Wednesday, September 21, 2011

నరేంద్ర మోడీ, రూమీటోపీ - చెన్నమనేని విద్యాసాగర్ రావు Andhra Jyothi 22/09/2011


నరేంద్ర మోడీ, రూమీటోపీ
- చెన్నమనేని విద్యాసాగర్ రావు

సద్భావన మిషన్‌లో రెండు అమంగళకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని వార్తలు. ఒకటి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లేచి, మీడియా కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతంలో గందరగోళం ఏర్పడి సర్దుకోవడం; రెండవది ఒక ముస్లిం మతపెద్ద నరేంద్రమోడీని సన్మానిస్తూ సంప్రదాయ పద్ధతిలో పెట్టబోయిన టోపీని ఆయన సున్నితంగా తిరస్కరించడం.

టోపీని తిరస్కరించిన సంఘటన కోతికి కొబ్బరికాయ దొరికినంతగా ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ప్రసార, ప్రచార సాధనాలకు సరిపడా ఆహారం దొరికింది. 'సద్భావన మిషన్' గురించి విశ్లేషణ చేసేవారికి, విమర్శకులకు, కావాలని ఈ ఉపవాసదీక్షను వ్యతిరేకించే వాళ్ళకు ఇది ఒక పదునైన అస్త్రంగా పరిణమించింది. మొత్తం ఈ ఉపవాస దీక్షను ఉత్తది చేయడానికై ఈ టోపీ అస్త్రాన్ని ఝళిపించడానికి ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.

గుజరాత్‌లో గోధ్రా సంఘటన తదుపరి చెలరేగిన మత సంఘర్షణల్లో చనిపోయిన వారిలో మాజీ ఎంపి ఒకరు ఉన్నారు. ఆ సంఘటన నరేంద్ర మోడీని వెంటాడింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో ఉపశమనం లభించింది. ఆ వెంటనే నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థి కాబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తున్నది. మరొకవైపు నరేంద్ర మోడీకి వీసాను నిరాకరించిన అమెరికా ఇప్పుడు ఆయన పరిపాలనాదక్షుడని అభిప్రాయపడుతున్నది. ఈ విషయమై పలువురు మోడీపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

మోడీ ఆ పాలనా దక్షతను దేశవ్యాప్తంగా విస్తరించాలని కొందరు కోరుతుండగా, దానిపై ఆందోళన చెందేవారు మరికొందరు స్పష్టంగా కనబడుతున్నారు. ముస్లిం మతపెద్ద పెట్ట బోయిన టోపీని నెమ్మదిగా వారించడమనేది ముమ్మరమయిన చర్చకు దారి తీస్తుంది. ఏ విధంగా ఈ హఠాత్పరిణామం నుంచి నరేంద్రమోడీ బయటపడతారు, ఏ విధంగా తనను తాను సమర్థించుకొంటారు, క్షమాపణ చెప్పినా.. ఒక వర్గం వారు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొన్ని టీవీ ఛానెల్స్ పనిగట్టుకొని మోడీ ఎన్నికలలో వ్యతిరేకం చేసినట్టుగా చేయ ప్రారంభించాయి. గతంలో ఇటువంటి ప్రచారంతో మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దృష్ట్యా ఈ వ్యతిరేక ప్రచారం శుభసూచకమేనని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకూ టోపీ పెట్టుకోకపోవడం నేరం అవుతుందా? అది ఒక మతాన్ని తిరస్కరించినట్టో, అవమానపరిచినట్టో అవుతుందా? దీన్ని రాజకీయం చేయడం, ఓటు బ్యాంకు రాజకీయాల బురద చల్లడం ఈ సందర్భంగా ఎంతవరకు సమంజసమని భావించే వాళ్ళు అధికంగా ఉన్నారు.

ఉపవాసదీక్షలో హిందూ ముస్లింలను కలుపుతూ, అభివృద్ధిలో భాగస్వాములను చేయడం మతకల్లోలాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు చూడడం, దీన్నే మొత్తం భారతదేశం ఒక ఉదాహరణగా తీసుకోవాలని కోరుతున్న సందర్భంలో మళ్ళీ ఒక వర్గాన్ని తృప్తిపరచడానికి చేసే విన్యాసాలను వారించడం సమంజసమనిపిస్తుంది. ఇది వ్యక్తిగతమైన భావన. దాన్ని విశ్లేషించి విపరీతార్థాలు తీసి ఒక మతానికి చెందినవారికి వ్యతిరేకమనే ప్రచారాన్ని కలిగించడం దుర్మార్గం. సాధారణంగా హోలీ పండుగ సందర్భంగా రంగు ఇతర మతాలవారిపైన పడకుండా జాగ్రత్త పడతారు. వారు కూడా వారిస్తారు.

కొన్ని సందర్భాలలో తిలకం దిద్దుకుంటున్నప్పుడు పొరపాటున ముస్లిం సోదరులకు పెట్టబోతే వారు వారిస్తారు. దాన్ని గౌరవించి వెనక్కు తగ్గుతాము. అంత మాత్రాన ఇందులో ఒక వర్గం వారు మరొక వర్గానికి వ్యతిరేకం అనే తీర్పు నివ్వలేము. కొన్ని సందర్భాలలో ముస్లిం ప్రార్థనా మందిరాలు సమీపించగానే 'మేళ వాయిద్యాలు' సంప్రదాయకంగా ఆపేస్తారు. ఆపాలని చట్టం లేకున్నా సంప్రదాయాన్ని గౌరవిస్తూనే వుంటారు. నరేంద్రమోడీ తన ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా తాను ఒక వర్గాన్ని ప్రత్యేకంగా చూపించకుండా మొత్తం సమాజం ఒకటనే ఉద్దేశంతో సర్వతోముఖాభివృద్ధి సాధించానని అది దేశవ్యాప్తంగా కొనసాగాలని స్పష్టం చేశారు.

మత విశ్వాసాల మధ్యన వివక్ష లేదు అని చెప్పే సందర్భం ఒకసాకుగా కాకుండా, ఒక సూత్రంగా ఉండాలని నరేంద్ర మోడీ ఉపవాస దీక్ష సందర్భంగా ప్రతిపాదించిన సద్భావన మిషన్ స్పష్టం చేసింది. దీని పైన నిష్పక్షపాతమైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు వాక్యాలలో నిగూఢంగా ఇమిడివున్న సర్వ ధర్మ సమభావన అనే పరంపర దేశాన్ని ఒక శక్తిగా సమాజాన్ని కలిసివుంచే సమైక్య సంధాతగా నిలుస్తుంది. ఉగ్రవాదానికి మతం లేదు. కులం లేదు.

ఆ ఉన్మాద పిశాచం ప్రపంచాన్ని వణికిస్తుది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిలువరించడానికి భారతదేశం ప్రధాన భూమికను పోషించి ఆచరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. టోపీ వివాదాన్ని పీకలదాకా లాగడం గర్హనీయం. హిందూ తీవ్ర వా దం లేదని అంగీకరించలేము. కానీ వీటి తారతమ్య సాంద్రతలను పరిశీలించి పరిభాషా ప్రయోగంలో జాగ్రత్తపడాలి. చిన్న విషయంపైన ఒక మహత్తర మిషన్‌ను ధ్వంసం చేయాలని చూడడం, ప్రత్యామ్నాయాన్ని చూపకపోవడం సమాజాన్ని నష్టపరచడమే అవుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి.

తాలిబన్ల పాలన(1996-2001)లో ఉన్న అఫ్ఘానిస్తాన్‌ను కేవలం పాకిస్థాన్, సౌదీ అరేబియా మాత్రమే గుర్తించాయి. తీవ్ర భావాలు ఉన్న వారిని ప్రోత్సహించి పాక్ మదర్సాలలో బోధించి 'జీహాద్'ను అమలుపరిచేందుకు వారికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది; ఆయుధాలూ ఇచ్చింది. భారతదేశం, అందులో ముస్లిం సముదాయం పైననే ప్రధానమైన గురి కాబట్టి చిన్న విషయాలను వివాదం చేసి ఎంతో కష్టపడి పది సంవత్సరాలుగా మత సంఘర్షణలు లేకుండా కాపాడుతున్న రాష్ట్రానికి చిన్న టోపీ వివాదాలు ఇరువర్గాలలో అగాధాన్ని ఏర్పాటు చేయకుండా ప్రచార, ప్రసార సాధనాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించాలి.

ప్రపంచంలో అతి పెద్ద ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలో, రాముడిని ఒక మహాపురుషునిగా భావించడం, రామ లీలాలు ప్రదర్శించడం, రామాయణంలోని కొన్ని పాత్రల పేర్లపై విమానాశ్రయాలు, వీధులు ఉండడం, కరెన్సీ నోట్లపైన గణేశుని బొమ్మలుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు వీటిని మనదేశంలో అమలు చేయాలంటే, అనిర్వచనీయమైన కుహనా లౌకికవాద వికృతభూతం అడ్డం వస్తుంది. అదృష్టవశాత్తు ఇంకా తాలిబాన్లు కాందహార్‌లో చేసిన ఆకృత్యాల ప్రభావం ఇంకా అక్కడ పడలేదు.

భారతదేశం మతపరమైన రాజ్యం కానందువల్ల ఈ మహాభారత కుటుంబంలో, వివిధ మతాల విశ్వాసాలను కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉన్నది. నరేంద్ర మోడీ అన్నట్టు రాజకీయాలలో, ప్రభుత్వ వ్యవస్థలో మెజారిటీ -మైనారిటీ అన్న పదాలకు స్థానం ఉండరాదు. స్వప్రయోజనాల కొరకు బ్రిటిష్ పాలకులు చేసినట్లే ఈ విచ్ఛిన్నకర ప్రవృత్తి ప్రజల మధ్యన సన్నిహిత సంబంధాలను తుంచివేస్తుంది.

1960వ దశకంలో ఒకసారి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని సంప్రదింపుల కమిటీలో ఒక విచిత్రమైన చర్చ జరిగింది. ఆకాశవాణిలో ప్రతి ఉదయం భక్తిగీతాలతో భక్తిసంగీత కార్యక్రమాన్ని ప్రసారం చేయడాన్ని ఒక లౌకికవాద పార్లమెంటు సభ్యుడు బలంగా వ్యతిరేకించారు. అలాంటి కార్యక్రమం వల్ల పూర్తిగా హిందూ వాతావరణం ఏర్పడుతుందని ఆయన వాదన. లౌకిక రాజ్యంలో ఇలాంటి వాటిని అనుమతించరాదని చెప్పారు.

ఆ ఎంపి ఇదే విషయమై అప్పటి మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వద్దకు కొంతమంది ప్రతినిధులతో కలిసివెళ్ళి ఫిర్యాదు చేశారట. వారు చెప్పింది సహనంగా విన్న తరువాత రాధాకృష్ణన్ ఇలా వ్యాఖ్యానించారు: 'మిత్రులారా! ఉదయం పూట మినహా నేను ఎప్పుడూ ఆకాశవాణి వినను. నేను వినే ఏకైక కార్యక్రమం భక్తి సంగీత్'అని చెప్పారట. రాధాకృష్ణన్ తమ ప్రసంగాలలో లౌకికరాజ్యం అంటే మతం లేని రాజ్యం కాదని పదేపదే స్పష్టం చేశారు. అన్ని మతాలను సమగౌరవంతో చూడడం, వివక్ష లేకుండా పౌరులందరూ సమానమేనన్నదే ఆయన ప్రసంగాల సారాంశం.

గాంధీ రామరాజ్యం గురించి చెప్పినా, గురుదేవ్ రవీంద్రుని ఒకే ఒక ధర్మరాజ్యం ఉండాలన్న ప్రార్థన ప్రారంభించినా వారు మత వ్యతిరేక రాజ్యాన్ని , లౌకిక వ్యతిరేక రాజ్యాన్ని ప్రతిపాదిస్తున్నట్లు మనం భావించాలా? నరేంద్రమోడీ తన వ్యక్తిగత కారణాల పైననో లేక, కొన్ని తప్పుడు సంకేతాలను నివారించడానికో లేక యాదృచ్ఛికంగానో ఒక ముస్లింపెద్ద ఇచ్చిన టోపీని పెట్టుకోలేదు; శాలువా మాత్రమే స్వీకరించారు. ఆయన ఇలా చేయడం ఒక మతానికి వ్యతిరేకమనో లేక లౌకికవాది కాదనో అర్థం వచ్చే విధంగా ఆ దృశ్యాలను కొన్ని టీవీ ఛానెల్స్ పదే పదే చూపించడం ఎంతవరకు సమంజసం? ఆత్మపరిశీలన చేసుకోకతప్పదు.

- చెన్నమనేని విద్యాసాగర్ రావు
మాజీ కేంద్ర మంత్రి

No comments:

Post a Comment