Tuesday, September 6, 2011

జన లోక్‌పాల్‌లో జనులెవ్వరు? - ఎం. చెన్న బసవయ్య, డి.రవీందర్, ఎస్.మల్లేష్ Andhra Jyothi,06.09.2011


జన లోక్‌పాల్‌లో జనులెవ్వరు?
- ఎం. చెన్న బసవయ్య, డి.రవీందర్, ఎస్.మల్లేష్

భారత ప్రజాస్వామ్యంలో లోక్‌పాల్ వ్యవస్థ ఒకటి ఉండాలని నాలుగైదు దశాబ్దాల నుంచి ఒక డిమాండ్ కొనసాగుతూ వస్తూన్నది. ఇటీవల పలు పౌర సమాజ గ్రూపులు ఉద్యమాలు చేపట్టడంతో ఆ డిమాండ్ పటిష్టమైంది. అయితే ఈ ప్రక్రియ రెండు విపరీత ధోరణులకు దారితీసింది. ఇటు ప్రభుత్వం ఒక రకమైన పట్టుదలకు పోతే అటు 'టీమ్ అన్నా' అనబడే పౌర సమాజంలోని ఒక గ్రూపు మరో రకమైన విపరీత ధోరణికి పోయింది.

చివరకు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాకుండా ఇటు ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అటు టీమ్ అన్నా కూడా తమ తమ పోకడలను కొంత సరిచేసుకోవడంతో కొంత సందిగ్ధం తొలగింది. పార్లమెంటు తీర్మానం చేసింది. అన్నా దీక్ష విరమించుకున్నారు. అయితే పార్లమెంటు తీర్మానం ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే. అది చట్టంగా రూపొందడానికి వివిధ స్థాయిలలో చేపట్టవల్సిన చట్ట రూపకల్పన ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో పలు అంశాలపై విస్తృత చర్చ కొనసాగవలసిన అవసరముంది.

ప్రభుత్వ ముసాయిదా అసంపూర్ణమైనది. పలు లోపాలతో కూడుకున్నది. అందువల్లే పలు ప్రత్యామ్నాయ ముసాయిదాలను పౌర సమాజ గ్రూపులు ముందుకు తీసుకువచ్చాయి. ప్రభుత్వ ముసాయిదాలోని అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అయితే టీమ్ అన్నా ముసాయిదాలో అన్నీ సమర్థమైన అంశాలు ఉన్నాయి, లోటుపాట్లు ఏమీ లేవు అనుకోవడం పొరపాటు. ఇది, ఇంతవరకు వారి చేతుల్లోనే పన్నెండు సార్లు సవరణకు గురికావడం దానిలోని అంశాల బలహీనతలను తెలియజేస్తుంది. కావున టీమ్ అన్నా రూపొందించిన 'జన లోక్‌పాల్' పై ఒక విమర్శనాత్మక పరిశీలన అవసరం.

మౌలికంగా టీమ్ అన్నా జన లోక్‌పాల్‌లో 'జనులు ఎవరు' అనే ప్రశ్నను వేయాల్సివుంటుంది. ఎందుకంటే 121, 01, 93, 422 మంది జనాభా కలిగి, సామాజికంగా (కుల, మత, లింగ, భాషా, ప్రాంతం) విలువలు, సంస్కృతీ, భావాలు ఇంకా అనేక అంశాలతో వైవిధ్య భరితమైన సమాజంలో టీమ్ అన్నా మొత్తం భారత పౌర సమాజంలో మిగతా గ్రూపులలో ఒక గ్రూపు అవుతుందే కాని, మొత్తం భారత పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహించలేదు.

మరి వారే ప్రకటించుకున్నారా? మీడియా సృష్టించిందా? ఏది ఏమైనా పట్టుమని పది మంది కలిసి, అందునా సుమారుగా అందరూ ఒకే సామాజిక శ్రేణికి చెందినవారు, మేమే పౌర సమాజ ప్రతినిధులం, ఇతర పౌర సమాజ సంస్థల కంటే మాకే అవినీతిని ఎదుర్కొనే జ్ఞానం ఉన్నది, మేము చెప్పిందే వేదం, కావున మా ముసాయిదానే పార్లమెంటు ఆమోదించాలని అనడం ఒక కుంభకోణం లేదా దుందుడుకు వాదం అవుతుంది.

టీమ్ అన్నా అనుసరించిన పోకడలు ప్రజాస్వామ్యమైనవా? రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియలకు అనుగుణంగా ఉన్నాయా? అసలు అవి గాంధేయమైనవా? అనే వాటిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటి జోలికి పోకుండా 'జన్ లోక్‌పాల్' ముసాయిదాలోని కొన్ని ముఖ్య అంశాలను పరిశీలించి ఏ విధంగా అవి నేడున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధమో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవీ, (సంక్షిప్తంగా) జన లోక్‌పాల్ ముసాయిదాలోని అంశాలు:

(అ) జన లోక్‌పాల్ వ్యవస్థ ఎన్నుకోబడే వ్యవస్థ కాదు. అది కేవలం కొంత మంది కలిసి ఎంపిక చేసుకోబడే వ్యవస్థ. సెలక్షన్ కమిటీలోని పలువురు సభ్యులు ఈ దేశ ప్రజలకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎలాంటి జవాబుదారీగా ఉండరు. (ఆ) ఇది ఒక కార్యనిర్వాహక వ్యవ స్థ. దీనికి దర్యాప్తు, శిక్షించే అధికారాలుంటాయి. కానీ దేశ కార్య నిర్వాహక శాఖకు గానీ, పార్లమెంటుకు కానీ జవాబుదారీగా ఉండదు. ఉన్న త న్యాయవ్యవస్థకు కూడా జవాబుదారీగా ఉండదు.

(ఇ) ఎంపీ లు, న్యాయమూర్తులు, ప్రధానమంత్రిని విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంది. దీనిలో భాగంగా జన లోక్‌పాల్ ప్రధాన మంత్రితో సహా ఏ అధికారి ఫోన్‌నైనా ట్యాప్ చేయడం, ఇతరత్రా సమాచార వ్యవస్థలను అడ్డుకునే పద్ధతులను ఉపయోగించే అధికారముంది. (ఈ) జన లోక్‌పాల్ వే సిన శిక్షను న్యాయస్థానంలో సవాల్‌చేసే అవకాశముంది. అయితే దాని ఇతర కార్యకలాపాలపై కోర్టులలో అప్పీలుకు వెళ్ళే అవకాశం లేదు.

(ఉ) ఈ వ్యవస్థలో పోలీసు, కోర్టుల విధులు రెండూ ఒకటిగా కలిసి ఉంటాయి. ఎవరిపైన అయినా సూమోటోగా విచారణ చేపట్టవచ్చు. ఏ సంస్థనైనా ఇది బ్లాక్ లిస్టు చేయవచ్చు. ఏ లైసెన్స్‌నయినా రద్దు చేయవచ్చు. పెనాల్టీలు విధించే, ఆస్తులు జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. (ఊ) జన లోక్‌పాల్ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో కేవలం 11మంది సభ్యులే వున్నా, దాని (వేల సంఖ్యలోని) ఉద్యోగులు లోక్ పాల్ చట్టపు అన్ని అధికారాలను కలిగివుంటారు.

ఇంత విపరీతమైన దర్యాప్తు, శిక్షించే అధికారాలతో సహా లోక్‌పాల్ అధికారులు ఒక వేళ తమ అధికారాన్ని నిస్సహాయ సామాన్యులపై ప్రయోగించే ప్రయత్నం చేస్తే !? ఈ వ్యవస్థలో చేరిన ఉద్యోగులందరూ అన్నా హజారే వలే ఎలాంటి దురాకర్షణకు లోనుకాకుండా ఉండగలరా? (ఎ) జన లోక్‌పాల్‌కు కేంద్ర ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను శిక్షించే, తీసివేసే అధికారముంది. (ఏ) ఎంపీలపై విచారణ చేపట్టే అధికారం ఇంతవరకు పార్లమెంటు అధికార పరిధిలో ఉంది.

దీనిని కూడా జన లోక్‌పాల్ అదనంగా సమకూర్చుకుంది. దీనితో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తమ విశిష్ట అధికారాన్ని కోల్పోతారు. తన సభ్యులపై చర్యలు తీసుకునే స్వాతంత్య్రాన్ని, స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు కోల్పోతుంది. ఇదే విధంగా న్యాయశాఖ కూడా తన స్వాతంత్య్రాన్ని కోల్పోతుంది. తద్వారా న్యాయశాఖ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ దానిలోని సభ్యుల జవాబుదారీ తనానికి ఉద్దేశించిన మరో ప్రత్యేక జుడీషియల్ కమిషన్ బిల్లును జన లోక్‌పాల్ అడ్డుకొంటున్నది.

(ఐ) జన లోక్‌పాల్ సభ్యుల ఎంపిక ప్రక్రియలోని అంశాల ప్రకారం సెలెక్టయ్యే సభ్యులు తమ జీవితంలో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధం కలిగి ఉండటం అనర్హం. మరి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలలో పనిచేసి ఉంటే ఏమవుతుంది అనే అంశంపై వివరణ లేదు. (ఒ) జన లోక్‌పాల్ వ్యవస్థ కేంద్ర స్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రాల స్థాయిలో అచ్చం ఇదే తరహా అధికారాలతో లోకాయుక్తలు ఏర్పడాలి. వీటన్నిటినీ పరిశీలిస్తే టీమ్ అన్నా అభిప్రాయంలో కేవలం విపరీతమైన అధికారాలతో అత్యంత కేంద్రీకృత సర్వాధికార వ్యవస్థలే అవినీతిని ఎదుర్కోగలవు.

అంటే గాంధీ సిద్ధాంతపు మౌలికాంశమైన అధికార వికేంద్రీకరణ అవినీతి నిరోధక వ్యవస్థకు పనికిరాదు! ఇక ఇప్పుడు ఈ అంశాలు ప్రజాస్వామిక లక్షణాలకు, రాజ్యాంగ మౌలికసూత్రాలకు ఎలా భిన్నంగా ఉన్నాయో చూద్దాం. (అ) ప్రజల ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికతో సంబంధం లేకుండా కేవలం నియమితమయ్యే సంస్థ సకల అధికారాలు కలిగివుండడం ప్రజాస్వామ్య సూత్రాలకు, పరిపాలనకు విరుద్ధం. (ఆ) నిజానికి జన లోక్‌పాల్ కార్యనిర్వహక వ్యవస్థకు గాని, పార్లమెంటుకు గాని జవాబుదారీ కాక పోవడమే కాకుండా, న్యాయవ్యవస్థ అధికారాలను సహితం సంతరించుకోవడం రాజ్యాంగ విరుద్ధం. (ఇ) ఉన్నత న్యాయవ్యవస్థలను పర్యవేక్షించడం, విచారణ చేపట్టే అధికారం జన లోక్‌పాల్‌కు కల్పించడం 'స్వతంత్ర న్యాయవ్యవస్థ' అనే రాజ్యాంగ సూత్రాన్ని బలిచేయడమే అవుతుంది.

దీనివల్ల 'రూల్ ఆఫ్ లా' అనే న్యాయసూత్రం కూడా ప్రమాదమెదుర్కోవల్సి వస్తుంది. (ఈ) రాజ్యాంగంలోని 14వ అధికరణ చట్టం ముందు పౌరులకు సమానత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇది నిర్హేతుక, ఇతర పక్షపాతాల నుంచి పౌరులను కాపాడుతుంది. జన లోక్‌పాల్‌కు ఎంపికయ్యే సభ్యులు గతంలో రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా ఉండడమే కాక అవినీతి చట్టాల కింద చార్జిషీట్ చేయడబడకుండా ఉండాలి (చార్జిషీట్ చేయబడడం, దోషిగా నిరూపించబడడం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి). ఇవి పక్షపాత ధోరణి కిందకు వస్తాయి. కనుక ఈ అనర్హతలకు సంబంధించిన అంశాలు 14వ అధికరణకు విరుద్ధం.

(ఉ) జన లోక్‌పాల్ ముసాయిదాలో సామాజిక న్యాయం, జెండరు న్యాయం అనే అంశాల ప్రస్తావనే లేదు. దీనిని బట్టి టీమ్ అన్నా ఎటువంటి సామాజిక విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో విశదమవుతున్నది. (ఊ) పైన పేర్కొనబడినవే కాకుండా ఒక వేళ టీమ్ అన్నా జన లోక్‌పాల్ ముసాయిదాను యథాతథంగా చట్టంగా మారిస్తే, రాజ్యాం గ సవరణకు, పార్లమెంటుకు ఉన్న పరిమిత అధికారాలకు సైతం అది వ్యతిరేకమవుతుది.వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకుంటే టీమ్ అన్నా అనుసరిస్తున్న పద్ధతులే కాకుండా వారు ప్రతిపాదించిన జన లోక్‌పాల్ ముసాయిదాలోనే పలు అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పోకడలు ఉన్నాయని అర్థం కాగలదు.

నేడు భారతదేశంలో ఒక లోక్‌పాల్ వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రజలు, పౌర సమాజపు సంస్థలు ఒక వాస్తవాన్ని గమనించాలి. అదేమిటంటే మనం అవినీతిని నిరోధించడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల సమతౌల్యాన్ని భంగపరచకూడదు. ప్రముఖ ఆర్థిక వేత్త ప్రణబ్ బర్దన్ ఇలా అన్నారు: 'దేశంలోని ప్రజాప్రాతినిధ్య సంస్థలు నేడు ఎంత చెడుగా పనిచేస్తున్నా వాటిని పటిష్టం చేయడానికి, ప్రజాస్వామిక నియంత్రణలు చేపట్టడానికి అనేక పద్ధతులున్నాయి.

నేను ఉద్యమాలను సమర్థిస్తాను కాని అవి ప్రాతినిధ్య సంస్థలను తిరస్కరించడం చాలా ప్రమాదం. ఇట్లాంటి సంఘటనలు జరిగిన ఇతర దేశాలలో చివరకు ప్రభుత్వాలపై ప్రజా ఆమోదం క్షీణించడంతో వాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్థానంలో అథారిటేరియన్ వ్యక్తులు అధికారంలోకి రావడం గమనించవచ్చు. ఈ ప్రమాదం భారత్‌కు పొంచి ఉందని కాదు కాని ప్రాతినిధ్య సంస్థల పట్ల అనాదరణ ధోరణులు ఇలాగే కొనసాగుతూపోతే మున్ముందు ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఆదరణ కరువవుతుంది'

- ఎం. చెన్న బసవయ్య, డి.రవీందర్, ఎస్.మల్లేష్
(ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)

No comments:

Post a Comment