Sunday, September 25, 2011

గనుల టెక్నాలజీలో వెనకబడ్డాం! - ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్ Andhra Jyorthi 25/09/2011


గనుల టెక్నాలజీలో వెనకబడ్డాం!
- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

భారత ధరా గర్భంలో ఖనిజ నిక్షేపాలు ఎక్కడెక్కడున్నాయో అన్వేషించి తెలుసుకొనే సంస్థ జియలాజికల్ సర్వే ఇండియా. అయితే ఈ సంస్థ కార్యకలాపాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నేపథ్యంలో- మన దేశంలో గనులకు సంబంధించిన అంశాలపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరక్టర్ పి.వి.శేషారావుతో ఈ వారం ముఖాముఖి..

మన దేశంలోని గనుల స్థితిగతులు ఏమిటి?
ఒక సారి పంట పాడైయిందనుకుందాం. మళ్లీ పంట వేసుకుంటాం. గనులు అలాంటివి కాదు. ఖనిజాలు ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వెలికితీస్తే వాటి పని అయిపోయినట్లే. అందువల్లే అమెరికా, చైనా వంటి దేశాలు తమ దగ్గరున్న సహజవనరులను ఉపయోగించుకోవు. వాటిని పరిరక్షించుకుంటాయి. తమ అవసరాలకు ఇతరుల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. ఇక మన విషయానికి వస్తే- బాక్సైట్, బొగ్గు, ఇనుము మొదలైన ఖనిజాలు సమృద్ధిగానే ఉన్నాయి. వీటి కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. అయితే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే టెక్నాలజీ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం.

ఈ మధ్య కాలంలో గనుల అక్రమ తవ్వకాలు బాగా పెరిగిపోయాయి. వీటిని నియంత్రించటానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి మార్గాలున్నాయి?
దేశంలో ఉన్న ఖనిజసంపదపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. మన దేశంలో ఎక్కడెక్కడ ఏఏ ఖనిజాలు ఉన్నాయనే విషయంపై మన దగ్గర సమగ్ర సమాచారం ఉంది. బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయం నుంచి అనేక అధ్యయనాలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సర్వేలు చేశాయి. చేస్తున్నాయి.

దాని నివేదికల ఆధారంగానే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా గనుల తవ్వకాన్ని చేపట్టాయి. తమ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు కూడా ఇచ్చాయి. అయితే ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏఏ ప్రాంతాల్లో తవ్వుతున్నారు? వారి కార్యకలాపాలలో ఉన్న లోసుగులు ఏమిటనే విషయంపై సరైన నియంత్రణ లేదు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడిందని తేలింది. ఇలాంటి కంపెనీలు మన దేశంలో అనేకం ఉన్నాయంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది?
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ విధానాలలో ఎటువంటి సమస్య లేదు. కాని వాటిని అమలు చేయాల్సిన వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవటం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు ఓబులాపురం వ్యవహారాన్నే తీసుకుందాం. వాస్తవానికి ఓబుళాపురంలో నాణ్యమైన ఇనుప ఖనిజం దొరకదు. బళ్లారి, సాండూరు మొదలైన ప్రాంతాల్లో నాణ్యమైన ఖనిజం దొరుకుతుంది. అక్కడ నుంచి ఇనప ఖనిజాన్ని తవ్వి, దానిని ఓబులాపురంలో తవ్వినట్లు చూపించి అక్రమంగా రవాణా చేశారు. అంతే కాకుండా అడవుల్లో కూడా ఖనిజాన్ని తవ్వారు. లెక్క ప్రకారం ఇవన్నీ చట్టవిరుద్ధమైనవే.

ఇలాంటివి జరగకుండా చూడటానికి కొన్ని శాఖలు ఉన్నాయి. ఈ విషయం లో అవి కూడా సక్రమంగా పనిచేయలేదు. తవ్వకాల సమయంలో విధివిధానాలను వివరించాల్సిన బాధ్యత ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌ది. ఈ బ్యూరో వారే ప్రైవేట్ గని యజమానులు పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుం డా చూడాలి. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే భారీగా జరిమానాలు కూడా విధించవచ్చు. బ్యూరో ఈ మేరకు నివేదికలు తయారుచేస్తుంది. అయితే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో ఇవి జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ సంఘటనలో అన్నిస్థాయిలలోను లోపం ఉంది.

మన దేశంలో దొరికే ఇనుప ఖనిజంపై ఇతర దేశాలకు ఎందుకంత ఆసక్తి?
ఏ దేశం తన సహజ సంపదను వాడేసుకుందామని భావించదు. దానిని పరిరక్షించుకొని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఇక్కడ ఖనిజాన్ని శుద్ధిచేసే విషయంలో టెక్నాలజీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉంటే- ఆ దేశానికి అంత లాభం ఉంటుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో బయదెళ్ల అనే ప్రాంతంలో ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి.

వీటి నుంచి తవ్విన ఖనిజాన్ని గత రెండు మూడు దశాబ్దాలుగా జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు. జపాన్ వారు తమకు ఈ గనుల్లో దొరికే ఖనిజమే కావాలంటారు. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ దొరికే ఖనిజంలో కొన్ని అరుదైన ట్రేస్ ఎలిమెంట్స్ లభించటమే. ఈ ట్రేస్ ఎలిమెంట్స్‌ను ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దగ్గర ఇలాంటి ట్రేస్ ఎలిమెంట్స్‌ను వెలికితీసే టెక్నాలజీ లేదు. అంతే కాకుండా ముందు చెప్పినట్లు ఏ దేశం తమ వద్ద ఉన్న సహజ వనరులను వాడేసుకుందామని ప్రయత్నించదు.

గనుల విషయంలో మన రాష్ట్రం ఎలాంటి విధానాలు అనుసరిస్తోంది?
మన రాష్ట్రంలో గనులకు సంబంధించిన విషయాలలో పెద్దగా నియంత్రణ లేదు. అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుకుంటున్నారు. కర్నూలు, కడప, అనంతపురం- ఇలా అనేక ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు నంద్యాలకు సమీపంలో ముద్దవరం అనేక ప్రాంతంలో ఇనుప గనులు ఉన్నాయి.

వాటిని కొందరికి లీజుకు ఇచ్చారు. కాని వారు ఆ గనులలో తవ్వకాలు జరపరు. సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో తవ్వకాలు జరుపుతారు. అక్కడి నుంచి ఖనిజాన్ని తీసుకువచ్చి ఎగుమతి చేస్తారు. ఇలాంటి అక్రమ తవ్వకాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు తప్పనిసరైన చర్యలను కూడా చాలా మంది తీసుకోరు. ఒంగోలులోని చీమకుర్తి దగ్గర ఉన్న గనులు ఒక ఉదాహరణ. గనిని తవ్వినప్పుడు దానిలో నుంచి వచ్చే మట్టిని సమీపంలో ఉన్న కాలవలలో పోస్తారు. దీని వల్ల చెరువులు పూడుకుపోతాయి. రైతులకు సరిగ్గా నీరు అందదు. ఇలా చెప్పుకుంటే పోతే అనేక ఉదాహరణలు లభిస్తాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

No comments:

Post a Comment