Thursday, September 15, 2011

చదువుకు సమ్మె వద్దు - కంచ ఐలయ్య Andhra Jyothi 17/09/2011



చదువుకు సమ్మె వద్దు

- కంచ ఐలయ్య

'నేను హిందువునెట్లయిత?', 'పోస్ట్ హిందు ఇండియా' పుస్తకాలను రాసినందుకు నన్నెంతోమంది అగ్రకులాల వాళ్ళు 'దేశద్రోహి' అని తిడుతూనే ఉన్నారు. ఈ వ్యాసం రాస్తున్నందుకు 'తెలంగాణ ద్రోహి' అని తిట్టొచ్చు. అన్ని రంగాలకంటె చదువులో తెలంగాణ బాగా వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ ఒప్పుకుంది. అందుకు ఇతర కారణాలతో పాటు ఇక్కడి భూస్వాములు బడులను, పాఠశాలలను నడవనివ్వకపోవడం కూడ ఒక కారణం.

నేను నర్సంపేట దగ్గరి గూడూర్లో 8వ తరగతి 1966లో చదువుతున్నప్పుడు ఒకరోజు పనిబడి పంచాయతీ సమితి ఆఫీసుకు పోయాను. అప్పుడే బి.డి.ఓ. సమితి ప్రెసిడెంట్ మీటింగ్ అటెండ్ చేసి టీచర్లందరూ బయటికొచ్చి మాట్లాడుకుంటున్నారు. ఒక టీచర్ "వెంకట్‌రెడ్డి దొర మాబడిలో చదువు చెప్పొద్దంటున్నాడు. మీరు ఊరి పోరగాండ్లకు చదువు చెప్పుతే మాకు జీతం ఎవరుంటారని తిడుతున్నాడు. సంతకం పెట్టి సప్పుడు చేకపో అంటున్నాడు'' అన్నాడు.పక్కన టీచర్ "గంతమంచి ఊరు దొరికినంక ఇంకేంది, దొర నన్నక్కడ ఏయించుగద బాగుండు'' అన్నాడు. ఈ సర్దుబాటు పంతుళ్ళకు-దొరలకు ఇక్కడ చాలా కాలంగా ఉన్నది.

తెలంగాణలో దొరలు చాలా గ్రామాల్లో బడి పంతుళ్ళతో నెరదార్లుగా పనిచేయించుకొని పాఠాలు చెప్పొద్దని బాహాటంగానే చెప్పేవాళ్ళు. 1969 నాటికి దొరలు లేని గ్రామాల్లో కొద్దోగొప్పో స్కూళ్ళు నడిచేవి. అయితే దొరలు మాత్రం తమ పిల్లల్ని బయట చదివించేవాళ్ళు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనాక, ఆంధ్రదోపిడీపై కోపంతో నాతరం ఒక సంవత్సరం పూర్తిగా కోల్పోయాం. ఆ తరువాత కూడ ఆంధ్రుల దోపిడీ అంతం కాలేదు కాని మా జీవితంలో 'కాపీ కొట్టి' పరీక్ష రాయడం మొదలైంది. బైకాట్లు చాలా సంవత్సరాలు సాగేవి. ఈ క్రమంలో పంతుళ్ళకు మార్కులు ఇచ్చుడు విద్యార్థులకు పుచ్చుకునుడు అలవాటైంది.

చదివి పరీక్ష రాసేవాళ్ళను పిచ్చివాళ్ళుగా చూడడం, పేపర్లు చదివి మార్కులిచ్చే పద్ధతి లేకపోవడం విద్యార్థుల జీవితంతో ఆడుకోవడం అలవాటైపోయింది. దాదాపు 1980 దాకా ఈ పద్ధతి ఏ ఆత్మవిమర్శ లేకుండా నడిచింది. 1980 నుండి 1996 బోనగిరి తెలంగాణ సదస్సు వరకు ఈ అంశంపై బైకాట్లు జరగక కాస్త నిలకడగా స్కూళ్ళు నడిచాయి. ఈ కాలంలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలే గ్రామాల నుండి వచ్చి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. కొంతమంది విదేశాల్లో కూడ ఉన్నారు.

కాని ఇదే దశలో కమ్యూనిస్టు, మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణ కేంద్రబిందువైంది. 1969 నుండి తెలంగాణ మావోయిజం కొంత కలగలిసి నడిచాయి. ఈ రెండు కూడ విద్యారంగాన్నే టార్గెట్ చేసేవి. మావోయిస్టు పోరాటం బలపడ్డంక ఈ "చదువులన్నీ బూర్జువా చదువులు'' జై తెలంగాణ బైకాట్లకు బదులు "ఎర్రజెండ, ఎర్రజెండ ఎన్నియలో'' బైకాట్లు జరిగేవి. బతుకుదెరువు కోసం చదువుకోకపోతే ఎట్లా అనే విద్యార్థులను, భూస్వాముల తొత్తులని, బూర్జువాల తొత్తులని సామ్రాజ్యవాద ఏజెంట్లని తిట్టుడు మామూలైపోయింది. ఈ దశలోనే వందలాది మంది స్కూళ్ళు, కాలేజి చదువులు వదిలేసి ఎర్రదండులో చేరారు.

1990 దశకంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం ప్రపంచీకరణతో కలకలసి వచ్చింది. అన్ని తరగతుల కులాల ప్రజలకు పోటీపడి విద్య నేర్చుకోవలసిన అవసరమొచ్చింది. ఈ దశలో ప్రయివేటు, ప్రభుత్వ స్కూళ్ళకు ఎనలేని అఘాతం ఏర్పడింది. ఊళ్ళలో మళ్ళీ బైకాట్లు మొక్కుబడి పరీక్షలు ఏం రాసినా మార్కులివ్వడం పద్ధతి, స్కూళ్ళ నుంచి కాలేజీలకు పాకింది. గత రెండేండ్లలో అసలు క్లాసురూంలో పాఠాలు సెప్పడం పంతుళ్ళకు, వినడం విద్యార్థులకు అలవాటు తప్పినంతపనైంది.

ఈ అన్ని ఉద్యమాలకు యూనివర్సిటీ, కాలేజీ, స్కూలు టీచర్లు సిద్ధాంత నాయకులయ్యారనేది ఒక వాస్తవం. అటు తెలంగాణ ఉద్యమానికి ఇటు కమ్యూనిస్టు- మావోయిస్టు హిందూత్వ ఉద్యమాలకు సిద్ధాంతకర్తలు ఇక్కడి నుండే వస్తున్నారు. దురదృష్టవశాత్తు విద్యను నిలకడగా, సీరియస్‌గా క్లాస్‌రూంలో, లైబ్రరీలో నేర్చుకోవడం గురించి వీళ్ళు ఆలోచించలేదు.

ఉద్యమాల్లో ఉన్నవాళ్ళందరికీ తాత్కాలిక దీర్ఘకాలిక ఉద్యమ అవసరాలుంటాయి. అందుకు ఉపయోగపడే కేంద్రాలుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఉంటాయి. వాటిని బైకాట్ చేయించి, లేదా సమ్మెల ద్వారా మూసేయించడమే ఒక అత్యవసర కర్తవ్యంగా కనబడుతోంది. ఈ ఉద్యమ రూపానికి తీవ్రంగా బలయ్యేది మొదటితరం విద్యాలయాల్లో అడుగుపెట్టినవాళ్ళు. ఈ ఆధునిక దశలో విద్య ఒక్కటే వాళ్ళను, దారిద్య్రం నుండి, రోగాల నుండి, మూఢ నమ్మకాల నుండి, బయట పడేయగలదని మనకు తెలుసు.

వాటిని అవసరాల వల్లనో ఆవేశం వల్లనో నిరంతరంగా మూసేస్తే ఒక్కతరం కాదు, ఎన్నో తరాలు దెబ్బతింటాయి. ఉద్యమరూపాలు కూడ 1969 నుండి ఇప్పటివరకు ఒకే విధంగా ఉంటున్నాయి. తెలంగాణనో, విప్లవాన్నో లేదా హిందూ రాష్ట్రాన్నో సాధించడానికి స్కూళ్ళమీదనే పడాలా! పోరాటాలే మంచి పాఠాలు చెబుతాయని మనం చెబుతున్నాం. ఇప్పుడున్న పోటీయుగంలో రోడ్లమీద పోరాటం కంప్యూటర్ విద్యనెలా నేర్పుతుంది? 1969 నుండి ఇప్పటివరకు విద్యార్థులను రోడ్లమీదికి తేవడాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చడం పరిపాటే.

ఆనాడున్న పోటీకి, ఈనాడున్న పోటీకి ఏమైన పోలికలున్నాయా? ఆనాడున్న ఉద్యోగ అవసరాలకు, ఈనాడున్న ఉద్యోగ అవసరాలకు పోలికలున్నాయా? ఈ పోలిక మన అవసరానికి న్యాయం చెయ్యొచ్చుకానీ, ఈ ప్రాంతపు పిల్లల భవిష్యత్తుకు ఏమాత్రం పనికిరాదు. ప్రతి సంవత్సరం పదులకొద్దీ "స్కూల్ డేస్'' పాఠాలు చెప్పకుండా, విద్యార్థులు వినకుండా ఉద్యమ అవసరాలతో పోడగొట్టి వాళ్ళ జీవితాలను ఏం చేయదలుచుకున్నాం. స్కూలు విద్య, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఆరోగ్య అవసరాలకంటె, పండుగలు పబ్బాలకంటే, అత్యవసరమైన అంశం. దాన్ని ప్రభుత్వం అట్లా నిర్వచించకపోవచ్చు.

అది ప్రాంతీయ దోపిడీ ప్రభుత్వం ఐనప్పుడు ఈ ప్రాంతపు స్కూళ్ళను అరకొరగా నడిపే అవకాశం వుంది. ఈ అన్యాయాన్ని ఆపే పోరాటంలో నిరంతరంగా, అదొక పోరాట రూపంగా చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళు బందు చేసుడేంది? స్కూలు టీచర్లు గ్రామీణ ప్రాంతాలలో ఉండే పెద్ద మేధావి వర్గం. ఈ మేధావి వర్గం, కాలేజి, యూనివర్శిటీల్లో ఉండే టీచర్లవైపు ఆదర్శం కోసం చూస్తూంది.

విద్యార్థులు వీరందరివైపు చూస్తారు. 'పాలబుగ్గల జీలుగాడ, పాలు మరిచి ఎన్నాళ్లైందో' అని పాట రాసిన తెలంగాణే, 'ఓ పాలబుగ్గల పాపల్లారా! మీరు బడిలో ఉంటే తెలంగాణ ఎట్లా వస్తుంది' అంటే మన చైతన్యం చెట్లు ఎక్కుతున్నట్టా, భూమి మీద నడుస్తున్నట్టా? ప్రభుత్వ స్కూళ్ళలో పాఠాలు లేని విద్యార్థులు నామమాత్రపు వడబోతలతో యూనివర్శిటీలకు వస్తున్నారు. ఇక్కడ కూడ మార్కులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలు చేశాం.

ఇక్కడ నిరంతరం రోడ్లమీద నిలబెట్టుడు అలవాటుగా మారాక ఆ స్థితిని మార్చడానికి చాలా కాలం పడుతుంది. ఈ పెద్దపిల్లల సంగతటంచుదాం. స్కూలు లేకుండా ఉంటే ఆనందమనుకునే పసికూనల జీవితాన్ని బలవంతంగా కూర్చోబెట్టి, మార్చేది స్కూలు: గ్రామాలను మార్చేది కూడ గ్రామాల్లోని స్కూలే. వాళ్ళకు మనం ఎందుకోసం స్కూలు మూస్తున్నామో అర్థంకాదు. కాని టీచర్లకు తెలుసు. అన్ని ప్రాంతాల్లోని గ్రామ టీచర్లు గ్రామాల్లో ఉండడం లేదు. సమ్మె, బందు, బైకాట్ వల్ల తాను కాలు కదల్చకుండా ఇంట్లో ఉండేందుకు ఉపయోగపడుతుందనే స్థితి, నెలలుగా, సంవత్సరాలుగా స్కూళ్ళు మూయడం వల్ల నష్టం టీచర్లది కాదు, పిల్లలది. మనం కోరుకునే తెలంగాణో, విప్లవమో వచ్చేదాక పోరాడాలనే పట్టుదల టీచర్‌కు ఉండవచ్చు.

కాని అది ఒకటి, రెండు రోజుల్లో వచ్చేది కాదు అని తెలిసి కూడ ప్రతి నిత్యం స్కూలు మూయిస్తే జరిగేదేంటి? ఆ స్కూలుకు లేదా టీచర్ జీతబత్తాలకు చెందిన సమస్యల మీద బందులు చేస్తే పరవాలేదు. అవి త్వరలో పరిష్కరించదగ్గవి. కాని రాష్ట్రాల విభజన లేదా దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసే సమస్య ఎప్పుడు పరిష్కారమైతాయో తెలియదే! టీచర్లు ఉద్యమాల్లో పాల్గొనరాదని నేను అనడం లేదు. సెలవుల్లో, స్కూలు టైంకు ముందు, తరువాత వాళ్ళెంత ఉద్యమకారులుగా ఉంటే అంత మంచిది.

పాఠాలు చెప్పకుండా, రీసర్చి చేయకుండా ఒక సమస్యను ముందు పెట్టుకుని నిరంతరం తాము రోడ్లమీద ఉండడం, విద్యార్థుల్ని రోడ్లమీద ఉంచడం మాత్రం ద్రోహం. దేనికి? విద్యకు. ఇప్పటివరకు మనం విద్యాహక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. కాని విద్య అన్నింటికంటే ముఖ్యమైన 'ఎస్సేనిషియల్ సర్వీస్' అని గుర్తించలేదు. ఇటువంటి ఆలోచనను టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారని మనకు తెలుసు. తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్ళలో చదివించే ప్రభుత్వ టీచర్లంతా ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

ప్రభుత్వ స్కూళ్ళను నడుపమని సమ్మె నోటీసు ఇచ్చిన టీచర్లు తమ పిల్లలకు ప్రయివేటు స్కూళ్ళలో చదువుచెప్పే టీచర్లకు ఆ హక్కు ఉండాలనీ పోరాడగలరా? ఆ టీచర్లు రాష్ట్రసాధనో, విప్లవమో వచ్చేవరకు సమ్మెచేస్తే జీతాలు ఇవ్వాలని పోరాడుతారా? గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని రోజులు మూతపడ్డాయో, ప్రయివేటు స్కూళ్ళు ఎన్నిరోజులు మూతపడ్డాయో లెక్కలు తీయండి. గ్రామీణ ప్రాంతపు ప్రభుత్వ స్కూళ్ళను దాదాపు సంవత్సరం పొడవున మూసే ఉంచారు? అక్కడ ఎవరు చదువుతున్నారు? క్రింది కులాల బీద పిల్లలు. వాళ్ళకు స్కూలు ఎందుకు మూస్తున్నారు ఏం తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడ టీచర్లను అడగలేరు. కాని ఇదే టీచర్ల పిల్లలు ప్రయివేటు స్కూలు ఒక్కరోజు బందైన వీళ్ళే వెళ్ళి అడుగుతారు.

అవును తెలంగాణ రావాలి, ఈ దేశంలో విప్లవం కూడ రావాలి. వాటికి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోని పోరాట రూపాలు ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో ఏ అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా స్కూళ్ళు, కాలేజీలు బందుపెట్టి, రోజూ రోడ్ల మీద విద్యార్థుల్ని నిలబెట్టే ఉద్యమాలు చూస్తున్నామా? ఉద్యమమేదైనకాని, దాని కోసం సెంటిమెంట్ ఎంత బలంగానైనా ఉండనియి, స్కూళ్ళను, కాలేజీలను వాటిని బయట ఉంచకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ స్కూళ్ళను మూసెయ్యడానికి రూపొందిస్తున్న ఉద్యమ ఎత్తుగడల్ని కింద కులల వారిని కొత్త తరం జీతగాళ్ళుగా తయారుచేసుకునేందుకే అనే ఆలోచన తప్పక వస్తుంది. మొత్తం విద్యారంగాన్ని ప్రయివేటీకరణవైపు నెట్టేలా అనే ప్రశ్న కూడ తలెత్తుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

No comments:

Post a Comment