Tuesday, September 6, 2011

సుప్రీం తీర్పు - మాడ్కం మాసా - వరవరరావు Andhra Jyothi 07/09/2011


సుప్రీం తీర్పు - మాడ్కం మాసా

- వరవరరావు

ఆగస్టు 5- వారాంతపు సంతరోజు. దంతెవాడ (ఛత్తీస్‌ఘడ్) జిల్లాలోని కెర్లపాడా క్యాంపు నుంచి చిక్పాల్ దేవపరా గ్రామానికి కేంద్ర రిజర్వు పోలీసు కంపెనీకి చెందిన రెండవ బెటాలియన్ పోలీసులు వచ్చారు. గ్రామస్తుంలందరికీ కంబళ్లు పంచుతామనీ, అందుకని గ్రామంలోని ఒక మైదాన ప్రాంతానికి రావాలని ప్రకటించారు. గ్రామస్తులందరూ వచ్చాక తాము ముఖియాతో మాట్లాడాల్సి ఉందన్నారు. మాడ్కం మాసా తానే ముఖియానని ముందుకు వచ్చాడు. గ్రామస్తులందరినీ వెళ్లిపొమ్మని చెప్పి ముఖియాను తమతో ఉండిపొమ్మన్నారు. ప్రజలందరూ వెళ్లిపోయారు. అతన్ని బొలేరో వాహనంలో ఎక్కించుకొని తమ క్యాంపుకు తీసుకుపోయారు. అతడు తిరిగి రాలేదు.

గ్రామస్తులు కొందరు పోలీసు క్యాంపుకు వెళ్లి తమ ముఖియా ఏడి అని అడిగారు. పోలీసులు అతన్ని తమ వెంట తీసుకురాలేదని, గ్రామంలోనే వదిలేశామని చెప్పారు. ఆగస్టు6- మధ్యాహ్నం మూడుగంటల సమయంలో సిఆర్‌పి ఎఫ్ వాళ్లు సుర్మా క్యాంపులో మీడియాను పిలిచి ఒక ఎన్‌కౌంటర్ జరిగిందని, అందులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, ఒక నక్సలైటు తమపై దాడి చేశాడు గనుక మరణించాడని చెప్పారు. ఇద్దరు పోలీసులను గాయపడినట్లు చూపారు. వాళ్లు మృతుని శవాన్ని కూడా చూపారు. అతడు మోస్తున్న ఆయుధాలని చెప్పి కొన్ని చూపారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రాలు కలిసి ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయని చెప్పారు.

ఆగస్టు 10- నాలుగురోజులయినా తమ ముఖియా తిరిగిరాకపోవడంతో ఆయనకేమయిందోననే ఆందోళనతో నలభైమందిదాకా గ్రామస్తులు ఆ రోజు కెర్లపాడా సిఆర్ పిఎఫ్ క్యాంపుకు పోయారు. అక్కడ మళ్ళీ అధికారులు అతని గురించి తమకేమీ తెలియదని చెప్పారు. అప్పుడు వాళ్లు ఇంక సుకుమాలో ఉన్న ఇండ్ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కే వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు అదనపు ఎస్పీని కలిశారు. మొదట అతను కూడ తనకేమీ తెలియదన్నాడు. కాని తర్వాత, శనివారం 6న ఒక ఎన్‌కౌంటర్ అయింది, అందులో ఒక గుర్తుతెలియని నక్సలైటు చనిపోయాడు.

ఆ ఎన్‌కౌంటర్ నీలవరంలో జరిగింది అని చెప్పాడు (ఆ గ్రామం నిజానికి కెర్లపాడాకు అభిముఖంగా కుంటా రోడ్డు వైపు ఉంటుంది) సుకుమా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ ఉన్న మృతదేహం ఫోటోలు చూసి పోల్చుకొమ్మని సూచించాడు. వాళ్లు సుకుమా పోలీస్ స్టేసన్‌కు వెళ్ళి ఆ ఫోటోలు చూసి అది తమ ముఖియా మాడ్కం మాసాదేనని ధ్రువపరిచారు. మాడ్కం మాసా చిక్పాల్ దేవపరా గ్రామానికి ముఖియా, అతని వయస్సు 33 ఏళ్ళు. ఈ ఘటన నేపథ్యంలోకి వెళదాం. మే 17- బోర్గుడ గ్రామంలో ఒక మందుపాతర పేలి సిఆర్‌పిఎఫ్ పోలీసు క్యాంపుకు చెందిన ఏడుగురు పోలీసులు చనిపోయారు. అది ఆ రోజు రాత్రి 8.10 గంటలకు జరిగింది.

సిఆర్‌పిఎఫ్ దర్యాప్తు క్రమంలో దిలీప్‌కోడి అనే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతడు కొన్ని పేర్లు చెప్పాడని పోలీసులు అంటున్నారు. బాడీసెట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి నందలాల్‌ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు పోలీసులను సంఘటనా స్థలానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక బాంబే పేలిందని, మిగతా రెండు బాంబులు పేలకుండా ఎక్కడ మిగిలి ఉన్నాయో వెతికి ఇచ్చాడని పోలీసులు చెప్పారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని ద్వారా ఖమ్మం జిల్లా అడవిలో ఒక ఆయుధ కర్మాగారం ఉన్నట్లు తమకు తెలిసిందని, అది కూనవరం బంజన్‌గూడాలో గంగరాజు అనే వ్యక్తి నడుపుతున్నాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఆ దర్యాప్తు అంతా సిఆర్‌పిఎఫ్, కోబ్రా, ఎపి పోలీసులు సంయుక్తంగా జరిపి గంగరాజును అరెస్ట్ చేశారు. వాళ్లు ఆ ఆయుధ కర్మాగారం అని చెప్తున్న దానినుంచి ఆరు రైఫిళ్లు, ఒక సుత్తి, ఒక గొడ్డలి దొరికినట్లు చూపెట్టారు. గంగరాజు రవీన్‌హల్దార్‌తో సంబంధాలున్నట్లు చెప్పాడని సుకుమా లోతట్టు ప్రాంతంలో చింద్ ఘర్ నివార్ గుర్లీ మార్కెట్‌లో ఉన్న అతని ఫోటో స్టూడియోకు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఫోటో గ్రాఫరన్నది పోలీసుల ఆరోపణ. అతని నుంచి ఒక ల్యాప్ టాప్ పట్టుకున్నామని అందులో మావోయిస్టుల ఫోటోలు, పత్రికా ప్రకటనలు, సాహిత్యం చాలా దొరికిందని పోలీసులు చెప్తున్నారు.

దిలీప్ కోడి, నందలాల్, గంగరాజు, రవీన్ హల్దార్‌లను విచారిస్తే మాడ్కం మాసా పేరు బయటపడిందని (ఏమని బయటపడిందో తెలియదు) అందుకని అట్లా అతడిని పట్టుకొని చంపారని పోలీసుల్లోనే కొన్ని వర్గాల ద్వారా బయటికి వచ్చిన ఉదంతం. ఆగస్టు 10 నుంచి చిక్పాల్ దేవపరా, కేర్లపాడా మొదలైన గ్రామాల నుంచి, సుకుమా పోస్టాఫీసు బయట ప్రజలు గుమిగూడి తమ ముఖియా మాడ్కం మాసా పాస్‌పోర్టు సైజు ఫోటోలు పంచుతున్నారు. వెలసిపోయిన నీలిరంగు చొక్కా వేసుకొని ఆ ఫోటోలో నవ్వుతున్న దృఢకాయుడు చిక్పాల్ గ్రామానికి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఎన్నికైన ముఖియా అని, అంటే గ్రామ పెద్ద అని, అతనికి మావోయిస్టులతో ఏ సంబంధాలు లేవని చెప్తున్నారు.

ఇదే గ్రామస్తులు మరొక ఫోటో కూడా చూపుతున్నారు. ఒక తెల్లటిరాయి మీద, కుడిచెయ్యి భుజం దగ్గర వేలాడుతూ, ఛాతీలో గుండు దూసుకపోయిన ఒక బీభత్సమైన శవం. అదీ మాడ్కం మాసాదే. అతన్ని ఆగస్టు 5 సంతరోజు తమ అందరి సమక్షంలోనే బొలేరో వాహనంలో క్యాంపుకు తెచ్చి ఆగస్టు 6న మావోయిస్టు గెరిల్లా దుస్తులు తొడిగి చంపేసి, సుకుమా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ చేయించి ఎన్‌కౌంటర్ ప్రకటించి బొంద పెట్టారని, ఆగస్టు 10న తమకీ విషయం తెలిసిందని ప్రజలు చెప్తున్నారు.

కాని దంతెవాడ ఎస్పీ అంకిత్ గార్గ మాత్రం అతడు మావోయిస్టేనని, అతడు నిజమైన ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడని చెప్తున్నాడు. కాని సుకుమా ప్రాంతపు స్థానిక రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోవాసీ లక్ష్మా మొదలు సిపిఐ మనీష్ కుంజమ్ వరకు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని అతణ్ణి ఆగస్టు 5న సంతరోజు జనం ముందు పట్టుకెళ్ళారని స్పష్టంగా చెప్తున్నారు.

ఇంతమంది ప్రజలు, ఇద్దరు ప్రముఖ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ మావోయిస్టు వ్యతిరేక పోలీస్ ఆపరేషన్ ఇన్‌చార్జ్ సి ఆర్‌పిఎఫ్ ఐజి పంకజ్ సింగ్ మాత్రం ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని, ఇందులో తమ ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, గెరిల్లా దుస్తుల్లో ఉన్న ఒక నక్సలైటు మరణించాడని పునరుద్ఘాటిస్తున్నాడు. పోస్ట్‌మార్టమ్ చేసి డాక్టర్ పెర్కె 'మాసా కుడిభుజం గ్రెనేడ్ దెబ్బకు శిథిలమై ఉంటుందని, ఛాతీలో మాత్రం బుల్లెట్ కుడివైపునుంచి దూరి ఎడమవైపు వెళ్లిపోయిందని చెప్పాడు.

అతడీ గాయాలతో మరణించాడని చెప్పాడు. దక్షిణ బస్తర్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామన్న ఆగస్టు 6న మావోయిస్టులకు సిఆర్‌పిఎఫ్ బలగాలకు ఎటువంటి ఎదురుకాల్పులు జరగలేదని చెప్పాడు. 'మాడ్కం మాసాతో మావోయిస్టులకు ఎన్నడూ ఏ సంబంధమూ లేదని, తమ కోసం అతడే పనిచేయలేద'ని స్పష్టం చేశాడు.

మన దేశానికి ఇందిరాగాంధీ 11 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఈ కాలంలో నక్సల్బరీ ఉద్యమ అణచివేత మొదలు ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కుల హరణ దాకా అలా ఉంచుదాం. 1984లో పంజాబ్ మిలిటెంట్ ఉద్యమాన్ని అణచివేయడానికి స్వర్ణాలయంపై సైనిక దాడికి పూనుకున్నది. వందలాది సిక్కులను సైన్యం చంపేసింది. అదే ఏడాది అక్టోబర్ 31న ఆమెను ప్రధాని నివాసంలోనే హత్య చేశారు. ఆమె అంగరక్షకులపైనే హత్యానేర విచారణ జరిగి వాళ్లను ఉరితీశారు. ఆమె ప్రభుత్వం. వాళ్ళు అంగరక్షకులు. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని ఐదేళ్లు పాలించాడు. ఆయన పాలనయే ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో సిక్కుల ఊచకోతతో ప్రారంభమైంది.

వేలాది సిక్కులను చంపేశారు. టాడా వగయిరా అలా ఉంచుదాం. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుతో శ్రీలంకలోనూ వేలాది తమిళులను చంపారు. శ్రీపెరుంబుదూరులో ఆయనను ఎల్‌టిటిఇ అభిమానులు మానవబాంబుగా మారి హత్యచేశారు. ఆ హత్యానేరంలో నిందితులను ఉరితీయబోతున్నారు. వాళ్ళు సాధారణ పౌరులే. వాజపేయి కాలంలోనే గుజరాత్ మారణకాండ జరిగి వేలకొలది ముస్లింలు హతులయ్యారు.

నెహ్రూ మొదలు 2001 డిసెంబర్ 31 దాకా మన ప్రజలే ఎన్నుకున్న మన పార్లమెంటు ప్రజల పట్ల ఎన్ని నేరాలు చేసిందో. అది పెద్ద చిట్టా. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి అమాయకులైన గార్డులు చనిపోయారు. దాడిచేసిన వాళ్లూ చనిపోయారు. కుట్రలో భాగంగా అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష విధించారు. ఆయనను ఉరితీయవలసిందేనని కేంద్రహోం శాఖ మంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేసింది. అఫ్జల్ గురు సాధారణ పౌరుడు.

కాశ్మీరీ. బాబూలాల్ మరాండీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎంత అవినీతి, అన్యాయాలకు పాల్పడ్డాడో ప్రభుత్వమే తేల్చినప్పుడు ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మావోయిస్టులపై దాడికి ఆయన జార్ఖండ్ వికాస్ మోర్చాను తయారుచేసి దానికి తన కుమారుడు అనుప్ మరాండీని బాధ్యుణ్ణి చేశాడు. సల్వాజుడుం, హర్మత్ వాహిని (బెంగాల్), శాంతిసేన (ఒడిషా), సేత్నా (జార్ఖండ్)ల వలే ఇది ఒక ప్రైవేటు సైన్యం. చిల్కారీ (జార్ఖండ్)లో ఒక మార్కెట్ ప్లేస్‌లో ఈ సైన్యంపై మావోయిస్టులు కాల్పులు జరిపితే అనుప్ మరాండీతో సహా 19 మంది చనిపోయారు. ఈ చర్యతో ఏ సంబంధమూ లేని ప్రజా కళాకారులు జీతన్ మరాండీ, అనిల్‌రామ్, మనోజ్ రాజ్వర్, ఛత్రపతి మండల్‌లకు గిర్ధీ జిల్లా సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది.

ఈ నలుగురూ సాధారణ ఆదివాసీ పౌరులు. సుప్రసిద్ధ కళాకారులు. ఇటీవల సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అరుదైన నేరాల్లో కూడా అత్యంత అరుదైన నేరం అంటే ఏమిటో నిర్వచించింది. అది రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులు దారాసింగ్ అనే బందిపోటును చంపిన కేసు అపీల్‌లో. పౌరులు, సాధారణ పౌరులు హత్యచేస్తే వాళ్ళకు శిక్ష యావజ్జీవం నుంచి మరణశిక్ష వరకు వేయొచ్చు. కాని మరణ శిక్ష అరుదయిన నేరాల్లో కూడా అత్యంత అరుదైన నేరాలకే వేయాలి.

అది పౌరుల కన్నా, భారత శిక్షా స్మృతిని, నేర శిక్షా స్మృతిని పాటించి తీరవలసిన పోలీసులు చేసిన హత్య అయితే అపుడది తప్పక వాళ్లకు వర్తిస్తుంది అని. ఎక్కడ ఎవరిని చంపినా కేసు నమోదు చేయవలసింది పోలీసులే ('ఎన్ కౌంటర్'లో ఎవరు చచ్చారని పోలీసులు ప్రకటించినా హత్యానేరం కింద నమోదుచేసి విచారణ చేయవలసిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనం ఏక గ్రీవంగా తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దానిపై అపీల్ చేసి స్టే తెచ్చుకున్నది.) కోర్టులో ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదు చేయవలసింది పోలీసులే. కోర్టు విచారణలో మెజిస్ట్రేట్ మొదలు సెషన్స్ వరకు హైకోర్టు సుప్రీంకోర్టులోను వాదించవలసింది ప్రాసిక్యూటర్లే, ప్రభుత్వ న్యాయవాదులే. కనుక ప్రజాజీవితమనే చేనును (ప్రాణాలను) కాపాడవలసిన కంచె పోలీసులు, ప్రభుత్వం. మరి ఆ కంచెయే చేనుమేస్తే? చేనును చంపేస్తే? సుప్రీంకోర్టు తీర్పు ఛత్తీస్‌ఘడ్‌కు కూడా వర్తిస్తుందా? మాడ్కం మాసా 'ఎన్‌కౌంటర్' విషయంలో దర్యాప్తు, విచారణ సుప్రీం కోర్టు తీర్పు వెలుగులో జరుగుతుందని ఆశించవచ్చునా?

- వరవరరావు

No comments:

Post a Comment