Thursday, March 8, 2012

మహిళా బిల్లును మరిచామా?--డేవిడ్


భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజారిటీ ఉండికూడా చట్టంగా రూపుదాల్చని వాటిలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరాలనుండి పార్లమెంట్‌లో చట్టంగా రూపుదాల్చలేక పోతోంది. ప్రస్తుత ప్రభుత్వమైనా తన ప్రభుత్వ పదవీకాలం ముగిసే లోపు ఇది చట్టరూపం దాల్చేలా కృషిచేసేందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అం దరూ దీక్ష పూనాల్సిన అవసరం ఉన్నది. 


అన్ని వివక్షల్లో కెల్లా స్త్రీ వివక్ష చాలా ప్రమాదకరమైనది. సమాజంలోని లింగవివక్షను రూపుమాపి మహిళల సాధికారికతకు దోహదం చేయాలంటే మహిళా రిజర్వేషన్‌లు తప్పనిసరి. నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేసే ప్రభుత్వ పథకాలన్నీ సమర్ధవంతంగా అమలు జరగాలంటే ఆ పథకాల నిర్మాణంలో, అమలులో వారి భాగస్వామ్యం తప్పనిసరి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళలు స్వావలంభన పొందగలుగు తారు. అదే విధంగా ప్రభుత్వ విధానాలను మహిళలకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తారు. అందువల్ల ప్రభుత్వ విధానాల తయారీలో మహిళల భాగస్వామ్యం పెంచాలంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.



అత్యధిక సంఖ్యలో ప్రజలకు రాజకీయ పాలనలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం. అయితే సమాజంలో దాదాపు సగం వరకు మహిళలకు రాజ కీయ పాలనలో, ప్రభుత్వ విధానాల నిర్మాణంలో వారికి సరియైన ప్రాతినిధ్యం లభించుట లేదు. దేశ జనాభాలో 50 శాతాన్ని ఆక్రమించిన మహిళలు రాజ కీయ పదవులలో ఎన్నడూ 8.4 శాతానికి మించిలేరు. కాని ప్రపంచ దేశాలలో చాలా దేశాలు మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంలో భారతదేశం కంటే ముందువరుసలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలలో మొత్తం మహిళలలో 30శాతం నుండి 35 శాతం మంది అక్కడి పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్థా న్‌లోసైతం దాదాపు 23 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా 8.4 శాతం మాత్రమే మహిళలు భాగస్వామ్యం వహిస్తు న్నారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్ఠం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్‌లను కల్పించడం తప్పనిసరి.



అభివృద్ధి అజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్ధిలో భారతదేశం పురోగమిస్తోంది. కాని మానవాభివృద్ది నివేది కలో ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాము. ప్రభుత్వ పాలనలో మహిళల భాగస్వా మ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ధి ప్రధాన అజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలలో మహిళలకు కల్పించే సౌకర్యాలని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. మంచినీటి వసతి, పిల్లల ఆరోగ్య విషయాలు, పౌష్ఠికాహార కల్పనలలో తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువల్ల మహిళలకు ప్రభుత్వపాలనలో భాగస్వామ్యం కల్పించడం వల్ల వారు సమాజానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందించుటకు అవకాశం ఉంటుది.నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించేందుకు కూడా రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన జరిపేందుకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీ స్వచ్ఛందంగా మహిళలకు ప్రాధాన్యతఇచ్చి వారిని ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేయుటకు ముందుకు రాలేదు. సంకీర్ణ రాజకీయాలలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని, అందువల్ల ఎక్కువ సీట్లను మహిళలకు కేటాయించడం లేదని అన్ని పార్టీలూ సమర్ధించుకుంటున్నాయి. అయితే పరోక్ష ఎన్నికలకు అవకాశం ఉన్న శాసన మండలి, రాజ్యసభ సీట్లలో కూడా స్ర్తీలకు తగిన అవకాశాలను కల్పించడంలో రాజకీయపక్షాలు వెనకాడుతున్నాయి. 



మహిళా రిజర్వేషన్‌లపై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే- అగ్రకులాలకు చెం దిన మహిళలే అధింగా లాభపడి, సామాజికంగా వెనుకబడిన వర్గాల మహి ళలకు అన్యాయం జరుగుతూ చట్టసభల సామాజిక పొందిక దెబ్బతింటుంద నేది. అగ్రకులాల మహిళలతో వెనకబడిన కులాలకి చెందిన మహిళలు పోటిప డలేరు. ఈ అభ్యంతరం వల్లనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చలేక పోతోంది. దీనిని పరిశీలిస్తే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాలకు సరియైన ప్రాతినిధ్యం లభించకపోవచ్చు. లింగవివక్షతను అధిగమిం చాలంటే ఉప కోటాతో సహా మహిళారిజరేషన్‌ బిల్లు అమలుపరచడం అవసరం. అయితే ప్రస్తుతంఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు పరచడం వల్ల వెనకబడిన వర్గాల మహిళలకు నష్టం కలుగుతుంది. 



భారతదేశంలో కులం ఒక బలమైన వ్యవస్థ. ఇది దేశరాజకీయాల్ని నిర్దేశిం చగలుగుతోంది. రాజకీయ సమీకరణకు కులం ఒక ప్రాతిపాదిక. మండల్‌ కమిషన్‌ సిఫార్స్‌ల అనంతరం దేశరాజకీయాలల్లో సామాజికా మధనం ప్రారంభమైంది. దీని ప్రకారం దేశరాజకీయాలలో వెనకబడిన వర్గాలకు చెందిన వారి రాజకీయ ప్రాబల్యం పెరిగింది. మహిళా రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టి ఉప కోటా అమలుచేయవచ్చు. ప్రస్తుత రూపంలో మహిళా రిజర్వేషన్‌లు పూర్తిగా పలుకుబడి గలవారికే ఉపయోగప డతాయి. దక్షిణాసియా దేశాలలో మహిళలలో ఎక్కువమంది పలుకుబడి కలిగిన వర్గాలనుండివచ్చి రాణించినవారే అధికం. రాజ్యాంగం స్థానిక సంస్థలలో 33 శాతం సీట్లను స్త్రీలకు కేటాయించడం ద్వారా నేడు సుమారు 10 లక్షలమంది మహిళలు పాలనలో పాల్లోనే అవకాశంవచ్చింది. 


david
వారిలో ఎందరో జడ్పీటీసీలు గా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచ్‌లుగాపనిచేస్తున్నారు. వీరు కూడా తమకు అవకాశాలు వస్తే రాజకీయ రంగంలో అద్భుతాలు చేయగలమని నిరూ పించారు. కాబట్టి మహిళలను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరియైనదికాదు. ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపం దాల్చేందుకు పురుష్యాధిక్యతను పక్కకుపెట్టి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.



Surya News Paper Dated : 08/03/2012 


1 comment: