Thursday, September 8, 2011

లోహియా దృష్టిలో సమానత్వం by GV Ratnakar Surya News Paper 09/09/2011


లోహియా దృష్టిలో సమానత్వం
ram-manohar-lohiaమానవుల అనుభవాలు బహురూపాల్లో ఉంటాయి. వాటిలో కొన్ని జీవితపు మహోన్న త లక్ష్యంగా సమానత్వాన్ని దర్శించే విషయంలో ఒక రకమైన పొరలను కప్పాయి. స్వతంత్రులుగా ఉన్నప్పుడు మానవు లు లాభం పట్ల ఆశ ఉన్నప్పుడే బాగా పనిచేస్తారు. అలా కాక కార్మికులైతే ‘తొలగింపు’ అన్న భయం ఉన్నప్పుడే పనిచేస్తారు. లేదా ఆశ- భయం ఈ రెండింటినీ కలుపుకొని ఉండే వ్యవస్థలో మానవులు పనిచేస్తారు. పెరుగుదల కోసం- భయం పైనో, లేదా ఆశ పైనో ఆధారపడే వ్యవస్థల్లో అసమానతలు పెంపొందుతాయి. అందువల్ల అసమానత అనేది మానవ ప్రకృ తిలో సహజసిద్ధమైన అంగంగా భావించే స్థితి వచ్చింది. పెట్టుబడిదారీ విధానం రాలిపోయే స్థితికి రానప్పుడు, అసమానతలలోని మానవ త్వం గురించి గొప్పలు ప్రచారం చేస్తుంది.

భయం లేదా పేరాశలకు సంతృప్తి రమైన ప్రత్యామ్నాయాన్ని ఇంతవరకు కనుక్కోలేదు. నైతిక ప్రబోధాల ద్వారా మానవ ప్రకృతిలో ఆదర్శవంతమైనమార్పు లేదా విప్ల వం దానికదే రాగలదన్న ఆశ- సమానత్వం గురించి జరిపే అన్వేషణను దెబ్బకొట్టి కురూపిని చెయ్యడంతోబాటు, సమా నత్వంపై నిర్హేతుకం, స్వార్ధపూరితం, హ్రస్వదృష్ఠులతో కప్పిన పొరలను మరింత దృఢంచేసింది. జీవితపు మహోన్నతలక్ష్యం ఏమిటి, దాన్ని ఎలా సాధించాలన్నది ప్రధానమైన విషయం అంటాడు లోహియా.సమానత్వం అంటే- ఒకరకమైన వాతావరణం, ఒకరకమైన ఆవేశం లేదా ఒకరకమైన కోరిక అయి ఉండవచ్చు. రాజకీయ, సాంఘిక, లేదా ఆర్థికాది అన్ని రకాల ఏర్పాట్లూ మానవుల మధ్య, వ్యక్తికి వ్యక్తికి మధ్య సమానంగా ఉండాలని ఈ కోరిక.

సమానత్వపు ఏర్పాట్లనేవి ఆయా సందర్భాలలో ఎలా ఉంటాయనేది ఆయా వ్యక్తుల కోరికలను అనుసరించి, స్వప్నాలను అనుసరించి ఉంటాయి. కలలకు ఉభయ లక్షణాలుంటాయి. వాస్తవంతో నిమిత్తం లేకుండానూ ఉండవచ్చు, మరో వైపు కలలు మనుషుల్ని ముందుకు నడిపించి, తామున్న వ్యవస్థను బద్దలుకొట్టేలా ప్రేరేపించనూ వచ్చు. సమానత్వం అనేది ప్రధానమైన విషయం. ఈ సమానత్వాన్ని స్పష్టమైన రూపంలో నిర్వచిస్తే తప్ప- అదొక వాతావరణం, ఆవేశం, కోరిక లేదా స్వప్నం మాత్రమే అవుతుంది.చట్టపరమైన సమానత్వాన్ని సాధించుకున్న తర్వాత రాజకీయ సమానత్వపు దశ వచ్చింది. రాజకీయ సమానత్వం అంటే వయోజనుల ఓట్లకు ఉండే సమాన విలువ.

ఇటీవలికాలం వరకూ ఆస్తిపాస్తులు, విద్యాయోగ్య తలూ ఓటుకు ముడిపడి ఉండేవి. ఆడవాళ్ళ ఓటుహక్కు మరీ ఇటీవలి కాలంలో సాధించింది. ఏమైనప్పటికీ మానవుడు చట్టపరమైన సమానత్వం నుంచి రాజకీయ సమానత్వానికి ఒక ముందడుగు వేశాడనడం వాస్తవం అంటాడు లోహియా. సమానత్వం అంటే సాధారణ దృక్పధం, ఒక వాతావరణం, ఒక కోరిక, ఒక స్వప్నం. దానిని సగుణమైన, స్పష్టమైన సమానత్వంగా ఏదో ఒకరూపంలో అను వర్తింపచెయ్యాలి. అలా చేసినప్పుడు- చట్టంముందు అందరూ సమానం. ఆహారా నికిచ్చే సబ్సిడీలను అందరూ సమానంగా భరిం చడం, సేవకునికి ఒక ఇల్లు, పిల్లల అలవెన్సు, నిరుద్యోగభృతి, వృద్ధాప్య పింఛను మొదలైన స్పష్టమైన అర్ధాలు సమ కూరుతాయి.

ఇవన్నీ సమానత్వపు స్పష్టమైన భావనలు. ఆచరణలో సంక్షేమ రాజ్యం అంటే ఇది! భారతదేశంలో సంక్షేమరాజ్యం గురించి మాట్లాడేవారికి అదం టే ఏమిటో అసలు తెలియదు. సమానత్వాన్ని గురించి ఆలోచించేటప్పుడు, చారి త్రకమైన సమానత్వంతోపాటు సగుణ సమా నత్వం- నిర్గుణ సమానత్వాల పరస్పర సంబంధాల దృష్ట్యా కూడా సమానత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఈ రెండు రూపాలూ నిరంతరం పరస్పర సంబంధాలతో అవగాహన చేసుకు నేందుకు తోడ్పడేలా ఉండాలి అంటాడు లోహియా. సమానత్వానికి అనేక దశలు న్నాయి. ఉదాహరణకు సోవియట్‌ రష్యా లో ఇంతవరకు చరిత్రకందిన వాటికన్నా మహోన్నతంగా, మొత్తం జనాభా కంతటికీ, ప్రాథమిక విద్యను, మందులను అం దజేయడంలో గొప్పవిజయాన్ని సాధించారు. ప్రత్యేకించి విద్యారంగంలో, వైద్య రంగంలోనూ జర్మనీ, అమెరికా ఉన్నతస్థానంలో ఉన్నాయి. మొత్తం పశ్చిమ యూ రప్‌లో, అమెరికా అంతటాకూ డా అందరికీ కనీసం అన్నం వస్త్రాలు లభిస్తాయి.

ఈ దళిత ఆదివాసీ, వెనుకబడిన వర్గాలలో నిజమైన సామర్ధ్యం ఉన్నవారు కూడా అభివృద్ధి అవకాశాలు లభించక వెనుకబడిపోతారు. ద్వేషాగ్నిని బహుళంగా కురిపించగల ప్రసంగాలు చేసేవారు, వారిని దాటవేసి ముందుకు సాగిపోతారు. మానవజాతికి నష్టంవాటిల్లుతుంది. అందరి దృక్పధాలను, ప్రతిభా సామర్ధ్యాలను, ముఖ్యంగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలవారి ప్రతిభా సామర్ధ్యాలను పెంపొందించవలసిన ఆవశ్యకతపట్ల సమానత్వాన్ని సాధించడానికి కృషి చేసేవారు చాలా జాగ్రత్తపడవలసి ఉంటుంది. అసమానతల ఫలితాలను అనుభవిస్తూ సమా నత్వాన్ని వ్యతిరేకించేవారిపై పోరాటాన్ని కూడా గట్టిగా సలుపవలసి ఉంటుంది అంటాడు లోహియా.

ఒక దేశం లోపల, దేశ దేశాల మధ్య సమానత్వాన్ని క్రమం గా సాధించడం కష్టసాధ్యంగా కనిపిస్తున్నది. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని సాధించు కోగలిగినా కొనసాగించుకోవడం మరీ ఇబ్బంది కరం. మానవజాతి యావత్తూ సమానత్వం అనే మహోన్నత లక్ష్యాన్ని ఆధ్యాత్మికంగా స్వీకరిస్తే తప్ప, క్రమక్రమం గా సమానత్వ స్థాయిని సిద్ధించుకోవడం కర్తవ్యంగా భావిస్తేతప్ప- అసమానతల ద్వారా ఫలితాలను పొందుతున్న దేశాలూ, వర్గాలూ, వ్యక్తులు కూడా- వారి ఉని కికి పునాది అసమానత్వమే కావడంవల్ల, సంపూర్ణ సమానత్వ సాధన కృషికి అడ్డుపడుతూ ఉండగలరు. మానవజాతి చరిత్రలో సర్వత్రా, అపూర్వమైన మానవులు ఈ మార్గాన్ని అపూర్వంగా అనుసరించినవారు- ప్రహ్లాదుని నుంచి సోక్రటీసు, మహా త్మాగాంధీల వరకు ఉద్భవించారు.

jvratnakarఇటువంటి అపూర్వవ్యక్తులు అనుసరించిన, ఆచరించిన మార్గాన్ని అతి సామాన్యుడు కూడా ఎలా ఆచరించ వచ్చునో 20వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా చూశాం. వ్యక్తిగతంగా అంత ఎక్కువగా ఆచరించకపోయినా సామూహికంగా ఆచరించారు అంటాడు లోహియా. సౌభ్రాతృత్వం, పదార్ధపరమైన సమానత్వ భావనను వ్యక్తుల, కుటుంబాల పరిధి వరకే పరిమితంచేసుకొని పూర్వకాలంవారు మానవప్రకృతిని ఏవిధంగా ఉల్లంఘించారా అనీ, యావత్‌ మానవ కుటుంబానికి దీనిని ఎందువల్ల విస్తరిం చలేకపోయారాఅనీ ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు-ఆర్థిక సమానత్వం, సౌభ్రాత్రం, సమ భావనలతో బాటు విశ్వ సమైక్యతకు సంబంధించిన కవితల్ని వాస్తవంగా గానం చేసుకోవచ్చు అంటాడు లోహియా.

No comments:

Post a Comment