Wednesday, September 7, 2011

కులరాజ్య వివక్ష - డాక్టర్ కత్తి పద్మారావు Andhra Jyothi 22/03/2011


కులరాజ్య వివక్ష

- డాక్టర్ కత్తి పద్మారావు

ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. ఒక విచిత్రమేమిటంటే ఎస్సీ, ఎస్టీలే తమకు వ్యతిరేకమైన ప్రభుత్వాలను ఎన్నుకొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలన్నింటిలోనూ ఎస్సీ, ఎస్టీల విషయంలో వివక్ష చూపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రిమండలిలో అత్యధికులు రెడ్డి వర్గీయు లు; 14 కీలక శాఖలు వారివే. ఈ విషయమై ఏ పార్టీ మాట్లాడలేదు.

కారణమేమిటి? రెడ్డి వర్గానికి కాంగ్రెస్, కమ్మ వర్గానికి తెలుగుదేశం ప్రాతినిధ్యం వహించడమే కాదూ? సిపిఐ, సిపిఎం లలో సైతం అగ్ర నాయకత్వం కమ్మవారిదే. ఆ పార్టీల కార్యవర్గాల్లో దళితులకు సముచిత స్థానం లేదు. దాంతో కమ్యూనిస్టు నాయకులు రాష్ట్ర మంత్రివర్గంలో కులాధిపత్యాన్ని ప్రశ్నించలేకపోతున్నారు.

తీసికట్టు పదవులు దళితులకు ఇచ్చారు. దళిత మంత్రులు అగ్ర కులాలకు తాబేదారులుగా మారారు. అందువల్లే బడ్జెట్ కేటాయింపుల్లో దారుణమైన వివక్ష జరిగింది. బడ్జెట్ కేటాయింపుల మీద దళిత ఉద్యమం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రణబ్ ముఖర్జీ సామాజిక న్యాయాన్ని తోసిపుచ్చారు. 1981లో ప్రణాళికా సంఘం చేసిన సూచనలను రాష్ట్ర బడ్జెట్ పాటించలేదు. ప్రణాళికా సంఘం సూచనల ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించాల్సిన ధనం 16.2 శాతం.

నోడల్ ఏజెన్సీ నేర్పాటు చేసి దాని ద్వారా కేటాయించిన నిధులను ఖర్చు చేయాలి. 2009-10 బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 33,496 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రణాళిక వాటా రూ.5,243 కోట్లు. ఇందులో కేవలం రూ.2,764 కోట్లే ఖర్చు పెట్టారు. మరి ఎస్సీ మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారు? మూడు దశాబ్దాలుగా రూ.26,406 కోట్లకు పైగా ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన డబ్బు ఖర్చుపెట్టలేదు. ఆ నిధుల్ని దారి మళ్ళించారు. అగ్రకులాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.

శాసనసభలో 69 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులు ఉన్నారు. పార్లమెంటులో తొమ్మిది మంది దళిత సభ్యులు ఉన్నారు. వీరంతా అగ్రకుల రాజ్యాధికారానికి దాసోహమయ్యారు. వ్యక్తిగత ప్రయోజనా ల కోసం జాతి ధనాన్ని అగ్రకుల రాజకీయ వ్యవస్థకి తాకట్టు పెడుతున్నారు. ఇదంతా కేవలం రాజకీయంగానే జరుగుతుం ది. ప్రతిపక్షాలు దీనిని అంతర్గతంగా అంగీకరిస్తూనే పైకి నినాదాలు చేస్తున్నాయి.

ప్రధాన సమస్య అయిన భూ సమస్య కూడా ఈ ఇరవై ఏళ్ళలో పక్క దారి పట్టింది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్టు అగ్రకుల పార్టీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలు ప్రయోజన రహితమైన వాళ్ళు. తమ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకులని తెలిసి కూడా వారికి లోబడుతున్నారు. తద్వారా దళితుల హక్కుల్ని కాలరాయడంలో దళిత నేతలే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు ఈ సామాజిక ద్రోహం నిరంతరంగా జరుగుతుంది.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సరైన నిధులు కేటాయించక పోవ డం, కేటాయించిన నిధులను వాడక పోవడం జరుగుతుంది. దీనివలన ఆ వర్గాలవారు భూమిలేని, ఇళ్ళులేని, ఉపాధిలేని, చివరకు జీవించే హక్కులేని వారిగా కూలిపోతున్నారు. పట్టణా ల్లో ప్రస్తుతం సెంటు స్థలం లక్షల రూపాయల ధర పలుకుతుం ది. మరి ఆ పాటి స్థలం కొనుక్కోగల స్తోమత దళితుల్లో ఎంతమందికి ఉంది?

ఈ కోణం నుంచి చూసినప్పుడు దళితుడు రానురాను నివసించే హక్కునే కోల్పోతున్నాడు! ఒక మనిషి చచ్చిపోతే ఖననం చేయడానికి శ్మశాన స్థలం లేని పరిస్థితులలో దళితులు జీవిస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో దళితుల శ్మశాన స్థలాలకు డబ్బు కేటాయింపు లేదు. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తూ, మురుగువాడల్లో జీవనం గడుపుతున్న వారికి రోడ్ల కేటాయింపు లేదు. అగ్రకులాల వీధుల్లో వేసిన రోడ్లే వేస్తున్నా రు. అగ్రకులాల కాంట్రాక్టర్లు ఆ ధనాన్ని దోచుకుంటున్నారు.

మరి ఇది బడుగు వర్గాల ప్రభుత్వమేనా? సుప్రీంకోర్టు ఆదేశించినా బీసీల ఫీజు రీయెంబర్స్‌మెంటు జరగలేదు. ఆదివాసీ లు అయితే ఈ పాలకుల దృష్టిలోనే లేరు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చుతున్నారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలలో అన్ని సదుపాయాలను ఎందుకు కలుగజేయ డం లేదు? కనీస విద్యా, వైద్య సదుపాయాలు కొరవడి ఆదివాసీలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. భారత రాజ్యాంగా న్ని అనుసరిస్తున్నామని చెబుతున్నప్పటికీ మనుస్మృతినే మన పాలకులు అమలుపరుస్తున్నారు.

దేశ జనాభాలో ఎస్సీలు 16.2 శాతం. వారి రక్షణ కోసం రాజ్యాంగంలోని 17వ అధికరణ అస్పృశ్యతను నివారిస్తుంది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందరికీ సమానమేనని అధికరణ 14 స్పష్టం చేసింది. దళితుల అభ్యున్నతికి తగి న కేటాయింపులు చేయాలని అధికరణ 46 నిర్దేశించింది. బడ్జెట్ పరంగా దళితులకి కేటాయింపులు తగ్గించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

అధికరణలు 330, 335; 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం దళితులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను తప్పక అమలు జరపాలి. ఆయా అధికరణలు నిర్దేశించిన వాటినన్నిటినీ అమలుపరచడానికే ఒక ప్రత్యేక పరిశోధక బృందం చేత ఏటా ఒక నివేదికను రూపొందించాల్సి వుంది. ఈ నియమాలన్నిటినీ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలదీయడం లేదు.

అంబేడ్కర్ అనుకున్నట్టే పూనా ఒడంబడిక ద్వారా అగ్రకుల పార్టీల నుంచి దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలుగా వస్తున్నవారు సమాజానికి పనికి రాకుండాపోతున్నా రు. సమాజంలో ఉన్న కుల తత్వాన్ని, కులాధిపత్య భావాన్ని ఈ దళిత నేతల ద్వారా అగ్రకుల రాజ్యాధికారం పెంచి పోషిస్తుంది. భారతదేశ గ్రామాల్లో మనుస్మృతి రాజ్యమే నడుస్తుంది.

స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల ఆధీనంలో ఉన్న భూములను ఇప్పుడు పరిశ్రమల అభివృద్ధి పేరుతో అంతర్జాతీయ సం స్థలకు తాకట్టుపెడుతున్నారు. అమెరికాకు చెందిన ఒక బహుళజాతి సంస్థతో మన ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుం ది. ఆ ఒప్పందం మేరకు రాబోయే ఐదేళ్ళ కాలంలో విశాఖపట్నంకి సమీపంలో ఉన్న నక్కపల్లిలో ఆ సంస్థ రూ.2900 కోట్ల తో ఒక భారీ పరిశ్రమను నెలకొల్పబోతుంది.

ఇందుకు ఆ సంస్థ కు మన ప్రభుత్వం 800 ఎకరాలు ఇచ్చింది. అంతేగాక మరో రూ.22,672 కోట్లతో మరో 25 పరిశ్రమలను నెలకొల్పడానికి కూడా ఆ సంస్థకి భూములు కేటాయించారు. ఈ భూములన్నీ దళిత బహుజనులకు చెందాల్సినవే. వీటన్నింటిని కుదువ పెట్టడమంటే అగ్రకులాల రాజ్యం, విదేశీ పెట్టుబడిదారులు కలిసి దళిత బహుజనులకు నిలబడేచోటు లేకుండా చేయటమే. ఈ పరిశ్రమల్లో దళిత బహుజనులను చేర్చుకోవడం ఎలాగూ జరగదు. పైగా అవి వారికి కాలుష్యాన్నే మిగుల్చుతాయి.

2011-12 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం కేటాయింపులు రూ.1,28,542 కోట్లు. ఇందులో ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి వారికి రూ.22,000 కోట్లు కేటాయించాలి. అయితే 10 శాతం లోపే ఎందుకు కేటాయించారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? విద్యా, వైద్యరంగాలు, పౌర సరఫరా లు, గృహ నిర్మాణానికి కేటాయింపులు తగ్గించారు. కొన్ని రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు.

2010-11 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌కి సంబంధించి రూ.26,000 కోట్ల బకాయి లు ఇంకా తీర్చవలసి వుంది. ఇటువంటి వాటన్నిటికి సాంఘిక సంక్షేమ శాఖ కేటాయింపుల్లోంచి తీరుస్తూ ఉన్నారు. బడ్జెట్‌లో చూపించిన డబ్బునే దారి మళ్ళిస్తున్నప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమి చేస్తున్నారు?

ఒక దళితవాడ వైశాల్యం రెండు ఎకరాల లోపు ఉంటుంది. అందులో 300 ఇళ్ళు ఉంటాయి. ఒక ఎస్టీ గూడెం వైశాల్యం అర ఎకరంలోపు ఉంటుంది. ఒక రెడ్డి ఊరు వంద లేదా పాతిక ఎకరాల్లో ఉంటుంది. వాళ్ల పొలాల్లోకి రోడ్లు వేస్తారు. గోదావరి జిల్లా ల్లో క్షత్రియుల పొలాలు, చెరువుల్లోకి రోడ్లు వేసి ఉంటాయి. దళితులు చనిపోతే శ్మశానానికి దారి ఉండదు. శ్మశాన స్థలాల కోసం, శ్మశానాల్లో దారి కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి.

చివరకు ఎమ్మార్వో కార్యాలయాల ముందు శవాలను పెట్టి పోరా టం చేశాం కూడా. శ్మశాన స్థలాల కొనుగోలుకు డబ్బులేదని ఎమ్మార్వోలు, కలెక్టర్లు అంటున్నారు. అంటే చచ్చిన మనిషిని పాతి వేయడానికి ఈ ప్రభుత్వానికి డబ్బులేదు. ఎస్సీలకు కేటాయించిన డబ్బు వారికి ఖర్చు పెట్టడంలేదు. ఎంత అమానుషం! మన దళిత మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నారు?

ఎండాకాలం వచ్చింది. 100కి 80 దళిత వాడ ల్లో తాగునీరు లేదు. అన్ని పంచాయతీ ట్యాంకు లు అగ్రకులాల వీధుల్లోకే నీరు సరఫరా చేస్తున్నాయి. వాటర్ ట్యాంకుల్లో దళిత వాడలకు నీటి కేటాయింపులేదు. ఒకటో రెండు పైపులు వేస్తారు. సొంతంగా పైపులు వేసుకునేవాళ్ళు రూ.10 వేలు కట్టమంటారు. పూటకే గడవని వాళ్ళు పదివేలు ఎలా కట్టగలరు? ఆదివాసీలు ఒక్క బిందె నీటి కోసం మూడు కిలో మీటర్లు నడిచి వెళ్ళుతుంటారు.

అగ్రకులాల వారి చెరువుల్లోకి దళితులని రానివ్వటం లేదు. వాళ్ల పశువుల్ని తోలి కడుగుతున్నారు. కాని దళితుల్ని చెరువుల్లోని నీరు తీసుకువెళ్లనివ్వని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? మన గ్రామాల్లోకి ఈ మహాశయు ల కార్లు రావు. రోడ్లన్నీ గోతుల మయమే. ఎవరైనా దళిత స్త్రీ నొప్పులు వస్తే మంచాల్తో కట్టుకుని మోసుకువెళ్ళాల్సిన గ్రామాలు ఇంకా ఉండడం మనకు సిగ్గుచేటు కాదా?

గ్రామా న్ని, వాడని వేరు చేశారు. గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకుంటున్నారు. వాడని జీవించటానికి వీలులేనిదిగా మలుస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే దళితులు, ఆదివాసీల కు రాజకీయ, సామాజిక చైతన్యం కావా లి. 'మన ఓట్లు మనమే వేసుకుందాం, మన రాజ్యాన్ని మనమే నిర్మిద్దాం' అనే దృక్పథం పెరగాలి. దళిత యువకులు అగ్రకులాల నాయకత్వంలో కాకుండా వారే నాయకులుగా ఎదగాలి. గ్రామ రాజకీయ పెత్త నం దళిత బహుజనుల చేతుల్లోకి రావాల్సివుంది.

రాజ్యాధికార మే ప్రధానమైన 'కీ' అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. దళిత బహుజనులు తమ రాజ్యాధికార సాధన కోసం అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో కృషి చేయ డం ద్వారానే ఈ దోపిడీని ఎదిరించగలరు. అగ్రకులాలవారికి అనుకూలంగా వ్యవహరిస్తు న్న ఇప్పటి దళిత ఎమ్మెల్లేలు, ఎంపీల వల్ల ఎస్సీ, ఎస్టీలకే కాదు మొత్తం సమాజానికి కూడా నష్టమే.

- డాక్టర్ కత్తి పద్మారావు

No comments:

Post a Comment