Wednesday, March 21, 2012

అర్హత పరీక్షలు - అర్హులైన అభ్యర్థులు - సీతారాం



యు.జి.సి నిర్వహిస్తున్న జాతీయ అర్హత పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) విషయమై పున:సమీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఇటీవలి వార్తలు తెలుపుతున్నాయి. గత నెలలో యు.జి.సి జరిపిన 483వ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం ఏమంటే అర్హతా పరీక్షను నిర్వహించే విషయంగా మరొక ప్రత్యేక సమావేశం జరపాలనేది. గత రెండు దశాబ్దాలుగా నిర్వహించబడుతున్న జాతీయ పరీక్ష గురించి ఇంత హఠాత్తుగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 
జాతీయ అర్హతా పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులైతేనే విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గాను, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గాను నియమింపబడటానికి అర్హతను పొందినట్లు. ఈ నిబంధనను కఠినంగానే అమలుచేసే విషయంలో కేంద్ర మానవ వనరుల విభాగం ఆదేశించింది. రెండేళ్లుగా ఈ నిబంధనను కఠినతరంగానే అమలు చేస్తున్నారు. ఈ నిబంధన ఇట్లా ఉండగానే దీనికి విరుద్ధంగా ప్రమోషన్ల ద్వారా డిగ్రీ కళాశాలలో జూనియర్ లెక్చరర్లను నింపారు. 
తొలుత జాతీయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటుగా, డాక్టరేట్ పొందిన అభ్యర్థులకు లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. మలివిడతలో ఈ అర్హతలు ఏమీ లేకపోయినప్పటికీ జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు వచ్చాయి. జాతీయ అర్హతా పరీక్ష విషయమై యు.జి.సి పునరాలోచన చేయాలని భావించడానికి ఈ ప్రమోషన్ల ప్రక్రియ, రాష్ట్ర ప్రభుత్వాలు యు.జి.సి నిబంధనలను అమలు చేయకపోవటం మొదలైనవి ప్రభావితం చేసి ఉంటాయని భావించడానికి వీలుంది. నిజానికి యు.జి.సి జరపాలనుకున్న పునస్సమీక్ష వార్త నిరుద్యోగులకు, ప్రమోషన్ల కొరకు వేచిచూస్తున్న వారికి సంతోషాన్ని కలిగించేదే. 
రేపోమాపో జరగనున్న సమీక్షకు ప్రేరణగా నిలిచిన అంశాలు రెండు మూడున్నట్లు యు.జి.సి సభ్యులొకరు చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. వాటిల్లో మొదటిది, జాతీయ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య స్వల్పంగా ఉండటంతో పాటుగా, విశ్వవిద్యాలయ స్థాయిలో ర్యాంకులు సాధించినవారు, పదేళ్లకు పైబడి బోధనానుభవం గలవారు సైతం, కృతార్థులు కాలేకపోతూ ఉండటంపై యు.జి.సి విస్మయం చెందుతూ ఉన్నట్లు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. అసలు ఏ అనుభవం లేని అభ్యర్థులు, అప్పుడే విశ్వవిద్యాలయ విద్యను పూర్తిచేసుకున్న అభ్యర్థులు అవలీలగా ఉత్తీర్ణత పొందటం యు.జి.సి.ని పునరాలోచనకు పురికొల్పినట్లు ఆ సభ్యులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. 
ఆ సభ్యులొకరు వెల్లడించిన మరొక అభిప్రాయం కూడా ఆలోచించదగినదిగానే కనిపిస్తోంది. నెట్ పరీక్షలో మొత్తం మూడు పేపర్లుండగా, మొదటి రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ పద్ధతిని పాటిస్తున్నాయి. మూడవ పేపరు వివరణాత్మక వ్యాసరూపంలో రాయాలి. మొదటి రెండు పేపర్లు పాసవుతున్న అభ్యర్థుల సంఖ్య అధికంగానే ఉంటోంది కానీ, మూడవ పేపరు అయిన సబ్జెక్ట్ విషయంగా ఎక్కువమంది విఫలమవుతున్నారు. ఈ వైరుధ్యం ఎందుకు ఏర్పడుతున్నదో అధ్యయనం చేస్తే తప్ప అవగతం కాదు. సబ్జెక్ట్ పరంగా ఉత్తీర్ణత పొందుతున్న వారు కూడా కనీస మార్కులు మాత్రమే సాధిస్తున్నారు. అంటే తమ సబ్జెక్ట్‌లో లోతయిన పరిజ్ఞానం, అందుకు తగ్గ విస్తృత అధ్యయనం వారిలో తగ్గిపోతుందని ఈ ఫలితాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

ఒకవేళ సబ్జెక్ట్ విషయంలో ఉపరితల జ్ఞానం వల్లనే అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నట్లయితే వారు అధ్యాపకులుగా నియమితులు కావటం వల్ల విద్యార్థులకు గాఢమైన విషయ పరిజ్ఞానం కలిగించటంలో, విద్యార్థులను విషయ నిపుణులుగా తీర్చిదిద్దడంలో దోహదం నామమాత్రంగానే చేయగలుగుతారు. ఈ దృష్ట్యానే యు.జి.సి. నెట్ పరీక్ష గురించి మూల్యాంకనం చేయాలని భావించినట్లయితే ఇది ఆహ్వానిందగిన విషయమవుతుంది. నిబంధనలను పాటించకుండా ప్రమోషన్లు పొందిన వారికి వెసులుబాటు కల్పించేందుకు మార్గాలు అన్వేషించేందుకు పునస్సమీక్ష జరిగితే అది సరైన ఫలితాలను ఇవ్వదు సరికదా, ఉన్నత విద్యలో ప్రమాణాలను మరింత పలచన చేయటానికి ఉపకరిస్తుంది. 
ఇదే సందర్భంలో మరొక విషయం కూడా చర్చకు అవకాశమిస్తున్నది. నెట్ పరీక్ష పాసైన అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించటంలో జాతీయ అర్హత పరీక్ష ఉపకరించదనే వాదన కూడా ఉంది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమింపబడాలంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాలి. అటువంటి శిక్షణ ఏదీ లేకుండానే అర్హత పరీక్ష పాసై ఉద్యోగానికి అర్హత పొందటం, ఉద్యోగం పొందుతూ ఉండటం యు.జి.సి.ని తీవ్రంగానే ఆలోచింపజేసినట్లు భావించాలి. ఎందుకంటే నెట్ పాసయిన అభ్యర్థి విశ్వవిద్యాలయ పోస్టుకు అర్హత పొందుతాడు. 

నామమాత్రపు మౌఖిక పరీక్షనెదుర్కొని నియమితుడూ అవుతాడు. అదే డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం కావాలంటే తిరిగి సర్వీసు కమిషన్ పరీక్షను నిర్వహిస్తుంది. దీనిలో జనరల్ స్టడీస్ పేపర్‌తో పాటు, సబ్జెక్ట్ పేపర్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ రెంటిలో అధిక మార్కులు తెచ్చుకుంటేనే మౌఖిక పరీక్షకు పిలుస్తారు. 

ఇటీవల కాలంలో ఎ.పి.పి.యస్సీ చేపట్టిన నియామక ప్రక్రియ ఎంతో వివాదాస్పదమైంది. అభ్యర్థుల అసంతృప్తులు వెల్లువెత్తాయి. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించటం, కోర్టు కేసులు అనేక గందరగోళాల మధ్య కొత్తగా లెక్చరర్లు ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిపోయారు. అయితే ఇదే సమయంలో కాంట్రాక్టు లెక్చరర్లుగా వ్యవస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు మరింత ఆందోళనకు, అభద్రతకు గురవుతున్నారు. ప్రమోషన్ల ద్వారా పోస్టులు నింపినా, డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైనా అప్పటిదాకా పనిచేస్తున్నవారు స్థానాన్ని వొదులకోవలసిందే. దినదిన గండంగా కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలు గడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్హులైన కాంట్రాక్ట్ లెక్చరర్లు తమకు న్యాయం చేయమని అడుగుతున్నారు 
గత పదేళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నప్పటికీ, అర్హతలున్నా తమను పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. కొత్తగా యు.జి.సి. అర్హత పరీక్ష విషయమై పున:సమీక్ష చేయాలని భావించడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 50 మందికి పైగా డాక్టరేట్లు పనిచేస్తున్నట్లు అంచనా. జాతీయ అర్హతా పరీక్ష నెగ్గిన అభ్యర్థులు మరో 50 మంది వరకు ఉండొచ్చు. అయితే వీరు ఎ.పి.పి.ఎస్సీ డిగ్రీ లెక్చరర్ల కోసం నిర్వహించిన నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరి వాదన ఏమంటే యు.జి.సి. అర్హత పరీక్ష విషయంగా పునరాలోచన లేదా పున:సమీక్ష జరపాలని భావించడానికి ముఖ్యకారణాలు రెండు కదా - ఒకటి అభ్యర్థుల బోధనా సామర్థ్యాన్ని సదరుపరీక్ష పరీక్షించడం లేదు. రెండు వివరణాత్మక పద్ధతిలో సబ్జెక్ట్ పరీక్షలో ఎక్కువమంది సఫలత పొందడం లేదు. 

అంటే ఎ.పి.పి.ఎస్సీ నిర్వహించే ఆబ్జెక్టివ్ పద్ధతి కూడా అసమగ్రమైందేనని వారు భావిస్తున్నారు. అసలు ఈ పరీక్షలేవీ బోధన గురించి అభ్యర్థుల సామర్ధ్య, నైపుణ్యాలను పరీక్షించడానికి చాలవు అంటున్నారు. వారి వాదనలో వాస్తవం కాదనలేనిది. పరీక్షలో ఎంపికయిన అభ్యర్థులందరికీ బోధనలో మెళకువలు, ప్రావీణ్యాలు ఉండవు. శిక్షణలేని అభ్యర్థులను అటు ప్రమోషన్ ద్వారా ఇటు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నింపి చేతులు దులుపుకోవటం కంటే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహించి వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించటమో లేక కనీస టైమ్‌స్కేలు ఇచ్చి వారి బోధనానుభవాన్ని ఉన్నత విద్యారంగానికి ఉపయోగపెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. 
అటు విశ్వవిద్యాలయాలలో నియమితులవుతున్న వారు, ఇటు సర్వీస్ కమిషన్ నియమిస్తున్న అభ్యర్థులకు తగినంత శిక్షణ ఉండటం లేదనేది వాస్తవమే. అయితే నియమితులయిన తరువాత రెండేళ్ల కాలవ్యవధిలో విధిగా ఓరియంటేషన్ కోర్సు, పునశ్చరణ తరగతులు పూర్తిచేయడం లాంటి నిబంధనలను అమలు చేస్తున్నారు. కేవలం వీటి ద్వారానే బోధనా నైపుణ్యాలు చేకూరుతున్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇటీవల కాలంలో డిగ్రీ పరీక్షల ఉత్తీర్ణతా శాతం ఆందోళన కలిగించే విధంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారు సరైన ఫలితాలు సాధించకపోతే తొలగిస్తారన్న భయం వల్ల జిల్లా సగటు లేదా విశ్వవిద్యాలయ సగటుకు సమానంగా ఫలితాల సాధన కోసం కృషి చేస్తున్నారు. 

అదే సందర్భంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న బోధకులు తక్కువ శాతం ఫలితాలనే సాధిస్తున్నా వారిని ఎవరూ ఏమీ అడగరనే భావనకూడా కాంట్రాక్టు ఉద్యోగులలో ఉంది. ఉద్యోగ అర్హత పరీక్షలు, నియామక పరీక్షలు, పోటీ పరీక్షలు ఇట్లా ఏ పరీక్షా విధానాన్ని చూసినా భారతీయ విద్యారంగంలో అనేక వైరుధ్యాలకు ఆశ్రయం ఇస్తున్నాయి. విద్యారంగానికి ఒక సమగ్రమైన దార్శనికత, సుస్పష్టమైన గమ్య, లక్ష్యాల లేమిని ఈ వివాదాలు సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ నియామక పరీక్షల వ్యవస్థ అనేక సందేహాలకు ఆస్పదమైంది. డాక్టరేట్లు లేకపోయినా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత పొందకపోయినా డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను సరైన రీతిలో క్రమబద్ధీకరించకపోవటం నిజంగా శోచనీయమే. 
మన జ్ఞాన వ్యవస్థలో జ్ఞాపకశక్తి జ్ఞానంగా మనన్నలు పొందుతూ ఉన్నది. కేవలం జ్ఞాపక సామర్ధ్యంలోనే అభ్యర్ధులు అన్నిచోట్ల ఎంపికవుతున్నారు. వీరి దృక్పథం వీరి అవగాహనా సామర్థ్యం, బోధనా ప్రావీణ్యం ప్రతిదీ ప్రశ్నార్థకమే అవుతున్నది. ఇటువంటి స్థితిలో యు.జి.సి అర్హత పరీక్షపై జరపబోయే పునరాలోచన, పున:పరిశీలన ఏ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందో చూడాలి. అదే విధంగా ఎ.పి.పి.యస్సీ ఉద్యోగ నియామక పరీక్షల విషయంగానూ విస్తృతంగానే చర్చజరగాలి. 
ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో జ్ఞాన బోధనకు పోటీ పరీక్షల కంటే ప్రావీణ్య నిరూపణ పరీక్షలే ఉత్తమం. అవి అభ్యర్థుల శక్తి సామర్థ్యాన్ని నిజంగా పరీక్షించేవిగా ఉండాలి. ఎక్కడో నిపుణుల కమిటీ, ఎపి.పి.ఎస్సీ చైర్మన్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు ఇచ్చే మార్కుల ప్రాతిపదికన కాకుండా డిగ్రీ కళాశాల తరగతి గదిలో విద్యార్థులు వేసే మార్కుల ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక జరిగితే ఎంతో బావుంటుంది. లెర్నర్ సెంటర్డ్ విద్య గురించి చాలా మాట్లాడతాం కాని, తమకు కావలసిన బోధకుడిని తామే ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించగలదా ఈ వ్యవస్థ? అదే జరిగితే ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్లుగా కొనసాగుతున్న వారిని వారి విద్యార్థులే ఎంపిక చేసుకుంటారు. 

- సీతారాం
Andhra Jyothi News Paper Dated : 22/03/2012 

No comments:

Post a Comment