Friday, September 9, 2011

ఫార్మసీ విద్యపై అవగాహనా లేమి by- అల్లం వంశీ (యం.ఫార్మసీ) Andhra Jyothi 10/09/2011


ఫార్మసీ విద్యపై అవగాహనా లేమి

'పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడం మా లక్ష్యం. వైద్యం అందరికీ అందడం ఎలా? నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందించడమెలా? అనే అంశాలపై విస్తృత చర్చ జరగాలి'- ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 71వ అంతర్జాతీయ ఫార్మా సదస్సులో మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అన్న మాటలవి. ఆ విస్తృత చర్చ మన ఫార్మా విద్యారంగం దగ్గరి నుంచే ప్రారంభం కావాలి.

ఐదేళ్ల పాటు కొత్త ఫార్మసీ కళాశాలలకు అనుమతి మంజూరు చేయవద్దని తాము ప్రతిపాదించినట్టు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) అధ్యక్షుడు డాక్టర్ బి.సురేశ్ ఆ సదస్సులో వెల్లడించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రతిపాదనకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి- ఫార్మా విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం కోసం;

రెండు -మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం. ఫార్మా విద్యారంగం సంక్షోభంలో ఉన్నదని ఈ ప్రతిపాదనను బట్టి విశదమవుతున్నది. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 700 ఫార్మా కళాశాలలు ఉండగా ఒక్క మన రాష్ట్రంలోనే 300 పైచిలుకు ఉన్నాయి. ఉన్న 300 కళాశాలల్లో ఎన్నింటిలో సీట్లు పూర్తిగా నిండుతున్నాయన్నది ఆలోచించాలి. దాదాపు 200 పైగా కళాశాలల్లో సీట్లు పూర్తిగా నిండడం లేదు. ఒకొక్కదానిలో మొత్తం 60 సీట్లకు గాను 5-6 సీట్లు మాత్రమే నిండిన కళాశాలలు కూడా ఉన్నాయి.

ఫార్మా విద్యారంగంలో సంక్షోభానికి గల మూలాలను అన్వేషిస్తే ముఖ్యంగా నాలుగు ప్రధాన కారణాలు కనపడుతాయి. అవి: (అ) చేరబోయే విద్యార్థుల్లో ఈ రంగం పట్ల సరైన అవగాహన లేకపోవడం; (ఆ) విచ్చలవిడిగా కొత్త కళాశాలలకు అనుమతులు ఇస్తూనే ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్యకు మించినన్ని కళాశాలలు అందుబాటులోకి రావడం; (ఇ) కళాశాలలు సరైన ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించలేకపోవడం; (ఈ) చదువు పూర్తయిన తర్వాత మెరుగయిన ఉద్యోగావకాశాలు లేకపోవడం.

ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత మెడిసిన్‌లో సీటురాని బైపీసీ విద్యార్థులు, ఇంజనీరింగ్‌లో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని నిరాశలో ఉన్న ఎంపీసీ విద్యార్థులు ఫార్మసీ మినహా ప్రత్యామ్నాయం లేదు కాబట్టి గత్యంతరం లేక అందులో చేరుతున్నారు. అసలు ఔషధ విజ్ఞాన శాస్త్రంలో దేని గురించి చదువుదాము, ఏమి నేర్చుకుందాము, తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలుంటాయన్నది విద్యార్థులకే గాక, వారి తల్లితండ్రులకూ సరైన అవగాహన లేదు.

ఇక్కడ తప్పు విద్యార్థులదో, వారి తల్లితండ్రులతో కాదు, సరైన అవగాహన కల్పించలేని మన (విద్యా) వ్యవస్థది. పాఠశాలస్థాయిలో విద్యార్థులకు డాక్టరో, ఇంజనీరో, లాయరో, వ్యాపారవేత్తనో, ఉపాధ్యాయుడనో, పోలీసనో, మరేదయినా ప్రభుత్వోద్యోగమనో ఇలాంటివే అనేక రకాల వృత్తుల గురించి, వివిధ రంగాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంటుంది. ఆదివారం బడిలో నేర్చుకున్న చదువు వల్ల కావచ్చు. లేదంటే వాళ్ల చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ సహజంగానే ఏర్పర్చుకున్నవి కావచ్చు.

కాని ఏ ఒక్క విద్యార్థికీ కూడా బడి చదువు అయిపోయేసరికి గాని, అంతెందుకు ఇంటర్ చదువు అయిపోయేవరకు గానీ ఫార్మారంగం అంటే ఏమిటో తెలిసే అవకాశమే లేదు మన దగ్గర. అటు బడి చదువులోనూ దాని గురించి ప్రస్తావన రాదు. ఇటు బయటి సమాజంలోనూ ఎవ్వరికి ఫార్మసిస్టు అంటే ఏమిటో అవగాహన ఉండదు. అభివృద్ధిచెందిన దేశాల్లో వైద్యరంగంలో ఒక డాక్టరుకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అంతే సమానమైన ప్రాధాన్యం ఫార్మసిస్టుకూ ఉంటుంది.

వ్యాధిని గుర్తించి చికిత్సను అందించడంలో ఒక వైద్యునిది ప్రధానపాత్రకాగా, దానికి అవసరమైన ఔషధాలను పరిశోధనల ద్వారా కనిపెట్టి, మందులు తయారుచేసి అందించడంలో ఫార్మాసిస్టులదీ అంతే పాత్ర. ఫార్మాసిస్టులలో కూడా వివిధ రకాల విభాగాలకు చెందినవారుంటారు. పరిశోధనారంగానికి సంబంధించినవీ, ఔషధ నాణ్యతను పరీక్షించేవీ శాఖలు కొన్ని ఉండగా, రోగులకు మెరుగైన వైద్య సహాయం కొరకు హాస్పిటల్/క్లినికల్ ఫార్మసిస్టు అనే శాఖలు ప్రత్యేకంగా ఉంటాయి.

మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే హాస్పిటల్/క్లినికల్ ఫార్మాసిస్టుల గురించి అవగాహన పెరుగుతుంది. దీనికోసం ఆరేళ్ళ ఫార్మా డీ అనే కోర్సును మన దేశంలో మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. నిస్సందేహంగా ఇదొక శుభ పరిణామం. 2014 నాటికి వారు అందుబాటులోకి వస్తారు. ఇకనైనా ఆ రంగం గురించి మన దగ్గర ఆస్పత్రులకు గాని, ప్రజలకు గాని అవగాహన కల్పించవల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు కూడా ప్రాథమిక విద్యనభ్యసించే దశలో మిగిలిన వాటితో పాటు స్వల్పంగానైనా ఫార్మా రంగం గురించి కూడా అవగాహన కల్పించవలసి ఉన్నదని వేరే చెప్పనవసరం లేదు.

ఇక కేంద్ర ప్రభుత్వపు అఖిల భారత సాంకేతిక విద్యా విభాగ మండలి (ఎ.ఐ.సి.టి.ఈ) విషయానికొస్తే, వాళ్లకు ఫార్మా విద్యాంగంపై సరైన విషయ పరిజ్ఞానం ఉన్నదో లేదో అనే సందేహం కలుగుతుంది! విచ్చల విడిగా విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వడం సరైన పనో కాదో వారు చేతులు కాలిన తర్వాత కూడా గుర్తించలేకపోతున్నారు. అలా అనుమతి ఇచ్చే ముందు ఆ సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రయోగశాలలు ఉన్నాయో లేదో పర్యవేక్షించే విషయంలో కాస్త నిజాయితీతో నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఇన్ని కళాశాలలు పుట్టుకు రాకపోయేవేమో!

ఎక్కువ కళాశాలలు ఉంటే ఎక్కువ మందికి చదువుకునే అవకాశముంటున్నదన్నది వాస్తవమే. కాని ఎన్ని కళాశాలల్లో నాణ్యతతో కూడిన విద్య అందుతున్నదనేది వారు ఆలోచించాలి. అలాగే ప్రతి ఏటా బయటకు వస్తున్న ఇన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఔషధ విజ్ఞాన శాస్త్రాన్ని వైద్యశాస్త్రంలో ఒక భాగంగా గుర్తించి సరైన స్థానం కల్పించలేకపోవడం, ప్రజలకూ దీని గురించి సరైన అవగాహన కల్పించలేకపోవడం, విద్యాలయాల సంఖ్య పెంచే ముందు వాటిలో నాణ్యతను గుర్తించలేకపోవడం వంటివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నది నిస్సందేహం.

ఇవన్నీ ఒక ఎత్తు కాగా ఈ రంగంలో చదువు ముగించుకొని బయటకు వచ్చిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయన్న ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఎప్పుడూ కలిగిఉండదు. ఒక వేళ అలాంటి ఆలోచనే కలిగివుంటే ఐడిపిఎల్ లాంటి కంపెనీలను మరిన్ని స్థాపించి ఉద్యోగావకాశాలనూ, ఉత్పత్తినీ పెంచే వారు. తద్వారా 'ఆరోగ్యకరమైన' సమాజ స్థాపనకు కృషిచేసేవారు కానీ మూసివేసే దిశలో అడుగు వేసే వారు కాదేమో?!

అన్ని ప్రైవేట్ ఔషధ తయారీ సంస్థలు యేటికేటికీ లాభాలు పెంచుకుంటూ పోతూనే ఉన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు నష్టాల ఊబిలో ఎందుకు చిక్కుకున్నాయంటున్నారో సామాన్యులకు అర్థం కాని విషయం! ఫార్మారంగంలో బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా కానీ గత రెండేళ్ళలో ఉపాధి అవకాశాల సంఖ్య ఊహించలేనంతగా తగ్గింది. అందుకే ఈ రంగంలో మేధో వలస పెరిగింది. పరిశోధనల రీత్యాగానీ, ఉద్యోగావకాశాలు, ధనార్జన దృష్ట్యా గానీ, గౌరవం పొందే విషయంలో గానీ ఫార్మా రంగానికి దేశంలో చిన్నచూపు ఉన్నదనే భావనతోనే వాటిని వెతుక్కుంటూ పాశ్చాత్య దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది.

ఔషధాల ఉత్పత్తి, విక్రయం, వినియోగాలను నియంత్రించే చట్టాలు మనకు ఉన్నా, వాటిని ఎంతవరకు అమలుపరుస్తున్నారన్న నిజాలు తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల ఔషధ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు అనర్హుల చేతుల మీద నడుపబడుతున్నాయన్న బహిరంగ రహస్యం గురించి చర్చ జరిపి చర్యలు తీసుకునే దిశగా ముందుకు పోవలసివుంది.

ప్రతి రాష్ట్రంలో 'ఫార్మాసిటీ'లను, ఔషధ పరిశోధనా కేంద్రాలను నెలకొల్పవలసివుంది. ఉపాధి అవకాశాలను పెంపొందించడమేగాక పరిశోధనలనూ ప్రోత్సహించవలసివుంది. వైద్య, జీవ రసాయనిక, ఔషధ విజ్ఞాన, జన్యుశాస్త్ర, రసాయనిక, జీవ సాంకేతిక రంగాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. వీటన్నిటిలోనూ ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నవి. మిగిలిన వాటితో పోలిస్తే మన దేశంలో ఈ రంగాల్లో పరిశోధనలను ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు,

ఇకనైనా ఆ ధోరణి మారాలి. పరిశోధనలను ప్రోత్సహించాలి. 'ఆరోగ్యవంతమైన' సమాజం కొరకు ఈ రంగాలలో పరిశోధనలు తప్పనిసరి. ఇక్కడ పరిశోధనలు ఎక్కువగా జరగడం లేదన్న దానికి ఒకే ఒక్క ఉదాహరణ మన దేశానికి ఇంతవరకు సొంతంగా ఒక్క ఔషధ మూలకం (డ్రగ్ మాలిక్యూల్) కూడా లేకపోవడమే (మన దేశంలో తయారయ్యేవన్నీ జెనెరిక్ మందులే). భూమ్మీద మానవుల మనుగడ సాగినన్ని రోజులు ఔషధాల అవసరం ఉండి తీరుతుంది. ఔషధాలులేని జీవనాన్ని ఊహించలేము. అటువంటి రంగాన్ని గురించి ప్రజల్లో అవగాహన పెంచి, అభివృద్ధి పరచవలసిన బాధ్యత అందరిది.

- అల్లం వంశీ (యం.ఫార్మసీ)

No comments:

Post a Comment