అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక మళ్లీ వచ్చింది. సంబరాలను అంబరాన్ని దాటే స్థాయిలో నిర్వహించుకొంటాం. కానీ నిజమైన సాధికారత అందమైన స్వప్నంగానే మిగిలిపోతోంది. సంపూర్ణ స్థాయిలో స్త్రీకి సాధికారత సాధించబడడం గగన కుసుమంగానే అనిపిస్తోంది. మహిళా సాధికారత అన్న పదం మాటల్లో ఎంతో అందంగా కనిపిస్తూ, మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్నా మహిళల నిజ జీవితంలో ఆ సాధికారత సాధించబడిందా? ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారా అని ప్రశ్నించుకొంటే సమాధానం ఏమొస్తుందో అందరికీ తెలిసిందే.
మహిళకు సాధికారత కావాలనే ఆలోచన, ఆ దిశలో స్త్రీలు పయనం చేయడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే అసలు విషయం మనకు తెలుస్తుంది. యు.ఎన్.ఓ 1975లో స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. 1975 మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతకన్నా ముందు 1910 మార్చి 8న డెన్మార్క్ రాజధాని కోపెన్‌హోగన్‌లో ఒక అంతర్జాతీయ మహిళా సభ జరిగింది. జర్మన్ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జట్కిన్ ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని చేసిన సూచనను ఆ సమావేశం ఆమోదించింది.
అప్పటి నుంచి ఆ తేదీని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారనేది మరో కథనం. పది గంటల పని దినం కోసం పురుషులతో సమాన వేతనం కోసం 1845లో పశ్చిమ పెన్సిల్వేనియాలోని బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెలో మహిళా కార్మికులే ప్రధాన పాత్ర నిర్వహించారు. 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందువల్ల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని క్షారా జట్కిన్ ప్రతిపాదిందని అంటారు. స్త్రీ సమస్యకు ఒక రూపం ఆ రోజే జరిగిందన్నది వాస్తవం.
పెట్టుబడిదారీ విధానం ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ పురుష నిష్పత్తి పడిపోతోంది. దేశంలో 1000 : 933 మంది స్త్రీ పురుష నిష్పత్తి ఉంది. హరిత విప్లవంతో ఆర్థికాభివృద్ధి సాధించిన పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లో 800 లోపుకు పడిపోయింది. 0-6 సంవత్సరాల వయస్సు బాలికల్లో నిష్పత్తి గత శతాబ్ది కాలంలో 945 నుంచి 927కి పడిపోయింది. 1994లో పిఎన్‌డిటి చట్టం వచ్చింది. అయినా భ్రూణ హత్యలు తగ్గలేదు. 1991 నుంచి 5 కోట్ల మంది ఆడపిల్లలు భూమి మీద పడకుండానే అంతర్థానమయ్యారు. ఇది యూనిసెఫ్ నివేదిక. ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన విష సంస్కృతి ప్రభావాలు మహిళలపై ఇంటా బయటా విషం గక్కుతున్నాయి.
అందుకే స్త్రీని బాధించే ఏ సమాజం బాగుపడదు. మగవాళ్లు స్త్రీల మీద జాలితో మారనక్కరలేదు. ప్రేమ పూరిత వైవాహిక జీవనం కోసం, సకల సంపదల కోసం, తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, సమాజ కల్యాణం కోసం మారాలి. అపుడే సమాజంలో దేశంలో ప్రపంచంలోని స్త్రీల జీవితాల్లో నిజమైన సాధికారత లభించి జీవితాలు ఆనందమయం అవుతాయి. నిజమైన సాధికారతకు అదే అసలైన అర్థం. అపుడే సాధికారత అంబరాన్నంటే సంబరం అవుతుంది.
- సి.హెచ్. కళావతి
అసోసియేట్ ప్రొఫెసర్
Andhra Jyothi News Paper Dated 08/03/2012
No comments:
Post a Comment