Saturday, September 24, 2011

ఓడిపోని ఒప్పందాలు జరగాలి By - కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర Namasethe Telangana 25/09/2011


9/24/2011 10:21:51 PM
ఓడిపోని ఒప్పందాలు జరగాలి
భారత దేశ సమాజం కేవలం ఒక సమాజం మాత్రమే కాదు, అది అనేక సమాజాల కలయిక. అదొక కులాల, జాతుల బందీఖాన. ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఆధిపత్యకులాలు, ఆదివాసులు, మైనారిటీలు భారత సమాజంలో వున్నారు. వీళ్లందరి సామాజిక స్థితిగతులు ఒక్కటిగా లేవు. అణచివేతలు, దడికట్టుకోవడాలు, అంతస్తుల ప్రాతిపదికగా భారతీయ సమాజం ఉంది. నిజానికి జాతులు, కులాలు- వాటి అవసరాలన్నీ చాలా సందర్భాల్లో ఒక్కటిగా లేవు. ఒక్కటి కావు. రాజ్యం, పాలకు లు ఈ జాతుల్ని, కులాల్ని తరగతుల్ని ఒక్కటిగా గుదిగుచ్చినయి. వాళ్ల అదుపు, సౌక ర్యం కోసం భిన్నత్వంలో ఏకత్వమని, ఏకత్వంలో భిన్నత్వమని, మనమంతా హిందువులమని, గంగా సింధు బిందువులమని న్యాయం, సమానత్వం, సహోదరత్వం మనందరికి పునాదులని ఇంకా ఇట్లాంటి మాయమాట లెన్నో అల్లేసిండ్రు. ఏ రెండు కులాల మధ్య కంచం పొత్తు లేకుండా చేసిండ్రు. ఏ రెండు కులాలు సాంఘికంగా సమానంగా లేవు. అణచివేతల భావజాలాన్ని యంత్రాంగాన్ని, నిర్మాణాల్ని తెలివిగా విధి నిషేధాల పేరుతో సామాజిక సమూహాల మధ్య గోడల్లేపేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయశక్తి ఉన్న కులాలు అల్పసంఖ్యాకులైతే, మంది బలం, శ్రమశక్తి, ఆకలి, అణచివేతలు, అవకాశాల చట్రం నుంచి పక్కకు నెట్టేయబడడం బహుజన కులాల, జాతుల పరిస్థితైంది. ఈ చట్రాన్ని, ఈ సామాజిక అణచివేతల భావజాలాన్ని, నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రోద్యమానికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం పోటీ కాదు, వ్యతిరేకత కాదు. అట్లాగే తెలంగాణకు మన్యసీమ ఉద్యమం పోటీకాదు. అణగారిన సమూహాలు, ప్రాంతాలు, జెండర్‌లు, గొంతులు విప్పుతున్నయి. తమకు తామే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నయి. తమ సమస్యలకు రాజకీయ డిమాండ్ల రూపంలో పరిష్కారాలను కోరుతున్నయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ చిత్తశుద్ధి కనబరిస్తే, ముందుకు వస్తున్న అనేక ఉద్యమాల డిమాండ్లను ఏక కాలంలో పరిష్కరించగలవు. ఆ శక్తి ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వ బలము, ప్రభుత్వంలోని అన్ని శాఖల రూపంలోనే వుంటుంది. ఏ శాఖ పరిష్కరించాల్సిన రాజకీయ సమస్య ను ఆ శాఖ ద్వారా ప్రభుత్వాలు పరిష్కరించగలవు. ఈ అంశాన్ని గమనించినప్పుడు సామాజిక ఉద్యమాలకు కార్యకర్తలుగా ఉన్న మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఏ ఉద్యమం మరో ఉద్యమానికి పోటీ కాలేదని, వ్యతిరేకత ఉండబోదని.

అయితే పాలక కులాలు తమ ఆస్తిత్వం, తమ మనుగడ, ఆధిపత్యాల కోసం మెజారిటీ అణగారిన అస్తిత్వాల శిబిరంలో గందరగోళాన్ని, అపోహలను, వైషమ్యా లు, ఈర్ష్యలను పోటీలను వ్యతిరేక భావాలను చొప్పిస్తున్నాయి. ఒక న్యాయబద్ధమైన ఉద్యమానికి మరో న్యాయబద్ధమైన ఉద్యమం పోటీ అని అనుకునే లాగ కలహాలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధిపత్యకులాలు తమకు అవసరమైన డిమాండ్లను పార్లమెంటులో సులభంగా పరిష్కరించుకుంటున్నాయి. చట్టాలు చేస్కుంటున్నయి. తమకు ఇష్టంలేని మాదిగ దండోర, తెలంగాణ, తుడుందెబ్బ, బీసీ రిజర్వేషన్లు, మహి ళా రిజర్వేషన్లు మొదలగు అంశాలను జాతీయ ప్రగతిశీల కూటమి(యూపీఏ) ఏకాభివూపాయ సాధన పరీక్షకు వదిలేస్తున్నాయి.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాదిగలు మిగతా ఎస్సీ కులాలు ఒకవైపున, మరోవైపు మాలలు. వీరిమధ్య కుల సామాజిక పంపకాల ఒప్పందం ఇప్పటికే జరగాల్సి వుంది. ఆ విషయంలో దళితుల మధ్య ఆధిపత్య కులంగా ఎదిగిన మాల కులం మీద ఎక్కువ బాధ్యత వుంటది. మాదిగలు మిగతా ఎస్సీ కులాలు ఆ దిశగా ఎదురు చూసిండ్రు. అయితే రాజకీయ, ఉద్యోగ పరిపాలన, నాయకత్వ, విద్య, సంక్షే మ, రచనారంగాల్లో ఎదిగిన మాలలు, అసాంఘిక శక్తులుగా తయారవడం వల్ల పంపిణీ న్యాయాలకు సంబంధించిన సామాజిక ఒప్పందం ఎస్సీ కులాల మధ్య జరగలేదు.దీనిని ప్రతిపాదించిన మాదిగలు ఆశాభంగం చెందారు.

అట్లనే తుడుందెబ్బ ఉద్యమం ముందుకు తీసుకొచ్చిన ఆదివాసీ రిజర్వేషన్ల అంశంలోనూ కొండజాతులకు, అటవీజాతులకు న్యాయం జరిగే ప్రాతిపదికలో వారికీ మైదాన ప్రాంత ఆదివాసులకు మధ్య రిజర్వేషన్ల పంపిణీకి సంబంధించిన సామాజిక ఒప్పందం ఇప్పటికే జరిగి వుండాల్సింది. ఈ విషయంలో మైదాన ప్రాంత ఆదివాసీ తెగలైన లంబాడీ (సుగాలి) ఎరుకల మొదలగు వారి మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే వీరు సాపేక్షికంగా రిజర్వేషన్లు ఉపయోగించుకొని బలపడ్డ తెగవారు కాబట్టి. ఎస్సీల్లో మాలలు మాదిగలలాగే వీరు మిగిలిన కొండజాతులు, అటవీజాతుల వారి పట్లా అసాంఘిక శక్తులుగా మారిండ్రు. అట్లనే బీసీల్లో సంచారజాతులు అల్పసంఖ్యాక వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు వారికి అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కోసం ఉద్యమిస్తున్నారు. వీరి హక్కులను గ్యారంటీ చేయడానికి వీలుగా వెనుకబడిన బీసీ కులాల మధ్య ఆధిపత్య బీసీ కులాల మధ్య ఒక సామాజిక ఒప్పందం ఇప్పటికే జరిగి వుండాల్సింది.

అయితే బీసీల్లో ఆధిపత్య బీసీలుగా ఎదిగిన మున్నూరు కాపు, యాదవ , గౌడ, పద్మశాలి మొదలగు ఆధిపత్య బీసీ కులాల్లోని అవకాశాలు పొందిన వర్గాలు అసాంఘిక ప్రతిఘాతక పాత్ర పోషస్తుండడం వల్ల ఎంబీసీలకు రిజర్వేషన్లలో పంపక న్యాయాన్ని గ్యారంటీ చేసే సామాజిక ఒప్పందమేదీ జరగకుండా పోయింది.
అట్లనే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు, మైనారిటీ మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే సామాజిక ఒప్పందం అణగారిన సామాజిక వర్గాల మహిళలకు, ఆధిపత్య కులాల మహిళలకు సామాజిక ఒప్పందం జరగాల్సి వుండింది. ఇది రాజకీయ ప్రతీకగా చూస్తే , సామాజిక న్యాయ వాదాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న బి.ఎస్.పి. సమాజ్‌వాది, ఆర్జేడీ మొదలగు రాజకీయ పార్టీలొకవైపు- మిగిలిన మనువాద పార్టీలొకవైపు నిలిచి సామాజిక ఒప్పందం చేసుకోవాల్సి వుండింది. ఇందులో మనువాద పార్టీలపైనా పూర్తి బాధ్యత వుండింది. కానీ మగ, మనువాద, వామపక్షపార్టీలు కావడం వల్ల, ఆధిపత్యాలకు మారుపేరు కావడం వల్లనూ అసమానతలను, దోపిడీని రెగ్యులేట్ చేసుకోవడం వల్లనూ, ఓబీసీ మహిళలకు, మైనారిటీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఇందుకు మగవాద, మనువాద పార్టీలే పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుంది.

మనువాద పార్టీల విధానాలను బలపరుస్తున్న ఆధిపత్య కులాల మహిళలు, మహిళా సంఘాల నాయకురాల్లు అసాంఘిక వైఖరి కూడా కారణమే. వీరి వల్లనే ఓబీసీ, మైనారిటీ మహిళలకు దామాషా ప్రకారం ప్రాతినిధ్యాలు కల్పించే సామాజిక ఒప్పందం జరగాల్సింది. అది జరగకుండా పోవడానికి మనువాద కులాల మగ వాళ్లు, మహిళలు ఒక కారణమైతే వారి పార్టీలన్నీ మరో కారణంగా చెప్పుకోవచ్చు. మహిళా బిల్లు తెగకుండా నాన్చడం వల్ల నష్టపోయింది. ఎస్సీ,ఎస్టీ మహిళలే ! (రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కూడా) ఇక ఆధిపత్య ప్రాంతాల వారికి వలసలుగా మారిన తెలంగాణ విముక్తి సమస్య కూడా ఇలాంటిదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య ఒక సామాజిక ఒప్పందం జరిగి ఉండాల్సింది. దీనికి తెలంగాణ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు నిలబడి ఈ ఒప్పందం చేసుకొని వుండాల్సింది. ఇది జరగకపోవడానికి ఆధిపత్య సీమాంధ్ర రాజకీయ పార్టీల కుట్ర పూరిత రాజకీయ కార్యకలాపాలే ప్రధాన కారణంగా చెప్పాలి.

పై అంశాలను పరిశీలిస్తే ప్రతి దొంతర్లో ఆధిపత్య కులాలు, తెగలు వెనుకబడిన తరగతులు, జెండర్‌లు, ప్రాంతాలు పోషిస్తున్న ప్రతీఘాతక వైఖరులేనని స్పష్టమవుతుంది. దీనివల్ల ఘర్షణ వాతావరణం పెరిగింది. జనాభా దామాషాలకు మించిన అదనపు సౌకర్యాలను ఆధిపత్యాలను చెలాయిస్తున్న సామాజిక వర్గాలు ప్రజాస్వామికంగా వ్యవహరించక పోవడం వల్లే ఈ అంతర్యుద్ధాలకు పునాదులు పడ్డాయి. సామరస్యంగా సామాజిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆయా దొంతర్లలోని ఆధిపత్య కులాలు ముందుకొస్తే పంపక న్యాయాలు ఏర్పడ్తాయి. ప్రాతినిధ్యాలు, ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేదంటే ఈ అంతర్ ఘర్షనలు సుదీర్ఘ అశాంతికి నిలయమైతయి.గతంలో బ్రిటీష్ వారి దగ్గర అంబేద్కర్ సాధించిన కమ్యూనల్ అవార్డుగానీ, రాయలసీమ, కోస్తాంవూధకు జరిగిన శ్రీ బాగ్ ఒప్పందంగానీ, సీమాంధ్ర - తెలంగాణ మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం కానీ, అమలులో అవి ఎట్లా నిర్వీర్యం చేయబడ్డాయో చరిత్ర మనకెన్నో పాఠాలు నేర్పింది. నిజానికి ఈ అవార్డులు ఒడంబడికలు అమలు జరిగి వుంటే హక్కులు కోల్పోయిన వారు తిరిగి ఏనాడో హక్కులు పొంది వుండేవారు.

అణగారిన కులాలు, జాతులు ప్రాంతాలు, జెండర్‌లు వీరి స్వయం గౌరవం, హక్కులు, స్వయంపాలన , సాధికారితకు ప్రజాస్వామ్యంలో తప్పనిసరి షరతులుగా వుండాలి. ఒప్పందాల అమలులో కూడా నిజాయితీ క్రియాశీలత వుండాలి. ఇవి లోపించిన నాడు అసమానతలు, సంఘర్షణ చివరికి అంతర్యుద్ధాలుగా పరిణమించవచ్చు. 
- కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర

No comments:

Post a Comment