సామాజిక తెలంగాణను కోరడమే నేరమా?…..
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేడు ఒక నిర్ధాయక దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటీవల ఫిబ్రవరి 7 వ తేదీన జరిగిన విద్యార్ధి పొలికేకలో, పొలిటికల్ జే ఏ సి లో వివిధ కుల సంఘాల జే ఏ సి లు నేడు ఉద్యమంలో కీలకమయిన పాత్ర పోషించడానికి అనిర్వచనీయమయిన స్పూర్తిని అందించిన మాదిగ దండోరా నాయకుడు, పొలిటికాల్ జే ఏ సి లో నిర్ణాయక పాత్ర పోషిస్తున్న కృష్ణ మాదిగపై జరిగిన దాడి అత్యంత హేయమయిన చర్య. ఈ చర్యపట్ల తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులు, పౌర హక్కుల సంఘాలు, కొందరు దళిత మేథావుల ఉదాసీనతను ఎలా ఆర్థం చేసు కోవాలి? తర తరాలుగా ఈ కుల సమాజంలో సామాజిక పెత్తనం కోసం రాజ్యాధికారం కోసం అగ్ర వర్ణాలు జరుపుతున్న, కొనసాగిస్తున్న కుయుక్తులు; రాజ్యాధికార ప్రాతినిథ్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం అట్టడుగు కుల – వర్గాలు సాగిస్తున్న పోరాట క్రమంలో కృష్ణ మాదిగ మీద మొన్న జరిగిన దాడిని అర్థం చేసుకోవాలి. అయితే, అట్టడుగు కుల వర్గాలపై ఆధిపత్య అగ్ర కులాల జరిపించే దాడులు, చేసే అవమానాల పరంపరలో నిన్న జరిగిన దాడి మొదటిది కాదు, చివరిదీ కాదు. సామాజిక సమానత్యం కోసం పాటుపడే యే అణగారిన కుల-వర్గ ప్రతినిధి అయినా అవమనాలకు లోనవుతాడు. ఫూలే – అంబేద్కర్ జీవిత అనుభవాలనుండి మనం అర్థం చేసుకోవలసింది ఇదే. నాడు ఫూలే- అంబేద్కర్ లాంటి ఎందరో నాయకులు ఎన్నో అవమానాలకు, తిరస్కారాలకు గురై తాము వ్యక్తిగతంగా లబ్ది పొందకున్నా తదనంతరం తమ జాతి భవిష్యత్తు కోసం ఆలోచించారు. కాని జగజ్జీవన్ రాం లాంటి నాయకులు జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కి, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేసుకునడాన్ని మనం మరువకూడదు. కృష్ణపై జరిగిన దాడిని దళిత నాయకులుగా చెలామణిలోనున్న చాలామంది కుహనా మేథావులు ఖండించక నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని వారు జగజ్జీవన్ రాం పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే, దళితుల పోరాటాల కాల గమనంలో అంబేద్కర్ స్థానం చెక్కు చెదరని సుస్థిరతను సంపాదించుకుంటే, జగజ్జీవన్ రాం స్థానం మసకబారి పోయినట్లుగా; అంబేద్కర్ సిద్థాంతాల వెలుగులో వర్తమాన సామాజిక న్యాయ పోరాటాలకు సిద్థాంత భూమికను అందిస్తున్న కృష్ణ మాదిగ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడి, పేరుకే అంబేద్కర్ వాదాన్ని- ఆచరణలో జగజ్జీవన్ రాం తత్వాన్ని అంది పుచ్చుకున్న నేటి దళిత మేథావుల పాత్రలు కాలక్రమంలో కనుమరుగయి పోతాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. తెలంగాణ పొలిటికల్ జే ఏ సి లో రాజకీయ పార్టీల ద్వంద వైఖరి పట్ల కేసిఆర్ ఉదాసీనత పలు అనుమానాలకు తావిస్తూంది. అదే విధంగా, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకొని రావడంలో పొలిటికల్ జే ఏ సి మెతక బారితనం ఒక పట్టాన అర్థం కావడంలేదు. ఎందుకంటే సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధులు ఇరవై నాలుగు గంటల్లొనే రాజీనామాలు చేస్తే, తెలంగాణాలో ఆ రాజీనామాల కార్యక్రమం యిప్పటికీ ఒక కొలిక్కి రాకపోగా, అదో పెద్ద ప్రహసనంగా మారడం ఇక్కడి ప్రజా ప్రతినిథులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కంటే వారి పదవులే ప్రియమైనట్లుగా తేట తెల్లమవుతుంది. ఈ విషయాలపైననే ఇటీవల జరిగిన జే ఏ సి సమావేశాల్లో రెండుసార్లు కృష్ణ మాదిగ వేసిన ప్రశ్నలు అక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేశాయి. అంతే కాకుండా, గత కొంత కాలంగా పొలిటికల్ జే ఏ సి మీద అత్యంత స్పష్టతతో నిర్మాణాత్మకమైన విమర్శ పెట్టగలిగిన వ్యక్తి అతనే కనుక మొదటి నుండి జే ఏ సి లో అతనిని పక్కకు పెట్టాలనే అగ్రకుల కుతంత్ర వాదనను అగ్రకుల మీడియా చాలా బలంగా వినిపిస్తూనే ఉంది. యాభై యేళ్ళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, ఆ సమస్యను ప్రజలల్లోకి తీసుకెళ్ళడంలో, దానిని రాజకీయ ప్రక్రియ నుండి ఒక జాతీయ పొరాటంగా మరల్చడంలో భాగంగా తగిన స్పూర్తిని అందిచడంలో అన్ని శక్తులూ – ముఖ్యంగా బూర్జువా పార్టీలు, విప్లవ పార్టీలు – వైఫల్యం చెందాయి. ఆ క్రమంలో కే సి ఆర్ మొదలు పెట్టిన రాజకీయ ప్రక్రియ సరైన ఫలితాన్నివ్వలేక పోయింది. అయితే అతని ఆమరణ నిరాహర దీక్ష భూమికగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకత్వం విధ్యార్థుల చేతులలోకి పోవడం ఆధిపత్య కులాలకు మింగుడుపడడం లేదు. ఆ విద్యార్థి ఉద్యమం కూడా ఒక మహోన్నతమైన ప్రజా ఉద్యమంగా మారింది. తెలంగాణ పోరాట క్రమంలో యిదొక చారిత్రక మలుపు. అయితే, విద్యార్థి ఉద్యమాన్ని తమ చెప్పు చేతలలోకి తీసుకోవడానికి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఉస్మానియ విద్యార్థి జే ఏ సి లో ఆ పని సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ నాయకత్వం వహిస్తున్నవారిలో అత్యధికులు అట్టడుగు కుల వర్గాలకు చెందినవారే. పైపెచ్చు తమ జే ఏ సిలో రాజకీయ పార్టీల జోక్యాన్ని నిర్ద్వందంగా ఆ విద్యార్థులు తిరస్కరించారు. ఆర్ట్స్ కాలేజీలో విజయవంతంగా జరిగిన విద్యార్థి గర్జనే యిందుకు ప్రబల నిదర్శనం. ఈ క్రమంలో, దాదాపు పదకొండు యూనివర్శిటీలనుండి ఇరవై ఒక్క రోజులపాటు రెండు బృందాలుగా మూడు వందల మంది విద్యార్థులు కాళ్ళకు సరైన ఆచ్చాదనలు లేకుండా దాదాపు పన్నెండు వందల కిలో మీటర్ల పైగా పాద యాత్ర చేసే క్రమంలో, కాళ్ళకు పుండ్లతో, ఈగల్లో దోమల్లో కటిక నేల పైన నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ, వందలాది గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలను చైతన్య పరుస్తూ పొలికేకకు ఓరుగల్లుకు చేరుకున్నారు. ఆ విద్యార్థులు ఒక బహిరంగ సభ పెట్టుకుని తమ అనుభవాలను పంచుకొనడంతోపాటు, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించుకోవాడానికి ఏర్పాటు చేసుకున్న సభలో, కూర్చోనడానికి – నిలబడడానికి కూడా అవకాశం లేకుండా చేసి వారిని అవమానించారు. పాద యాత్ర చేసిన విద్యార్థులను సభకు పరిచయం చేసే కనీస మర్యాదను కూడా విస్మరించి, సభ పోస్ట్లర్లపైన ఎవరెవరి పేర్లుండాలో, వేదికపైన ఎంతమందుండాలో, ఆ ఎంత మందిలో ఏ కులస్తులుండాలో, ఎంతసేపు మాట్లాడాలో లాంటి అన్ని అంశాలపైన తమ పెత్తనాన్ని చెలాయించబోయారు. అందుకోసం కే యూ జే ఏ సి కి డబ్బులు ఎర జూపెట్టారు. దానికి తోడు కే యూ జే ఏ సి అభిప్రాయానికి వ్యతిరేకంగా కృష్ణ మాదిగను ఎట్టి పరిస్థితులలోనూ పోలికేక సభకు పిలువ వద్దని తనకు అనుకూలురయిన విద్యార్థి నాయకులను హైదరాబాద్ కు ప్రత్యేకంగా పిలిపించుకుని ఉచిత సలహా ఇవ్వడమే గాక; వక్తలకు కోర్టునుండి అనుమతి తీసుకునే క్రమంలో కృష్ణ మాదిగ పేరు విద్యార్థి జే ఏ సి సూచించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా అతని పేరును చేర్చక పోవడం అగ్రవర్ణ కుయుక్తులలో భాగంగానే అర్థం చేసుకోవాలి. పోలికేకలో విద్యార్ధులు వినలేదు కాబట్టే ఎలాగైనాదాడి చేయించాలని భావించారు. కేయూలోని కొంతమంది అధ్యాపకులు, ప్రొఫసర్ జయశంకర్, దేశపతి శ్రీనివాస్ మాట్లాడినంత సేపు ప్రశాంతంగా ఉన్న సభా ప్రాంగణం వారి ప్రసంగం పూర్తయ్యి, కృష్ణ మాదిగ ప్రసంగం మొదలుపెట్టి పెట్టగానే ఇసుకతో నింపిన వాటర్ పాకెట్స్, రాళ్ళు, కర్రలు, వాటర్ బాటిల్స్ తో అకస్మాత్తుగా అగ్రకుల కిరాయి విద్యార్థులు ఉన్మాదుల్లా దాడి చేశారు. కేవలం రెండే రెండు నిమిషాలలో జరిగిన ఈ దాడి ముందుగా రూపొందించుకున్న పథకంలో భాగమేనని వేదికకు కేవలం కొన్ని అడుగుల దూరంలోనున్న మాకు స్పష్టంగా కనిపింది. ఈ దాడిని, దానిని మీడియాలో చూపించిన క్రమాన్ని గమనించినట్లయితే కొన్ని విషయాలు స్పష్టంగా అవగతమవుతాయి. ఒకటి, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు కుల – వర్గాలకు వారి వారి జనాభా దామాషా ప్రాతిపదికన రాజ్యాధికారంలో భాగం కావాలని డిమాండ్ చేస్తున్న వారి ఆకాంక్షల గొంతు నొక్కే క్రమం; రెండు, మహోన్నతంగా సాగిన విద్యార్థి పాద యాత్రను మీడియా ఉద్దేశ్యపూర్వకంగా కవర్ చేయక పోవడం అటుంచి, సంఘటన వల్ల ఉద్యమానికి మేలు జరుగక పోగా విచ్చిన్నం చేసే చర్యగానే భావించదగిన దాడిని పదే పదే ప్రసారం చేయడం అనేది ఆంధ్ర – అగ్రవర్ణ మీడియాతో తెలంగాణా రాజకీయ నాయకులు మమేకమయ్యి చేసిన కుట్రపూరిత పథకంలో భాగమే. ఈ సంధర్భంగా ఇంకొక విషయాన్ని సుస్పష్టంగా చెప్పుకోవాలి. ఉద్యమంలో వందలాది మంది చనిపోయినప్పటికీ వారిని స్మరించకుండా ఒక్క వేణుగోపాల్ రెడ్డినే పదే పదే స్మరిస్తూ పాట పాడడం, మిగిలిన వందలాది అట్టడుగు కుల వర్గాల వారిని విస్మరించడం వెనుక బలిదానాలకి సైతం కులం ఉందనే విషయం రుజువు చేస్తుంది. అసలు పొలిటికల్ జే ఏ సి తో కృష్ణ మాదిగకు ఉన్న ప్రధాన వైరుధ్యమేమిటి? కేవలం అతని మాటలు మాత్రమే ఎందుకు చర్చనీయాంశమవుతున్నాయి? దీనిని పరిశీలిస్తే అతని ప్రధాన లక్ష్యం ‘సామాజిక తెలంగాణ’ మేనని స్పష్టంగా తెలుస్తుంది. గతంలో భూసంస్కరణలు అమలులో భాగంగా జరిగిన భూపంపిణీలో అత్యథిక భాగం ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలకే చేరినవి. ఆ భూమిని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్నట్లుగానే రాజ్యాధికారాన్ని కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకోగలిగారు. రేపు తెలంగాణాలో ఇది పునరావృతం కాకుడదని, అణచివేతకు గురి కాబడిన కుల – వర్గాల వారికి, ఆదివాసీలకు, మత మైనార్టీలకు పరిపాలనలో, వనరుల పంపిణీలలో సరి అయిన ప్రాతినిథ్యం లభించాలన్న డిమాండే అతని మీద దాడికి పురి గొల్పి ఉండొచ్చు. అంతే కాకుండా, ‘తెలంగాణను ఎవడూ యుద్దం చేసి గెలవలేదు. తెలంగాణలో జరిగిన అన్ని అక్రమాలు ఇక్కడి అగ్ర కుల, ఆధిపత్య వర్గాలకు చెందిన పెద్ద మనుష్యుల కనుసన్నలలోనే జరిగినవి. ఉదాహరణకు, ఇక్కడి భూములను బయటి వారు కొనకూడదు, అమ్మకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని తుంగలో తొక్కి వేలాది ఎకరాల భూమిని బయటి వారి చేతుల మీదుగా హస్తాలు మారడానికి సహకరించినది కూడా ఇక్కడి దొరలే. కేవలం అధికార దాహం, అగ్రకుల దురహంకారం నాటి నుంచి నేటి వరకు ఈ నేల విముక్తికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ముఖ్య మంత్రి పదవిపై వ్యామోహంతోనే నాటి తెలంగాణ ప్రజా సమితీని మర్రి చెన్నారెడ్డి కాంగ్రేసు పార్టీలో వీలీనం చేశాడు. నేడు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా అగ్ర కులాలు పావులు కదుపుతూ రాజీనామాలు చెయ్యడానికి వెనుకాడుతున్నాయని’ పలు సందర్భాలలో కృష్ణ మాదిగ పేర్కొనడం సహించని కొందరు అతనిపైకి దాడికి పురికొల్పేరనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం ఇంత కాలం దొరల ఆధిపత్యంలోనే ఉందని, తెలంగాణా వస్తే ఆదే ఆధిపత్యం కొనసాగుతుందనే సత్యం కృష్ణ మాదిగ మీద జరిగిన దాడి దృఢ పరుస్తుంది. ఆధిపత్య కులాలలో ఉన్న అభ్యుదయవాదులు, విప్లవకారులు, హక్కుల సంఘాల నాయకులు బడుగు బలహీన కుల – వర్గాల వారిపై రాజ్యం చేసే హింసను పలు సందర్భాలలో ఖండించడాన్ని మనం చూస్తూనే ఉంటాము. అదే సందర్భంలో, ఆ నాయకుల కుల స్వభావాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సత్యమూర్తి, కలేకూరి, కృష్ణ మాదిగ లాంటి కొంతమంది దళితులపై జరిగే దాడుల పట్ల – అవి వ్యక్తులు చేసినా, రాజ్యం జరిపించినా – తమ కనీస స్పందన కూడా ప్రకటించరు. ఆ మధ్య బాడుగ నేతలు పేరుతో ఒక పత్రిక జరిపిన పరోక్ష దాడినిగాని, నిన్న వరంగల్ పొలికేక సభలో కొంతమంది జరిపించిన ప్రత్యక్ష దాడినిగాని ఖండిచక పోవడం అనేది ఆ నాయకులలో నిబిడీకృతమైన అగ్రకుల నిజ స్వభావానికి నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ వచ్చాక వచ్చే దొరల ఆధిపత్యాన్ని కూల దోయడం పెద్ద కష్టం కాదు. ఈ నేలకు కాకతీయులను ఎదిరించిన సమ్మక్క – సారక్కల శౌర్యం ఉంది. నిజాం రాజులను పారద్రోలిన శక్తి ఉంది. ఉళ్ళో తిష్ట వేసిన దొరలను గడిలనుండి తన్ని తరిమిన చరిత్ర ఉంది. రేపు వచ్చే తెలంగాణ మీద పెత్తనం చెలాయించాలనుకున్న దొరలను, అగ్రవర్ణాలను తరిమివేసి అంతిమగా అట్టడుగు కుల వర్గాల స్వప్నం – సామాజిక తెలంగాణను ఎలా సాధించుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అణగారిన కుల వర్గాలకు సరి అయిన రాజకీయ ప్రాతినిథ్యంతో పాటు, సామాజిక అసమానతలులేని, ఆర్ధిక సమతుల్యం గల సామాజిక తెలంగాణే అంతిమ లక్ష్యం అని కృష్ణ మాదిగతో పాటు వివిధ కుల సంఘాల జే ఏ సి నాయకుల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష సాకారం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.
- గుర్రం సీతా రాములు (రీసర్చ్ ఫెలొ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటి)..
ఈ వ్యాస౦ రాసే క్రమం లో తన విలువైన సూచనలు ఇచ్చెన గుండిమెడ సాంబయ్య గారికి కృతజ్ఞతలతో
Surya News Paper Dated : 10/02/2010
No comments:
Post a Comment