Wednesday, September 7, 2011

అవినీతిని వ్యతిరేకిస్తే సరా? - ఆర్. ఉమామహేశ్వరి Andhra Jyothi 08/09/2011


అవినీతిని వ్యతిరేకిస్తే సరా?
- ఆర్. ఉమామహేశ్వరి

అవినీతిపై వ్యతిరేకత సరే, నిర్బంధ స్థానభ్రంశం, పేదరికం, పేదల అణచివేత, మరణ శిక్ష, మతతత్వ ఫాసిజం ఇత్యాది అమానుష దారుణాల నుంచి ప్రజలను రక్షించడానికి ఉద్యమాలేవీ? అవినీతిపై ప్రజ్వరిల్లినంత తేలిగ్గా, ఆందోళన, ఆ అనాగరిక అంశాలపై ఎందుకు చెలరేగలేదు? పోనీ, మణిపూర్ ఆడపడుచు ఇరోమ్ షర్మిల దశాబ్దంకు పైగా ఎందుకు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారో అర్థం చేసుకున్నవారు అన్నా హజారే మద్దతుదారులలో ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానాలు లభించవు.

కారణాలు స్పష్టమే. (అ) వివిధ 'అభివృద్ధి' ప్రాజెక్టుల మూలంగా నిర్వాసితులవుతున్న నిర్భాగ్యులు, అణచివేత, పేదరికం, మతతత్వం, ఈశాన్య భారత రాష్ట్రాలలో సైనిక దళాల దురాగతాలు (వీటికి వ్యతిరేకంగానే షర్మిల పోరాడుతున్నారు) మొదలైన సమస్యలు అన్నా ఉద్యమానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చిన అసంఖ్యాక ప్రజలకు చాలా దూరమైనవి; (ఆ) ఈ ప్రస్తావిత అంశాలను అవగాహన చేసుకోవడంలో భిన్న దృక్పథాలు ఉన్నందున ఆసేతు హిమాచలం భారతీయులు ముక్తకంఠంతో వాటిని వ్యతిరేకించడం లేదు. లైసెన్స్ కోసమో, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికో, పెన్షన్ పొందడానికో లంచం ఇవ్వక తప్పని పరిస్థితి.

ఇది చాలా మందిని ప్రత్యక్షంగా బాధిస్తుంది. ఇలా స్థానభ్రంశం, పేదరికం, అణచివేత (కుల, లైంగిక, వర్గ) వల్ల వారికి నేరుగా చికాకులేవీ ఉండవు (అని అన్నా ఉద్యమ మద్దతుదారులు భావిస్తున్నారు). అవినీతిపై పోరాటం అనేది చాలా ప్రయాసరహిత వ్యవహారంగా కన్పిస్తుంది. అందుకే కాబోలు అవినీతిపై పోరుకు యావద్భారతమూ ఏకత్రాటిపై నిలబడింది. పాలనా వ్యవస్థలోని నీతి బాహ్యతపై పోరాటం చాలా సరళమైనది; అందరూ 'అర్థం చేసుకొనేంత' సులువైనది; జీవితంలోకి ప్రవేశించని తరుణ వయస్కులు సైతం చిత్తశుద్ధితో వీధుల్లోకి వచ్చారు. అన్నాను దిగివచ్చిన మహాత్ముడుగా ఆరాధించారు.

మన సమాజాన్ని పట్టి పీడిస్తోన్న సకల రుగ్మతల (పైన ప్రస్తావితమైనవి వాటిలో కొన్ని మాత్రమే)ను నిర్మూలించేది అవినీతిపై పోరాటం, జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించడమేనని వారు విశ్వసించారు. అవినీతికి వ్యతిరేకంగా కుల, మత, వర్గాలకు అతీతంగా సకల భారతీయులు సమైక్యంగా చేసిన పోరాటంలో మనకు స్పష్టంగా గోచరమైన వాస్తవం ఒకటి ఉంది. అది, ఒక విధంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనుల్లో అత్యంత బలహీనుడికి ప్రాతినిధ్యం వహించగల ఆదర్శ విధానంగా ప్రజాస్వామ్యపు మరణం. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన ప్రజాస్వామ్యం మధ్యవర్తిత్వం నెరపే ప్రజాస్వామ్యంగా మారిపోయింది.

ఈ పరిణామాన్నే అన్నా ఉద్యమం సూచించింది. అత్యున్నత అధికార స్థానాలలో గల వారి వద్ద 'లాబీ' (ఒక పనిని చేయడానికి గాని, ఒక చట్టం లేదా శాసనం తేవడానికి గాని లేదా మార్చేందుకు గాని ప్రభుత్వ యంత్రాంగంలోని వారిని ఒప్పించడం, శాసనాలలో మార్పు తేవడానికి గాని, వారికి అనుకూలమైన కొన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నచ్చచెబుతూ , ఒత్తిడి తెస్తూ పనిచేసే సంస్థ లేదా ఉద్యమం) చేయగల విద్యాధిక మధ్యతరగతి ప్రజలు నెరపే మధ్యవర్తిత్వమది.

న్యాయ వివాదాల్లో, చట్ట సంబంధ వ్యవహారాల్లో ప్రవేశంలేని వారి తరఫున ఆ విషయాల్లో నిపుణులైన వారు వాదించిన విధంగానే మధ్యతరగతి విద్యాధికులు సామాన్య ప్రజల తరపున మధ్య వర్తిత్వం నెరపుతారన్న మాట. ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలనే విషయమై సగటు పౌరుల తరఫున ఎన్‌జిఓ (ప్రభుత్వేతర సంస్థ)లు మధ్యవర్తిత్వం నెరపడం ప్రారంభమైంది. అన్నా ఉద్యమం ఇందుకొక శోచనీయమైన రివాజును నెలకొల్పింది.

గమనార్హమైన విషయం ఒకటి ఉంది. అన్నా ఉద్యమం 'నిరసన ' ఉద్యమం కాదు. మధ్యతరగతి నిరసన తెలుపదు; అది కేవలం అభ్యర్థిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది (డిమాండ్ అండ్ కమాండ్). ఏదీ పనిచేయనప్పుడు వాస్తవ పరిస్థితిని అంగీకరిస్తుంది. అన్నా ఉద్యమం కలవర పరిచే ప్రశ్నలు వేటినీ తన ముందుకు తీసుకురానందున మధ్యతరగతి ఒక విధంగా ఆ ఉద్యమంతో మమేకమయింది. అవినీతి అనేది 'బాబు'లు అంటే ప్రభుత్వాధికారులు, రాజకీయవేత్తలు పాల్పడేది అని భారతీయ మధ్యతరగతి ప్రజల భావన.

విమర్శించడానికి, దుమ్మెత్తిపోయడానికి అత్యంత తేలిగ్గా లభ్యమయ్యే 'ఇతరులు' వీరే (అధికారులు, రాజకీయవేత్తలు). న్యాయవ్యవస్థ సైతం వీరిని అదే దృక్పథంతో చూస్తుంది. ఋషిసత్తముడుగా ప్రజల్లో పేరు పొందిన వ్యక్తి అన్నా హజారే. నిశితంగా చూస్తే, గణనీయమైన ఆర్థిక వనరులతో సమకూరిన ప్రచారంతో అన్నాకు ఆ ప్రఖ్యాతి లభించిందని అర్థమవుతుంది. చెన్నై వీధుల్లో నేను చూసిన (ముఖ్యంగా మద్దతు తెలుపడానికి ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రదేశాల్లో) అన్నా పోస్టర్లు, విద్యార్థి ఉద్యమాల పోస్టర్ల వంటివి కావు; ఉద్యమాలే నిత్య జీవితంగా ఉన్న కార్యకర్తలు సృష్టించినవీ కావు.

ఆ పోస్టర్లలోని అన్నా బొమ్మలు ఒక నిర్దిష్ట రీతిలో ఉన్నాయి. ముందుగా నిర్ణయించుకొని తీసినవి కాకపోవచ్చు. అయితే వాటి సృష్టి వెనుక ఒక ప్రచారపరమైన వ్యూహం ఉంది. ఫోటోగ్రాఫర్ల పొరపాటు వల్లన కానివ్వండి లేదా ఆ పోస్టర్ల ముద్రణకు ఉపయోగించిన ఖరీదైన పేపర్ వల్లనో అవి అలా కనపడుతున్నాయి. నిజానికి ఇది చర్చనీయాంశం కానప్పటికీ, తప్పక పరిగణనలోకి తీసుకోవల్సి వుంది. ప్రచార వ్యూహాలు, ఉద్యమ కారణాలు, నాయకుల తీరుతెన్నులు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించవల్సిన అవసరమెంతైనావుంది. అన్నా ఉద్యమాన్ని అలా యథాలాపంగా కాకుండా మరింత నిశితంగా చూడక తప్పదు.

అనినీతిని మీరు ఎలా నిర్వచిస్తారు? అన్నా ఉద్యమం చూసిన విధంలో కాకుండా మరో విధంగా దానిని నిర్వచించగలరా? చెన్నైలో యువతీ యువకులు ప్రతి రోజూ త్రివర్ణ పతాకాలను చేతపట్టుకొని వీధుల్లోకి రావడాన్ని చూశాను; ఒక 'గొప్ప' ఉద్యమంలో తాము పాల్గొంటున్నామనే ఒకానొక భావన వారిలో వ్యక్తమయింది. విదేశాల నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్‌లు, విద్యార్థులు సైతం ఉద్యమంలో పాల్గొన్నారు (అని మీడియా వెల్లడించింది). నేను అన్నా గురించి గాని, టీమ్ అన్నా గురించి గాని మాట్లాడడం లేదు.

ఉద్యమాల గురించి, ఉద్యమ రాజకీయాల గురించి, నిర్దిష్ట 'ఇమేజ్'లను సమకూర్చుకోవడం గురించి అవినీతి నిర్మూలనా ఉద్యమం ఆలోచనాపరుల మనస్సుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇది ఆధునిక మధ్యతరగతి ఉద్యమం. సహేతుక లేదా తప్పుడు కారణాలతో, జాతి హిత లేదా వర్గ స్వార్థ లక్ష్యాలకు, మంచి లేదా తప్పుడు మార్గాలలో సాగిన అవినీతి నిర్మూలనా ఉద్యమం ఇటీవలి కాలంలో మరే ఉద్యమం ఆకర్షించని విధంగా మధ్యతరగతి ప్రజలను విశేషంగా ఆకట్టుకొంది.

ఈ ఉద్యమ ప్రజ్వలనలో మీడియా పెద్ద పాత్ర పోషించినప్పటికీ, అందులో పాల్గొన్నవారందరూ మంచి స్థితిపరులే అయినప్పటికీ మధ్యతరగతి ప్రజలను మున్నెన్నడూ లేనివిధంగా ప్రభావితం చేసిందన్నది సత్యం. అందరినీ తమ సురక్షిత గృహాల నుంచి, కార్యాలయాల నుంచి, పాఠశాలలు, కళాశాలల నుంచి వీధుల్లోకి తీసుకువచ్చింది.

బాలలూ, యువతీ యువకులూ పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఈ ఉద్యమం ప్రేరణనివ్వడం గమనార్హమైన విషయం. సరే, ప్రభుత్వం ఈ ఉద్యమ డిమాండ్లను ఇంత శీఘ్రంగా ఎందుకు అంగీకరించింది? భూసేకరణలో తమకు జరుగుతోన్న అన్యాయాలను నివారించే చర్యలను ప్రభుత్వం చేపట్టడానికి ఉత్తరప్రదేశ్ రైతులు సుదీర్ఘ పోరాటమే చేయవలసివచ్చింది. ఆదివాసీలు లేదా దళితుల నేతృత్వంలో ఇదే ఉద్యమం జరిగివుంటే మీడియా, సినిమా స్టార్లు, ప్రభుత్వం ఇంత త్వరగా ప్రతిస్పందించేవేనా?

మీడియా, ప్రజలు అవినీతిని ఏ విధంగా నిర్వచిస్తున్నారనే విషయాన్ని చూడడం చాలా ముఖ్యం. అయితే ఎన్‌జిఓలు, 'పౌర సమాజం' కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల, బృందాల చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నించారా? ఆ సంస్థలు, వ్యక్తులు ఎవరికి జవాబుదారీ వహిస్తున్నారు? వాటి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కును ఉపయోగించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అవినీతి వ్యతిరేకతా ఉద్యమాల దృష్టి అంతా ఎప్పుడూ రాజకీయవేత్తల అక్రమాలపైనే (అసలు రాజకీయవేత్త అనే పదమే సమస్త చెడుకు పర్యాయపదమై పోయింది. దురదృష్టవశాత్తు సమాజ జీవిత వాస్తవాలూ దీన్ని అంతకంతకూ నిరూపిస్తున్నాయి).

అభివృద్ధి పనుల పేరిట తాము సేకరిస్తున్న సమాచారాన్ని ఎన్‌జిఓలు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు? ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ఎన్‌జిఓలు లోపాయికారీగా తాము వ్యతిరేకిస్తున్న ప్రభుత్వంతో కలిసి ఎందుకు పనిచేస్తున్నాయి? ఏ లక్ష్యం కోసం అయితే నిధులు పొందుతున్నాయో అదే లక్ష్యం కోసం వాటిని వినియోగిస్తోన్న ఎన్‌జిఓలు ఎన్ని ఉన్నాయి?

టీమ్ అన్నా ఇటువంటి ప్రశ్నలను పట్టించుకోలేదు. జన్ లోక్‌పాల్ బిల్లు ఈ ప్రశ్నలను అసలు ప్రస్తావించనే లేదు. అది అసలు దాని లక్ష్యం కాదనుకోండి. టీమ్అన్నా దృష్టిలో 'దోషులు' అధికారులు, రాజకీయవేత్తలు మాత్రమే. వీరిని శిక్షింపచేయడమే ఉద్యమ లక్ష్యం. పారిశ్రామిక వేత్తలు, సంపన్న వ్యాపారుల గురించి జన్ లోక్‌పాల్ ప్రస్తావించనే లేదు. పేదరైతుల భూములను కారుచౌకగా స్వాధీనం చేసుకొంటున్న స్టీల్ లేదా మైనింగ్ కంపెనీలు ఈ అవినీతి నిర్మూలనా పోరాటకారుల దృష్టిలో లేనేలేవు.

అధికారులను, రాజకీయవేత్తలను శిక్షిస్తే సరా? ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటోన్న సకల సమస్యలకు మూలంగా ఉన్న ఆర్థికాభివృద్ధి నమూనా విషయమేమిటి? దీని గురించి మాట్లాడే వారే లేరు. మరి అవినీతి వ్యతిరేక ఆందోళనకు మద్దతు ఇవ్వడం చాలా సులువైన వ్యవహారంగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. సమస్యను లోతుగా వివేచించే ప్రశ్నలను ఈ ఉద్యమం ప్రజల ముందుంచనే లేదు. కలవరపెట్టే ప్రశ్నలను వేస్తే ఇంత మద్దతు లభించేదేనా?

అవినీతి నిర్మూలనా ఉద్యమంలో ఎంతో మంది బాలలు, యువతీ యువకులు పాల్గొన్నారు. నిజంగా వారికి స్ఫూర్తినిచ్చినదేమిటి? నిర్వాసన, పేదరికం, అణచివేత, ఎన్‌కౌంటర్ హత్యలు మొదలైన వాటిలో లేని ఆకర్షణ 'అవినీతి'లోనే వారికి కన్పించడానికి కారణమేమిటి? 'ఇండియా ఎగెనస్ట్ కరప్షన్' అని రాసివున్న ప్లకార్డులను ఊపుతూ అవినీతి నిర్మూలనా ఉద్యమంలో అత్యుత్సాహంగా పాల్గొన్న బాలలను చూసినప్పుడు చాలా విచారం కలుగుతుంది.

ఈ తరుణ వయస్కుల గమ్యం ఏమిటి? వారు నిజాయితీగానే ఈ ఉద్యమంలో పాల్గొన్నారనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతోన్న అనేకానేక పోరాటాల్లో కాకుండా ఈ ఒ క్క అవినీతి నిర్మూలనా ఉద్యమంలో మాత్రమే భాగస్వాములు ఎం దుకయ్యారు? ఈ ప్రశ్నను చాలా లోతుగా అర్థం చేసుకోవల్సివుంది. నేడు జరుగుతోన్న ప్రతి ఇతర ఆధునిక ప్రజాస్వామిక ఉద్యమంలో నూ పట్టణ మధ్యతరగతి ప్రజలు భాగస్వాములు కావాలని ఆశిద్దాం.

- ఆర్. ఉమామహేశ్వరి
మద్రాస్ ఐఐటిలో పోస్ట్ - డాక్టోరల్ ఫెలో

No comments:

Post a Comment