Monday, March 12, 2012

బడుగుల బాధలపై చర్చలేవీ? - డా. కత్తి పద్మారావు



పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చర్చలు ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈనాటి బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు దూషణ భూషణలతో కాలం గడుస్తుంది. ఇద్దరూ తమ సామాజిక వర్గాలకు ప్రతినిధులు మాత్రమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో పెద్దపీట వేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి తను కాక 13 మంది రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న వారిలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వారు మీరు దొంగలంటే మీరు దొంగలని మాట్లాడుకుంటున్నారు. 

నిజానికి వీరిద్దరూ అత్యల్ప సంఖ్యాకులకు ప్రతినిధులు. ఒకరు 3 శాతం కాగా మరొకరు 6 శాతం జనాభాకి ప్రతినిధులు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉన్నారు. ఎస్సీలు 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక కోటి ఇరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు. అలాగే ఎస్టీలు యాబై లక్షల ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు. శాసనమండలిలో కానీ శాసన సభలో కానీ అరవై మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు. అయితే బీసీల సమస్యలు గాని, ఎస్సీ, ఎస్టీల సమస్యలు గాని మాట్లాడే అవకాశం వీరికి రావట్లేదు. ఒకవేళ మాట్లాడే అవకాశం ఇస్తే పార్టీ గొప్పలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఇస్తారు. 

బీసీల విషయానికి వస్తే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయం కాని, స్కాలర్‌షిప్ విషయం కాని, వృత్తులు కూలిపోతున్న విషయం కాని, చర్చకు రాలేదు. ఎస్టీల విషయంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాల్లోని సహజ వనరులపై సంపూర్ణ హక్కులు గిరిజనులవే. 1995లో బమారియా కమిషన్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే 50 శాతం యాజమాన్య హక్కులు వారికే చెందాలి. 20 శాతం భూమి సొంత దారులకు 30 శాతం భూమి పెట్టుబడిదారులకు ఇవ్వాలని కమిషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది. 

గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న రెడ్డి, కమ్మ ప్రభుత్వాలు ఈ ప్రస్తావన అసెంబ్లీలో రాకుండా చూస్తున్నాయి. బీసీలకు ఎస్సీలకు, సంబంధించి అగ్రకులాల ప్రతినిధులే సంస్కర్తల్లా మాట్లాడుతున్నారు. 2,760 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించి 265 కోట్లు అందులో స్వాహా చేసినట్టు రుజువైనా రెండు పక్షాలు కలిసి ఆ చర్చను దాటవేశాయి. ఇక ఎస్సీల విషయానికి వస్తే రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 (14)లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక మార్గదర్శకాలు కల్పించబడ్డాయి. 

1980లో దళితుల సామాజిక, ఆర్ధికాభివృద్ధి కోసం షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ దీనికిచ్చిన గైడ్‌లైన్‌ను బట్టి ఆయా రాష్ట్రాల్లో దళితుల జనాభా నిష్పత్తిని బట్టి ప్లాన్ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగాలి. అయితే మన రాష్ట్రంలో గడచిన 19 సంవత్సరాల్లో రూ.16,912,91 కోట్ల నిధులు ఎస్సీలవి 5 వేల కోట్లు ఎస్టీలవి దారి మళ్లించబడ్డాయి. ఎస్సీ, ఎస్టీల్లో భూమి లేని వారికి భూమి కొనివ్వడానికి ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు లింకు రోడ్లు, గృహ వసతి, తాగునీరు, మురుగు కాల్వల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మించాలి. 

కాని ఇవేవి చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు దారి మళ్లించినందుకు వీరిని రాజ్యాంగం ప్రకారం శిక్షించవచ్చు. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించటం అన్నిటి కంటే పెద్ద నేరం. గడిచిన 50 సంవత్సరాల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు సాధారణ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ ఆరుగురు మాత్రమే గెలిచారు. ఇక రాజ్యసభ విషయానికి వస్తే 148 రాజ్యసభ సభ్యత్వంలో 14 మాత్రమే వీరికి లభించాయి. అంతేకాకుండా మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఉన్న ఆర్థిక, రెవెన్యూ, హోమ్ వంటివి ఎప్పుడోగాని లభించడం లేదు. ఇక మైనార్టీలకు వస్తే గత పన్నెండు ఎన్నికల్లో మొత్తం కలిపి 3.83 శాతం ప్రాతినిధ్యం పొందగలిగారు. 

రాజ్యాంగ రక్షణలున్న ఎస్సీ, ఎస్టీల సంగతి ఇలా ఉంటే బీసీల సంగతి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా బలహీనవర్గాల పూర్తి భాగస్వామ్యం లేని ప్రభుత్వాలు, బలహీనవర్గాలని ఏదో ఒక విధంగా రాజకీయంగా అణచివేసిన ప్రభుత్వాలే అన్నది గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన అన్ని ఎన్నికలలో ఎన్నికల ముందు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని చెబుతూనే టికెట్ల పంపిణీలో మొండిచెయ్యి చూపించి మోసగించడం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియగా ఉంటూ వచ్చింది. చివరకు అసెంబ్లీలో కూడా బీసీల సమస్యల మీద మాట్లాడనివ్వలేదు. కొన్ని జిల్లాలైతే బీసీల ప్రాతినిధ్యాన్ని మరింత తగ్గిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 

గత పదకొండు ఎన్నికల్లో 186 మంది అభ్యర్థుల్లో 82.25 శాతం సీట్లు అనగా 153 మంది రెండు కులాల వారే ఎన్నికయ్యారు. బీసీలు కేవలం 2.68 శాతం మాత్రమే ఎన్నికయ్యారు. అంటే ఐదు సీట్లు మాత్రమే. ముస్లిములయితే 1.61 శాతం మాత్రమే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ మూడు పాలక కులాలకే పెద్దపీట వేశారు. గుంటూరు జిల్లాలో 4 పార్లమెంటు నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత పదకొండు ఎన్నికలు పరిశీలిస్తే 209 మంది అభ్యర్థులు గెలిచారు. 89 శాతం అంటే 189 మంది అగ్రకులాల వారే గెలిచారు. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను బీసీలకు నామమాత్రంగానైనా సీట్లు ఇవ్వలేదు. 1978లో (ఇతర పార్టీలు) బీసీలకు ఒక సీటు ఇచ్చారు. 1983లో ఒక సీటు ఇచ్చారు. 1985లో (తెలుగుదేశం) ఒక సీటు ఇచ్చారు. 1994లో (తెలుగుదేశం) ఒక సీటు ఇచ్చారు. 1999లో ఇతర పార్టీలు ఒకటి, కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చాయి. 2004లో ఇతర పార్టీలు 1 సీటు ఇచ్చాయి. మొత్తం కలిపి 14 సీట్లు ఇచ్చారు. ఇది 6.7 శాతం అంటే బీసీలకు రావాల్సిన సీట్లు 52 శాతం వుండగా మొత్తంగా పెద్ద ఎత్తున అగ్రకులాలు దురాక్రమణ చేస్తున్నారు. ఆయా పార్టీల్లో బీసీలు తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడలేక పోతున్నారు. నిజానికి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకపోతే మొత్తం రాష్ట్రం మీద 4, 5 సీట్లు కూడా ఇచ్చేవారు కాదని అర్థమవుతుంది. 

ప్రకాశం జిల్లాలో మరీ దారుణం. గడిచిన పదకొండు ఎన్నికల్లో మొత్తం 149 మంది సభ్యులు ఈ జిల్లా నుంచి ఎన్నిక కాగా అందులో 88.59 శాతం (132) అభ్యర్థులు అగ్రకులాలకి ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాలకు చెందినవారు. 7.38 శాతం ఎస్సీలకు రిజర్వుడు నియోజకవర్గాల నుంచి ఎన్నిక కాగా, కేవలం 4.02 శాతం (6) మాత్రమే బీసీల నుంచి ఎన్నికయ్యారు. ఈ విధంగా ప్రతి జిల్లాను పరిశీలస్తే బీసీలు రాజకీయంగా ఈ రెండు పార్టీల చేత నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బడ్జెట్‌లో సుమారు 21 శాతం ఎస్సీలు, ఎస్టీలకు ఇవ్వాలి. సుమారు రూ.30 వేల 450 కోట్లు రావాల్సి ఉంది. కనీసం 30 శాతం బీసీలకు కేటాయించాలి. కాని అలా కేటాయించలేదు. 

అసెంబ్లీలో రెండు కులాల వారే వాదించుకుంటున్నారు. ఆ రెండు కులాల్లో పేదలు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజులు కట్టలేని వారు ఉన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. సిపిఐ, సిపిఎంలో కూడా సీట్లు కమ్మ, రెడ్లకే ఇస్తున్నారు. అంతేకాదు, ఆయా పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్రకులాల బడ్జెట్‌కే మద్దతిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ధనవంతులు రెడ్ల పార్టీ. ఇక టిఆర్ఎస్ వెలమ ఆధిపత్యంలో నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంటా, బయట పోరాటం అవసరం. వీరంతా కలిసి రాజకీయ పార్టీని రూపొందించుకోవడంతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తమ సాధికారత కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. 

ప్రజలు సిగ్గుతో తల వంచుకునే కుంభకోణాల గురించి వ్యక్తిగత సమస్యల గురించి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చట్ట సభల్లోని దళిత, బహుజన ప్రతినిధులు ఇంకా స్వీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించవలసి ఉంది. డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికే అవమానం జరిగినప్పుడు ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో వేయాలనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆ డిమాండ్ కోసం పోరాడటంలో ఐక్యతను ప్రదర్శించాల్సి ఉంది. నిజానికి బడ్జెట్ కేటాయింపుల్లో దళిత, బహుజనులకు జరుగుతున్న అన్యాయం రాజ్యాంగ విరుద్ధమైనది. 

ఈ విషయంగా దళిత, బహుజన మేథావులు సిద్ధపడాలి. పోరాటం, పునర్నిర్మాణం దళితుల బహుజనులకు నిరంతర చర్య. చట్ట సభలను పోరాట కేంద్రాలుగా మార్చాలి. మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు పౌర హక్కులు కేవలం బహిరంగంగా చర్చించేవే కాదు. అవి తప్పక చట్ట సభల్లో ప్రమాణ బద్ధంగా చర్చించబడాలి. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని అందరూ ఒక్కసారి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాతినిధ్యం అంటే వ్యక్తిగత ప్రాతినిధ్యం కాదు. అది తప్పకుండా సామాజిక శ్రేణుల ప్రాతినిధ్యం కావాలి. ఇది అంబేద్కర్ మహాత్మా ఫూలే ఆశయాల ద్వారానే సాధ్యం 

- డా. కత్తి పద్మారావు

Andhra Jyothi News Paper Dated : 14/03/2012 

No comments:

Post a Comment