Wednesday, March 14, 2012

సచార్‌ నివేదిక వచ్చి ఐదేళ్ళయినా...ముస్లింల జీవితాల్లో తొలగని చీకట్లు---మొయినుల్‌ హసన్‌



ముస్లింలు సమస్యలు ఎదుర్కొంటున్న ముఖ్య రంగాల్లో ఉపాధి రంగం ఒకటని సచార్‌ కమిటీ గుర్తించింది. ముస్లింలలో జనాభా-కార్మికుల నిష్పత్తి బాగా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ముస్లింలకు పట్టణాల్లో స్వయం ఉపాధి పథకాల్లో తగిన స్థాయిలో భాగస్వామ్యం కల్పించడం లేదు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మహిళలు ఇంటివద్దనే పనులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆస్తులు, నైపుణ్యం విషయంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కమిటీ పేర్కొంది.
ప్రభుత్వానికి అధికారికంగా ఎటువంటి మతం లేదు. తనకిష్టమైన ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు, అందులోని సిద్ధాంతాలను ఆచరించే హక్కు, బోధించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికీ ఉందని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. భారత రాజ్యాంగం లౌకికతత్వానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. పశ్చిమ దేశాలు ఈ పదాన్ని తమ రాజ్యాంగాల్లో పేర్కొన్నాయి. ఆ దేశాల్లో లౌకికతత్వం చర్చికీ, ప్రభుత్వానికీ మధ్య స్పష్టమైన విభజన తీసుకొచ్చింది. మన దేశంలో సెక్యులరిజం బీజాలను దేశ విభజనకు ముందే వేసినప్పటికీ భారత రాజ్యాంగంలో లౌకికతత్వం అనే పదాన్ని ఏ లక్ష్యంతోనైతే చేర్చారో అది నెరవేరలేదు. మన దేశంలో మైనారిటీలు దీర్ఘకాలంగా దయనీయ స్థితిలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చి సుమారు ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ వారి పరిస్థితిలో మార్పు రాలేదు.
భారతదేశ మొత్తం జనాభాలో మైనారిటీ మతస్థులు 18.4 శాతం ఉన్నారు. 2001 జనగణన ప్రకారం వారి సంఖ్య 18.95 కోట్లు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలే. వీరు మైనారిటీ జనాభాలో 72.8 శాతం ఉన్నారు. భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల సంఖ్య 13.4 శాతం, అంటే సుమారు 14 కోట్లు.
ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు 2005లో జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఏర్పాటు ఆహ్వానించతగ్గ పరిణామమే. అయితే దురదృష్టవశాత్తు ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం, సాహసం కొరవడ్డాయి. ప్రభుత్వానికి శాసనపరమైన, విధానపరమైన సూచనలు చేసేందుకు, ముఖ్యంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మైనారిటీ గ్రూపుల హక్కులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2004లో జాతీయ సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
మైనారిటీల దుస్థితి
విద్యారంగంలో, జీవనోపాధి, ప్రజాసేవల అందుబాటు విషయంలో మెజారిటీ ముస్లింలు వెనకబడి ఉన్న విషయాన్ని సచార్‌ కమిటీ దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. పాఠశాలలో చేరే ముస్లిం విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉందని, మధ్యలో మానివేసే వారి సంఖ్య (డ్రాపౌట్లలో) ఎక్కువగా ఉందని మరీ ముఖ్యంగా మహిళల కంటే పురుషుల విషయంలో ఇది ఎక్కువగా ఉందని కమిటీ తెలిపింది. విద్యారంగంలో ముస్లింలు అభివృద్ధి చెందడంలో పేదరికం ప్రధాన అడ్డంకిగా ఉంది. కుటుంబంలోని పిల్లలు తమ కుటుంబాలకు సహాయపడాల్సి రావడంతో వారు పాఠశాలకు వెళ్లడానికి సహజంగానే ద్వితీయ ప్రాధాన్యత లభిస్తోంది.
ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో మంచి నాణ్యతాప్రమాణాలు గల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లు, బాలికల పాఠశాలలు తక్కువ సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం వంటి ఇతర సమస్యలున్నాయి. ముస్లింలలో అక్షరాస్యతా శాతం 59 ఉంది. వీరిలో నాలుగు శాతం మందికి మాత్రమే ఉన్నత విద్య అందుబాటులో ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు ఏడు శాతం ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న సుమారు 40 శాతం గ్రామాల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. జనాభాలో కార్మికుల సంఖ్య మరి ఏ ఇతర సెక్షన్ల కంటే ముస్లింలలో తక్కువగా ఉంది. ముస్లింలలో అత్యధికులు స్వయం ఉపాధిలో ఉన్నారు.
ఇటీవల ఆర్థిక సంస్కరణలు చేనేత, మరమగ్గాలు, పట్టు పరిశ్రమ వంటి సంప్రదాయ ముస్లిం వృత్తుల పాలిట మరణశాసనంగా మారాయి. ముస్లిం మహిళలకు తక్కువే అయినప్పటికీ నిలకడగా ఆదాయం కల్పించిన కుట్లు, అల్లికలు, జరీ వంటి కుటీర పరిశ్రమలు నేడు ఉనికిని కాపాడుకోవడానికి తంటాలుపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో ముస్లింల వాటా వరుసగా 23 శాతం, 6.5 శాతంగా ఉన్నాయి. ఇవి షెడ్యూల్డ్‌ కులాలు(39 శాతం), షెడ్యూల్డ్‌ తెగలు (9.5 శాతం) కంటే కూడా బాగా తక్కువగా ఉన్నాయి. ముస్లింల సగటు జీతం కూడా బాగా తక్కువగా ఉంది. బ్యాంకు రుణాలు కూడా ముస్లింలకు అందుబాటులో ఉండేది చాలా తక్కువ.
పన్నెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో మైనారిటీల అభివృద్ధికి తగిన మొత్తంలో నిధులు కేటాయించాలని పార్లమెంటు సభ్యుల బృందం ఇటీవల ప్రధానిని కలసి డిమాండ్‌ చేసింది. నిధుల కొరత ఉండబోదని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. మైనారిటీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను నివారించి వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు జాతీయ సలహా మండలి (ఎన్‌ఎసి) 2011 నవంబర్‌లో కొన్ని సిఫార్సులు చేసింది. మైనారిటీల సంక్షేమానికి ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, సర్వతో ముఖాభివృద్ధి వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను మెరుగుపరిచేందుకు కమిటీ సిఫార్సులు చేసింది.
ఎందుకూ కొరగాని జోక్యాలు
జస్టిస్‌ సచార్‌ కమిటీ నివేదిక సమర్పించి ఐదు సంవత్సరాలు గడిచాయి. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది. మైనారిటీల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ముస్లింల పట్ల ప్రభుత్వం ఇప్పటికీ మొండిచేయి చూపుతూనే ఉంది. మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాల్లో సృజనాత్మకత, స్పష్టత కొరవడుతోంది. విద్య, ఆర్థిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముస్లిం ప్రజలకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను గుర్తించి, పరిష్కరించేవిగా ఎంతమాత్రం లేవు. ప్రజాసేవల అందుబాటులో ఎదురవుతున్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేవిగా ఈ సంక్షేమ పథకాలు లేవు. కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ నుండి ఈ పథకాలను అమలుచేసే జిల్లాస్థాయీ అధికారుల వరకు వ్యవస్థాగత యంత్రాంగంలోనూ స్పష్టత కొరవడింది. సామాజిక- ఆర్థిక వివక్షతలపై నేరుగా పోరాటం చేసే విషయంలో కూడా స్పష్టమైన పథనిర్దేశం కొరవడింది. నిరాదరణకు గురవుతున్న సెక్షన్ల సామాజిక- ఆర్థిక వివక్షతలను అంతమొందించగలిగినట్లు చెప్పుకుంటున్నప్పటికీ ముస్లిం సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులు దారుణమైన స్థాయిలో అత్యంత తక్కువగా ఉన్నాయి. 2010-11 బడ్జెట్‌లో తలసరి వనరుల కేటాయింపు రు.797 మాత్రమే. ఎస్‌టిలు(రు1,521), ఎస్‌సిలు(రు.1,228) కంటే బాగా తక్కువగా ఉంది.
దేశ జనాభాలో ముస్లింలతోసహా ముస్లిం మతస్థుల వాటా 18.4 శాతం ఉన్నప్పటికీ వారికి ఉద్దేశించిన పథకాలకు చేస్తున్న కేటాయింపులు మొత్తం ప్రణాళికా కేటాయింపులో ఐదు శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మైనారిటీ వ్యవహారాల శాఖకు 2010-11లో రు. 2,600 కోట్లు కేటాయించారు. బహుళ రంగ అభివృద్ధి కార్యక్రమానికి (ఎంఎస్‌డిపి) చేసిన కేటాయింపులు కూడా ఇందులో ఉన్నాయి. ముస్లిం జనాభా అధికంగా నివసించే జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఈ కేటాయించిన నిధుల్లో కూడా అధికమొత్తం వినియోగానికి నోచుకోవడం లేదు. 2010-11లో కేటాయించిన మొత్తంలో 22 శాతం మొత్తాన్ని మాత్రమే మూడవ త్రైమాసికం మధ్యవరకు వినియోగించారు. కార్యక్రమాల రూపకల్పన సజావుగా లేకపోవడం, అమలు చేసే యంత్రాంగం బలహీనంగా ఉండటం ఇందుకు కారణం. సచార్‌ కమిటీ వెల్లడించిన అంశాలకు ప్రతిస్పందనగా మొత్తం జనాభాలో ముస్లింల సంఖ్య 25, అంతకంటే అధిక శాతం ఉన్న 90 జిల్లాలను ఎంఎస్‌డిపి గుర్తించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని ఈ జిల్లాల్లోని అధికారులను ఆదేశించారు. అయితే ఇందులోనూ తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. ముస్లింలు అధిక సంఖ్యలో గల గ్రామాలు, శివారు ప్రాంతాలు లేదా సెటిల్మెంట్‌ స్థావరాలుగానే ఉంటున్నాయి. స్వల్ప మొత్తంలో మాత్రమే నిధులు కేటాయించడం సంగతి అటుంచి ఎంపిక చేసిన కార్యక్రమాలు ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అమలు కావడం లేదు. ముస్లింలకు ఇందువల్ల ఒనగూరుతున్న ప్రయోజనం కూడా ఏమీ ఉండటం లేదు.
ఉపాధి, విద్య
ముస్లింలు సమస్యలు ఎదుర్కొంటున్న ముఖ్య రంగాల్లో ఉపాధి రంగం ఒకటని సచార్‌ కమిటీ గుర్తించింది. ముస్లింలలో జనాభా-కార్మికుల నిష్పత్తి బాగా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ముస్లింలకు పట్టణాల్లో స్వయం ఉపాధి పథకాల్లో తగిన స్థాయిలో భాగస్వామ్యం కల్పించడం లేదు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మహిళలు ఇంటివద్దనే పనులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆస్తులు, నైపుణ్యం విషయంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కమిటీ పేర్కొంది. వారికి ఉపాధి, రుణ సదుపాయాలు సక్రమంగా లభించడం లేదని తెలిపింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచి ఉద్యోగాలు కల్పించడం పదిహేను పాయింట్ల కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంది. వారికి రుణ సదుపాయాలను అధికం చేయడం, ముస్లిం యువకులకు నైపుణ్యం పెంపొందించుకునే అవకాశాలు మెరుగుపరచడం మరో ముఖ్యాంశం. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్‌ యోజన కింద దక్షిణ 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్‌), దర్భాంగ (బీహార్‌) జిల్లాలకు చేసిన కేటాయింపులు వరుసగా రెండు, నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే. ఈ జిల్లాల్లో బిపిఎల్‌ కుటుంబాలు వరుసగా సుమారు లక్షన్నర, ఎనభై వేలు ఉన్నాయి. ఉదాహరణకు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద మైనార్టీలకు 10,110 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. జిల్లాలో ఉన్న మైనారిటీ జాబ్‌ కార్డులు గలవారి సంఖ్య 2.2 లక్షలు. కాగా, ఈ పథకం కింద ఎస్‌సిలు, ఎస్‌టిలకు మొత్తం ఉపాధి అవకాశాల్లో 50 శాతం కల్పిస్తున్నారు. బిపిఎల్‌ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండానే ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిధుల కేటాయింపు పేలవంగా ఉండటం, నిధుల వినియోగంలో లోపాలు, పథకాల రూపకల్పనలో లోపాలు, ముస్లింల అవసరాలను తీర్చేలా లేని కార్యక్రమాలు రూపొందించడం ముస్లింల సమస్యలు అపరిష్కృతంగా మిగలడానికి కారణాలుగా భావిస్తున్నారు. వీటితోపాటు కార్యక్రమాలను, పథకాలను అమలు చేసే యంత్రాంగాలు కూడా బలహీనంగా, లోపభూయిష్టంగా ఉండటం కూడా ఇందుకు కారణం. 2011లో ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) అనే ప్రాథమిక విద్యా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దేశంలో ప్రాథమిక విద్య గణనీయంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేసింది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా 89 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలు ఈ పాఠశాలల్లో చేరేది చాలా తక్కువ. ముస్లింలలో అక్షరాస్యతా శాతం ఎస్‌సి, ఎస్‌టి మినహా ఇతర నిరాదరణకు గురవుతున్న వారితో పోల్చితే పదకొండు శాతం తక్కువగా ఉందని సచార్‌ కమిటీ అంచనా వేసింది. ముస్లింలలో అక్షరాస్యతా శాతం పెంచే కార్యక్రమం ఇతర గ్రూపులతో సమాన వేగంగా అమలు కావడం లేదు. పాఠశాలలకు అసలు వెళ్లని లేదా మధ్యలో మానివేసే ముస్లింల శాతం ఇతర సెక్షన్లవారిలో కంటే అధికంగా ఉంటోంది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల సంఖ్య కూడా బాగా తక్కువ. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాల సైతం లేని గ్రామాల సంఖ్య వెయ్యికి పైనే ఉందని సచార్‌ కమిటీ పేర్కొంది.


-మొయినుల్‌ హసన్‌
Prajashakti News Paper Dated 13/03/2012 

No comments:

Post a Comment