ఆకాశంలో మేము సగం అని స్త్రీలు చెప్పుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. నవనాగరిక సమాజంగా చెప్పబడుతున్న 21వ శతాబ్దం గర్భంలోనే స్త్రీ పుట్టుకను అడ్డుకుంటున్నది. తల్లిగా, చెల్లిగా, జీవిత భాగస్వామిగా కీర్తింపబడుతున్న స్త్రీ జాతిని అంతమొందించడానికి ఈ సమాజం నిరంతరం ఆరాటపడుతుంది. వైవిధ్యమైన భారతీయ సమాజం బాలికల పట్ల వివక్ష చూపడంలో సమానత్వాన్ని పాటిస్తున్నది.అభివృద్ధి చెందిన, వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాల మధ్య గ్రామీణ, పట్టణ, కుల, మత వర్గాల మధ్య సైతం స్త్రీ, పురుషుల నిష్పత్తిలో వ్యత్యాసం కనిపించడం లేదు.
2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల భారతీయులలో 62 కోట్ల 37 లక్షల మంది పురుషులుండగా 5 కోట్ల 64 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అంటే ప్రతి వెయ్యిమంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారన్న మాట. 2001లో 933గా ఉన్న స్త్రీల నిష్పత్తి నేడు మెరుగుపడిందని మినుకు మినుకుమంటున్న ఆశ. కానీ ఈ సంఖ్య దేశంలోని ప్రజల జీవన ప్రమాణం పెరిగిన విషయాన్ని మాత్రమే సూచిస్తున్నది తప్ప, స్త్రీల సంఖ్య పెరిగింది అన్నది కాదు. పిల్లల విషయానికి వస్తే 0-6 సంవత్సరాల వయస్సు గల బాలికల సంఖ్య తగ్గిపోతోంది. 1991 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది బాలురకు 945 మంది బాలికలు ఉండగా 2001లో 927, 2011 నాటికి 914తగ్గిపోయింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది.
ఆడపిల్లలంటే మైనస్‌గానూ, మగ పిల్లలంటే ప్లస్‌గా మాట్లాడుకుంటున్న సమాజంలో మనం జీవిస్తున్నాం. అమ్మాయిల్ని పెంచడం దగ్గర్నుండి పెళ్లి చేసి పంపించేంత వరకు వ్యయవూపయాసలతో కూడిందని అనుకుంటున్నారు. అదే అబ్బాయిలైతే చదువు పూర్తికాగానే ఉద్యోగం చేస్తూ సంపాదిస్తారని, వాళ్ల పెళ్లి సందర్భాలలో కట్న కానుకల రూపంలో డబ్బులు చేజిక్కించుకోవచ్చనే అన్న భావన చాలా మంది తల్లిదంవూడులలో పెరిగిపోతున్నది. ఈ విధమైన కారణాల వల్ల ఆడపిల్లలను కనడానికి ముందుకు రావడం లేదన్నది గణాంకాలు చెబుతున్న చేదు నిజం. స్త్రీలపై జరుగుతున్న మానసిక, శారీరక దాడులపై తక్షణమే స్పందించి కఠిన శిక్షలు అమలు చేయకపోతే మునుముందు పరిస్థితి దారుణంగా మారుతుంది.
దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి అగాధాన్ని సృష్టిస్తున్నది.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో స్త్రీల నిష్పత్తి ఎక్కువగానే ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం 97మంది స్త్రీలు ఉండగా 2011 నాటికి 992కు పెరిగింది. కానీ 2001 జనాభా లెక్కల ప్రకారం 0-6 సంవత్సరాల వయస్సులోని ప్రతి వెయ్యిమంది బాలురకు 961 మంది బాలికలుండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 943కుతగ్గిపోయింది. 2001 జనాభాతో పోలిస్తే బాలికల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నది. 11 జిల్లాల్లో బాలికల సంఖ్య రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్నది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు మానవ సమాజ పురోగమనంతో పాటు లింగ వివక్ష పెరగడానికి సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా వచ్చి న యంత్రాలను దుర్వినియోగపరుస్తున్నారు.
దీనికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని అమలు పరచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. జనాభా పెరుగుదలను అరికట్టడానికి 1971లో అబార్షన్‌ను చట్టబద్దం చేశారు. ఇది స్త్రీల శారీరక హింసకు, దోపిడీకి దారి తీస్తుంది. లింగ నిర్ధారణ పరీక్షలురావడంతో దేశంలో అబార్షన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. 197లో మహారాష్ట్ర ప్రభు త్వం లింగవివక్షతో కూడిన అబార్షన్లను నిషేధి స్తూ చట్టాన్ని చేసింది. 1994లో కేంద్ర ప్రభు త్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించింది. దీన్ని దేశవ్యాప్తంగా పటిష్టంగా అమలుపర్చడానికి 2003లో PNDT Pre-conception and pre-natal diagonstic Techniques (Prohibition of sex and selection) Actను తెచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ 312, 313 సెక్షన్ల ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జీవితఖైదు శిక్షను విధించవచ్చు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభు త్వం విఫలం అయ్యింది. ఫలితంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం బాలికల సంరక్షణను బాధ్యతగా తీసుకోకపోతే భవిష్యత్తులో స్త్రీ, పురుషుల నిష్పత్తి ప్రశ్నార్థంగా మారుతుంది. వరకట్న నిషేధం కాదు, ప్రభుత్వమే అమ్మాయి పెళ్లి ఖర్చులను భరించి వరకట్నం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో ఉన్న ఈ వివక్షను రూపుమాపకపోతే బాలికల సంఖ్య మరింతగా క్షీణిస్తుంది. పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు బాలిక చదువు, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే చూసుకోవాలి. దీని కోసం ఒక పథకాన్ని అమలు చేయాలి. సామాజిక, ఆర్థిక, అంతస్తులతో సంబం ధం లేకుండా ప్రతి బాలిక చదువులకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నామమావూతంగా ప్రవేశపెట్టిన బాలిక సంరక్షణ పథకం, ధనలక్ష్మి పథకాలు లింగ వివక్షను అరికట్టలేకపోతున్నాయి. దీనికోసం జాతీయస్థాయిలో ఒక ప్రణాళికను రూపొందించి దాన్ని అమలు చేయాలి. లేకపోతే భారతీయ సమాజంలో మహిళల మనుగడ ప్రశ్నార్థంగా మారుతుంది.
-డి. కల్పనకుమారి
డెవలప్‌మెంట్ వర్కర్, ఆక్షన్ ఎయిడ్
(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Namasete Telangana News Paper Dated 08/03/2012
No comments:
Post a Comment