Wednesday, September 7, 2011

జోన్ల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు -దేవని సతీష్‌మాదిగ Andhra Jyothi 04/12/2010


జోన్ల వారీగా ఎస్సీ రిజర్వేషన్లు
-దేవని సతీష్‌మాదిగ

ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు. మాలలు తక్కువగా ఉన్నారు. అయితే విద్యా, ఉద్యోగ అవకాశాలు మాత్రం మాలలు అనుభవిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) 1994 నుంచి మాదిగ దండోరా ఉద్యమం నిర్వహిస్తోంది. '1999లో తెలుగుదేశం ప్రభుత్వం మాదిగల ఒత్తిడి మేరకు ఎస్సీ రిజర్వేషన్‌ను ఎ,బి,సి,డి గ్రూపులుగా రాష్ట్రాన్ని యూనిట్‌గా చేసి మాల, మాదిగ జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించింది. ఈ విధంగా రాష్ట్రంలో ఎస్సీ కులాలను నాలుగు గ్రూపులగా వర్గీకరించి 2004 వరకు అమలు చేసింది. ఎస్సీ వర్గీకరణ విధానం తప్పుడు పద్ధతిలో జరిగిందని సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టివేస్తూ 2004లో ఉత్తర్వులు ఇచ్చి ఏ విధానమైనా పార్లమెంటు ద్వారా చట్టసవరణతో జరపాలని తీర్పు ఇచ్చింది.

2001 రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ జనాభా లెక్కల ప్రకారం- ఒకటవ జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎ గ్రూపుగా విభజన పొందిన రెల్లి, మరో 12 కులాల జనాభా 1,27,943. వీరికి వర్గీకరణలో 1 శాతం అందింది. నిజానికి వీరికి న్యాయంగా నాలుగు శాతం రిజర్వేషన్ వాటా దక్కాలి, కానీ రాష్ట్రాన్ని యూనిట్‌గా చేయడం వల్ల వీరు నష్టపోయారు. ఇదే జోన్‌లోని మాదిగ, మరో 18 కులాలకు 7 శాతం కేటాయింపులు జరగడం వల్ల ఇక్కడ 1,59,035 జనాభా ఉన్న మాదిగలకు తమ జనాభాకు మించి వాటా పొందారు.

నిజానికి ఈ జోన్‌లో వీరికి 4 శాతం రావాలి. 3 శాతం ఎక్కువ పొందారు. ఇదే జోన్‌లోని మాల, మరో 25 కులాల జనాభా 5,35,060. వీరికి 6శాతం రిజర్వేషన్ వాటా కేటాయించా రు. ఈ జోన్‌లో మాదిగల జనాభాకు మించి నాలుగురెట్లు ఉన్న సి గ్రూపు మాలలకు 6 శాతం రావడంతో అన్యాయానికి గురయ్యారు. నిజానికి వీరికి జనాభా ప్రకారం 7 శాతం వాటా రావాలి. ఇదే జోన్‌లో ఆది ఆంధ్ర, మరో 4 కులాల జనాభా 21,725. వీరికి రిజర్వేషన్ వాటాలో 1 శాతం కేటాయించారు. వీరంతా మాల (ఆది ఆంధ్ర మాల) కులస్తులే.

రెండవజోన్‌లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు. ఈ జోన్‌లో ఎ గ్రూపు రెల్లి 12 కులాలకు 1 శాతం కేటాయించారు. బి గ్రూపు లో మాదిగ, మరో 18 కులాలకు 7 శాతం అమలైంది. ఇక్కడ వీరి జనాభా 7,12,439. ఇదే జోన్‌లోని సి గ్రూపు మాలలకు 6 శాతం వాటా లభించిం ది. వీరి జనాభా 10,63,776. ఈ జోన్‌లోని మాదిగల జనాభాకు మించి మూడు లక్షలు ఎక్కువగా ఉన్నారు. మాలలకు అన్యాయం జరిగిం ది. ఇదే జోన్‌లోని ఆదిఆంధ్ర మాల, మాదిగలకు 1శాతం వాటా వచ్చింది. వీరి జనాభా 6,43,990. డి గ్రూపులోని ఆదిఆంధ్రమాల వారికి 1 శాతం వాటా రావడం ఈ జోన్‌లో చాలా అన్యాయం జరిగింది. న్యాయంగా వీరి కి 5 శాతం వాటా రావాలి. రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్ సుప్రీంకోర్టు, హైకోర్టు గల్లి నుంచి ఢిల్లీ దాకా పదవులు పొందిన వారూ వీరే.

మూడవ జోన్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. ఈ జోన్ ఎ గ్రూపు రెల్లి 12 కులాల జనాభా 5,787. వీరికి వర్గీకరణలో 1 శాతం వచ్చింది. బి గ్రూపులోని మాదిగ, మరో 18 కులాలు ఈ జోన్‌లో 7,53,353. వీరికి కామన్‌గా 7 శాతం వచ్చింది. ఇదే జోన్‌లోని సి గ్రూపు కేటగిరిలో ఉన్న మాల, 25 కులాల జనాభా 9,03,205. వీరికి కామన్ వర్గీకరణలో వాటా 6 శాతం వచ్చింది. వీరిక్కడ మాదిగల జనాభాకు మించి లక్షన్నర ఎక్కువగా ఉన్నారు. నిజానికి వీరికి 8 శాతం అందాలి. ఉమ్మడిగా జరిగిన కామన్ వర్గీకరణలో ఈ జోన్‌లోని మాలలకు అన్యాయం జరిగిం ది. ఇదే జోన్‌లోని డి గ్రూపు జనాభా 43,830. వీరికి 1 శాతం వచ్చింది.

నాల్గవజోన్‌లో రాయలసీమలోని నాలుగు జిల్లాలు. ఈ జోన్‌లో రెల్లి 12 కులాల జనాభా 3,404. వీరికి కామన్ వర్గీకరణ వాటాలో 1 శాతం వచ్చింది. ఇదే జోన్‌లోని మాదిగ, మరో 18 కులాల జనాభా 9,88,458. వీరికి న్యాయంగా 7శాతం వాటా అందింది. అలాగే మాల 25 కులాల జనాభా 9,76,823. వీరికి కామన్ వర్గీకరణలో 6 శాతం న్యాయంగా అందింది. ఉమ్మడి వర్గీకరణ విధానంలో జరిగిన వర్గీకరణ ఫలాలు 4వ జోన్‌లో సక్రమంగా అందాయి. ఆదిఆంధ్ర, ఆది ద్రావిడ జనాభా 1,05,328. వీరికి 1 శాతం కేటాయించారు.

ఐదవ జోన్‌లో ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలున్నా యి. మేతర(పాకి) 12 కులాల జనాభా 12,530. వీరికి కామన్ ఎస్సీ వర్గీకరణ వాటాలో ఎ గ్రూపుగా 1 శాతం వాటా ఇచ్చారు. ఇదే జోన్‌లోని మాదిగ 18 కులాల జనాభా 15,88,737. వీరికి (బి) ఉమ్మడి వాటాలో 7 శాతం కామన్‌గా వచ్చింది. ఈజోన్‌లోని మాదిగల జనాభా నిష్పత్తి ప్రకా రం 11 శాతం రావాలి. కానీ ఉమ్మడి వర్గీకరణలో అన్యాయం జరిగింది. మాలల జనాభా 7,14,874. వీరికి కామన్ వర్గీకరణ వాటాలో వీరి జనాభాకు మించి 6శాతం అందింది. నిజానికి ఈ జోన్‌లో మాలలకు 3 శాతం రావాలి. ఈ జోన్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆదిఆంధ్రవారు, మితుల్ అమ్యాల్ వారు వచ్చి స్థిరపడ్డారు. వీరి జనాభా 5,900. వీరికి 1 శాతం కామన్ అందింది.

ఆరవ జోన్‌లో హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు. ఈ జోన్‌లో మేతర వారి జనాభా 8,178. వీరికి కామన్‌గా 1 శాతం అందింది. ఈ జోన్‌లోని మాదిగ 18 కులాల జనాభా 25,56,716. వీరికి కామన్ వర్గీకరణలో 7 శాతం వచ్చింది. నిజానికి వీరికి ఈ జోన్‌లో 13 శాతం రావాలి. ఈ జోన్‌లో మాదిగలకు తీరని అన్యాయం జరిగింది. ఇదే జోన్‌లో మాలల జనాభా 8,04,598. వీరికి కామన్ వర్గీకరణలో 6 శాతం వచ్చింది. ఆదిఆంధ్ర (వలస) ఇక్కడ స్థిరపడ్డ వారి జనాభా 4,925. వీరికి 1 శాతం అందింది. గత ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను జోన్ల వారీగా వర్గీకరణ జరపకుండా ఉమ్మడి పద్ధతిలో వర్గీకరణ చేశాయి. దీనివల్ల తెలంగాణలోని 5,6 జోన్లలోని మాదిగలకు వర్గీకరణలో చాలా అన్యాయం జరిగింది. అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలోని 1,2,3 జోన్లలోని మాలలకు చాలా అన్యా యం జరిగింది. ఈ 'తప్పుడు పద్ధతిలో వర్గీకరణ జరుగుతుంటే పట్టించుకోని వర్గీకరణ ఉద్యమనాయకులు తెలంగాణ మాదిగలకు ఐదేళ్లు తీరని అన్యాయం చేశారు'. ప్రస్తుతం ఈ వర్గీకరణ రద్దయింది.

సమైక్య రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టాలనుకుంటే ప్రాంతాల వారీగా జోన్ల పద్ధతిలో వర్గీకరణ జరపాలి. అందుకు ముందు రాష్ట్రంలో ఒప్పందం కుదిరిన తర్వాత వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. తెలంగాణ ప్రాంతంలో మాల మాదిగలకు చదువు లేని కారణంగా 1956 నుంచి 1980 వరకు సీమాంధ్ర మాల మాదిగలు తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల ఉద్యోగాలు చేస్తున్నారు. 30 ఏళ్ల అన్యాయా న్ని సరిదిద్దడానికి తెలంగాణలోని ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం రిజర్వేషన్‌ను 22 శాతానికి పెంచాలి.

-దేవని సతీష్‌మాదిగ

తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు

No comments:

Post a Comment