Monday, September 12, 2011

దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi 13/09/2011దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే

- మంద కృష్ణ మాదిగ

వందల సంవత్సరాలు స్వతంత్ర రాజ్యంగా పిలువబడ్డ హైదరాబాద్ గత శతాబ్దిలో కొన్నేళ్ళు హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగింది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణలోని అగ్రవర్ణ భూస్వాములు, సీమాంధ్ర అగ్రవర్ణ భూస్వాములతో మిలాఖతై చేసిన ద్రోహం వల్ల తెలంగాణ ఆంధ్రలో విలీనమయింది; 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ జనాభాలో 85 శాతంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రావలసిన న్యాయమైన వాటా ఏ రంగంలోనూ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన మొదలు నేటివరకు ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన వారిలో దామోదరం సంజీవయ్య పాలన రెండేళ్ళు మినహాయిస్తే గత యాభై మూడేళ్ళ పరిపాలన మొత్తం అగ్రవర్ణాల నేతృత్వంలోనే సాగింది. అధికారం అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల రాష్ట్ర జనాభాలో 85 శాతంగా ఉన్న అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో వివక్షకు, దోపిడీకి గురయ్యారు.

మొత్తం పరిపాలనలో మూ డు ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యమంత్రులుగా అధికారం చెలా యించిన వారూ అగ్రవర్ణాల వారైతే, మూడు ప్రాంతాల అణగారిన వర్గాల వారికి అధికారం అందకుండా పూర్తిగా వెనక్కి నెట్టారు. 'దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు - మూడు ప్రాంతాల అగ్రవర్ణాలు అధికారాన్ని పంచుకున్నారు'. ముఖ్యమంత్రులైన వారే కాకుండా మంత్రుల సంఖ్య చూసినా ఎమ్మెల్యే, ఎంపీల సంఖ్యలను చూసినా శాసనసభ స్పీకర్ల సంఖ్య చూసినా అగ్రవర్ణాల ఆధిపత్యం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది.

రాజకీయ అధికారం చేతిలో పెట్టుకొని పరిపాలనా యంత్రాంగాన్ని వారి వర్గాలతో నింపుకొని ఆంధ్రప్రదేశ్‌ను కొల్లగొట్టి దోచుకొంటున్నారు. కొల్లగొట్టబడిన దోపిడీ సొమ్ములో పంచుకునే వాటాలలో తేడా ఉండవచ్చు. ఆ తేడా వచ్చిన సందర్భాల్లో వారిలో అభిప్రాయ బేధాలు పొడచూపవచ్చు. ఆ అభిప్రాయ భేదాలను ప్రాంతీయ వివక్ష కోణంగా సమాజానికి చూపెట్ట వచ్చు. ఆ పేరుతో వారి వారి ప్రాంతాల ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టే జై ఆంధ్రా, జై తెలంగాణ లాంటి ఉద్యమాలు గతంలో రావచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ఆధిపత్యానికై అగ్రకులాల వారు, రాష్ట్ర సాధన ముసుగులో తెలంగాణ ప్రజలందరి పక్షాన పోరాడినట్లు కనిపించవచ్చు. తెలంగాణ భౌతిక వనరులను కొల్లగొట్టి మూడు ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని య«థేచ్ఛగా తమ దోపిడీని కొనసాగించడం కోసం రాయలసీమ, ఆంధ్ర అగ్రవర్ణాల పెట్టుబడిదార్లు మాత్రమే సమైక్యాంధ్రను కోరుతున్నట్టు బయటికి కనిపించవచ్చు. అంతిమంగా మూడు ప్రాంతాల అగ్రవర్ణాల వారి లక్ష్యం దోపిడీ సొత్తును పంచుకోవడానికి తమ రాజకీయ ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి మాత్రమే అని స్పష్టమవుతుంది.

ఈ 53 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు విద్యా, ఉద్యోగ రంగాలలో ఉన్న రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయకుండా అగ్రకుల రాజకీయ నాయకులు, అగ్రకుల అధికారులు, నిరంతరం అడ్డుతగిలారు, తగులుతున్నారు. రిజేర్వేషన్ల అమలును పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ అణగారిన వర్గాలకు సంక్షేమ నిధులు కేటాయించవలసింది 85 శాతం అయితే 15 శాతం కూడా కేటాయించడం లేదు. కేటాయించడం 15 శాతం అయినా కేటాయించిన మొత్తం బడ్జెట్‌ను ఖర్చుపెట్టకుండా ఈ వర్గాలకు రావలసిన ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను కూడా ఇతర వర్గాల ప్రయోజనాల కోసం దారి మళ్ళిస్తున్నారు.

మరోవైపు ఈ అణగారిన వర్గాల 'ఆత్మగౌరవాన్ని' దెబ్బతీసే విధంగా అగ్రవర్ణాల వారు తమకున్న అధికార బలంతో దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు; 55ఏళ్ళలో అనేక హత్యలు, హత్యాచారాలకు పాల్పడుతు వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే '55 సంవత్సరాల సమైక్యాంధ్ర పరిపాలన మొత్తం మూడు ప్రాంతాల అగ్రవర్ణాల భూస్వాముల ఆధిపత్య పరిపాలనే' జాతీయోద్యమ కాలంలో డాక్టర్ అంబేద్కర్ పోరాడి సాధించిన చట్టసభల ప్రాతినిధ్యం ఎస్‌సి, ఎస్‌టిలకు దక్కింది.

ఈ ఇరువర్గాలకు కేటాయించిన రిజర్వుడు స్థానాలను మినహాయించి మూడు ప్రాంతాలలోని జనరల్ స్థానాలలో అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతుంది. మొత్తం స్థానాల్లో దక్కాల్సిన 50 శాతం ప్రాతినిధ్యం బిసి వర్గాలకు దక్కలేదు. మొత్తం స్థానాలలో దక్కాల్సిన 12 శాతం రాజకీయ ప్రాతినిధ్యం మైనార్టీలకు దక్కలేదు. బిసి, మైనార్టీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా పోవడానికి రాజకీయంగా బిసి మైనార్టీలను వెనక్కినెట్టి వేయడానికి అగ్రవర్ణాలే కారణం. ఇది వాస్తవం.

తెలంగాణలో 62 శాతం రాజకీయ వాటా బిసి, మైనార్టీలకు దక్కాల్సివుండగా కేవలం పది శాతంగా ఉన్న మూడు అగ్రవర్ణాల వారు దోచుకొని పంచుకుకొంటున్నారు. అదే విధంగా కోస్తాంధ్రలో బిసి మైనార్టీలకు దక్కాల్సిన రాజకీయ వాటా రెండు లేదా మూడు అగ్రకులాల వారే పంచుకొంటున్నారు. ఇక రాయలసీమలో కూడా బిసి, మైనార్టీలకు దక్కాల్సిన వాటాను రెండు అగ్రకులాలే పంచుకొంటున్నాయి. మూడు ప్రాంతాల అగ్రకులాలు దోపిడీ మనస్తత్వంతోనే ఉన్నాయని స్పష్టంగా తేలింది.

ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సాధనకై జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న అగ్రకులాలు, తెలంగాణ వస్తే బిసి, మైనార్టీల వాటా ముందే అంగీకరించకపోతే, రేపు ఏర్పడబోయే తెలంగాణలో కూడా అగ్రకులాల వారు తమ రాజకీయదోపిడీని కొనసాగిస్తారు. ఆ రాజకీయ దోపిడీని కొనసాగిస్తే వచ్చేది మాత్రం 'దొరల రాజ్యమే'. బిసి మైనార్టీలు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంలో నష్టపోయిన విధానమే సమైక్యాంధ్ర రాష్ట్రంలో కూడా ఈనాటికీ తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతుంది.

ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్‌లో 1952లో జరిగిన ఎన్నికలలో వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందో గమనించి, యాభై ఏళ్ళ తర్వాత కూడా పరిస్థితులలో పెద్దమార్పు ఏమీలేదని 2009 ఎన్నికలలో సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. అదే విధంగా సీమాంధ్ర ప్రాంతంలో కూడా గత 56 ఏళ్ళలో ఆనాటి, ఈనాటి వాస్తవ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని చూడండి: పట్టికలో పేర్కొన్న జనరల్ స్థానాలలో వివిధ సామాజిక వర్గాల వారి ప్రాతినిధ్యాన్ని గమనిస్తే మూడు ప్రాంతాల్లో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటివరకు రెండు లేదా మూడు జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రం మొత్తం మీద 10 లేక 15 శాతంగా ఉన్న అగ్రకులాల వారి రాజకీయ ఆధిపత్యమే కొనసాగుతుంది.

తెలంగాణ కోరే అగ్ర వర్ణాల దొరలు రేపటి తెలంగాణలో బిసి, మైనార్టీల వారి వాటా తేల్చగలరా? సమైక్యాంధ్రనే కోరే అగ్రవర్ణాలు రాయలసీమ, కోస్తాంధ్రలోని బిసి మైనార్టీల రాజకీయపరమైన వాటాను ఇప్పటికైనా ఇవ్వగలరా? మాకు రావలసిన వాటా మాకు ఇవ్వకుండా మేమెందుకు మీ నాయకత్వాన్ని అంగీకరించాలి? తెలంగాణ కావాలని కోరుతున్న అగ్రవర్ణ నాయకులారా, వచ్చే తెలంగాణలో మా వాటా ఎంతో తేల్చకుండా మీ నాయకత్వాన్ని మేమెందుకు అంగీకరించాలి? తెలంగాణలోనైనా, సీమాంధ్రలోనైనా అణగారిన ప్రజలు అందరూ సమైక్యమై తమ తమ ప్రాంతాలలోని అగ్ర వర్ణాల నాయకత్వాన్ని ప్రశ్నించే స్థితికి ఎదగాలని, గుడ్డిగా ఎక్కడైనా వారి నాయకత్వాన్ని అంగీకరించకూడదని పిలుపునిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించాలి; స్వాగతించాలి. అయితే తెలంగాణ లోనైనా, సీమాంధ్రలోనైనా దొరల, అగ్రవర్ణాల పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ సామాజిక తెలంగాణను, సామాజిక సీమాంధ్రలను సాధించాల్సిందే. ఆ లక్ష్య సాధనకై ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందిన మూడుప్రాంతాల ప్రజలు సంఘటితం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ, సీమాంధ్ర అగ్రవర్ణ రాజకీయ నాయకులకు మధ్య కుటుంబపరమైన, వ్యాపారపరమైన సంబంధాలు ఇప్పటికీ కొనసాగతూనే ఉన్నాయి. దోచుకున్న సంపద పంచుకునేకాడ వారి మధ్య వచ్చిన ఘర్షణే తప్ప, దోచుకునేకాడ దొరలంతా ఒక్కటే!

- మంద కృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

No comments:

Post a Comment