బడుగుల బాంధవుడు
-జి.హరగోపాల్
యస్.ఆర్.శంకరన్ గారు గుర్తేడు కిడ్నాప్ తరువాత వీణా శతృఘ్న ఇంట్లో కలవాలని కబురు పంపారు. అక్కడ కిడ్నాప్ గురించి చాలా వివరంగా-చిన్న చిన్న సంఘటనలతో సహా- చెప్పారు. అప్పుడు ఒకవేళ తనకు ఏమైనా జరిగి ఉంటే బాలగోపాల్ తన మీద నివాళి వ్యాసం వ్రాసేవాడా? అని నన్నడిగారు. ఆ ప్రశ్నకు అప్పటికి నా దగ్గర సమాధానం లేదు. బాలగోపాల్ మీదై నా, శంకరన్ మీదైనా నివాళి వ్యాసాలు వ్రాయవలసిన అవసరం ఏర్పడడం వ్యక్తిగతంగా ఒక విషాదమే!
అయితే అరుదైన వ్యక్తుల గురించి, అమానవీయంగా మారుతున్న సమాజంలో ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయ సంస్కృతి, విలువలు భ్రష్టుపడిపోతున్న సందర్భంలో మన మధ్యే ఏ సుఖాలు కోరకుండా అర్థవంతమైన జీవితాన్ని, ఒక రకంగా మానసికంగా ఒక పరిపక్వ జీవితాన్ని గడిపిన వారి గురించి మాట్లాడుకోకుండా ఉండటం ఎలా? అది ఆ మరణించిన వ్యక్తుల అవసరం కాదు, మనని మనం మనుషులు గా నిలుపుకోవడానికి చాలా అవసరం. శంకరన్ గారి జీవిత విశేషా లు కొన్ని మీడియాలో ప్రచురించారు. కాని ఆయన సున్నితమైన మానవీయ మనస్తత్వాన్ని అరుదైన ఆచరణను గురించి మరింత విస్తృతంగా, లోతుగా చర్చ జరపడం ఇప్పటి దిగజారుతున్న సమాజ అవసరం.
శంకరన్ గారితో పరిచయమేర్పడిన తర్వాత, ఆయన సర్వీసు లో ఉన్నప్పుడు తరచుగా కలవ లేదు. అలా కలిస్తే చాలా గొప్ప అనుభవంగా ఉండేది. శంకరన్ పదవీ విరమణ తర్వాత పౌర స్పందన వేదికలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆ విధంగా గంటల తరబడి, రోజుల తరబడి ఆయనతో పనిచేసే క్రమంలో ఆయన సున్నితమైన మనస్సు, అతి సున్నితమైన ఆచరణను గమనించే అవకాశం నాకు వచ్చింది. అది ఒక మరవరాని మానవీయ అనుభవం.
తత్వవేత్త రూసో మనిషి సంఘజీవి కావడంతో తన సహజ ప్రవృత్తిని కోల్పోయాడని, అతని సహజ ప్రవృత్తి మీద మానరాని గాయం ఏర్పడిందని ఒక వ్యాఖ్యానం చేశాడు. అందువలనే మని షి సహజ ప్రవృత్తికి, అతని సామాజిక బాహ్య వర్తనకి ఇక పూడ్చలేని అంతరం ఏర్పడి మనుషుల ప్రవర్తనంటే అసహజంగా మారిపోయిందని అంటాడు. ఇది చాలవరకు వాస్తవమైనా, ఎందుకో శంకరన్ లాంటి వాళ్లు ఈ వైరుధ్యంలో చిక్కుకోలేదేమో? మనిషి తన సహజత్వాన్ని కాపాడుకొనడానికి అవకాశాలున్నాయని మళ్లీ మానవాళి తన సహజమైన రీతిలో జీవించే ఒక భవిష్యత్ సమా జం సుసాధ్యమే అన్న ఒక విశ్వాసాన్ని కలిగించారని అనిపిస్తుంది.
ఆయనతో ఎన్నో గంటలు గడిపినా ఎన్ని చర్చలు చేసినా ఆయన మాట్లాడేప్పుడు కాని, ఒక పనిచేసేప్పుడు కాని జాగ్రత్తలు తీసుకున్నట్లు కాని, ఆలోచనలను సెన్సార్ చేసుకుంటున్నట్లు కాని ఎక్కడ అనిపించేది కాదు. ప్రతి అంశానికి చాలా సహజంగా స్పందించేవాడు, ప్రతిస్పందనలో మానవీయ పరిమళ ముండేది. మనిషి మంచితనమ్మీది ప్రగాఢ విశ్వాసముండేది. ఎక్క డ ఏ మంచి జరిగినా తనకే ఆ మంచి జరిగిందని ఆనందపడేవాడు. ఎక్కడైనా ఏ చెడు జరిగినా చాలా సహజంగా బాధ పడేవాడు. ఆ బాధను మాటల్లో ఎక్కువ చెప్పేవాడుకాదు కాని ఆయన ముఖకవళికలో కనిపించేది. ఆ విషయాన్ని కొనసాగిస్తే, ఒక తాత్విక ధోరణిలో స్పందించేవాడు.
ఆయన ప్రవర్తనలో అట్టడుగు వర్గాల పట్ల ఉండే 'కన్సర్న్' చాలా చాలా బలం గా, అదొక వ్యక్తిగత బాధగా తోచేది. నిరంతరం ఆ వర్గాల సమస్యల గురించి, వాటి కి పరిష్కారాల గురించి భిన్న కోణాల నుంచి ఆలోచించే వారు. ఈ మనస్తత్వం నేను చాలా సందర్భాల్లో గమనించాను కాని రెండో మూడు సంఘటనలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి.
మాటల సందర్భంలో ఒకసారి తాను ప్రభుత్వాధికారిగా గ్రామాలకు వెళ్ళి పేద కుటుంబాలను, పూటకు గడవని నిస్సహాయమైన కుటుంబాలను కలిసినప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారని తన స్వంత డబ్బులు ఇస్తూ ఈ డబ్బులు ఏదో ఒక 'పేదల సంస్థ' తన దగ్గర పెట్టిందని, పేదల కుటుంబాలకు ఇవ్వవలసిందిగా తనకు ఆ బాధ్యత ఇచ్చారని చెప్పే వారట. అంతేకాక డబ్బులు ఇచ్చినట్టు ఒక తెల్లకాగితం మీద వేలి ముద్ర వేయించుకు నే వాడట.
అలా ఎందుకు చేశాడంటే ఆ కుటుంబానికి చేసిన చిన్న సహాయం తాను చేశానని తెలిస్తే జీవితమంతా శంకరన్‌గారు మాకు సహాయం చేశారు అనే కృతజ్ఞతా భావం మిగులుతుందని, జీవితంలో బరువుని మోస్తున్న ఆ పేద వాళ్ళకు ఆ జ్ఞాపకం మరొక అదనపు భారమేనని అనుకున్నాడట! ఈ అవగాహన వలన త్రిపురలో ప్రధాన కార్యదర్శిఇగా పనిచేసే కాలంలో ప్రతి సబ్ కలెక్టర్ దగ్గర కొంత ఫండ్ పెట్టేలా , ఎవరైనా తమకు ఆ రోజు తిండి దొరకలేదనో, ఆకలితో ఉన్నామనో వస్తే ఏ నిబంధనల ప్రమేయం లేకుండా సబ్ కలెక్టర్ వారికి ధన సహాయం చేసేలా ఒక పద్ధతి పెట్టాడు.
ఇది నేను త్రిపురలో మానవహక్కల పరిశీలనకు వెళ్ళినప్పుడు మా విద్యార్థి నాగరాజ్ తన ఇంటి ముందు నిలబడిన ఒక మనిషికి డబ్బులిస్తూ ఈ వెసులుబాటు శంకరన్ గారి హయాంలో కల్పించబడిందని చెప్పాడు. ఎదుటి మనిషి ఆకలిని ఇంత సున్నితంగా, లోతుగా ఆలోచించడం ఆయనకున్న మానవీయతా ముద్ర దృక్కోణానికి ఒక బలమైన ఉదాహరణ.
ఒకసారి ఇద్దరం కలిసి హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకటి రెండు స్థలాలను చూయించి ఇక్కడ భోజనం 8 లేదా 10 రూపాయలకే దొరుకుతుంది అని అన్నాడు. ఈ చవక భోజన ఇళ్ళ గురించి ఈయన ఎందుకింత సమాచారం సేకరించాడు అని ఆలోచిస్తే అది మాలో చాలా తక్కువ ఆదాయాలు ఉండే వాళ్ళకు పట్టణంలో తిండి ఎక్కడెక్కడ దొరుకుతుందని పనికట్టుకుని సమాచారం సేకరించారని పించింది.
మేం శాంతి చర్చల సందర్భంలో శ్రీశైలంలో కొంత ఆగవలసి వచ్చింది. ఎలా గు అక్కడ ఉన్నాం కదా అని గుడిలోకి వెళ్ళాం. గుళ్ళో మాకొరకు ప్రత్యేక పూజ చేశారు. బయటికి వచ్చిన తర్వాత మేం కొంత హాస్యంగానే మీకు కుటుంబం లేదు పిల్లలు లేరు మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారు? అని అడిగితే 'నాకేముంటుంది మా దళితులకు మరిన్ని అవకాశాలు రావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని కోరుకొనడం తప్ప' అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆడవికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, పట్టణంలో తిరుగుతున్నా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నా ఆయన ధ్యాసంతా పేద వాళ్ళ మీదే. ఈ విషయాల మీద ప్రభుత్వాధికారులు సరిగా స్పందించడం లేదని వాపోయేవారు.
ఒక సందర్భంలో పంజగుట్ట ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ చాలా సేపు పోయింది. మా ఇంట్లో చాలా దోమల గొడవ ప్రారంభమయింది. తోచక శంకరన్ గారికి ఫోన్ చేశాను. సార్ దోమలు చాలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారని అడిగితే నన్ను దోమలు కుట్టవు మీకు తెలుసా అన్నారు. నేను అది ఎలా సాధ్యం అంటే దోమలకు నేనంటే కొంచెం ఇష్టం లేదు. మూడున్నర దశాబ్దాల పాటు ఐఎ ఎస్‌లో పనిచేసిన మనిషిని కుట్టినా ఏం కాదు, వాళ్ళకు ఏం స్పంద న ఉండదని దోమలకు కూడా తెలిసిపోయిందని సున్నితంగా, కొంచెం సెటైరికల్‌గా అన్నారు. శంకరన్‌గారు తనకు నచ్చని అంశాలను చాలా విట్టీగా చెప్పేవారు. మా మీద అలాంటి విట్టీ కామెం ట్స్ చేసి నవ్వించే వారు.
అందరు మనుషులు సంతోషంగా జీవించాలని మనసారా కోరుకున్న మనిషి తన చావుతో అందరిచేత కళ్ళ నీళ్ళు పెట్టించాడు. ఒకరి మనసును బాధ పెట్టకూడదని సహజంగా నమ్మి, ఆచరించి న మనిషి శంకరన్. ఆయనను తన జ్ఞాపకాలు అనుభవాలు వ్రాయవలసిందిగా చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులు కోరారు, అక్టోబర్ 6న సాయంత్రం ఏడు గంటలకు ఆయనను కలుసుకున్నాను. ఒక గంటకంటే ఎక్కువ కూచుని చాలా విషయాల మీద మాట్లాడుకున్నాం.
ఆ రోజు ఒక తెల్లటి చొక్కా (ఆయన మనసులాంటిదే) వేసుకుని నా ముందు కూచున్నారు. ఆ సందర్భంలో అరుణారాయ్ మీద, వరంగల్ జాయింట్ కలెక్టర్ కరుణ గారి మీద అవసరాన్ని బట్టి మాట్లాడవలసి వచ్చింది. ఆయనకు చాలా ప్రీతిపాత్రమైన వారు చాలా మంది ఉన్నారు కాని ఆ రోజు వాళ్ళెంత మంచి వాళ్ళో అని ఆ ఇరువురి గురించి చెప్పాడు. వరంగల్‌కు వచ్చి, బాలగోపాల్ మీద పర్స్‌స్పెక్టివ్స్ ప్రచురించిన 'రాజ్యం-సంక్షేమం-బాలగోపాల్ ప్రసంగాలు' ని ఆవిష్కరించాలని ఆయనను కోరాను.
బాలగోపాల్ వ్రాసిన రచనలు 11, 12 సంపుటాల దాకా ఉన్నాయ్ అని అంటే 'అమ్మ అంత వ్రాశాడా!' అన్నారు. దానికి జవాబుగా మీకు కూడా చాలా సంపన్నమైన అనుభవం ఉంది, మీరు సమాజంతో పంచుకోవలసిన అనుభవాలూ ఉన్నాయి, మీరు చెప్పే అభిప్రాయాలని, అనుభవాలని సమాజం గౌరవ పూర్వకంగా చదువుతుంది అని అంటే నవ్వి ఊరుకున్నారు. చివరి కి మనకు జ్ఞాపకాలను మాత్రమే వదిలి వెళ్ళారు. ఆయనతో అనుభవాలు, ఆయన జీవితం సమాజం మీద వీచిన ఒక పరిమళమైన తూర్పుదిక్కు గాలిలా అనిపిస్తుంది. -జి.హరగోపాల్
No comments:
Post a Comment