Friday, September 30, 2011

ఈ చెలగాటం మానండి - కొత్త పలుకు By - ఆర్కే Andhra Jyothi 1/10/2011


ఈ చెలగాటం మానండి
- కొత్త పలుకు

తెలంగాణ సమస్యను ఏ విధంగా, ఎంత త్వరగా కేంద్రం పరిష్కరిస్తుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. సకల జనుల సమ్మె కొనసాగే కొద్దీ ప్రజల జీవితాలు ఛిద్రం అవుతాయి. ఉద్యమకారుల్లో సహనం నశించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెదకాలనుకోవడం అవివేకమే అవుతుంది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ - పాకిస్థాన్‌ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పాలన్న ఉద్దేశంతో, ఇరుదేశాల మధ్య రైలు సర్వీసులను ప్రారంభించారు. అయితే, ఆ రైళ్ళలో ప్రయాణికుల సంఖ్య కంటే భద్రతా దళాల సంఖ్యే ఎక్కువగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు సీమాంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో ఇటువంటి వాతావరణమే నెలకొంది.

హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు వెళ్లే బస్సులన్నింటినీ రాత్రిపూట ఒకేసారి వదిలి, వాటికి రక్షణగా పోలీసులను పంపుతున్నారు. అయినా, సీమాంధ్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమంది బస్సులపై రాళ్ళు రువ్వుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రయాణికులు అప్పుడప్పుడు గాయపడుతున్నారు. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను దసరా సెలవుల కోసం ఇంటికి తీసుకురావడానికి బస్సులో బయలుదేరిన తెలంగాణకు చెందిన మిత్రుడు ఒకరు తన ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ, దశాబ్దాలుగా కలిసి ఉన్న ప్రజల మధ్య ఇంత ద్వేషం అవసరమా? అని ప్రశ్నించారు.

అవును, నిజమే! ఇంత ద్వేషం అవసరం లేదు. కానీ, ఆయా రాజకీయ పార్టీల నాయకుల ప్రకటనలతో సమస్య పరిష్కారం కాకపోగా, ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. తెలంగాణ ఇవ్వకపోతే తలకాయలు కోసుకుంటాం, లేదా కోస్తామని తెలంగాణ నాయకులు... రాష్ట్రాన్ని విడగొడితే తలలు తెగుతాయనీ, తాము గాజులు తొడుక్కుని కూర్చోలేదని సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అటుగానీ, ఇటుగానీ ఒక్క నాయకుడు కూడా త్యాగాలు చేయలేదు. ఆర్థికంగా నష్టపోలేదు. తమ చర్యలు, చేష్టల ద్వారా ప్రజలను మాత్రం నలిగి పోయేలా చేస్తున్నారు. రాజధానిలో సీమాంధ్ర ఉద్యోగులపై అడపా దడపా దాడులు కూడా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇంతింతై వటుడింతై అన్నట్టు... ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఏర్పడింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి మూడినట్టే! తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినట్టు ఉద్యమ నాయకులు ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారు. దిగితే పులి తినేస్తుంది. దిగకపోతే ఎంత కాలం అలా స్వారీ చేయాలో తెలియని పరిస్థితి!

తెలంగాణ సాధన క్రమంలో చివరి ఆయుధంగా సకల జనుల సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మె ప్రారంభమై 18 రోజులు గడిచిపోయాయి. మరెన్ని రోజులపాటు సమ్మె సాగుతుందో తెలియదు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారికి కూడా ఎంతకాలం సమ్మె కొనసాగించాలో తెలియదు. ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నా అంతిమ ఫలితం ఎలా ఉంటుందో అన్న సందేహం ఉద్యమకారుల్లో లేకపోలేదు.

ఏ ఇద్దరు ఉద్యమ నాయకులు కలిసినా తెలంగాణ వస్తుందంటావా? అని ప్రశ్నించుకోవడం ఇందుకు నిదర్శనం. అలా అని, తాము తలపెట్టిన సకల జనుల సమ్మెను ఫలితం రాకుండా మధ్యలో విరమించ లేరు. సంఘటితంగా జరుగుతున్న ఉద్యమం అటుంచి, తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఎంతో ఆశతో, ఉత్సాహంతో సమ్మెలో పాల్గొనడానికి వస్తున్నారు. వారు నిరుత్సాహపడితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉండబోతున్నదన్న విషయం ఎవరూ స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. కానీ, సమ్మె కారణంగా సకల జనులు అవస్థలు పడుతున్న విషయం వాస్తవం.

ఒకప్పుడు దేశంలోనే అగ్రగామిగా వెలిగిన మన కార్పొరేట్ రంగం కుదేలవుతోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలనుకున్నవి కూడా వివిధ కారణాల వల్ల పరపతి పుట్టక డీలా పడుతున్నాయి. ఒకవైపు సి.బి.ఐ. విచారణ, మరోవైపు సకల జనుల సమ్మె కారణంగా వ్యాపారాలు దెబ్బతిని, బ్యాంకు కిస్తులు కూడా కట్టలేని స్థితికి బడా బడా కంపెనీలు చేరుకుంటున్నాయి. "దీర్ఘకాలంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, నాలుగు దశాబ్దాలుగా అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేసిన నా కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ఆగిపోయి, నిధుల లేమితో సతమతమవుతున్నది'' అని ఒక పారిశ్రామికవేత్త కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.

సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటిస్తున్న తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల అధిపతులది కూడా ఇదే పరిస్థితి. "తెలంగాణకు జై అనకపోతే ఎక్కడ వెలివేస్తారోనన్న భయంతో సమ్మెకు సై అని ప్రకటించాం. నిజానికి, మా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఏడాది సీట్లు కూడా భర్తీకాలేదు. తెలంగాణలో గొడవల వల్ల ఇక్కడి పిల్లలు కూడా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరువంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు'' అని ఒక ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

అదే సమయంలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలున్న తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ప్రపంచీకరణ పుణ్యమా అని, అన్నింటా పోటీ పెరిగింది. 1969లో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు చదువుల్లో ఇంత పోటీ లేదు. ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రాష్ట్ర స్థాయి పరీక్షలలో పోటీ పడడంతోపాటు, జాతీయ స్థాయి కోర్సుల కోసం కూడా పోటీ పడవలసి ఉంటుంది.

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే వారి పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉన్నప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల గోస ఎవరికీ పట్టడం లేదు. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది బి.సి.లు, దళిత వర్గాలకు సంబంధించిన పేదలే. ప్రైవేట్ పాఠశాలల సంస్కృతి రాక పూర్వం ప్రభుత్వ పాఠశాలల్లో, అగ్రవర్ణాల వారితోపాటు బడుగు వర్గాల వారి పిల్లలు కూడా కలిసిమెలిసి చదువుకునేవారు. దీనివల్ల సామాజిక ఆర్థిక వ్యత్యాసాల గురించి వారిలో ఒక అవగాహన ఉండేది.

అప్పట్లో డబ్బున్న వారి పిల్లలకు చదువు పెద్దగా అబ్బేది కాదు. పేదల పిల్లలే కష్టపడి చదువుకునే వారు. ఇప్పుడు కార్పొరేటు పాఠశాలలు వచ్చిన తర్వాత, చదువు కూడా డబ్బున్న వారి సొంతం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదలు మాత్రం మంచి చదువులకు దూరం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో చేరడం వల్ల బడుగు వర్గాల పిల్లలకు నష్టం జరుగుతున్నది. బిడ్డ పుట్టే ముందు పురిటి నొప్పులు సహజమని పొలిటికల్ జె.ఎ.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇందుకు సమాధానంగా చెబుతున్నారు. అయితే, పురిటి నొప్పులు గంటా రెండు గంటలు ఉంటాయి కానీ... సంవత్సరాల తరబడి కాదు కదా! అని బాధితులు తమ మనసులోనే ప్రశ్నించుకుంటున్నారు. బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తం చేయగలిగే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదు.

రాష్ట్ర ప్రజల మధ్య ఇంత తీవ్రస్థాయిలో విభజన ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలనుకోవడం అవివేకం అవుతుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో, విజ్ఞతతో పట్టు విడుపుల ధోరణి ప్రదర్శించవలసిన నాయకులు, రాజకీయ ప్రయోజనాల వేటలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ కోసం సొంత పార్టీలనే ధిక్కరించి బయటకు వచ్చి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న నాయకులకు కూడా ప్రజల ఆదరణ అంతగా లభించడం లేదు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉదంతాన్నే తీసుకుందాం! ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ధ్వజమెత్తారు. మంత్రిగా ఉంటూ విద్యుత్ కొరత తీర్చాలంటూ నడిరోడ్డుపై బైఠాయించారు. అయినా, నల్లగొండ జిల్లాలో తెలంగాణ వాదుల చేతిలో ఆయనకు పరాభవమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాగం జనార్దన రెడ్డికి పరాభవం ఎదురుకాకపోయినా, ప్రజల ఆదరణ మాత్రం లభించడం లేదు. దీంతో ఆయనతో పాటు జట్టు కట్టి, పార్టీకి దూరమైన మిగతా ముగ్గురు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి రాయబారాలు నడుపుతున్నారు.

ఇవ్వాళ తెలంగాణలో రాజకీయ పార్టీగా అయినా, ఉద్యమ పార్టీగా అయినా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే గుర్తింపు పొందుతోంది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు ఇదివరకే ఒకసారి రాజీనామాలు చేసి గెలుపొంది, మళ్ళీ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. ఇందులో ఎవరి రాజీనామాలనూ స్పీకర్ ఇంతవరకు ఆమోదించ లేదు. టి.ఆర్.ఎస్. ఎంపీలైన చంద్రశేఖర రావు, విజయశాంతి రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదు.

అయినప్పటికీ... కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకే తెలంగాణ వాదుల నుంచి సెగ తగులుతోంది. వాస్తవానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సహకరించని పక్షంలో తెలంగాణ ఏర్పాటు అసాధ్యం. తెలంగాణ సాధించవలసిన పార్టీ, సహకరించవలసిన ఇతర పార్టీలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడగా... టి.ఆర్.ఎస్. పరిస్థితి పైచేయిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే జాతీయ స్థాయిలో బి.జె.పి. కూడా సహకరించాలి.

అంటే, తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించవలసిన కాంగ్రెస్, బి.జె.పి.లకు తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా ఒనగూరుతున్న ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ మొత్తాన్ని టి.ఆర్.ఎస్. గంపగుత్తగా తీసుకోవడంతో, మిగతా పార్టీల పరిస్థితి పక్క వాయిద్యంగా మారిపోయింది.

ఈ కారణంగానే తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చే పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని తమ పార్టీలో విలీనం చేయక తప్పదని కాంగ్రెస్ పెద్దలు షరతులు పెడుతున్నారు. అయితే, తెలంగాణ మొత్తం రాజకీయంగా తన ఆధిపత్యంలోకి రావడంతో, ప్రస్తుత పరిస్థితులలో కె.సి.ఆర్. ఈ షరతుకు అంగీకరిస్తారో లేదో తెలియదు. తెలంగాణలో తన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకునే దిశగా ఆయన కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులను తన పార్టీలో కలుపుకొంటున్నారు.

తర్వాత వంతు కాంగ్రెస్ పార్టీది కావచ్చు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను సోపానంగా మలచుకొని, కె.సి.ఆర్. ప్రారంభించిన ఈ రాజకీయ క్రీడ వల్ల, సొంత పార్టీ నాయకులనే నమ్మలేని స్థితి కాంగ్రెస్, తెలుగుదేశం అధినాయకులకు ఏర్పడింది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే... తమ పార్టీల ముఖ్య నేతలతో జరిపిన సమావేశాల వివరాలను కె.సి.ఆర్.కు తెలియజేయడానికి ఈ రెండు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు పోటీ పడుతున్నారు.

బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమైన తెలంగాణకు చెందిన మంత్రులు, ఎం.పి.లు, శాసన సభ్యుల్లో పలువురు, సమావేశం ముగిసిన వెంటనే ఆ వివరాలను కె.సి.ఆర్.కు, కోదండరామ్‌కు, స్వామిగౌడ్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించడానికి పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా, 'మీ రాజకీయ భవిష్యత్‌కు నాదీ పూచీ' అని కె.సి.ఆర్. ఇచ్చిన హామీతో కాంగ్రెస్‌లో ఉంటూనే కొంతమంది ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి రాజ్యసభ సీటు, మరికొంత మందికి ఎం.పి. టికెట్లు, శాసన సభ టికెట్లు ఇస్తానని కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా ఇటువంటి హామీలే లభించినట్టు చెబుతున్నారు. బాన్స్‌వాడ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, రాజీనామా చేసి టి.ఆర్.ఎస్.లో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డిని ఉప ఎన్నికలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా పోటీ పెట్టడం గమనార్హం. రాజీనామాలు చేసి మళ్లీ పోటీచేసి గెలవడం, తెలంగాణ సాధనకు ఎలా దోహదపడుతుందో వారికే తెలియాలి!

అయితే, కె.సి.ఆర్. ఎత్తుగడలను పసిగట్టిన కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరించబోతున్నారు. అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకుని సి.బి.ఐ. విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన రెడ్డి ప్రభావం ప్రజల్లో పలుచబడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్ఠానం, సీమాంధ్రలో రాజకీయంగా బలపడటానికి తీసుకోవలసిన చర్యలపై కూడా దృష్టి సారించింది.

సీమాంధ్రలో జగన్ బెడద, తెలంగాణలో కె.సి.ఆర్. ముప్పు కారణంగా ఇప్పటి వరకు పాలుపోని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు... ఇప్పుడు జగన్ బలహీనపడటం ఊపిరినిచ్చింది. దీంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడంపై దృష్టిని కేంద్రీకరించారు. అయితే, క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేని స్థితి ఉంది. 2014లో జరిగే ఎన్నికలలో పార్టీకి ఆమె సారథ్యం వహించే అవకాశం లేదని కాంగ్రెస్‌వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు 2జీ కుంభకోణంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ సమస్యపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం పాత్ర ఉందన్న అర్థం వచ్చేలా, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ప్రధాన మంత్రి కార్యాలయానికి అందిన నోట్ తాను రాయలేదని చెప్పడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రణబ్ ముఖర్జీ గురువారం నాడు కొంత ప్రయత్నం చేశారు.

ప్రణబ్ ప్రకటనతో కథ సుఖాంతం అయిందని చిదంబరం ప్రకటించుకున్నారు. ప్రధాని కార్యాలయానికి పంపిన నోట్‌ను ప్రణబ్ రాశారా, అధికారులు రాశారా? అన్నది ముఖ్యం కాదు. అందులోని సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత తమపై ఉందని ఇరువురు కేంద్ర మంత్రులు విస్మరించడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులే ఆ 'నోట్'ను రూపొందించారని అంగీకరిద్దాం. అధికారుల అభిప్రాయాలకు విలువ ఉండదా? 'మేమిద్దరం మాట్లాడుకున్నాం.

ఇప్పుడు సర్దుబాటు చేసుకున్నాం' అని మంత్రులు అంటే సరిపోతుందా? ఈ విషయం పక్కన బెడితే తెలంగాణ సమస్యను ఏ విధంగా, ఎంత త్వరగా కేంద్రం పరిష్కరిస్తుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. సకల జనుల సమ్మె కొనసాగే కొద్దీ ప్రజల జీవితాలు ఛిద్రం అవుతాయి.

ఉద్యమకారుల్లో సహనం నశించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ పరిస్థితిని మరెంతో కాలం భరించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు.

రెక్కాడితే గానీ డొక్కాడని వారి గురించి ఆలోచించవలసిన బా«ధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెదకాలనుకోవడం అవివేకమే అవుతుంది. తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న వారిలో నెలకొన్న భయాందోళనలు, సందేహాలను నివృత్తి చేయడానికి పూనుకోవాలి. అదే సమయంలో, రాజధానిలో నివసిస్తున్న సీమాం«ద్రుల రక్షణకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులపై కూడా ఉంది.

హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఉండకపోతే సీమాంధ్రకు చెందిన వారు ఇక్కడికి వచ్చి ఉండవలసిన అవసరం ఉండేది కాదు. రాజధాని అంటే అందరిదీ అన్న భావన అన్ని ప్రాంతాల వారిలోనూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి ఉద్యోగాలు, ఇతరత్రా విషయాలలో తమకు జరిగిన అన్యాయాన్ని సీమాంధ్ర నాయకులకు, ప్రజలకు వివరించి వారి మద్దతు పొందడానికి తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రయత్నించడం అవసరం.

ఇందుకు భిన్నంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, సమస్య పరిష్కారానికి విఘాతం కలిగేలా ప్రకటనలు చేయడం వంటివి ఉభయ ప్రాంతాల నాయకులు విడనాడాలి. దంచుడు, నరుకుడు వంటి పద ప్రయోగాల వల్ల కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరవచ్చు గానీ, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. మొత్తం వ్యవహారంలో హైదరాబాద్‌ను ఏమి చేయాలన్నదే కీలకంగా మారిన విషయం వాస్తవం. ఆ తర్వాత నదీ జలాల పంపకం ముఖ్యమైనది.

తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన ఉంటే, ఈ రెండు అంశాలపై చర్చను ప్రారంభిస్తే ఏదో ఒక పరిష్కారం లభించకపోదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు ప్రాంతాలను విడగొట్టాలన్న ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, ఆ దిశగా చర్చల ప్రకియకు శ్రీకారం చుట్టడం తక్షణ అవసరం. అంతేకానీ... ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు రాజకీయ పార్టీలకు లేదు. ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా వేదనకు గురవుతున్న ప్రజల గురించి ఆలోచించని రాజకీయ వ్యవస్థ ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే! తెలుగు ప్రజలు అనుభవిస్తున్న క్షోభకు త్వరలోనే ముగింపు లభిస్తుందని ఆశిద్దాం!
- ఆర్కే

No comments:

Post a Comment