Friday, March 9, 2012

కుడంకలం కలకలం--ఆదిమూలం శేఖర్‌కుడంకులం - ఈ పేరు ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతోంది. బంగాళాఖాత సముద్ర తీరంలో నిర్మిస్తున్న అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమం ముందు, సముద్ర కెరటాలే చిన్నబోతున్నాయి. ఎప్పుడూ సముద్రంలో ఉంటూ చేపలు పట్టుకుని బతికే మత్స్యకారుల్లో ఇంతటి చైతన్యమేమిటా అని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఈ చైతన్య ప్రభలను తట్టుకోలేక ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఉద్యమాన్ని అణచివేసేందుకు రకరకాల కుతంత్రాలు పన్నుతున్నాయి.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుడంకులంలో నిర్మిస్తున్న అణు విద్యుత్‌ కేంద్రం తీవ్ర వివాదాస్పదమయింది. కేంద్ర ప్రభుత్వానికే సవాలు విసురుతున్న ఈ ఉద్యమం ఐదారు నెలల నుంచి సాగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవంగా దీనికి 25 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఉద్యమానికి 1988లోనే బీజం పడింది.
భారత్‌ తన అణు కార్యక్రమంలో భాగంగా 1988లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితమే కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం. ఆ ఏడాది నవంబర్‌ 20న అప్పటి భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం రష్యాలో చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు మూలనపడిపోయింది. అణు సరఫరా దేశాల నిబంధనలను భారత్‌ అంగీకరించలేదన్న నెపంతో అమెరికా ఈ ప్రాజెక్టుకు మోకాలడ్డింది. ఆటంకాలన్నీ తొలగిపోయి అణు కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభమయ్యేనాటికి అంటే 2001 నాటికి దీని అంచనా వ్యయం రూ.13 వేల కోట్లకు పెరిగింది. ఒక్కోటి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల రెండు రియాక్టర్లు (వీవీఈఆర్‌ 1000)ను కుడంకులంలో నెలకొల్పారు. ఇందులో మొదటి దశను 2011 జూన్‌, రెండో దశను 2012 మార్చి నాటికి పూర్తి చేసి మొత్తం 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని భావించారు. దాదాపు రెండు దశలూ పూర్తయ్యాయి. 2008లో రష్యా, భారత్‌ మధ్య కుదిరిన మరో ఒప్పందం ప్రకారం ఇంకో నాలుగు రియాక్టర్లను ఈ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సివుంది. కుడంకులం భాగంగా రష్యా తన మూడో తరం అణు రియాక్టర్లు (వీవీఈఆర్‌ 1200) నాలుగింటిని భారత్‌కు సరఫరా చేయాల్సివుంది. మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాల్సిన తరుణంలో ఉద్యమం ఉధృతమైంది.
కుడంకులంలో ప్రభుత్వ కుట్రలు
కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు అలుపెరగని పోరాటమే సాగిస్తున్నారు. రాస్తారోకోలు, దీక్షలు, నల్లజెండాతో ప్రదర్శనలు, అణు కేంద్రం ముట్టడి వంటి రూపాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. మరోఒకటి రెండు మాసాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సిన స్థితిలో కుడంకులం కేంద్రాన్ని మూసేయాలంటూ ఉద్యమించడమేంటని ప్రధాని సహా మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిరసనకారులపై నిందలు మోపుతున్నారు. అమెరికా, యూరపు దేశాల నుంచి నిధులందుకుంటున్న స్వచ్ఛంద సంస్థలే (ఎన్‌జివోలు) కుడంకులంలో నిరసనలను ఎగదోస్తున్నాయని ప్రధానే స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలు అక్కడి వాస్తవ పరిస్థితిని ఏమాత్రం ప్రతిబింబించేవిగా లేవు. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రాల్లో జరిగిన ప్రమాదాలను చూశాక కుడంకులం అణుకేంద్ర భద్రతపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కుడంకులం చుట్టూ ఉన్నవి మత్స్యకారుల గ్రామాలే. ఈ కేంద్రం ప్రారంభమైతే కాలుష్యం వల్ల సముద్రంలో చేపలు దొరకవని, జీవనోపాధి కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే తమ మనుగడకే ప్రమాదమని ఈ అణు కేంద్ర ప్రమాద జోన్‌లోకి వచ్చే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రైతులు, మత్స్యకారులు భయాందోళనలు చెందుతున్నారు. దక్షిణ ద్వీపకల్పంగా పిలవబడే ఈ ప్రాంతం మిరియాలు, కొబ్బరి, జీడిపప్పు, కాఫీ, టీ, పసుపు,వనమూలికలు, సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. కుడంకులం అణు కేంద్ర ప్రమాద జోన్‌ పరిధిలో మొత్తం 15 కోట్లమంది జనం నివసిస్తున్నారు. జపాన్‌లోని ఫుకుషిమా (రెండున్నర కోట్లమంది) తో పోల్చితే ఇక్కడ జనాభా ఆరు రెట్లు ఎక్కువ. అదీగాక ప్రమాదం వల్ల సముద్ర జలాలు విషపూరితమైతే అపారమైన మత్స్య సంపద, ఇతర జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కుడంకులం భద్రతపై స్థానికులు ఇంతగా ఆందోళన చెందుతుండడానికి కారణమిదే. ఎంతో కీలకమైన ఈ అంశాన్ని ప్రభుత్వం విడిచిపెట్టి కేవలం ఎన్‌జీవోల కుట్రల గురించి మాట్లాడుతున్నది. ప్రభుత్వ వాదనలు సమస్యను పక్కదారి పటించడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవు. దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు రావడం కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్న తతంగం అంతకన్నా కాదు. కేరళ, బెంగాల్‌లాంటి చోట్ల స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని శక్తులు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసినపుడు కేంద్రానికి ఈవిషయం గుర్తుకు రాలేదు. అణు కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే సరికి ఇది గుర్తుకొచ్చింది. ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వం నిశ్చయించుకున్నది. అందుకే ఈ నాటకమాడుతున్నది. నిఘా సంస్థలు తిరునల్వేలి, తూత్తుకుడి, నాగర్‌కోయిల్‌ తదితర జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థలపై ఆరా తీశాయి. సీబీఐ దాడులు నిర్వహించింది. టూరిస్టు వీసాపై నాగర్‌కోయిల్‌లో పర్యటిస్తున్న ఓ జపాన్‌ పౌరుడిని బలవంతంగా వెనక్కు పంపింది.
ప్రభుత్వం అణచివేయాలనుకునే కొద్దీ ఉద్యమం ఉధృతమవుతోంది. ఒకప్పుడు కుడంకులం పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఉద్యమం. ఇప్పుడు చెన్నై నగరానికీ విస్తరించింది. ఇటీవలే చెన్నైలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉద్యమానికి రానురానూ మేధావులు, ప్రజాసంఘాల మద్దతు పెరుగుతోంది.
ఆందోళనకారుల అభ్యంతరాలు
కుడంకులం అణు విద్యుత్‌ కేంద్ర భద్రత, పర్యావరణ సమస్యలతో పాటు అసలు ఈ అణు కేంద్ర నిర్మాణానికి సంబంధించి జరగాల్సిన ప్రజాస్వామిక ప్రక్రియ ఏదీ అసలు జరగనేలేదని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మించడానికి ముందు స్థానిక సంస్థల్లో తీర్మానాలు చేయడం కానీ, బహిరంగ విచారణ నిర్వహించడం కానీ చేయలేదు. జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే ఉన్న అణు విద్యుత్‌ కేంద్రాలను మూసేస్తుంటే, అలాంటి అణు కేంద్రాలు మనకెందుకు? అనడిగితే దానికి సమాధానమివ్వని కేంద్రం టెక్నాలజీ గొప్పతనాన్ని గురించి పదేపదే వల్లె వేస్తోంది. దీనిపై నిపుణుల కమిటీ పేరుతో ఒక తంతు నడిపింది. అది ఫ్లాప్‌కావడంతో మాజీ రాష్ట్రపతి, అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రంగంలోకి దింపింది. కుడంకులం కేంద్రం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారని, దీనివల్ల స్థానికులకు ఎలాంటి ముప్పూ ఉండబోదని కలాం చెప్పారు. కుడంకులం అణు కేంద్రం, భూకంప కేంద్రానికి 1,300 కిలోమీటర్ల దూరంలోనూ, సముద్ర మట్టానికి 13.5 ఎత్తులో ఉన్నందున సునామీ, భూకంపం వంటి విపత్తుల నుంచి ముప్పు ఉండబోదని వివరించారు. అయితే ఈ వ్యవస్థలనూ దెబ్బతీసే విపత్తులు రావన్న గ్యారంటీ ఏమిటన్నది ఉద్యమకారుల ప్రశ్న. దీనికి సమాధానం లేదు. అందుకే తమిళంలో మాట్లాడిన కలాం మాటలనూ ఉద్యమకారులు విశ్వసించలేదు.
అనవసర ప్రతిష్టకు పోతున్న కేంద్రం
కుడంకులం విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గినా దేశంలో అణు కార్యక్రమమే సందిగ్ధంలో పడుతుందని కేంద్ర ప్రభుత్వ భావన కాబోలు! కుడంకులంతో పాటు మహారాష్ట్రలోని జైతాపూర్‌, మన రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ, మరో ఆరు అణు విద్యుత్‌ కేంద్రాలు నిర్మించాలనుకుంటోంది. కుడంకులం ఆగిపోతే మిగిలినవీ ప్రశ్నార్థకమవుతాయి. ఇప్పటికే కొవ్వాడ (రణస్థలం) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతేకాదు అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ప్రతిగా ఆ దేశం నుంచి 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల అణు రియాక్టర్లను భారత్‌ దిగుమతి చేసుకోవాల్సివుంది. ఫ్రాన్స్‌ నుంచి అతి ఖరీదైన రియాక్టర్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కుడంకులంలో ఆగిపోతే వీటన్నింటినీ ఆపేయాల్సివుంటుంది. దీనివల్లే కేంద్ర ప్రభుత్వం కుడంకులం ఉద్యమకారులపై నిప్పులు కక్కుతోంది. అందుకే తరచూ ప్రధానమంత్రే స్వయంగా అణు కేంద్రాలపై స్పందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రష్యాకు వెళ్లిన ప్రధాని...దేశంలో జరుగుతున్న ఆందోళనల గురించి పట్టించుకోకుండా, కుడంకులం మొదటి యూనిట్లో కొన్ని వారాల్లోనే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కుడంకులం కేంద్రంపై రూ.14 వేల కోట్లు ఖర్చు చేశామని, వృథాగా వదిలేయబోమనీ ప్రధాని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.
మారిన జయ ప్రభుత్వ వైఖరి
మొదట్లో కుడంకులం అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రధానికి లేఖ రాసిన తమిళనాడు ప్రభుత్వం ఆ తర్వాత వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కుడంకులంలో భారీ ఎత్తున ఉద్యమం జరుగుతున్నా, ఇప్పటికే వందలాది కేసులు నమోదైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు. అయితే విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సహకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడం, ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సగ భాగం అంటే వెయ్యి మెగావాట్లు తమిళనాడుకు ఇస్తామని ఆశజూపడం, తమిళనాడులో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తడం తదితర పరిణామాల నేపథ్యంలో జయలలిత ఒక నిపుణుల బృందాన్ని వేసి, కుడంకులం కేంద్రానికి అనుకూలంగా నివేదిక వచ్చేలా చూసుకున్నారు. ఆ నివేదికను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. నిన్నమొన్నటి దాకా అధికారంలో ఉన్న డిఎంకె కూడా కుడంకులం కేంద్రానికి అనుకూలంగా ఉంది. సహజంగానే కాంగ్రెస్‌, బిజెపిలు అణు కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ, కుడంకులం అణు కేంద్రం ప్రారంభించడమే విద్యుత్‌ సమస్యకు పరిష్కారమని చెబుతున్నాయి. వామపక్షాలు, వైగో నేతృత్వంలోని ఎండీఎంకే వంటి పార్టీలు, పలు ప్రజాసంఘాలు ఉద్యమకారులకు అండగా ఉన్నాయి. మేధావులు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కుడంకులం వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. విస్తృతమైన ప్రజా మద్దతు కలిగిన ఈ ఉద్యమాన్ని అణచడం ఈంత తేలికేమీ కాదని కాంగ్రెస్‌ పెద్దలకు ఈపాటికే అర్థమై ఉండాలి.
- ఆదిమూలం శేఖర్‌ 

Prajashakti News Paper Dated : 10/03/2012 

No comments:

Post a Comment