9/16/2011 12:01:36 AM
జయశంకర్ చైతన్యం: తెలంగాణ పోరాటాలు
సర్వజన సమ్మె జరుగుతున్న చారివూతక సందర్భంలో జయశంకర్ మన మధ్య లేకపోవడం ఒక పెద్దలోటే. ఆయనకుండే వ్యక్తిత్వం వలన వెసులుబాటు వలన, అంతకుమించి వ్యక్తిగత నిబద్ధత, నిజాయితీ వలన ఉద్యమానికి తన మీద తనకు విశ్వాసాన్ని కలిగించడానికి చాలా ఉపయోగపడేది. చాలా మందికి లేని ఒక విశ్వసనీయత జయశంకర్ పట్ల ఉండడానికి ఆయన తన జీవిత కాలానికి తెలంగాణ అనే ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. దాని పట్ల రాజీలేదు. అనుమానం లేదు. శషభిషలు లేవు. ఇది చాలా మందికి సాధ్యంకాదు. ఆలోచనలు, విశ్వాసాలు బాహ్య ప్రపంచంలో జరిగే ఆటుపోట్లకు గురవుతుంటాయి. మనుషులు, వారి ఆలోచనలు నిరంతరంగా మారుతుంటా యి. నిజానికి వరంగల్‌లో పుట్టి, పెరిగి, ఆ రాజకీయ వాతావరణంలో జీవిస్తూ ‘తెలంగాణ’ గురించే ఆలోచించడం ఆ విశ్వాసాన్ని వదులుకోకపోవడం పరిమితా లేక బలమా అన్న అంశాన్ని అంచనా వేయడం కష్టమే. ఒకవేళ అది బలహీనతే అని అనుకున్నా తెలంగాణ చరిత్ర భిన్న మలుపులు తిరిగి మళ్లీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు చేరుకోవడం వల్ల జయశంకర్ బలహీనత కూడా బలమైనశక్తిగా మారడం వ్యక్తి జీవితంలో జరిగే చాలా అరుదైన సంఘటనలలో ఒకటి.
జయశంకర్ వరంగల్‌లో పుట్టి, అక్కడ చదువుతున్న కాలంలో, ఆ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది. వరంగల్‌లోని మధ్యతరగతి దానిచేత చాలా ప్రభావితమైనవాళ్లే. అయితే తెలంగాణ సాయుధ పోరాట విరమణతో తెలంగాణ అస్తిత్వ చైతన్యం రూపొందించడం జరిగింది. సాయుధ పోరాటానికి అగ్రభాగాన ఉన్న నాయకత్వం సైద్ధాంతిక కారణాల వల్ల విశాలాంవూధను బలపరిచారు. అప్పటి కమ్యూనిస్టు పార్టీ సమాజం సమక్షిగంగా మారుతుందని విశ్వసించింది. ఆ సమ సమాజ స్థాపనే అప్పటి వాళ్ల స్వప్నం. ఈ సమ సమాజ నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ అసమానతలు, కుల పర అణచివేత, మహిళలపై హింస రద్దె మనుషులంతా మనుషులు గా మలచబడే ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందనేది ఆ ప్రాపంచిక దృక్పథ నమ్మకం. విశాలాంవూధలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందని, మౌలిక మార్పులు తీసుకరాగలమనే విశ్వాసం వాళ్లకుండవచ్చు.
ఎందుకో తెలంగాణ ప్రాంతంలో అప్పటికే ఆ విశ్వాసం పట్ల అనుమానాలున్నాయి. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంచుకొని రెండవ సార్వవూతిక ఎన్నికలలో సోషలిస్టు నినాదాలను, భావజాలాన్ని నెత్తికెత్తుకొని కమ్యూనిస్టు పార్టీని వెనక్కి నెట్టగలిగింది. చారివూతకంగా కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల రాజకీయాలలోకి వచ్చినా, సమాంతరంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను సజీవంగా కొనసాగించి ఉంటే, ఎన్నికలలో ఓడిపోయినా ఉద్యమాలు కొనసాగేవి. అలా చేయకపోవడం వల్ల తామ కలలు కన్న ‘విశాలాంవూధలో ప్రజారాజ్యం’ స్వప్నం చెదిరిపోయింది. తెలంగాణ అస్తిత్వం విశాలాంధ్ర భావనకు భిన్నంగా బలం పుంజుకుంటున్న సందర్భం జయశంకర్ చైతన్యా న్ని ప్రభావితం చేసిందేమో అని అనిపిస్తుంది.
రాష్ట్రంలో 1960వ దశాబ్దంలో ప్రవేశపెట్టబడిన హరిత విప్లవం అన్ని రకాల అసమానతలను ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలను పెంచింది.
దీనికి తోడు తెలంగాణలో సాయుధ పోరాటం అపరిష్కారంగా మిగిలించిన భూస్వామ్య సంస్కరణలు కొనసాగడమేకాక, ఏ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయో వాళ్లే భిన్న అవతారాలలో రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం వల్ల, ఒకవైపు జగిత్యాల జైత్రయా త్ర మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం దాదాపు కలిసే జరిగాయి. నక్సలైట్ ఉద్యమ ప్రభావం కన్నా ‘తెలంగాణ అస్తిత్వ ఉద్యమ చైతన్యం’ కలిగిన జయశంకర్‌ను ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే ఎక్కువ ప్రభావితం చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు రాజకీయ నాయకుల ద్రోహాలతో విసిగి అడవికి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. అయితే శ్రీకృష్ణ కమిటీ రహస్య చాప్టర్‌లో తెలంగాణ ఇస్తే నక్సలైట్లు బలం పుంజుకుంటారు అనేది ఎంత నిజమో తెలియదు కాని, 1960ల అనుభవాన్ని చూస్తే , ఇవ్వకపోతే ఆ పోరాటాలు బలపడతాయనేది మాత్రం వాస్తవం. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వాలు ప్రజలను పోరాటాలవైపే నెట్టుతాయి. ఈ మాట జయశంకర్ తన సుదీర్ఘ అనుభవం వల్ల, ఒక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని అంగీకరించకపోతే ఇంకొక పోరాట ప్రత్యామ్నాయం ముందుకు వస్తుందని, 1956 అనుభవం వల్ల, 1969 అనుభవ ఆధారంగా మళ్లీ మళ్లీ అనేవాడు.
వరంగల్‌లో రాడికల్ చైతన్యం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో జయశంకర్ వరంగల్ సి.కె.యం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. అయితే జయశంకర్‌లో ఒక లక్ష్యానికి పనిచేసే చిత్తశుద్ధి, ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహించే ప్రతిభ, వ్యక్తిగత నిజాయితీ వరంగల్‌లోని కొందరు రాజకీయ నాయకులకు కంటకంగా తయారయ్యాయి. జయశంకర్ చాలా సౌమ్యుడు. భాషలో అతి జాగ్రత్తలు పాటించేవాడు. సంస్కారం ఉన్నవాడు. ఇవన్ని దిగజారిన రాజకీయ నాయకులను భయపెట్టాయి. వాళ్లు ఆయన రాకను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్లు సాధించలేకపోయారు. రాజకీ య నాయకులకు భయపడడం కాని, వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తడం కాని జయశంకర్ వ్యక్తిత్వంలోనే లేవు. ఆయన చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి. తనను తాను గౌరవించుకోలేని ఏ వ్యక్తి కూడా ఇతరుల గౌరవాన్ని పొందలేడు. ఆయన ముఖ్యమంవూతులతో మాట్లాడినా, ప్రధాన మంత్రులతో మాట్లాడినా, సోనియాగాంధీతో మాట్లాడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా మాట్లాడాడు. బహుశా బలమైన వ్యక్తిగత విశ్వాసాలుండే వ్యక్తులకే అది సాధ్యమవుతుందేమో!
సి.కె.యం కాలేజీ రాజకీయంగా రెండు బలమైన శిబిరాలు కలిగిన అధ్యాపకులు, విద్యార్థులున్న సంస్థ. ఇవి రెండు ధృవాలుగా ఉండేవి. వామపక్ష అధ్యాపకులు, వి.వి., వి.యస్. ప్రసాద్‌తో సహా ఆయన నిజాయితీని, నిబద్ధతను గౌరవించారు. ఇంకొక శిబిరం ఆయన పాలనా పటిమను, పారదర్శకతను తట్టుకోలేకపోయింది. ఈ రెండు శిబిరాల సహకారాన్ని ఆయన పొందగలిగారు. సైద్ధాంతికంగా ఆయన తెలంగాణ వాది కావడం వలన, రాజకీయ సైద్ధాంతిక ఘర్షణను కొంత వరకు బయట ఉంచగలిగాడు. బహుశా ఆ అనుభవం వల్లే తెలంగాణ ఉద్యమంలో ఎవరూ కలిసొచ్చినా ఆర్.ఎస్.యు నుంచి ఆర్. ఎస్. ఎస్ దాకా అని అంటూ ఉండేవాడు. నిజానికి తెలంగాణ చరిత్ర తిరిగిన మలుపులలో ఆ ఉద్యమానికి ఇటు బి.జె.పి అటు మావోయిస్టు పార్టీలు మద్దతు ఇవ్వడం ఒక చారివూతక విచివూతమే. కాని జయశంకర్‌కు ఈ చారివూతక సందర్భం చాలా వెసులుబాటు కల్పించింది. అందుకే ఆయన మరణానికి అన్ని వర్గాల నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇందిరాగాంధీ రాజకీయాలతో ప్రారంభమైన అస్తిత్వ ఆధారిత రాజకీయాలు, 1980వ దశాబ్దం వరకు చాలా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చాయి. వర్గ రాజకీయాలతో పాటు సమాంతరంగా అస్తిత్వ రాజకీయాలు అభివృద్ధి చెందాయి. వర్గ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు మధ్య సఖ్యత ఉంది. ఘర్షణ ఉంది. ఈ రాజకీయాలు బలం పుంజుకుంటున్న సందర్భంలో 1990వ దశకంలో ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మరోసారి ముందుకు వచ్చింది. ఈ ఉద్యమం ముందుకు వస్తున్న తరుణంలో అప్పటికే పాలనా అనుభవం, ప్రజాదరణ పొందిన జయశంకర్ ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. 1950 ‘ముల్కీ గోబ్యాక్’ ఉద్యమం అప్పుడు ఆయన విద్యార్థి, 1960 ఉద్యమ కాలంలో అధ్యాపకుడు. 1990 ఉద్య మం వరకు ఒక నిర్ణాయకశక్తిగానే కాక సిద్ధాంతకర్త అని భావించే దశకు చేరుకున్నాడు. చరిత్ర కొన్ని రహస్యాల ను, కొన్ని ఆశ్చర్యాలను తన గర్భంలో దాచుకొని ఉం టుంది. అలా దాచుకున్న ఆశ్చర్యాలలో జయశంకర్ జీవి తం, దాని ప్రయోగికత ఒకటి.
జయశంకర్ వ్యక్తిత్వంలో మరొక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం: అధ్యాపకుడికి, రాజకీయ సామాజిక ఉద్యమాలకుండే సంబంధం. 1970లలో వరంగల్ ఉపాధ్యాయ, అధ్యాపక వర్గం పోరాట రాజకీయాలతో మిళితమైన సందర్భం. ప్రజా ఉద్యమాలు అధ్యాపక వర్గాన్ని ప్రభావి తం చేస్తూ, అధ్యాపక వర్గం ఉద్యమాలను ప్రభావితం చేసిన సందర్భమిది. నాలాంటి వాళ్లం ఆ సందర్భం వల్ల ప్రభావితమైన వాళ్లమే. కానీ రాను రాను విశ్వవిద్యాలయ అధ్యాపకులు చాలా కారణాల వల్ల ఉద్యమ రాజకీయాలకు దూరం అవుతూ వచ్చారు. ఏదో మన చదువు మనం చెబితే సరిపోతుంది దగ్గర ప్రారంభమై, తమ వ్యక్తిగత కుటుంబ సమస్యలతో కూరుకుపోతున్న సందర్భంలో కుటుంబమే లేని జయశంకర్‌కు తెలంగాణనే ఆయన కుటుంబం. ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వి.సి.గా ఉండే సందర్భంలో కూడా నాకు తెలిసి తెలంగాణమీద సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఏ హోదాలో ఉన్నా ఈ తెలంగాణ అంశం మాత్రం ఆయనను వదలలేదు. దాన్ని ఆయన వదలలేదు.
అధ్యాపకులంతా ఒక నిరాశావాదంలో ఉండే దశలో ఆయన తెలంగాణ ఉద్యమం అనివార్యంగా వస్తుందనే విశ్వసించాడు. దాని కొరకు తనను తాను సమాయత్తపరుచుకున్నాడు. అధ్యాపకుల పాత్ర ఉంటుందని, ఉండాలని ఆయన విశ్వసించాడు. అధ్యాపకులు క్లాస్‌రూంకు పరిమితం కాకుండా విశాల సామాజిక తరగతి గదిలో ఒకవైపు విద్యార్థులలాగ ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలకు తమ విజ్ఞానాన్ని అందించాలని బలంగా భావించాడు. అలా భావించినందువల్లే తెలంగాణ అంతా తిరిగాడు. వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. జయశంకర్ ఇచ్చిన వారసత్వం ఉపాధ్యాయ, అధ్యాపక వర్గానికి సదా ఒక స్ఫూర్తిని కలిగించేదే.
ఈ జయశంకర్ స్మారకోపన్యాసం ముగిసిన తర్వాత ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొ. సిహెచ్. హనుమంతరావు తన అధ్యక్ష పలుకులతో జయశంకర్ మీద తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం ఎందుకు పడలేదనే ఒక సందేహం తనకు ఉండేదని, బహుశా తెలంగాణ అస్తిత్వ సమస్య ఆయన చైతన్యంతో అత్యంత ప్రభావితంగా ఉండబట్టే ఇలా జరిగుండవచ్చు అంటూ, తాను విద్యార్థిగా ఉన్నప్పుడు తెలంగాణ పోరాటానికి ఆకర్షించబడి ఆ ఉద్యమంలోకి ఎలా వెళ్లాడో వివరించారు.
అయితే నాడు తెలంగాణ పోరాటంలో భాగమై తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఎకనామిక్స్‌శాఖలో పనిచేసి, ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, లేబర్ కమిషన్ లాంటి అత్యున్నతమైన విధాన నిర్ణయ సంస్థలలో పనిచేసి అందరి మెప్పులను పొందిన హనుమంతరావు తెలంగాణ అస్తిత్వానికి మద్దతు ఇవ్వడమే కాక, జయశంకర్ మరణం తర్వాత ఆయన రాసిన నివాళి వ్యాసం నిజంగా చాలా గొప్ప నివాళే. రెండు మార్గాల ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ లక్ష్యం పట్ల ఏకీభావం కలిగి ఉండడం జయశంకర్ విశ్వాసానికి గౌరవమే కాక, తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప అనుభవమే.
ప్రొ. జి. హరగోపాల్
(ఉస్మానియా విశ్వవిద్యాలయంలో National Academy of Development’ ఆధ్వర్యంలో వ్యాసకర్త 3 సెప్టెంబర్ నాడు ఇచ్చిన జయశంకర్ స్మారకోపన్యాస సంక్షిప్త సారాంశం)
No comments:
Post a Comment