బలం బాగా పెరిగిన దృష్ట్యా ములాయం సింగ్ యాదవ్ రెండో ఎస్సార్సీ ఊసు కూడా ఎత్తనీయరు. కేంద్ర స్థాయిలో చిన్న రాష్ట్రాల చర్చ పూర్తిగా మూసివేయబడుతుంది. ముందు ముందు బిజెపికూడా ఆ అంశాన్ని లేవనెత్తకపోవచ్చు. ఒక చిన్న ప్రాంతంలో, ఒక ప్రాంతీయ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా లాభం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు- ముఖ్యంగా- ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఓటెయ్యకపోతే రెండిటికి చెడతారు.
- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated : 14/03/2012
No comments:
Post a Comment