Saturday, March 31, 2012

ముస్లింలను ముంచే యత్నం - కంచ ఐలయ్య



ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును బిజెపి గెలువడానికి టిఆర్‌యస్, జెఎసిలు పకడ్బందీ ప్లాను వేశాయి. టిఆర్‌యస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంను ఓడించి బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు ఈ పథకం ముందే వెయ్యబడింది. ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌కు పడకుండా చూడడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. 2014లో ఈ ఎత్తుగడనే వేస్తే ఆదిలాబాద్, కరీంనగర్, ముథోల్, నిర్మల్, నిజామాబాద్ (ఇప్పటికే వారి చేతిలో ఉంది), బోధన్, కామారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్, సంగారెడ్డి, తాండూర్ సీట్లను కూడా బిజెపి గెలుచుకోవచ్చు. ఈ అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు 25 శాతానికి మించి ఉంటాయి. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2009 డిసెంబర్ ప్రకటన తరువాత కొత్త మలుపు తిరగిందని తెలిసిందే. ఈ ఉద్యమంలో ముస్లింలు ఏం చెయ్యాలి, ఎటు ఉండాలి అనే అంశంపై చాలా తర్జన భర్జన జరుగుతోంది. ఈనాటి తెలంగాణ అంతా ఒకనాటి ముస్లిం నిజాం పరిపాలనలో ఉండింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పరిపాలన అంతమయి ఆ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపిన దినాన్ని బిజెపి, ఆర్‌యస్‌యస్ ఆ ప్రాంత ప్రజల విమోచన దినంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాయి. ఆ తరువాత 1956లో విశాలాంధ్ర ఏర్పడి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు పాత నైజాం రాష్ట్రాన్ని బూర్గుల రామకృష్ణారావు పరిపాలించాడు. ఆ ఏడు సంవత్సరాల్లో ముస్లింల పరిస్థితి ఎలా తయారైందో ఎవరూ సరిగా అధ్యయనం చెయ్యలేదు. బూర్గుల రామకృష్ణారావు పరిపాలనలో వారికి గౌరవస్థానం దక్కిందా? 

ఆ కాలంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రాహ్మణ బ్యూరోక్రాట్లు విద్యావేత్తలు, ఇతర ఉద్యోగులు హైదరాబాదుకు, ఇతర జిల్లా కేంద్రాలకు వలస వచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉర్దూ స్థానాన్ని తగ్గించి ఇంగ్లీషును ప్రవేశపెట్టారు. వందలాది ముస్లిం ఉద్యోగులు వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ఇంటికి పోవలసివచ్చింది. సెప్టెంబ్ 17ను విముక్తిదినంగా ప్రకటించింది బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోనే. 

ఆర్‌యస్‌యస్‌కు, ఆర్యసమాజ్‌కు తెలంగాణలో సిద్ధాంత భూమికను రూపొందించింది ఇక్కడి మైగ్రెంట్ బ్రాహ్మణ వర్గమే. ఆనాటి నుంచి విశాలాంధ్రలో అడుగు పెట్టాక ఆంధ్ర భాష ధాటికి, అధికార యంత్రాంగంలో ఉనికిలో కొచ్చిన బ్రాహ్మణీయ ఇంగ్లీషు ధాటికి ముస్లింలు పూర్తిగా ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ తరువాత తెలంగాణ రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులతో జతై ఈ ప్రాంతపు ముస్లింలందర్నీ రజాకార్లుగా వక్రీకరించి ముందు 'త్రికుల రాజ్యాన్ని' (బ్రాహ్మణ, రెడ్డి, వెలమ) స్థాపించారు. 1980 దశకంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ముస్లిం వ్యతిరేక శక్తుల్లో కమ్మలూ చేరారు. ఇప్పుడది 'చార్ కుల' చట్రంగా మారింది. 

1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముస్లింలు భయపడుతూ పాల్గొన్నారు. ఎందుకు? అప్పటికే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి అత్యధిక ముస్లింలున్న ప్రాంతాల్లో ముస్లింలు భయ భ్రాంతులకు గురిచెయ్యబడుతున్నారు. వారి 'గెట్టోఅయిజేషన్' అప్పటికే పూర్తయింది. ఈ క్రమంలోనే 1950వ దశకంలో వారి రక్షణార్థం ఎంఐఎం పుట్టింది. ఈ ఎంఐఎం చాలా కాలంగా ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉంది. 

వెలమల నాయకత్వంలో 2000 దశకంలో టిఆర్‌యస్ పుట్టింది. ఇది మహారాష్ట్రలోని శివసేన సిద్ధాంతాన్ని తెలంగాణలో అమలు చెయ్య తలపెట్టింది. ఆర్‌యస్‌యస్ ప్రారంభించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని పెద్దఎత్తున జరుప నారంభించింది. ఈ పాటికే తెలంగాణలో ఎన్నో మత కల్లోలాలను, దాడులను ఇక్కడి ముస్లింలు చవి చూశారు. ప్రత్యేక రాష్ట్రమేర్పడితే కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి బిజెపిని తెలంగాణ కంతా వ్యాపింపజేసి టిఆర్‌యస్‌ను లొంగదీసుకోవచ్చు అనే సిద్ధాంతంతో ఆర్‌యస్‌యస్ తెలంగాణ మొత్తంగా పనిచెయ్యడం ఆరంభించింది. ఈ దశలో ఏర్పడిన రాజకీయ జెఎసిలో బిజెపి చేరి తన వ్యాప్తి సిద్ధాంతాన్ని అమలుచెయ్య మొదలుపెట్టింది. 

బిజెపి (చాపకింద ఆర్‌యస్‌యస్) జెఎసిలో చేరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తన క్యాడర్‌ను వ్యాపింపజేసింది. ఎవరెట్ల చచ్చినా తెలంగాణ వస్తే చాలు అనుకునే అగ్రకుల మేధావులు, కొంత మంది బిజెపిలో పనిచేసే బిసి ఉద్యోగులు పొద్దుందనుక టిఆర్‌యస్ ఆఫీసులో, తెల్లందనుక బిజెపి ఆఫీసులో మంతనాలు జరుపడం, ఆర్‌యస్‌యస్ మంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. దీని ఫలితంగా తెలంగాణ నరేంద్ర మోడీగా ఎదగాలని ఆశపడుతున్న కిషన్‌రెడ్డి తెలంగాణ యాత్ర చేశాడు. దానికి జెఎసి కొబ్బరికాయకొట్టి, జెండా ఊపింది (దురదృష్టవశాత్తు ఆ జెండా ఊపే కార్యక్రమంలో కృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు). 

ఆర్‌యస్‌యస్, బిజెపిల శక్తి మహబూబ్‌నగర్ ఎన్నికల్లో కమలమై పూసింది. ఐతే అక్కడ టిఆర్‌యస్ ఒక ముస్లింను పెట్టింది కూడ గెలిపించడానికి కాదు. అక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు పడకుండా చూసి, బిజెపిని గెలిపించడానికి. 'తెలంగాణ వాదాన్ని గెలిపించండి' అని జెఎసి వారు చెప్పినా టిఆర్‌యస్ వారు చెప్పినా అది బిజెపిని గెలిపించే ఒప్పందంలో భాగమే. దాదాపు ఇప్పటినుంచి 2014 ఎన్నికల వరకు టిఆర్‌యస్‌కు, జెఎసికి కావలసిన ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని ఆర్‌యస్‌యస్ సమకూరుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సంపాదించుకోవడానికి అలవాటుపడ్డ వీరు బిజెపి శక్తుల నుంచి డబ్బులు తీసుకోరని నమ్మడానికి వీలులేదు. రానున్న రెండు సంవత్సరాలు జెఎసి చుట్టున్న వీరంతా బిజెపిని తెలంగాణ రెడ్డి రాజకీయ శక్తిగా ఎదిగించే అవకాశముంది. టిఆర్‌యస్ వెలమల పార్టీ అయితే బిజెపి ఇక్కడ రెడ్ల పార్టీ కావాలనేది జెఎసి ఆలోచన కూడ. 

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే నినాదం ఇక ముందు బలపడుతుంది. జెఎసి చుట్టూ ఉన్న రెడ్లు, బ్రాహ్మలు, కొంత మంది బిసిలు కిషన్ రెడ్డి చుట్టూ ర్యాలీ అవుతారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎట్లాగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కనుక (ములాయంసింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చాక ఆ అవకాశం పూర్తిగా పోయింది) బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తేవడం ఏకైక రాజకీయ కార్యక్రమంగా ఈ శక్తులు పనిచేస్తాయి. తెలంగాణ మత్తు మందు బాగా ఎక్కిన మావోయిస్టు అగ్రకుల శక్తులు కూడ ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి వెనుకంజ వెయ్యరు. తెలంగాణ ఉద్యమ క్రమంలో సాధారణ బిసిలు, ఎస్‌సిలు బాగా నష్టపొయ్యారని ఇంతకు ముందే ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. 

ఇప్పుడు ముస్లింలకు ఏం జరుగుతుందో కొంత లోతుగా చూడాలి. నమస్తే తెలంగాణ బ్రాహ్మణ నేతృత్వంలో నడుస్తున్నందు వల్ల అది క్రమంగా బిజెపి కంట్రోల్‌లోకి పోయే అవకాశం లేకపోలేదు. ఈ పత్రిక చుట్టూ పనిచేస్తున్న 'మార్క్సిస్టు మేధావులను' బిజెపి విస్తృతికి బాగా వాడుకుంటారు. వారు ప్రతి నిత్యం కాంగ్రెస్‌ను, టిడిపిని తిడుతూ బిజెపి, టిఆర్‌యస్‌లను పొగిడే పనిచెయ్యక తప్పదు. తెలంగాణ కోసం వారు కూడా ఏ విషమైనా మింగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొక విచిత్ర విప్లవ వాదమైంది. 

ఈ అందరూ కలిసి మహబూబ్‌నగర్‌లో బిజెపి జెండా ఎగురవేశారు. ఈ ప్రాంతపు ముస్లింలకు ఒక హెచ్చరిక చేశారు. పార్టీ ఏదైనా కాని, తెలంగాణలో వెలమ, రెడ్లు గెలువడం ప్రధానం. ముస్లింలు వారు చెప్పినట్టు వినకపోతే వారి చేతిలో ఉన్న పత్రిక, టివి ద్వారా వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రిస్తారు. అవసరమైతే వారిపై ఆర్‌యస్‌యస్ తెలంగాణ వీరుల ముసుగులో దాడులు చేస్తుంది. 

టిఆర్‌యస్, జెఎసి, ఆర్‌యస్ యస్‌నే సపోర్టు చేస్తాయి. ఒకసారి ప్రాంతీయ సెంటిమెంటు రెచ్చగొట్టి ఫాసిస్టు పార్టీని ప్రజాస్వామ్య పార్టీగా ముందుకు తెచ్చాక ఫాసిజానికి తెలుసు ఎవరిని ఎట్లా హాండిల్ చెయ్యాలో! ఇప్పుడు తెలంగాణ ముస్లింలు, మొత్తం తెలంగాణ ప్రాంతం ఒక ప్రమాదకర పరిస్థితిలోకి నెట్ట బడ్డది. ఎంత మందిని చంపైనా, ఏ పార్టీని అధికారంలోకి తెచ్చినా తెలంగాణ సాధించాలనే 'తెలంగాణ భ్రమ' మేధావి వర్గం, రాజకీయ నాయకులు ఇక్కడ చాలా మందే తయారయ్యారు. ఈ తెలంగాణ మత్తు వారికి డబ్బును ఆస్తుల్ని కూడా సంపాదిస్తుంది. 

ముస్లింలపై దాడులు చేస్తే తెలంగాణ వస్తుందంటే అందుకు వీరంతా సిద్ధమయ్యే వాతావరణం కనిపిస్తుంది. అది నిజం కాకపోతే- గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, ఒరిస్సాలో క్రిస్టియన్ల ఊచకోత, బాబ్రీ మజీద్ కూలదోత చాలా సులభంగా చేసి దేశంలో ఎన్నో అరాచకాలను సృష్టించిన ఆ పార్టీని జెఎసిలో చేర్చుకొని తామూ బొట్లు పెట్టుకొని జెఎసి పేరుతో పాత మార్క్సిస్టులంతా దానికి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? రెడ్లకు, వెలమలకు, బ్రాహ్మణులకు మార్క్సిజం ఒక మాయావాదం. తెలంగాణ ప్రపంచకార్మిక విముక్తి సిద్ధాంత ఆచరణ అంశం. ముస్లింల పట్ల, కిందికులాల పట్ల ఈ గుంపుకు ఎప్పుడూ ప్రేమ లేదు. ఎంఐఎం ఇదే భయాన్ని పదేపదే చెబుతూ వచ్చింది. కాని గ్రామీణ ప్రాంతంలోని ముస్లింలు, తెలంగాణ వ్యతిరేక ముద్రకు, దాడులకు భయపడి టిఆర్‌యస్ చుట్టూ చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌యస్, జెఎసిలు తమనెంత మోసం చేశాయో తెలిసింది. ఇలానే జరుగుతుందని అసదొద్దీన్ ఓవైసీ చెబుతూనే ఉన్నాడు. 

వచ్చే ఎన్నికల నాటికి బిజెపి తన జాతీయ స్థాయి శక్తిని, డబ్బును తెలగాణ మీదే కేంద్రీకరిస్తుంది. టిఆర్‌యస్‌తో పొత్తుతోనో లేక స్వతంత్రంగానో తెలంగాణ అంతా పోటీ చేస్తుంది. జెఎసి తెల్లందాక బిజెపితో పొద్దుందాక టిఆర్‌యస్‌తో పనిచేస్తుంది. రానున్న రెండేండ్లలో తెలంగాణ ఒక రణ రంగంగా మారుతుంది. బిజెపి చాలా ప్రమాదకరమైన పార్టీ. దాని నినాదం జ్ఞానం, శీలం, ఏకత. దీని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం కంప్యూటరైజ్‌డ్ కామక్రీడలు చూస్తుంటారు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. మాజీ విప్లవకారులంతా తెలంగాణ పేరుతో బిజెపి, శివసేన సంస్కృతిలో స్నానం చేస్తే సర్వం సమకూరుతాయని చూస్తున్నారు. 

సాంస్కృతికంగా అందరూ హిందూ వాదులైనందు వల్ల సెక్యులరిజం గీతను ఎటు జరిపినా ఫరావాలేదు. ప్రాంతీయ ఉన్మాదంతో పైసలు, మైనార్టీ వ్యతిరేక ఉన్మాదంతో పవర్ వస్తాయి. తెలంగాణ రాకపోయినా అనుకున్నది జరిగింది. బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు గంపెడు మంది చచ్చారు. ఇక చావ వలసింది మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు. జై తెలంగాణ, జై మార్క్స్, జై మను. ఇప్పుడు తెలంగాణ నినాదం సర్వమానవ చావు నినాదం. ఆ అంతిమ లక్ష్యం బిజెపి మాత్రమే నెరవేర్చగలదు. ఇక రెడ్ల నేతృత్వంలోని జెఎసిలన్నీ దాని చుట్టే తిరుగుతాయి. 

2014లోపే ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుతారు. ముస్లింలది మాత్రం అగమ్యగోచర పరిస్థితి. వాళ్లు టిఆర్‌యస్, బిజెపి, వాటి అనుబంధ రాజకీయ జెఎసిలో చేరి పనిచెయ్యకపోతే వాళ్లను 'తెలంగాణ వ్యతిరేకులనే' ముద్ర వేసి వేధిస్తారు. అందులోచేరి పనిచేస్తే మహబూబ్‌నగర్‌లో వారికి పట్టిన గతే పట్టిస్తారు. వారిపై దాడులు చేస్తే ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతంలో పూర్తి స్థానాలు గెలుస్తాయనుకుంటే ఆ పని చేస్తారు. ముస్లింలకిప్పుడు ఒక్క అల్లానే దిక్కు. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jayothi News Paper Dated : 30/3/2012 

No comments:

Post a Comment