డా బి.ఆర్. అంబేడ్కర్ తనకు ముగ్గురు గురువులన్నాడు.వారు గౌతమ బుద్ధుడు, సంత్ కబీర్, సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. అంబేడ్కర్ గురువులలో ద్వితీయ స్ధానాన్ని పొందిన మధ్యయుగ విప్లవ నాయకుడు సంత్ కబీర్ సమకాలీనులలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభావితమైన మరో మహనీయుడు సంత్ శిరోమణి గురు రవిదాస్. కులం, మతం పేరుతో మానవ సమాజం పై జరుగుతున్న దాడులను, విధ్వంసాన్ని అరికట్టిన మహా పురుషుడు ఆయన. సమాజంలో మెజారిటీ వర్గాలైన ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రమైన అణచివేత, దోపిడీ, అవమానం, అంటరానితనంతో జీవిస్తున్న కాలమది.
క్రీ.శ. 15వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని వారణాసి ప్రాంతంలో సంతోఖ్ దాస్, కలిసీదేవి దంపతులకు జన్మించాడు రవిదాస్. చెప్పులు కుట్టే కులంలో పుట్టిన రవిదాస్ అదే వృత్తిని చేపట్టినప్పటికీ, నాడు జరుగుతున్న కులవ్యతిరేక పోరాటాలకు ప్రభావితుడై భక్తినే ఆయుధంగా, గేయాలనే తూటాలుగా చేసుకుని సంచలనం సృష్టించి విప్లవానికి పునాదులు వేసి అటు భక్తిలో, ఇటు దేశ భక్తిలో, సామాజిక పరివర్తనా ఉద్యమంలో తనకు తానే సాటైనవాడని నిరూపించుకున్నాడు.
హిందూధర్మం పేరుతో కర్మకాండలు, యజ్ఞయాగాలతో వెర్రితలలు వేస్తున్న సమాజాన్ని తన బోధనలతో ప్రభావితంచేసి అక్రమమార్గంలో ఉన్న లోకాన్ని సక్రమమార్గంలోకి దిశానిర్ధేశం చేసిన మహాతాత్త్వికుడు రవిదాస్. ఏకంగా సంత్ రవిదాస్ మతం పుట్టుకు రావడమే ఇందుకు నిదర్శనం.అంతేకాదు, సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గ్రంథ్‌సాహెబ్’లో ఇతని భోధనలు, గేయాలు చేరడం అంత ఆషామాషీ విషమేమీ కాదు. ఒక రోజు రవిదాస్ తన శిష్యులతో ప్రభాత కాలాన నదీ స్నానానికి వెళ్ళవలసి ఉండగా అది సాధ్యపడలేదు. అదే సమయానికి ఒక వ్యక్తికి చెప్పులజోడు కుట్టి అందచేస్తానని మాటివ్వడమే. స్నానాలు ముగించుకొని వచ్చిన శిష్యులలో ఒకరు ‘నదీ స్నానానికి రాకపోవడం ప్రవక్తలకు అపచారం కాదా?’ అని ప్రశ్నించాడు. వెంటనే రవిదాసు ‘మన్ ఛంగా తౌ కతోటి మీన్ గంగా’ అంటూ సమాధానమిచ్చాడు.-అంటే నీ హృదయం పవిత్రమైనది అయితే అదే పరమగంగ, వేరే పవిత్ర స్నానం అవసరం లేదని భావం. పౌర సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసహజమైన అంశాలలో కులంఒకటి. కులవ్యవస్ధలో ఇంకా నికృష్టంగా దాగిఉన్న అంశం అంటరానితనం. ఈ కులదొంతరల నిచ్చెనమెట్ల వ్యవస్థ రవిదాస్‌కు నచ్చలేదు.కొందరు ప్రజలు పశులకంటే హీనంగా బతకడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు.
అందుకే ఎవరినీ నీ కులమేదని అడుగకు, ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి దేవుడు సృష్టించినవాడే- అంటాడు. పూలే, అంబేడ్కర్‌లకు తీసిపోని భావజాలాన్ని ప్రవచించిన వాడు రవిదాసు. బ్రాహ్మణ మతం సృష్టించిన అగాథాలని భక్తితోనే, భక్తిలోనే విమర్శించి సంస్కరించే ప్రయత్నం ముమ్మరంగా చేసిన సంఘసంస్కర్త రవిదాస్. ఇలాంటి భావజాలాన్నే నాడు కొందరు ప్రవృత్తిగా స్వీకరించారు. వారిలో కబీరు, హరలయ్య, అక్కమహాదేవి, బసవన్న, తుకారాం, తులసీదాసు, సవతామాలి, మీరాభాయి, గోరా, సేనా ముఖ్యులు. పట్టుదల, కృషి, మొక్కవోని ధైర్యం, మానవత్వం, ప్రేమ, శాంత స్వభావం మనిషిని ఉన్నత స్థానానికి చేరేలా చేస్తాయని భావించాడు.
అమోఘమైన తన గాన పటిమతో మొత్తం దేశంలోనే అనిర్వచనీయమైన చైతన్యాన్ని సృష్టించిన రవిదాసు పేరున హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ సమ్మేళనాన్ని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ మాదిగలు అభినందనీయులు. బాధితుడే సంస్కరణకు పూనుకోవాలి.బాధితుడిని బాధితుడే ఆదుకోవాలఇన్న సూక్తిని నిరూపిస్తున్న మానవతా వాదులు మాదిగలు.దయామయుడైన రవిదాసు సర్వమానవ కళ్యాణానికి ఆనాడే పునాదులు వేసి చైతన్యపరచడం నేటికీ స్పూర్తిదాయకం, ఆదర్శనీయం.
Surya News Paper Dated : 11/03/2012
No comments:
Post a Comment