12 రాష్ట్రాల సీఎంల వ్యతిరేకత
తమ అధికారాల్లో జోక్యమంటూ అభ్యంతరం
దర్యాప్తు సంస్థల పని నిఘా సంస్థలు చేస్తాయా?
నక్సల్‌బరీని అణచడానికే ‘ఉప’ చట్టం
1967 చట్టానికి భారత్ సవరణలు
‘గ్రీన్ హంట్’ విస్తరణకు విశ్వప్రయత్నాలు
దేశంలో ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాదులను అణచివేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం-1967’ (ఉప- అన్ లా ఫుల్ ఏక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) లోని సెక్షన్ 43-ఎ ప్రకారం తనిఖీలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్టులు, ఉగ్రవాద ఆస్తుల జప్తు చేయడానికి, వారిని ప్రాసిక్యూట్ చేసి శిక్షించడానికి ‘జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (సంస్థ- ఎన్‌సీటీసీ)’ని 2012 మార్చి 1 నుంచి అమలులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థకు డిజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
ఆయన పర్యవేక్షణలో ముగ్గురు సంయుక్త డైరెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పని చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు పనిచేస్తారు. ఉగ్రవాదులపై సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి ఆపరేషన్లను నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను ఉపయోగిస్తారు. రాష్ట్రాల పోలీసు అధికారుల సహాయం అవసరమని భావిస్తే- ఆ సంస్థ తీసుకుంటుంది, లేకుంటే లేదు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వ్యతిరేకత రావడంతో సంస్థ ఏర్పాటును తాత్కాలికంగా వాయిదా వేసుకొంది.
భారత రాజ్యాంగ చట్టం ప్రకారం మన దేశం రాష్ట్రాల సమ్మేళనం. కనుక కేంద్రం, రాష్ట్రాలు- వీటి మధ్య అధికారాలు, అంశాలు పంపిణీ అయ్యాయి. అందువల్ల దేశంలో ఉన్నది ఫెడరల్ వ్యవస్థ. కనుక తమకు కేటాయించిన అంశాల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలి. ఒకరి పరిధిని మరొకరు అతిక్రమించరాదు. పోలీసు, శాంతి భద్రతల అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. ఉగ్రవాదులపై గాని లేక మరెవరిపై గాని నేరారోపణలు వస్తే వాళ్ళను ప్రాసిక్యూట్ చేసి చట్టం ప్రకారం శిక్ష విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది. అయితే రాష్ట్రాల సమ్మతితో రాష్ట్రాలకు తోడ్పడడానికి జాతీయ స్థాయిలో తనిఖీలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్టులు చేయడానికి సీబీఐ లాంటి సంస్థలున్నాయి. అందువల్ల 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్‌సీటీసీ ఏర్పాటు విషయమై తమతో ముందుగా చర్చించలేదని, ఇది పూర్తిగా శాంతి, భద్రతల అంశమని, కేంద్రానికి ఇందులో జోక్యం చేసుకోవడానికి హక్కులేదని తీవ్ర నిరసనలను తెలియజేశారు.
నిఘా సంస్థలు వేరు, దర్యాప్తు సంస్థలు వేరు. ఈ రెండూ భిన్నమైన కార్యకలాపాలు నిర్వహిస్తాయి. నిఘా సంస్థలు కేవలం సమాచారాన్ని సేకరించి దర్యాప్తు సంస్థలకు అందజేయాలే తప్ప ఆ సంస్థలే ప్రాసిక్యూషన్ చేయరాదు. ఆ పనిని దర్యాప్తు సంస్థలు చేయాలి. ఈ అధికారం రాష్ట్రాల స్థాయిలో పోలీసులకు ఉన్నది. సెక్షన్ 43-ఎలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్‌సీటీ లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇది పరస్పర విరుద్ధమన్న విషయాన్ని పక్కన పెట్టినా, అసలు రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాన్ని గురించి తన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్దేశిస్తుంది? అసలు చట్టవిరుద్ధ కార్యకలాపాలంటే ఏమిటో, వాటికి పాల్పడే సంస్థలను, వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో నిర్ణయిస్తూ కొన్ని రాష్ట్రాలు విడి విడిగా చట్టాలు చేసుకున్నాయి.
ఏ మేరకు శిక్షించాలో అందులో పొందుపరచకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా 1992లో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నది. కేంద్ర చట్టం ‘ఉప’ ప్రకారం నిఘా సంస్థ, దర్యాప్తు సంస్థ ఒకటే అయ్యింది. ఎన్‌సీటీసీ చేపట్టే తనిఖీలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్టులు వగైరా పనులకు ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- 1973’ వర్తిస్తుందని (ఉప) చట్టం లోని సెక్షన్లు 43 బి, 43 సి, 43 ఇ, 43 ఎఫ్‌లలో పేర్కొన్నారు. నేరం రుజువైతే సెక్షన్ 16 ప్రకారం ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలను కూడా న్యాయస్థానాలు విధించవచ్చునని పొందుపరచారు.
ఏ నేపథ్యంలో ఉప చట్టాన్ని 1967లో చేశారో పరిశీలిస్తే విషయం సంపూర్ణంగా అర్ధమవుతుంది. 1962 అక్టోబర్‌లో భారత్‌పై చైనా దురాక్రమణ జరిగినప్పుడు ఉమ్మడి పార్టీగా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది నాయకులు చైనాకు అనుకూలంగా, తక్కినవారు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేశారు. ఇది సీపీఐ చేసిన మూడవ చారిత్రక తప్పిదం. ఈ తప్పిదం వల్ల 1964 ఏప్రిల్‌లో పార్టీలో చీలిక వచ్చి సీపీఎం వేరుగా ఏర్పడింది. అయితే సీపీఐ నాయకుల వైరివల్ల అప్పటి నెహ్రూ ప్రభుత్వం 1963లో రాజ్యాంగ చట్టంలోని అధిరణ 19 (1)లో మాట్లాడే స్వేచ్ఛ కింద ఉన్న సబ్- క్లాజ్‌లు (2), (3), (4) లకు ‘దేశ సమగ్రత, సార్వభౌమత్వాలు’ అనే రెండు పదాలను చేర్చుతూ వాటికి భంగం కలుగకుండా వ్యవహరించాలని సవరణ చేసింది (వీటినే హేతుబద్ధ ఆంక్షలు) అంటారు.
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం- (ఉప)ను 1967 డిసెంబర్‌లో చేసింది. అప్పుడు ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద కార్యకలాపాలు అనే మాటలు ఆ చట్టంలో లేవు. 1967 మే 25న నక్సల్‌బరీ విప్లవోద్యమం ప్రారంభమైంది. ఈ విప్లవోద్యమాన్ని అణచడానికే అదే సంవత్సరంలో ‘ఉప’ చట్టాన్ని తెచ్చారు. అరబ్ దేశాలపై అమెరికా చేస్తున్న యుద్ధాలకు నిరసనగా 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా ఉగ్రవాదులు న్యూయార్స్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాలను కూల్చివేసిన విషయం విదితమే. ఆ చర్యను అమెరికా ఉగ్రవాద చర్యగా అభివర్ణించి, ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ప్రత్యేక చట్టాలు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం చేయించింది.
తమకు మద్దతు ఇవ్వని దేశాలు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్టుగానే పరిగణిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ తీర్మానానికి అనుగుణంగా భారత్ 1967 చట్టానికి సవరణలు చేస్తూ వచ్చింది. 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో 1967 (ఉప) చట్టానికి పదునుపెడుతూ సవరణ చేసింది. ఈ చట్టంలోని షెడ్యూల్‌లో 34 సంస్థలను/ రాజకీయ పార్టీలను నిషేధిస్తూ పొందుపరచింది.
‘ఉప’ చట్టంలోని సెక్షన్ 35 కింద మొదటి పీపుల్స్‌వార్, దాని అనుబంధ ప్రజాసంఘాలను, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, దాని అనుబంధ ప్రజాసంఘాలను ఈ షెడ్యూల్‌లో నిషేధించింది. ఆ రెండు పార్టీలు 2004 సెప్టెంబర్ 24న విలీనమైన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), దాని అనుబంధ ప్రజాసంఘాలను కూడా నిషేధిస్తూ షెడ్యూల్‌లో చేర్చింది. ఈ విప్లవ పార్టీలు ఉగ్రవాద చర్యలకు
పాల్పడుతున్నాయని, కనుక అవికూడా ఉగ్రవాద సంస్థలని భావించి సెక్షన్ 35 కింద కేంద్ర కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తామ విడిగా చేసుకున్న చట్టాల కింద ఈ పార్టీలను, సంఘాలను నిషేధించాయి. అమెరికా కూడా వీటిని నిషేధించింది. ఈ నిషేధాలు పని చేయకపోవడం, అణచివేత సాధ్యం కాకపోవడంతో కేంద్రం చివరకు మావోయిస్టు పార్టీపై 2009 ఆగస్టునుంచి ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ పేరిట పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నది.
విప్లవ కారుల ఆచూకీ కనుగొనడానికి కేంద్రం మానవ రహిత యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. యుద్ధ తంత్రంలో మిలటరీ అధికారులచేత పారామిలటరీ బలగాలకు, పోలీసులకు శిక్షణ అందిస్తున్నది. అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. యుద్ధభూమి ప్రాంతాల్లో ప్రజల కదలికల్ని దిగ్బంధనం చేస్తున్నది. ఈ గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ను దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలనే వ్యూహంలో భాగంగానే రాష్ట్రాల అధికారాలను కూడా హరింప చేసి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్‌సీటీసీ అనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అణచివేత కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
నక్సలైట్ల ప్రభావిత రాష్ట్రాలలో వారి చర్యల్ని అణచివేయడానికి కొన్ని రాష్ట్రాలు సరైన చర్యల్ని తీసుకోవడం లేదని కేంద్ర హోమ్ మంత్రి పి.చిదంబరం ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. ఎన్‌సీటీసీ ఏర్పాటుపై ముఖ్యమంత్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించమని చిదంబరాన్ని ఆదేశించారు. ఆ మేరకు ఎన్‌సీటీసీ ఏర్పాటును వాయిదా వేసి, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో మార్చి 12న సమావేశం ఏర్పాటు చేయించారు. ఆ తరువాతనే ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుందని చిదంబరం ప్రకటించారు.
చర్చల సారాంశం ఎలా ఉన్నప్పటికీ ఎన్‌సీటీసీ ఏర్పాటు, ఉప చట్టం రెండూ రాజ్యాంగ విరుద్ధం కనుక అవి చెల్లవు. నక్సలైట్ల అణచివేతకు కేంద్ర ప్రభుత్వం గిరిజనులతో సరిహద్దు సైనిక బెటాలియన్లను కూడా ఏర్పాటు చేస్తున్నది. అంతేకాక, ఉగ్రవాదం అణచివేత సాకుతో నక్సలైట్లను అణచివేసేందుకు భారత మిలటరీ దళాలకు శిక్షణ ఇస్తూ అమెరికా మిలటరీ బలగాలు దేశంలో తిష్ఠ వేశాయి. అమెరికా నేర పరిశోధక సంస్థ (ఎఫ్‌బిఐ), గూఢచారి సంస్థ (సీఐఏ) భారత్‌లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. నక్సలైట్లు దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదు. కనుకనే ప్రజలనుంచి గ్రీన్‌హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది.
Surya News Paper Dated : 10/03/2012
No comments:
Post a Comment