Thursday, September 22, 2011

సమ్మెచేసే హక్కు లేదా? - ఎండి. అన్వర్ Andhra Jyothi 23/09/2011


సమ్మెచేసే హక్కు లేదా?
- ఎండి. అన్వర్

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణంగా చూపుతున్న భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, ఆధిపత్య విషయాలు, అభివృద్ధిలో అసమానతలు-స్వయంపాలన ఆకాంక్షలు పూర్తిగా న్యాయమైనవి. దాదాపు యాభై ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రాన్ని పాలకులు ఏనాడో పరిష్కరించాల్సి వుంది. ఆ పని ఇప్పటికీ చేయని పాలకులే ఇక్కడి విద్యార్థులు ఆత్మహత్యలకు, నేటి ఆందోళనల నష్టాలకు అసలు దోషులు.

రాజకీయపరమైన సమస్యలకు చారిత్రక, శాస్త్రీయతతో కూడిన న్యాయమైన శాశ్వత పరిష్కారాలు అమలుచేసే దృష్టి కోణం మన పాలకులకు లేకపోవడం ప్రజలకు పట్టిన దురదృష్టం. సర్వరోగ నివారిణి 'పెన్సిలిన్' పాతమాటే కావచ్చుకాని మన పాలకులకు మాత్రం ప్రతి సమస్యకు పరిష్కారం మాత్రం 'పోలీసులే'. ఈ విధానాన్ని మొదటి నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల పైన పాలకులు అమలుచేస్తూ వస్తున్నారు. 1997లో తెలంగాణ కోసం ఉద్యమాలు చేయాలన్న ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెంట్ ఫోరం వరంగల్ డిక్లరేషన్ సభలకు, 1999లో తెలంగాణ జన సంఘటన కరీంనగర్ సభలకు అనుమతులు ఇస్తూనే ఆటంకాలు, అరెస్టులు జరిపింది పోలీసులే.

నల్గొండ జిల్లాలో తెలంగాణ కళాకారిణి బెల్లి లలిత హత్య అనంతర ం జరిగిన పరిణామాలు 'తెలంగాణ' అంటే నక్సలైట్లుగా ముద్రపడి చస్తూ బ్రతకాలనే హెచ్చరికలతో ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలువరించింది కూడా పోలీసులే. ఇటీవల ఉస్మానియా విద్యార్థులపై, మీడియా పైన పోలీసులు విరుచుకుపడి కొట్టిన తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే అంతగా తాయిలాలు, సత్కారాలు అందుతాయనే నమ్మకాన్ని మన ప్రభుత్వం నక్సలైట్ల అణచివేతలో ఆచరణాత్మకంగా నమ్మకం కలిపించినందున మన పోలీసులు అవకాశం వస్తే చాలు తమ నరకలోక ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నారు. సకల జనుల సమ్మె మొదలయి పది రోజులయింది.

దక్షిణ భారతదేశ పారిశ్రామిక రంగానికే ఆయువు పట్టులాంటి సింగరేణిలో బొగ్గుగని కార్మికులు మొదటి రోజు నుంచే నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మె వల్ల సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1 లక్షా 60 వేల టన్నుల (రూ. 25 కోట్ల విలువ) బొగ్గు ఉత్పత్తి నిలిచి పోతుండగా రోజుకు 15 కోట్ల రూపాయల వేతనాలను 66 వేల మంది కార్మికులు, తెలంగాణ సాధన కోసం తెలిసే కోల్పోతూ సమ్మెలో పాల్గొంటున్నారు. సకల జనుల సమ్మెలో ఉన్న ఇతర రంగాల ఉద్యోగుల పనిని ప్రభుత్వం ఎవరితోనైనా చేయించగలదు. కాని బొగ్గు ఉత్పత్తి పనిని మాత్రం ఎవరు చేయలేరు. శారీరక దారుఢ్యం ఉన్న పోలీసులు కూడా చేయలేరు.

అందుకే సకల జనుల సమ్మెలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులను పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇండ్లలో ఉన్నవారిని పట్టుకుని బొగ్గుగనుల వద్దకు తీసుకు వస్తున్నారు. ఇది గోదావరిఖనిలో ఆదివారం నాడు జరిగింది. సోమవారం నాడు పోలీసుల నిర్బంధంలో ఉన్న కార్మికులచే బలవంతంగా మణుగూరు, ఇల్లందులో పనిచేయిస్తుండగా అడ్డుకున్న కార్మిక నాయకులపై పోలీసులు లాఠీచార్జి జరిపి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నాడు సమ్మెను పరిశీలిస్తున్న జేఏసీకి చెందిన ఇరవై మంది నాయకులను గోదావరిఖని పోలీసులు అరెస్టు చేశారు. అదుపులో ఉన్న కార్మికులచే పనిచేయించి ఉత్పత్తి సాధించామనిపించుకోవచ్చు.

కాని ఆ కార్మికులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ప్రాంతీయ రాగద్వేషాలు పెరిగే అవకాశం లేదా? ఈ విద్వేషాలు ఇక్కడికే పరిమితమైపోతాయా? వాటి పరిణామాలు ఎంతటి హింసకు దోహద మౌతాయో 1969 ఉద్యమంలో కనిపించలేదా? ఒక డంపర్‌కు ఒక జవాన్ కూర్చొని కార్మికునితో నడిపిస్తాడు. ఇక్కడ స్వేచ్ఛగా కార్మికుడు పనిచేస్తున్నట్లా? తుపాకి భయానికి తన పోరాట స్వేచ్ఛను కోల్పోతున్నట్లా? ఒకరోజు పనికి మూడు రోజుల వేతనం ఆశ చూపుతున్నారు. ఇది పూర్తి నీతి బాహ్యమైన చర్య గతంలో కూడా సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెచేస్తే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు పరిచింది.

బొగ్గు బావులు కార్మికులు నివసిస్తున్న కాలనీలకు నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సమ్మెలో ఉన్న కార్మికులు ఇండ్లలోనే ఉంటారు. వారు ఏ నేరం చేసే అవకాశం లేకపోయినా పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు? ఈ చర్యలు చట్టవిరుద్ధం కాదా? 'సమ్మె' కార్మికునికి ప్రభుత్వానికి సంబంధించిన విషయం. పరిష్కారానికి కార్మికశాఖ అధికారులు ఉంటారు. సంప్రదింపులు వాటిలో భాగం. పని చేయాలనే బాధ్యత ఉన్నందున కార్మికులు సమస్య పరిష్కారానికి ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ప్రజా ప్రతినిధుల ద్వారా ఒత్తిడి పెడుతుంటారు.

కార్మికులకు వారికి ప్రాతనిధ్యం వహించే కార్మిక సంఘాలకు ఈ అవకాశం కూడా లేకుండా అరెస్టుల జులుం ఏమిటి? తెలంగాణ కోసం అందరు కాకపోయినా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు రాజీనామాలు చేసి పనులు వదిలి నిరసన తెలిపారు. అదే పనిని తెలంగాణ బొగ్గుగని కార్మికులు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిర్బంధంలోకి తీసుకుని పోలీసులు ఎందుకు పనిచేయించలేదు? వారు పదవులు వదిలితే త్యాగధనులు; వారికి సభలు, సత్కారాలు! కొలువులు వదలక కేవలం సమ్మెలోకి వెళితే కార్మికులు, ఉద్యోగులు, సకల జనులు మాత్రం పోలీసుల దృష్టిలో నేరస్థులవుతున్నారు. ఈ రాష్ట్రంలో సమ్మెచేసే హక్కును కూడా ప్రభుత్వం పోలీసులతో ఎన్‌కౌంటర్ చేయిస్తున్న విషయం సింగరేణి కార్మికులను కలిస్తే తెలుస్తుంది.

రాజకీయ, ఆర్థిక, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కార్మికులకు సమ్మె తప్ప మరే విధమైన మార్గం లేదు. సమ్మెలు, హర్తాళ్లు దేశ స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని పెంచిన పోరాట రూపాలే. వాటి వెనుక ఉన్న ఆకాంక్షలను గుర్తించి పరిష్కరించడమే నేటి గణతంత్ర సంక్షేమ ప్రభుత్వ నేతల బాధ్యత. సమ్మె కార్మికుని హక్కు. ఈ హక్కుకు రక్షణ కల్పించడమే పోలీసుల బాధ్యత. ప్రజాస్వామిక దేశంలో ప్రజల పని ఓట్లు వేయడం వరకే, తోచిన రీతిలో పాలన చేస్తాం అన్నట్లు పాలకులు ప్రవర్తించడం సరికాదు. తెలంగాణ వ్యాప్తంగా సకల జనులు చేస్తున్న సమ్మె కాంక్షను కూడా పాలకులు గౌరవిస్తూ పరిష్కరించవల్సిందే. అందుకు తెలంగాణ ఏర్పాటుకై రాజకీయ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడమే ఆందోళనలకు పరిష్కారం.

- ఎండి. అన్వర్
మానవ హక్కుల కార్యకర్త

No comments:

Post a Comment