Tuesday, September 6, 2011

సమస్యలపై పోరాటాలే మార్గం - శ్రీరాముల శ్రీనివాస్ Andhra Jyothi 09/04/2011


సమస్యలపై పోరాటాలే మార్గం
- శ్రీరాముల శ్రీనివాస్

మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ఆర్. వినీల్‌కృష్ణను మావోయిస్టు పార్టీ అపహరించి ప్రభుత్వం ముందు పద్నాలుగు డిమాండ్లను ఉంచింది. వాటిలో తమ పార్టీ కార్యకర్తలతో పాటు ఒరిస్సాలోని వివిధ జైళ్లలో నక్సలైట్ల పేరుమీద నిర్భందించిన చాసీమూలీ ఆదివాసీ సంఘ్ (ఆదివాసీ రైతుకూలీ సంఘం) కార్యకర్తలను, అమాయక ప్రజలను విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసింది.

అంతకుముందు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ సుందర్‌గఢ్, చాందీపోష్, నారాయణపట్నా, బంధుగాం, కోరాపుట్, మల్కన్‌గిరి, కలిమెల ప్రాంతాల్లో వేల సంఖ్యలో ప్రజలు కదిలి ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబీకులు, బంధువులు, వివిధ ప్రజాసంఘాలు, ప్రజలు తమ వారిని విడుదల చేయాలని రాస్తారోకోలు, రోడ్డు దిగ్బంధనలు, ధర్నాలు, ఊరేగింపులు అనేకమార్లు చేపట్టారు.

కలెక్టర్లకు మెమోరాండాలు సమర్పించారు. పోలీసులు కరుడుగట్టిన మావోయిస్టులను అరెస్టు చేసినట్లుగా చెప్పుతుంటే మీడియా, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, ప్రజలు వారం తా అమాయకులేనని ధ్రువీకరిస్తున్నారు. పాయకమాల్ ఎదురుకాల్పుల ఘటన లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపిన ఘటన పోలీసుల బూటకత్వాన్ని చాటి చెబుతుంది.

నేను మల్కన్‌గిరి జైలుకు వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రత్యక్ష, పరోక్ష సంఘటనలు తెలియజేస్తున్న విషయాలను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పేద అమాయక ఆదివాసీ బిడ్డలపై దేశద్రోహం, కుట్ర, ఆయుధాలు కల్గి ఉన్నారన్న సెక్షన్లతో ఏళ్లకొద్దీ జైళ్లలో బంధిస్తున్న విషయం అర్థయయింది.

మరోకోణంలో ఈ చర్యలన్నీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచిపెట్టడానికి చేపడుతున్న దుర్మార్గపూరి త ప్రయోగాలేనని స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతున్నవే ఈ అక్రమ అరెస్టులు. మెజిస్ట్రేట్, జడ్జీలను పౌరహక్కులను రక్షించమని కోరితే మాకు ఆ ఆధికా రం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల వైపు చూపడం తప్పా చేసింది ఏమీ లేదు.

జైళ్ల శాఖ అత్యున్నత అధికార్ల నుంచి, డీపీఓ, తాసీల్దార్, జాయింట్ కలెక్టర్లు మొదలు కిడ్నాప్‌కు గురైన కలెక్టర్ వినీల్‌కృష్ణ వరకు తమ అసంతృప్తి, అసహాయతలను వ్యక్తం చేయడమేగాక అక్రమం అని మాట్లాడిన సంఘటనలు అనేకం. 21-02-2011న నాతో పాటు మరో 12 మందిపై 2005నాటి ఎదురుకాల్పు ల కేసును 10 మంది అమాయకులపై పెట్టారు.

వారు విడుదల కాకుండా ఆపడం కోసం కుట్ర పద్ధతిలో ఆ కేసు పెట్టి కోర్టుముందు హాజరుపర్చారు. మాకు ఎస్కార్ట్ ఆఫీసర్‌గా వచ్చిన ఠాణా అధికారి ఐఐసి(సీఐ) రామకృష్ణపతిని ఎందుకు అమాయకులను వేధిస్తున్నారు అని అడుగగా సంఘటనలు జరిగాయి కాబట్టి కేసులు పెడుతున్నాము అని మాట్లాడడం విచారకరం. మరో విచిత్రమేమంటే 2009లో సర్పంచ్‌గా పోటీ చేసిన వ్యక్తిపై ఎలాంటి కేసులు లేవు అని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన పోలీసులే ఈ కేసులో అతన్ని కూడా ఇరికించారు.

నాపై 26 జూలై 2007న పోలీసులు రెండు కేసులు ఆరోపించారు. నాపై పెట్టిన తప్పుడు కేసులను నవంబర్ 30,2009 నాటికి గౌరవ అదనపు జిల్లా జడ్జి (ఎఫ్.టి.సి) విచారణ జరిపి నిర్దోషిగా ప్రకటించిన రాత్రే... మరోకేసుపై పోలీసులు వారెంట్‌ను జారీ చేసి జైలుకు పంపారు. నాపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు.

దాంతో నేను జైలు సూరింటెండెంట్ ద్వారా పోలీస్ సూరింటెండెంట్‌కు 'నాపై ఎన్ని కేసులు పెట్టాలనుకుంటున్నారో ఒకేసారి పెట్టమ'ని కోరుతూ పిటిషన్ రాసి పంపించాను. నాపైనే గాక అమాయకులైన ఆదివాసులపై ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్క కేసు చొప్పున పెడుతూ పోలీసులు వేధిస్తున్నారు. విడుదల అయిన వారిని గేట్‌దగ్గరే అరెస్టు చేసి మరోకేసు పెట్టి మళ్లీ జైలుకు పంపిస్తున్నారు.

ప్రాథమిక హక్కుల, మానవహక్కులను రక్షించమని కోరుతూ ఒడిసా ముఖ్యమంత్రి, కేంద్ర న్యాయశాఖమంత్రి, ఒడిసా రాష్ట్ర న్యాయశాఖమంత్రి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, జైళ్లశాఖ ఐజీ, జాతీయ మానవహక్కుల సంఘం, రాష్ట్ర మానవహక్కుల సంఘం, పీపుల్స్‌వాచ్, మల్కనగిరి జిల్లా కలెక్టరు, పోలీసు సూపర్‌డెంట్- అనేక పిటిషన్లను పంపించాము. వ్యక్తిగా, వ్యక్తులుగా, సామూహికంగా హక్కుల కోసం జైలుసంస్కరణలను అభిలషస్తూ, సమస్యల పరిష్కారానికి 2009 సెప్టెంబర్ 15, 2010 జనవరి26, 2010 ఏప్రిల్ 30, 2010 ఆగస్టు15, 2010 సెప్టెంబర్ 15, 2010 అక్టోబ ర్4, 2011 మార్చి22లలో ఆమరణ నిరాహారదీక్షలకు పూనుకున్నాము.

రాజ్యాం గం, చట్టబద్ధంగా ప్రజాస్వామిక ఆకాంక్షలతో పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకై డిమాండ్ చేశాము. 1) పోలీసులు ఆరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చకుండా రోజుల తరబడి పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని మానుకోవాలి. మొత్తం ఘటనలపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.

2) ముద్దాయిలపై ఎలాంటి కేసులు లేకున్నా పోలీసులకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మూడు లేదా నాలుగునెలల వ్యవధిలో మరొక తప్పుడు కేసును పెడుతూ విడుదల కాకుండా చేస్తున్నారు. ఏదేని పరిస్థితులలో విడుదలైనా జైలు గేట్ దగ్గరే అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపుతున్నారు. 2010 జూలై31న విడుదలైన అడ్మాకోవాసి,దేవా మడ్కామి, నందా, పొడియామీలను జైలుగేట్ దగ్గరే అరెస్టు చేసి ఆగస్టు 1వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు మళ్లీ జైలుకు పంపారు. ఆగస్టు 30న విడుదలైన కావటం, జోగా, మల్లా, మడ్కామిల 31వ తేదీన విడుదలైన కన్నా, పొడియామీలను జైలు గేట్ దగ్గరే అరెస్టు చేసి సెప్టెంబర్ 1వ తేదీన ముగ్గుర్ని కలిపి మరోకేసులో ఇరికించి జైలుకు పంపారు.

3) చార్జీషీట్‌ను పెట్టకుండా పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారు. అందుకుగాను కోర్టును వాయిదా కోరుతున్నారు. డబ్బులు లంచంగా ఇచ్చుకోగలిగిన వారిపై ఎలాంటి కేసు ఉన్నప్పటికీ రెండు నెలల్లో చార్జీషీట్‌ను కోర్టుకు సమర్పిస్తున్నారు. డబ్బులు ఇవ్వడంలో తేడా వచ్చినా లేదా ఇచ్చుకోలేకపోయినా వారికి చార్జీషీట్ ఇవ్వడం లేదు. వీలైనంత త్వరగా చార్జీషీట్‌లు ఇచ్చేలా చూడాలి. సమయానికి ఇవ్వకపోతే రివ్యూ జరపాలి.

4) డబ్బు ఉన్న వారు హైకోర్టుకు వెళ్లి బెయి ల్స్ పొందుతుంటే అదే తీవ్రత, తక్కువ తీవ్రత కలిగిన వారు పేదరికం కారణంతో జైళ్లలో సంవత్సరాల కొద్దీ మగ్గుతున్నారు. సెషన్స్‌కోర్టులో బెయిల్స్ ఇచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేయాలి.

5) సత్వర విచారణ ముద్దాయికి రాజ్యాంగపరంగా లభించిన హక్కు. ఈ ముఖ్య ఉద్దేశానికి తిలోదకాలు ఇస్తూ చిన్న చిన్న కారణాలతో కేసుల విచారణ సంవత్సరాలు నడుస్తోంది. ఒక్క ఐవో రాకపోవడంతో ఐదేళ్లు జైలులో బందీలుగా ఉంచి చివరికి నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. కెమికల్ లేదా రిపోర్టుల పేరుతో సంవత్సరాలుగా జాప్యం జరుగుతోంది. జాప్యాలను నివారించి ముద్దాయిల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి.

6) వివిధ జైళ్లలో వేరు వేరు కారణాలతో చనిపోయిన శిక్ష లేదా విచారణ ఖైదీల కుటుంబాలకు ప్రభుత్వ స్కీమ్‌లను, ఉచిత వైద్యం, విద్యను వర్తింపజేయాలి. 2010సెప్టెంబర్ 15న మల్కన్‌గిరి జైలులోని విచారణ ఖైదీలందరం ఆమర ణ దీక్షకు పూనుకోగా కోరాపూట్ నుంచి డీపీవో, వెల్‌ఫేర్ ఆఫీసర్లు వచ్చి మొత్తం విషయాలపై ముద్దాయితో చర్చించారు.

ఆ తర్వాత మా డిమాండ్లను జిల్లా ఎస్పీ, లాయర్లు, మెజిస్ట్రేట్, జడ్జీలను కలిసి చర్చించినా ప్రయోజనం లేకుండాపోయింది. మూడు నెలలు గడకుండానే మరికొన్ని కేసులు నమోదు చేయడం, అరెస్టులు ప్రారంభమైనాయి. ఎవరికి ఎన్ని పిటిషన్లు రాసినా, ఎన్నిసార్లు నిరాహారదీక్షలు చేపట్టినా ఎవరికి వారు తప్పించుకుంటూ నష్టం జరగుతు న్న ప్రాథమిక, మానవహక్కులకు మాత్రం ఎలాంటి హామీ లభించని విషాదకరమైన పరిస్థితి. పోలీసుల రాజ్యాంగ, చట్ట వ్యతిరేక కార్యక్రమాల కు వ్యతిరేకంగా, ప్రాథమిక హక్కుల రక్షణకు చివరి అవకాశంగానే కిడ్నాపులు జరుగుతున్న విషయాన్ని గుర్తించని కృష్ణారావు లాంటి మేధావులు విమర్శలకు పాల్పడడం హాస్యాస్పదం.

కిడ్నాప్ లాంటి చట్టవ్యతిరేక చర్యలు లేకుండా పోవాలంటే మావోయిస్టుల సమస్యను రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా చూస్తూ రాజకీయ పరిష్కారాలను వెదకాలి. పట్టుకొని కాల్చిచంపడం, నిషేధాలు విధించడం, అక్రమ అరెస్టుల వంటి అధికారిక హింసను వెంటనే ఆపాలి. దేశంలోని వివిధ జైళ్లలో నిర్బంధించిన మావోయిస్టు కార్యకర్తలతో పాటు, ప్రజాసంఘాల కార్యకర్తలను, ప్రజలను బేషరతుగా విడుద ల చేయాలి.

కలెక్టర్ కిడ్నాప్ తరువాత మధ్యవర్తుల సమక్షంలో కుదిరిన ఒప్పందాలకు బద్దులై, మావోయిస్టు పార్టీ సంయమనం పాటిస్తోంది. అయితే కొంత మంది పోలీసు అధికారులు, బీజేపీ, శివసేన వంటి మతతత్వ శక్తులు రకరకాల తప్పుడు ప్రచారాలను చేస్తూ, పరిస్థితిని వికటించేలా చేస్తున్నారు. కేంద్రం, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో సంయుక్త బలగాలతో కలిసి కూంబిం గ్ నిర్వహిస్తూ ఒప్పందాలను అతిక్రమిస్తున్నాయి.

కేంద్ర , ఒడిసా రాష్ట్ర ప్రభుత్వాలు, మధ్యవర్తుల సమక్షంలో జరిగిన ఒప్పందా ల ఆధారంగా పరిస్థితిని సమీక్షించి రాజకీయ ప్రక్రియగా మావోయిస్టులతో వెంట నే చర్చలు ప్రారంభించాలి. జైళ్లలో ఉన్న మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగా మధ్యవర్తిత్వం వహించేలా తగు చర్యలను తీసుకోవడం ద్వారా హింస తగ్గుముఖం పట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాస్వామిక వాదు లు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాలు కృషి చేయాలి. వివిధస్థాయిలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వాల, వాటి విభాగాల నిరంకుశ వైఖరులకు వ్యతిరేకంగా పోరాడిల్సింది గా, ప్రజాస్వామిక ఆకాంక్షలతో చేపడుతున్న మా పోరాటాలకు, హక్కుల పరిరక్షణకు మద్దతుగా నిలబడాలి.
- శ్రీరాముల శ్రీనివాస్
మావోయిస్టు రాజకీయ ఖైదీ

No comments:

Post a Comment