Tuesday, March 6, 2012

ఇంకెన్నాళ్లీ 'అంటరాని' అజెండా! - సుజాత సూరేపల్లి


మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చుకోవాలి. లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం అర్థంలేనిదవుతుంది. సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం జీవిత విధానంగా, సూత్రాలుగా ఉండడం. 1950 జనవరి 26 నుంచి మనం వైరుధ్యాల జీవితంలోకి అడుగుపెడుతున్నాం. రాజకీయాలలో సమానత్వం ఉండొచ్చు కాని సామాజిక, ఆర్ధిక రంగాలలో అసమానతలుంటాయి. సాధ్యమైనంత త్వరగా వైరుధ్యాలను తొలగించాలి. - డా.బి.ఆర్. అంబేద్కర్ 

ఎన్నికల కాలం! దళితులూ, వెనుకబడిన కులాలు, మైనారిటీలు, ఆదివాసీలపై చర్చ వచ్చే కాలం! కనీసం వోటు ద్వారానో, కాగితం మీదనో, దంచి కొట్టే ఉపన్యాసాల రూపానో ఈ విషయాలు బయటికి వచ్చే సందర్భం. ఎన్నికలు అనగానే మ్యానిఫెస్టోలనో, అజెండాలనో ముందుకు తేవడం సహజం. దళితుల విషయానికి వస్తే, బాబా సాహెబ్ చెప్పిన అంశాలు, దళితుల వెనుకబాటు తనానికి కారణాలు, వారి పరిస్థితిలో మార్పు తేవడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై ఎన్ని రాజకీయ పార్టీలకు అవగాహన ఉందో నిజంగా పెద్ద ప్రశ్న. రాజ్యాంగంలో దళితుల అభ్యున్నతికి అభివృద్ధి, చట్టాలు, విద్య, ఉద్యోగ, చట్ట సభలలో రిజర్వేషన్లు అనే మూడు ముఖ్యమైన కార్యక్రమాలను సూచించారు. 

వ్యక్తిగతమైన హక్కులు విడదీయరాని హక్కులుగా రాజ్యాంగం అణగారిన వారికి కల్పించాలని అంబేద్కర్ నిర్దేశించాడు. అయితే ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఇక్కడ అంటరాని, వెనుకబడిన కులాలు, ఆదివాసీలు, స్త్రీలు ఎందుకు ఇంకా హీన స్థితిక దిగజార్చబడుతున్నారంటే, ఇక్కడ పథకాలు, చట్టాలు పేరుకి బాగానే ఉన్నా, వాటిని ఆచరణలో పెట్టకపోవడం, వీరు ఇలా ఉంటేనే మేము బాగుంటామని పట్టుదలగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిపై ఉండడమే కారణం. 

అగ్రకులాలకు ఉండే, డబ్బు, పలుకుబడి, సామాజిక హోదా, రాజకీయాలపై పట్టు, జాతీయ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు అన్ని కలిపి ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో సంఖ్యలో మైనారిటీలుగా ఉండి కూడా మెజారిటీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను తమ కింద ఉండేట్టుగా శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర నీతి నిజాయితీగా ఉన్న కార్యకర్త కనబడితే వారిని కో ఆపరేట్ చేసుకోవడమో, అణచివేయడమో, నిందలు మోపి పక్కకు నెట్టివేయడమో చూస్తూనే ఉన్నాం. మరికొన్ని ప్రదేశాలలో అడ్డమొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం కూడా మనకెరుకే. 

ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం కారణంగా అనేక విషయాలు చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ అంశం ఎప్పుడూ ఎన్ని 'కల'ను నిర్దారించే అతి ముఖ్యమైన అజెండాగా మారింది. అవును, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, తమ వ్యాపారాలు నడవాలంటే, కలలు నెరవేరాలంటే ఎన్నికలే దారి. తమ అభ్యర్థులను నిలబెట్టడమో, తామే నిలబడడమో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బయటపడ్డ అక్రమ మైనింగ్, 2జి స్కామ్‌లు, మద్యం కుంభకోణాలు, అవినీతి ప్రాజెక్టులు, అవినీతి అని మొత్తుకునే వారు అందరూ కూడా రాజకీయాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారు. ఇందులో చిదంబరం, సోనియాలు కూడా లేకపోలేదు. 

తెలంగాణ విషయం మాట్లాడినప్పుడల్లా ఇక్కడ ఉన్న వివిధ వర్గాల, కులాల ప్రజలను, కొన్ని అంశాలను జోడించి మాట్లాడడం అనివార్యమైపోయింది. హఠాత్తుగా ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్టు, ముస్లింలు, దళితులూ, బహుజనులు, ఆదివాసీలు కూడా ఉన్నట్టు కూడా గుర్తుకు వస్తుంది. స్త్రీల విషయం మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి అసలు ఆ చర్చ రానే రాదు. స్త్రీల సమస్యలలో ఏ స్త్రీల గురించి మనం మాట్లాడుకోవాలి అనే మౌలిక ప్రశ్న ఎప్పుడూ ఎవరూ గుర్తుచేయరు. సమైక్యాంధ్రలో ఈ అంశాలు ఎందుకు చర్చకు పెట్టలేక పోయాం ఇప్పటివరకు? 

పట్టేవాళ్ళను వివిధ పేర్లతోనూ, వాదాలతోనూ, సంఘాలతోనూ అణచివేసి, వెలివేసే వరకు నిద్రపోరు కదా. బహుశా ఆంధ్రలో సమస్యలు లేవని అర్థం చేసుకోవాలో ఏమో. ఏదైతే ఏమిటి తెలంగాణ దళిత అజెండా అని తెలంగాణ పార్టీ నాయకులు దళితుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే మాట్లాడిన ఆ నాయకుడు దళితులకి ఒక హెచ్చరిక చేసినట్టుంది. దళితులకి ఆయనిచ్చిన సందేశం దళిత మేధావులు, సంఘాలు తప్పకుండా ఆలోచించాలి. అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన దగ్గరినుంచి ఎవరి సమస్యలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది అని బహుశా చాలా మందికి తెలిసే అవకాశాలు లేవు. కాని ఎవరి సమస్యలకు ఎవరు కారణం అనేది విశ్లేషిస్తే, నిజంగానే చెప్పుకుంటే ఒడిసే ముచ్చట కాదు. 

సరే ఇప్పుడు ముఖ్యంగా విషయం దళిత అజెండా కానీయండి ఇంకా వేరే వెనుకబడ్డ, సారీ పడవేసిన వారి గురించి మన దృక్పథం ఏమిటి? ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడక తప్పదు. అసలు ఈ కులాల వెనకబాటు తనానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు కారణమైతే, వాటిని విడివిడిగా చూసి అర్థం చేసుకోవడం వేరు, ఇవన్నీ సమాజ నిర్మాణంలో భాగంగా చూస్తే అర్థమయ్యేది వేరు. 

ఇక్కడి ప్రభుత్వాలు, అగ్రకుల రాజకీయ పార్టీలు అణగారిన వారు (అణచివేయబడ్డ వారు) అనగానే వారికి ఇందిరమ్మ ఇళ్లు, బోర్లు, కాసుకోవడానికి నాలుగు బర్రెలో గొర్రెలో లేకపోతే కొంత పోరంబోకు జాగా, ఎటువంటి వసతులు లేని బళ్ళు, వసతి గృహాలు కల్పిస్తే అర్జెంటుగా వాళ్ళ నాయకులనెవరినో కనుక్కొని ఆ పేరున నాలుగు విగ్రహాలు పడేస్తే వీరిని ఉద్ధరించేసినట్టే అనే అపోహ ఉంది. మరీ ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో చేస్తే ఒక పనయిపోతుందీ అన్న భావజాలం చాలా బలంగా మెదళ్ళలో నాటుకుపోయింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో, ఆయన దిగిపోయాక ఎన్ని తిప్పలు పెట్టారో ఇంకా ప్రజలు మరవలేదు. అయినా దళిత అజెండా ఒక పార్టీ గాని నాయకుడు గాని ఇచ్చేది కాదు. 

వెనుకబడవేసిన వర్గాల, కులాల, రాజ్యంలో అణచబడ్డవారి అభివృద్ధి ఒక భాగం కావాలి. విభజించి పథకాలు పన్నడం కాదు. ఎన్ని మంత్రిత్వ శాఖలు వచ్చినా, ప్రత్యేక పధకాలు ఉన్నా కూడా నిధులు దుర్వినియోగం చేయడం, దారి మళ్ళించడం నేటికీ అధికారికంగానే జరుగుతున్నది. అందుకు వీరు వారు అనే తేడా ఏమీ లేదు. ప్రజా వ్యతిరేక పార్టీలు, ప్రభుత్వాలు ఇంతకాలం చేపట్టిన దారిలోనే కొత్త నాయకులు పార్టీలు నడుస్తున్నారు. అలానే దళిత నాయకులు నడవాలనీ చెబుతున్నారు. 

ప్రజాసంఘాలను మచ్చిక చేసుకోవడం అగ్రకుల రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి అమ్ముడుపోయాక ఏ నాయకుడిని అయినా ఒక కులంతో కలిసి చూడడం సబబు కాదు. దళిత మేధావులు కాని, నాయకులు కాని అగ్రకులాల అజెండాలకి తమ కులాలని తాకట్టు పెట్టని వారే నిజమైన నాయకులు. 

అన్ని రాజకీయ పార్టీలు తమతమ మ్యానిఫెస్టోల్లో అణగారిన కులాల గురించి మాట్లాడే ముందు ఒక మనవి. ఇందిరమ్మ ఇళ్లు ఊరికి దూరంగా కట్టించి వెలివాడలను, ఊర్లను అలాగే ఉంచి నిర్మాణంలో ఉన్న అసమానతలను తొలగించకుండా చేసే పథకాలు కాని, మేము ఇచ్చే వాళ్లం మీరు తీసుకునే వాళ్ళుగా చిత్రించడం కాని, పనికిరాని, ఆచరణలో పెట్టలేని పథకాలను ఇంకా పాడకండి. స్త్రీలు, మైనారిటీలను కూడా కలిపి ప్రతి అంశంలోనూ కలిసి ఉండాలి. ఈ దేశంలో ఇంకా విలువలు, మానవత్వం వంటివి ఉంటే వీళ్ళని బిచ్చగాళ్ళుగా కాకుండా సమానత్వం ప్రాతిపదిక మీద వారిని నిలబెట్టే ప్రయత్నాల గురించి మాట్లాడండి. 

దళితులను చూపించి ఓట్లు దండుకోవడం కాకుండా అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదిక పైన పదవులు అందేలా చూడండి. భూములను వాటి రథచక్రాల కింద లక్షలాది బడుగు దళిత మైనారిటీ ఆదివాసులను బలివ్వకండి. అది మాట్లాడకుండా మీరెన్ని అజెండాలు పెట్టినా అవి అంటరాని అజెండాలుగానే మిగిలిపోతాయి. 

ప్రజలు ఇవాళ ఒక్క రూపాయికి బియ్యం ఇవ్వమని బిచ్చం అడగట్లేదు. మాకున్న పంటలను పండించుకునే అవకాశం ఇవ్వమని, లేని వారికి భూమి ఇవ్వమని అడుగుతున్నారు. పనికి ఉపాధిహామీ పథకం పెట్టి కోట్ల కొద్దీ రూపాయలను దారి మళ్ళించి, ప్రజలను పర్మినెంట్‌గా కూలోళ్ళను చేయమని కోరట్లేదు, గౌరవప్రదంగా పనిచేసకొనే హక్కుని కోరుకుంటున్నారు. వాళ్ల గోడు వినండి, 

ఓదార్పు యాత్రలు, చైతన్య యాత్రలు పేరుతో టైంపాస్ కార్యక్రమాలను ఇకనైనా ఆపండి. నానా పేర్లతో కొనసాగుతున్న దోపిడీ విధానాలను ప్రశ్నించండి. వాటికి స్వస్తిచెప్పి ఎవరి అభివృద్ధిని వారే నిర్వచించుకొనే విధంగా చట్టాలు చేయడానికి ప్రయత్నించండి. టైగర్ పార్కులు, నీటి ప్రాజెక్టు, మైనింగ్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేస్తే చూస్తూ ఊరుకుంటున్న మీకు అజెండాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? జీవించే హక్కును కాలరాస్తున్న మీరు పీడిత ప్రజల నాయకులు ఎలా అవుతారు? మీ పార్టీలు రాజకీయ పార్టీలు ఎట్లైతయి? 

ఈ రోజుకి కూడా ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీకి దళితులకి, ఆదివాసీలకి, చిన్నకులాలకి, మైనారిటీలకి, స్త్రీలకి మేమున్నాము అండగా అని ధైర్యం కల్పించ లేకపోయింది. ఎందుకు? దళితుల ఓట్లు లేకుండా, వారి సహకారం లేకుండా కనీసం ప్రచారం కూడా మీ కథ నడపలేరు కదా! పాట పాడాలన్నా, డప్పు మోగాలన్నా, దరువు వేయాలన్నా, మిమ్మల్ని మీ పార్టీల జెండాలని భుజాన మోయడానికి వాళ్ళే దిక్కు కదా! చమటనీ, రక్తాన్నీ ధారపోసి మిమ్మల్ని గెలిపిస్తే వొరిగింది ఏమిటి? కనీసం శవాలను పాతిపెట్టడానికి కూడా జాగా లేదు. దళితులను ఇంకా అంటరాని వారిగానే చూస్తూ, అంటరానివారిగానే ఉంచుతూ, ఎప్పటికీ అడుక్కుతినే బిచ్చగాళ్ళుగా చిత్రిస్తూ, దోచుకు తినేవాడే తేనె పూసిన కత్తిలాగా తీయని మాటలు మాట్లాడుతుంటే విని మైమరిచిపోయే కాలం పోయింది. 

రాజకీయ స్వతంత్రం ప్రతి ఒక్కరికీ ఉంది. సామాజిక అంశాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడండి. ఈ దేశంలో అందరికీ మౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. వాటి పేరు చెప్పి, మీకు మేము మాత్రమే చేస్తున్నాం అని హక్కులను కాల రాయకండి. ఎన్నికలు ప్రజల కోసమే అయితే, మార్పు కోసమే అయితే, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కొరకే అయితే అందరూ ఆదరిస్తారు. కూలిపోతున్న ప్రజాస్వామ్య విలువలని కాపాడకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా ఎవరి వోటు వారికే వేసుకోవడమే జరుగుతుంది. గెలవడం, గెలిపించడం ఏమీ ఉండవు. 

- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 06/03/2012 

No comments:

Post a Comment