Friday, March 16, 2012

జనాభా లెక్కల్లో దాగిన నిజాలు



village
తొలిదశ 2011 జనాభా వివరాలను 2012 మార్చి 12న కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. జనాభా వివరాలను- ఘనత వహించిన భారత ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రసాదిం చిన సౌకర్యాలను గమనిద్దాం.

నేటికీ దేశంలో దాదాపు 50 శాతం మంది స్ర్తీ, పురుషులు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే దేశంలో సగం మందికి మరుగు దొడ్ల సౌకర్యం లేదు. మనని మనం పరిపాలించుకోవడం ప్రారం భించి ఆరున్నర దశబ్దాల య్యింది. ఇప్పటికీ దేశ జనాభా అంతటికీ కనీస సౌకర్యాలు కల్పించుకోలేకపోయాం అన్నది వాస్తవం. 4.7 శాతంమంది కార్లలో విహరిస్తూ సర్వసౌకర్యాలు అనుభవిస్తున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అంటే, 95.3 శాతం మందికి పంచాల్సిన సంపదను 4.7 శాతంమంది దక్కించు కుంటున్నారు. కడుపు నిండా తిండి, కంటినిండా నిద్ర, మరుగు దొడ్లు లేకున్నా- విచిత్రంగా దేశంలో 53.2 శాతం మంది మాత్రం మొబైల్‌ టెలిఫోన్‌ వినియోగిస్తున్నారు. మొత్తం మీద 63.2 శాతం మంది ఇండ్లకు టెలిఫోన్‌ సౌకర్యం ఉందని సెన్సస్‌ నివేదిక వెల్లడించింది.
మరుగుదొడ్లు లేని జనాభా (దాదాపు 50 శాతం) 49.8 శాతం. కట్టెలు, పిడకల పొయ్యి వాడేవారు 49.00 శాతం. డ్రయినేజి సౌకర్యం లేని ఇండ్లు ఉన్న కుటుంబాలు 48.9 శాతం. కారు ఉన్న కుటుంబాలు 4.7శాతం సైకిల్‌ ఉన్న కుటుంబాలు 44.8 శాతం. స్కూటర్‌ ఉన్న కుటుంబాలు 21.0 శాతం. మొబైల్‌ ఫోన్‌ కలిగినవారు 53.2 శాతం. గ్యాస్‌ స్టౌ ఉన్న కుటుంబాలు 28.6 శాతం. స్వంత టెలిఫోన్‌గలవారు 63.2 శాతం. ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ ఉన్నవారు 3.1 శాతం. కంప్యూటర్‌ కలిగిన కుటుంబాలు 6.3 శాతం. ఒక గది ఇల్లు కలవారు 37.1 శాతం. రెండు గదుల ఇల్లు కలవారు 31.7 శాతం. మూడు గదుల ఇల్లు కలవారు 14.5 శాతం.రేడియో ఉన్న కుటుంబాలు 19.9 శాతం. ఒపెన్‌ డ్రయినేజి సౌకర్యం ఉన్న ఇండ్లు 33.00 శాతం.

స్వంత ఇండ్లలో నివసించేవారు 8.66 శాతం. ఒక జంట ఉండే ఇండ్లు 70.1 శాతం. రెండు జంటలు ఉండే ఇండ్లు 14.1 శాతం. బ్రహ్మచారులున్న ఇండ్లు 11.6 శాతం. పబ్లిక్‌ టాయిలెట్లు వాడేవారు 3.2 శాతం. టాయిలెట్‌ సౌకర్యం ఉన్న ఇండ్లు 24.66 శాతం. 
జనాభా లెక్కల్ని ఎంత శాస్త్రీయంగా సేకరించినా కింది స్థాయిలో మామూలు ఉద్యోగుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల, విధానపరమైన లోపాలవల్ల కొంత ఖచ్చితత్వం తగ్గినా ఉన్నంతలో ఆధారపడిదగిన లెక్కలు ఇవే. జనాభా లెక్కల సేకరణలో కొన్ని రాజకీయాలు, చాణక్యాలు ఉన్నా మొత్తం వాటి ప్రభావం తక్కువే. ఉదాహరణకు స్వాతంత్య్రం రాకముందు (1941) బ్రిటిష్‌ ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించింది. ఆ లెక్కల్లో కులాలు, మతాల వారీగా జనాభా వివరాలను సేకరించింది. స్వతంత్య్ర దేశంగా కొనసాగిన నైజాం రాజ్యంలో కూడా బ్రిటిష్‌ వారి పద్ధతిలో జనాభా లెక్కలను కులాల వారీగా సేకరించారు. బ్రాహ్మణీయ- హిందుత్వ భావజాలంలో ఉన్న స్వాతంత్య్రానంతర పాలకులు జనాభా లెక్కలను కులాల వారీగా సేకరించడానికి ఇచ్చగించలేదు. పైగా దానిని తీవ్రంగా అడ్డుకొన్నారు. 
ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశంలో కులం ప్రధాన అంశం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా చూసినా కులం అత్యంత ప్రభావపూరితమైన అంశం. మాతృగర్భంలో ఉన్నప్పట్టినుండి యవ్వనప్రాయులు అయ్యేవరకు పిల్లలందరూ కుల కట్టుబడిలో, కుల ఆచారాల మధ్య పెరిగి పెద్దవారవుతారు. వారి సంస్కారం, విద్య, అవగాహనలను కులం ప్రభావితం చేస్తుంది. పుట్టుకనుండి చావు వరకు ప్రతిదినం ప్రతి అంశంలో కులం తానున్నానంటుంది. ప్రభుత్వం వారు, పాలకకులాల వారు, పార్టీల పెద్దలు మాత్రం- కులం గురించి మాట్లాడడం ఏమిటి, అది కుసంస్కారం- అని కులం విషయమై మాట్లాడకుండా జనసామాన్యాన్ని కట్టడి చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కులం గురించి మాట్లాడటాన్ని నిషేధించినంత పనిచేశాయి. తద్వారా ఆరున్నర దశబ్దాలు వారు అప్రతిహతంగా విశాల భారత దేశాన్ని పాలించగలిగారు. తమ కులస్థులను పైకి తెచ్చుకోగలిగారు.

వారే 4.7 శాతం మంది కార్లు కలిగి ఉన్నారు. బీసీ, ఎస్సీ కులాల వారు కొందరు కార్లు, వాహనాలు కలిగి ఉన్నారు. వారు పుట్టుకతో బీసీ, ఎస్సీలే కానీ స్వభావరీత్యా అగ్రకుల పాలకవర్గ స్వభావాన్ని లేదా, దళారి స్వభావాన్ని సంతరించుకున్న వారు మాత్రమే. కులానికి సంబంధించిన అస్తిత్వ లక్షణాలున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యక్తి నేటి దేశకాల పరిస్థితుల్లో కారు కొనగలగటం దాదాపు అసాధ్యం.
‘కులం లేదు లేదు’ అని పాలకవర్గాలు కింది వారిని మాయ చేస్తూ తాము మాత్రం తమ ఇంటి కోడళ్ళుగా తమ కులం వారినే తెచ్చుకున్నారు. కులాన్ని పాటించని వెర్రినాయకులు ఆయా పార్టీలో అతిస్వల్పంగా ఉంటారు. వృత్తి విద్యలు వర్ధిల్లి ప్రపంచానికి కన్ను కుట్టించిన అద్భుతమైన నైపుణ్యాలు సంతరించుకున్న, అంతులేని సంపదను సృష్టించిన భారతదేశం స్వాతంత్య్రానికి ముందు తెల్లదొరలవల్ల, స్వాతంత్య్రానంతరం బ్రాహ్మణీయ హిందుత్వ పాలక కులాల స్వార్థంవల్ల- నూటికి యాభై మంది దరిద్ర నారాయణులను తయారు చేసింది. 4.7 శాతం మంది సంపన్నులను తయారు చేసింది. 

దేశంలో దాదాపు 21 శాతం మందికి స్కూటర్‌/ సైకిల్‌ మోటార్‌ యోగం పట్టిందట. అనగా దేశంలో 21 శాతం మంది మధ్య తరగతి వారున్నట్లు భావించవచ్చు. ఉద్దేశం ఏదయినా కానీ ప్రభుత్వం వెల్లడించిన ఈ జనాభా వివరాల్లో అనేక వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. ఎంత దాచినా, లెక్కలను మసిపూసి మారేడుకాయచేసినా కొన్ని వాస్తవాలు వెల్లడికాక తప్పలేదు. 44.8 శాతం మందికి సైకిల్‌ సౌకర్యం ఉందట. వీరిని సమాజంలో ఉన్న కింది మధ్యతరగతి వారిగా భావించవచ్చు.వీరిలో కొందరు స్కూటరు కొనుక్కొని మధ్యతరగతి వారిగా ఎదగడానికి ప్రయత్నించే వ్యక్తులుగా భావించవచ్చు. 
దేశంలో 49 శాతం మంది ఇంకా కట్టెలు, పిడకల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిననాటి సామాజికస్థితిలో ఉన్న జనాభాగా వీరిని పరిగణించవచ్చు. ఏ రాజకీయాలు, ఏ సంక్షేమ పథకాలు వీరి దరి చేరవు. వీరిని పశుప్రాయలకన్నా కొంచెం మెరుగైన జీవనశైలిలో బతికే వారుగా పరిగణించవచ్చు. వీరిని యధాతథ స్థితిలో ఉంచడానికే పాలకవర్గాలు సదా ప్రయత్నిస్తాయి. ఎందుకంటే వీరే వారికి ఓట్ల పంటను పండించేది. వీరి అజ్ఞానం అచైతన్యమే వారికి శ్రీరామరక్ష. జనాభాలో తొంభై శాతం. మందికి కనీస నాణ్యతగల విద్య, వైద్య సౌకర్యాలు అందడం లేదు. నూటికి నలుగురు తల్లులు ప్రసవ సమయంలో మరణిస్తున్నారు. పుట్టిన వందమంది శిశువుల్లో పదిమంది ఏడాది దాటకుండా కన్ను మూస్తున్నారు. 

durgam-ravinder
బతికి బట్టకట్టిన పిల్లల్లో కేవలం ఐదు శాతం మందే ఆరోగ్య వంతమైన వాతావరణంలో పెరుగుతుంది. ఈ పరిస్థితి మారడానికి రెండవ స్వతంత్ర ఉద్యమం రావాలో ఏమో! గాంధీలవల్ల ఇప్పుడు లాభం ఉంటుందో ఉండదో? ఆయన తెచ్చిన స్వాతంత్య్ర ఫలితమే వికటించి నేటికీ యాభై శాతం మంది భారతీయులను అజ్ఞానంలో, అంధకారంలో ఉంచింది కదా !


Surya News paper Dated : 16/03/2012

No comments:

Post a Comment