Saturday, March 24, 2012

ఒక యోధుడి విషాద నిష్క్రమణ--డాక్టర్ సి. కాశీంచాలా రోజుల తర్వాత ఈ మధ్య ఒక మిత్రుడు కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా మాటల్లో సాంబశివుని ప్రస్తావన కూడా వచ్చిం ది. ఒకప్పుడు నా మిత్రుడు బీజేపీ రాజకీయాలతో ఉన్నాడు. శాంతి చర్చల సందర్భంలో (2005) సాంబశివుడు ఈ మిత్రుడి గ్రామానికి వచ్చాడట. అమెరికన్ సామావూజ్యవాదం, బీజేపీ మతోన్మాదం ప్రజలకు ఏవిధంగా శత్రువులయ్యాయో ప్రజల సమక్షంలో గంటసేపు ఉపన్యాసించి దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వ్యతిరేకమైన ఆ పార్టీలో పనిచేయటమంటే ప్రజల వ్యతిరేక వర్గంలో ఉండటమేనని చెప్పాడట. సాంబశివుడి ఉపన్యాస ప్రభావంతో ఆ మిత్రుడు బీజేపీని వదిలిపెట్టి నీతి, నిజాయితీగా తన కులవృత్తి (వవూడంగి) పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు ఒక ఉపన్యాసంతో ఎన్ని రకాలుగా ప్రభావితం చేశాడో తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. తన ఆచరణతో, చెదరని చిరునవ్వు పలకరింపుతో, ప్రజలపట్ల ఉండే నిబద్ధత తో, వర్గశవూతువు పట్ల ఉండే కసితో రెండు దశాబ్దాలు తెలుగునేలపై చెరగని సంతకం చేశాడు.

మందెంట పోయేటి యలమందను మహోన్నత నాయకుడిగా ఎదిగించిన విప్లవోద్యమానికి సాంబశివుడే సాక్ష్యం. నాగజెముళ్ళ బృందావనంలో విరబూసిన విప్లవ మందా రం. అతడు నడిచినంత మేర విప్లవాన్ని వెదజల్లాడు. నెర్రె లు పారిన కరువు నేలలో నాగళ్ళతో సంభాషించాడు.రజాకార్లతో రణం చేసిన ఎర్రగుండె నల్లగొండలో కళ్ళు తెరిచి పాలమూరు పోరుకేకయ్యాడు. శత్రువు నీడలా వెంటాడుతుంటే ప్రజాక్షేవూతంలో ఉండి యుద్ధం చేశాడు. చెంచులను దోపిడీ చేస్తు జంగ్లాత్‌గాళ్ళను తరిమికొట్టి అడవి బిడ్డలకు అండగా నిలబడ్డాడు. వలసపోతున్న జీవితాలకు కాసింత నమ్మకాన్ని ఇచ్చాడు. తెలుగు నేలపై విశేష ప్రభావాన్ని వేసి న అతికొద్ది మంది విప్లవకారులలో సాంబశివుడు ఒకరు. 
సాంబశివుడు నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని దాసిడ్డిగూడెంలో పుట్టాడు. కునపురి చంద్రయ్య, లక్ష్మమ్మలకు పుట్టిన మొదటి సంతానం. కడు పేదరికం. నోరులేని జీవాలను నమ్ముకొని బతికిన కుటుంబం. కన్నీళ్ళను కతికి, బతుకు చితికిన బాల్యం దొరగడీలో జీతమున్నది. చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత గొంగడి భుజానికెక్కింది. గొర్లమందకు, మేకల దొడ్డికి దొరైపోయాడు. ఐదవ తరగతిలో ఆగిన చదువును కొనసాగించాలని చాలా తపించాడు. కానీ పేదరికం అతన్ని వెక్కిరించింది. 
సరిగ్గా ఈ సమయంలో దాసిడ్డిగూడెంకు చెందిన శ్యామల కిష్టయ్య భువనగిరి డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. రాడికల్ రాజకీయాలతో ప్రభావితుడయ్యాడు. ఈ రాజకీయాలను కిష్టయ్య దాసిడ్డిగూడెం మోసుకొచ్చాడు. కిష్టయ్య, ఐలయ్య ఇద్దరు చెలికాండ్రు. శ్యామల కిష్టయ్య తెచ్చిన రాజకీయాల ప్రభావంతో విప్లవం కోసం పూర్తికాలం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. రైతుకూలి సంఘం పెట్టి, దానికి నాయకత్వం వహించి అనేక పోరాటాలు నడిపాడు. క్రమంగా 90వ దశకం లో ఉండిన విప్లవాల వెల్లువ ఐలయ్యను మరింత పదునెక్కించింది. 
వరంగల్ రైతుకూలి సంఘం మహాసభలు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. మేకల దామోదర్‌డ్డి (సంజీవ్), బాబన్న ప్రభావంతో ఉన్న ఊరును, కన్నతల్లిని వదిలి కోట్లాది తల్లుల విముక్తి కోసం ప్రయాణమయ్యాడు. అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగాడు. ప్రేమించాల్చిన వాళ్ళను అధికంగా ప్రేమించి, ద్వేషించాల్సిన వర్గ శత్రువును అంతకంటే అధికంగా ద్వేషించే సైద్ధాంతిక పటుత్వాన్ని అలవర్చుకున్నాడు. ఎదుటి వ్యక్తు లు చెప్పే విషయాలను ఓపికగా వినటం అతడికి అలవాటు. కనుకనే మంచి నాయకుడుగా మారాడు. క్యాడర్‌లో ఉండే నైపుణ్యాలను, శక్తులను బట్టి ప్రోత్సహించేవా డు. సూర్యం, ఆర్.కె మాధవ్‌లతో కలిసి పనిచేయటం వల్ల విప్లవ నాయకత్వ లక్షణాలు ఒంటపట్టాయి.
ఐలయ్య రామన్నగా, సుధాకర్‌గా, పనిచేస్తూ సాంబశివుడిగా పరిణామం చెంది పాలమూరు జిల్లాలో పనిచేయటంలోనే అతడి రాజకీయ జీవితం విశాలమైంది. సాంబశివుడి వారసత్వాన్ని తలకెత్తుకోవటం వల్ల ప్రజలకు సాంబశివుడుగా ప్రేమ పాత్రుడయ్యాడు. పాలమూరు జిల్లా కొల్లాపూర్ తాలూకాలోని చుక్కాయిపల్లిలో అంటరాని పూరి గుడిసెలో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికెన పుల్ల తీసుకొని దరువేసిన మనిషే సాంబశివుడు. అంటరాని పెను మంటను ఆర్పడానికి విప్లవాన్ని కౌగిలించుకున్న మాదిగ బిడ్డ పేరే సాంబశివుడు. కునపురి ఐలయ్య పాలమూరుకు రాకమునుపు ఈ జిల్లా విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిపేరు సాంబశివుడు పభాకర్). ఈ పేరు ప్రజలకు ఎంత ప్రేమనో, శత్రువుకు అంత భయం. పాలమూరు విప్లవోద్యమానికి సుదర్శన్‌డ్డి జీవంపోస్తే సాంబశివుడు విస్తరిం పచేశాడు. మాధవ్ అద్భుతమైన నిర్మాణం చేశాడు. విప్లవోద్యమ అవసరాల రీత్యా లింగమూ ర్తి, రమేశ్‌తో కలిసి కృష్ణానది దాటుతుండగా పుట్టి మునిగి సాంబశివుడు 2001లో అమరుడయ్యాడు. సాంబశివుడు అమరత్వం తర్వాత పాలమూరు జిల్లా విప్లవోద్యమ నాయకత్వ బాధ్యతలను కునపురి ఐలయ్య (సుధాకర్) చేపట్టాడు. ఇక్కడి నుంచి ఐలయ్య సాంబశివుడయ్యాడు.

సాంబశివుడి పేరుతో పాలమూరు మీద వేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావాన్ని తర్వాత కాలంలో సాంబశివుడిగా మారిన ఐలయ్య విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చేవరకు కొనసాగించాడు. ఎందరికో గుండె ధైర్యం చెప్పిన అతనికి ఎందుకు గుండె జారిదో తెలియదు. కానీ సేఫ్ జోన్‌లోకి వెళ్ళి తిరిగివచ్చాడు. కానీ రాజ్యానికి విప్లవోద్యమ రహస్యాలు చెప్పకుండా ఉద్యమం పట్ల కృతజ్ఞతను ప్రదర్శించాడు. అట్లే ఉద్యమానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. పైగా విప్లవోద్యమం గొప్పతనాన్ని పొగిడాడు. ఉద్యమంలో ఉండగా తాను చేసిన ప్రతి రాజకీయ చర్య సరైనదేనని ప్రకటించాడు. విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చాక చాలా మందిలాగా వ్యక్తిగత జీవితంలో ముడుచుకొని ఉండలేకపోయాడు. చలనశీలమైన తన స్వభావాన్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా వ్యక్తం చేశాడు. బూర్జువా అధికార రాజకీయాల కోసం పనిచేస్తున్నప్పుడు సహజంగానే పాత, కొత్త శత్రువులు ఏకమవుతారనే స్పృహను మర్చినట్లున్నాడు. 

ప్రత్యామ్నాయ రాజకీయాలలో నాయకుడిగా ఉండి వర్గ శత్రు వు నిర్మూలనలో భాగమైన వ్యక్తిని ఈ పాలకవర్గాలు వదిలిపెడ్తామని భావించటంలోనే విషాదమున్నది. శ్రీ కృష్ణ కమిటీ వ చాప్టర్‌లో భాగమై న, రాజ్య ప్రేరిత ప్రైవేటు గూండాలు చేసినా.. ఇది రాజ్యం చేసిన హత్యనే. యోధుడిలా తెలుగు నేలపై తిరగాడిన సాంబశివుడి విషాద నిష్క్రమణ జీర్ణించుకోలేనిదే. అయినా అతని విప్లవ స్వప్నం, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చే దారిలో మనందరం నడవటమే అతనికి మనమిచ్చే నివాళి. విప్లవోద్యమంలో పనిచేసి బయటికి వచ్చి ఉద్యమంపై బురద చల్లి, అనారోగ్యాలతో మరణించిన కొందరి సంస్మరణ సభల పేరిట విప్లవోద్యమం మీద దాడి చేస్తున్న ఈ సందర్భంలో విప్లవోద్యమం పట్ల సాంబశివుడు చూపిన విజ్ఞత, నిబద్ధత మనకు ఆదర్శం కావాలి. 

-డాక్టర్ సి. కాశీం 
(రేపు సాంబశివుడి ప్రథమ వర్ధంతి)
Namasete Telangana News Paper Dated : 25/03/2012 

No comments:

Post a Comment