Thursday, September 29, 2011

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది? By -చుక్కా రామయ్య Namasethe Telangana 30/09/2011

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది?
musal-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాసలో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకో గలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువులో తన జీవితాన్ని చూసుకుంటారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే, రాఘవడ్డి అనే పాత మిత్రుడు కలిశాడు. యిద్దరం మాట్లాడుకుం టూ నడుస్తున్నాం. ‘నిన్న వాకర్స్ మీటింగ్ అయ్యింద’ని చెప్పాడు. అందులో ‘నేనొక ప్రశ్నను గెలిచా’నన్నాడు. ‘ఏమి ప్రశ్న’ అన్నా ను. ‘చుక్కా రామయ్యది ఏ ఊరు?’ అని అడిగారు. ‘కొందరు భువనగిరి అని, కొందరు సిద్దిపేటని చెప్పారు. మరికొందరు మహబూబ్‌నగర్ జిల్లా అని చెప్పారు. ఆయనది వరంగల్ జిల్లా పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి పక్కనే ఉన్న గూడూరు’ అని నేను చెప్పాను. ‘గూడూరు ఊళ్లో ఒక గుడి ఉత్సవ కార్యక్షికమం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లానని, ఆ గుడిని రామయ్య తండ్రి కట్టించారు. అప్ప టి నుంచి రామయ్య తెలుసునని వాకర్స్ మీటింగ్‌లో చెప్పాన’ని నాకు చెప్పాడు. ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తాయి? ఇది నాఊరు గూడూ రు అని చెప్పుకోవడానికి ఆ ఊళ్లో భూమ న్నా, ఇల్లన్నా ఉండా లి. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి బదిలీ అయితే అక్కడే ఉండేవాణ్ణి. సెలవుల్లో కూడా అక్క డే ఉండేవాణ్ణి. సెలవుల సమయంలో ఆ చుట్టుపక్కల ఊళ్లల్లోని ప్రజలతో కలిసేవాణ్ణి. పిల్లలు కూడా తమ ఊళ్లకు నన్ను వేసవి సెలవుల్లో తీసుకుపోయేవారు. దీని వలన ఆ పిల్లల తల్లిదంవూడుల జీవన విధానం చూసే అవకాశం లభించింది. క్లాసురూములో చదువు చెప్పేటప్పుడు స్థానిక సమస్యలతోనే ఆనాటి పాఠాన్ని ఆరంభించేవాణ్ణి. ఉపాధ్యాయునికి కేవలం సబ్జెక్ట్ రావటమే కాదు, ఆ పిల్లల నేపథ్యం కూడా తెలిసి ఉండాలి. ఆ నేపథ్యాన్ని చెప్పుకుంటూ, వారి గ్రామాల్లోని సంఘటనలను గుర్తుచేస్తూ పాఠం చెబితే విద్యార్థి తన పరిసరాలను తన జీవితానికి సంబంధించినదనుకుని ఆ చదువుపై శ్రద్ధను చూపుతాడు. నేడు ప్రభుత్వ స్కూళ్లలోకి దళితులు, గిరిజనులు, పేదవర్గాలు, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఆ పిల్లలందరినీ క్రమం తప్పకుండా బడులకు తేవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వారిలో 60 శాతానికి మించి అక్షరాస్యత పెరగటం లేదు. దానికి కారణం ఏమిటి? పిల్లలు తమ జీవితాలను ఆ పుస్తకా ల్లో చూసుకోవటం లేదు.

పాఠ్యపుస్తకాల ముద్రణ విషయంలో నేటికీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి సిలబస్‌ల రూపకల్పనలో సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతున్నారు. ఈ విధానం లో మార్పులు తేకపోతే చదువు అన్ని వర్గాల వాకిళ్లలోకి పోలేదు. దీనికోసం ప్రభుత్వమే పెద్ద కృషి చేయవలసి ఉంది. ఈ పని ఎన్నిసార్లు చెప్పినా ప్రభు త్వం పెడచెవిన పెడుతోంది. ప్రాథమికస్థాయిలో విద్యార్థికి పరిసరాలతో ఎంతో సంబంధం ఉంటుంది. ప్రాథమిక పాఠ్యాంశాల తయారీలో స్థానిక వ్యవహారిక భాషను ఉపయోగించాలి. అప్పుడు విద్యార్థి ఇబ్బంది పడడు. పాఠం చదువుతుంటే అది తనకు బాగా తెలిసిన విషయ మే అన్నట్లుగా విద్యార్థి ఫీల్ కావాలి. తన జీవితమనుకుంటే పాఠ్యపుస్తకా న్ని, పాఠశాలని విద్యార్థి వదిలిపెట్టడు. ఇది ఆచరణాత్మకంగా, ఒక ఉపాధ్యాయుడిగా 60 ఏళ్లలో నేను గమనించిన అంశం. అందుకే ఇంటిభాష ప్రాథమిక స్థాయి లో ప్రవేశపెట్టాలని కొంతకాలం ప్రభుత్వంతో పెనుగులాడాను. ఫలితం మాత్రం రాలేదు. పాఠ్యపుస్తకాల తయారీ అంటే ఏదో పదిమంది టీచర్లు కలిసి పాఠ్యపుస్తకాన్ని తయారు చేసి ఇవ్వటమే కాదు అన్ని ప్రాంతాల విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో పాఠ్యపుస్తకాలు తయారుచేయాలి. ఆ పని చేయటం అంత సులభమైనదేమీ కాదు. దాని కోసం సుదీర్ఘమైన అధ్యయనం, పరిశోధన నిరంతరం కొనసాగాలి. పుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేసుకున్నాం.

raju29-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష , ఆచారాలు, ఈ ప్రాంత విశిష్టత, తరతరాల తెలంగాణ, సంస్కృతి, ఇక్కడి ప్రజల వ్యక్తిత్వాలు, వృత్తులు, ఆలోచనా విధానాలు, సంప్రదాయాల గురించి చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు తెలు గు అకాడమీ చేయలేదు. ఇంటర్, డిగ్రీ, తదితర పాఠ్యపుస్తకాలు ముద్రణ చేయటం, వాటిని విక్రయించటం దీనికే తెలుగు అకాడమీ కాలమంతా సరిపోతోంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని అకాడమీ వెలుగులోకి తేలే దు. తెలుగు సమాజంలో భిన్న కోణాలను, భిన్న సంస్కృతులను వెలుగులోకి తేవడంలో తెలుగు అకాడమీ చేయవలసిన కృషి ఎంతో ఉంది. బతుకమ్మ పండుగ గురించి ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తే గత ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా బతుకమ్మను ప్రదర్శనగా పెట్టారు. ఇక్కడి ప్రజలు ఆందోళన చేయకముందే ఆ బాధ్యతను తెలుగు అకాడమీ భుజం మీద వేసుకొని నిలబడి ఉంటే బాగుండేది. బతుకమ్మకు సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తేవాలి. ఈ పనిని బిఎన్ శాస్త్రి కొంత వరకు చేశారు. అకాడమీ చేయాల్సిన పనిని బిఎన్ శాస్త్రి తన రెండు చేతులతో నెత్తికెత్తుకున్నారు. ఇంకా తెలంగాణ జనపదాలకు సంబంధించిన పరిశోధన ప్రొ. జయధీర్ తిరుమలరావు నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ పనిని అకాడమీ తన భుజాలపై వేసుకోవాలి.



నేను మహబూబ్‌నగర్‌కు బదిలీ అయినప్పుడు బస్‌స్టాండ్‌లో దిగి స్కూల్ ఎక్కడ అని అడిగాను. వాళ్లు చెప్పలేదు. ఒక కండక్టర్ వచ్చి సారు ‘శాల’ ఎక్కడని అడుగుతున్నారన్నాడు. బడిని కన్నడంలో ‘శాల’ అంటార ని చెప్పాడు. ఏమి ‘బీకు’ అన్నాడు. అంటే ఏమి కావాలన్నాడు. కన్నడ ప్రభావం మహబూబ్‌నగర్ జిల్లా మీద, అక్కడి భాష మీద ఉన్నది. ఇది చిన్న విషయమే కావచ్చును. అదే నిజామాబాద్, ఆదిలాబాద్ వెళితే మహారాష్ట్ర మరాఠీ భాష ప్రభావం కనిపిస్తుంది. అదే నల్లగొండ జిల్లా సరిహద్దు కోదాడకు వెళితే కృష్ణా జిల్లా ప్రభావం కనిపిస్తుంది. మిర్యాలగూడ వెళితే గుంటూరు జిల్లా ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాస లో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువు లో తన జీవితాన్ని చూసుకుంటారు. తమ పరిసరాలను పోల్చుకుంటారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో ఇంటి భాషకు, స్కూల్ భాషకు దూరం పెరగకూడదు. ఇది మనదేశంలోనే కాదు, ఇంగ్లాండులో కూడా స్కాట్‌లాండ్ భాష ఒక రకంగా ఉండదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటినుంచి మన వాళ్లు ఈ ప్రయత్నం చేయకపోవటం వల్లనే మన పాఠ్యాంశాలు సామాన్యుల జీవితాల్లోకి చొచ్చుకుపోలేకపోయాయి. వాళ్ల భాషను గేలి చేస్తే ఆ సంబంధిత వర్గాలు దూరమైపోతాయి. బడి పెట్టగానే సరిపోదు. విద్యావ్యాప్తి జరగాలంటే ఆ ప్రాంతంలో లీనమైపోవాలి. అందు కే ఇది మిషనరీలా పనిచేయాలి. ఇతర దేశాల క్రైస్తవులు మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యావ్యాప్తి కోసం భాషనే కాదు, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషను అలవర్చుకున్నారు. వారి జీవితాలను ఆకళింపు చేసుకున్నారు. అదే తరగతి గదిలో మాట్లాడారు. తనున్న సమాజంలో టీచర్ గర్భితం కావాలి. అప్పుడే విద్యార్థి టీచర్ చెప్పే పాఠంలోకి వెళ్లగలుగుతాడు. ఇప్పటికైనా తెలుగు అకాడమీ వారు అన్ని ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించే విధంగా అన్ని ప్రాంతాల భాషలపై పరిశోధనలు చేయాలి. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలను ఇంటిభాషలోనే రాసేందుకు పాఠశాల విద్యాశాఖ తీర్మానించాలి. ఇది ఎంత తొందర గా చేస్తే అంత మంచిది. దీని వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను తగ్గించవచ్చును. అప్పుడే మన ప్రాథమిక విద్య గడపదాటుతుంది.
-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

No comments:

Post a Comment