Wednesday, September 21, 2011

నేతలే ద్రోహులు - జూలూరు గౌరీశంకర్ Andhra Jyothi 22/09/2011


నేతలే ద్రోహులు
- జూలూరు గౌరీశంకర్

ఉద్యమం తెగతెంపులదాకా వచ్చింది. తెలంగాణ ఇస్తరా? లేక చస్తరా? అన్న చివరి దశ దాకా వచ్చిన తండ్లాట ఇది. 700కు పైగా విద్యార్థులు ఆత్మబలిదానం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఇంజను ఆగకుండా ఉద్యమ ప్రస్థాన బండిని ముందుకు నడుపుతున్నారు. మిత్ర శత్రువుల, అంతర్గత శత్రువుల, స్వరాష్ట్ర ముఖం మోసుకుని వెన్నుపోటు పొడిచే నాయకా నాయకమణ్యుల మాటల మధ్య తెలంగాణ గాయపడ్డప్పుడల్లా ఆత్మాభిమానంతో ఆకుల్లారాలిపోతున్న బిడ్డల త్యాగం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇంత ఎర్రపడ్డది. విద్యార్థులు, యువతే ఈ ఉద్యమానికి వెన్నెముక అయ్యారు.

"విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా'' అన్న పాట చెవుల్లో ఇంకా గింగిరులుగా తిరుగుతూనే ఉంది. "కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు'' అన్న పాటను తెలంగాణ నేల మరువలేదు. జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, జనార్థన్, నాగరాజు, స్వర్ణలతలపై గద్దర్ రాసిన లాల్‌సలామ్ పాట ఇప్పటికీ ఈ నేలలో, కళాశాల మైదానాల్లో కొత్తగా చిగురిస్తూనే ఉంది. తెలంగాణలో బడులంటే, తెలంగాణ చదువులంటే ఎట్లుంటయో మా చుక్కా రామయ్య తన కళ్ళతో చూపిస్తూనే ఉన్నారు.

తెలంగాణకు అన్ని గాయాల్లాగే విద్యారంగంలో కూడా తీవ్రంగా గాయపడ్డది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలలో జరుగుతున్న దగా చూసినంక, ఎటు చూసినా తెలంగాణకు సావే. ఎట్లయిన మనం సచ్చుడే అన్న తెగింపుతో తెలంగాణ యువత ముందుకు పోతుంది. శ్రీకాంతాచారి అమరత్వం తెలంగాణ ఉద్యమాన్ని గడపగడపకు తీసుకుపోయింది. యాదయ్య మంటల్లో ఎగురుకుంటూ ఒక సింహపు పిల్లల్లా దూసుకువచ్చిన సంఘటన మొత్తం తెలంగాణను గుండెమండే విధంగా చేసింది.

ఒక కానిస్టేబుల్, ఒక రైతు, ఒకరా ఇద్దరా 700 మంది తెలంగాణ ముద్దు బిడ్డలు, ముక్కుపచ్చలారని బిడ్డలు, పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి, ఎందరెందరో దళిత బహుజన, గిరిజన, మైనార్టీ వర్గాల పిల్లలు చేసిన త్యాగాలే ఉద్యమ బలం. ఆత్మబలిదానాల దారుల్లో ఎగిసిన ఉద్యమం కదా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఆ 700 మంది బిడ్డల త్యాగం ఆ తల్లుల గర్భశోకం కదా ఈ నాయకులందరూ ఒక్కతాటిపైకి రావాలన్న ఊహకు కారణమైంది. ఢిల్లీ పీఠం కదిలింది. డిసెంబర్ 9 ప్రకటనకు కారణమైంది.

ఇంకా ఆత్మబలిదానాల రూపం మారితే మరింత ప్రమాదం తప్పేదేమో? విద్యార్థులు, యువత, ఉద్యోగులు లేకుండా తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాన్ని చూడలేం. కానీ ఈ సందర్భంలో అనేక ప్రశ్నలు ఉద్యమం ముందుకు వచ్చాయి. "సకల జనుల సమ్మె'' తెలంగాణ గుండె చప్పుడుగా ముందుకొచ్చింది. సకల జనం కదులుతున్నారు.

"సకల జనుల సమ్మె'' చివరి ఆయుధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాల్సిందే? దీనిలో మరోమాటకు తావేలేదు. కానీ పిల్లల చదువులు, ఆత్మ బలిదానాల సంగతేమిటన్నదే కళ్ల ముందున్న ప్రశ్న. ఇది చాలా సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్నను ఎట్లేసినా కొంత గందరగోళం తప్పదు. ఈ తేనెతుట్టెను ఎవరో ఒకరు కదపాలి. పిల్లల చదువు ఏమైపోతుంది? ఈ రస్తా ఎటువైపు అన్న ప్రశ్న వేసిన వారంతా జాతి ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా మారిపోదురు కాక మారిపోదురు.

నాలుగున్నరకోట్ల మంది ప్రజల గుండె గొంతుకల ముందు, ఆకాంక్షల ముందు ఒక తెలంగాణ కవిగా, ఒక చెకుముకి రాయిలాగా, "ఇది తెగతెంపుల సంగ్రామం. తెగిస్తేనే తెలంగాణ సాధ్యం'' అన్న అక్షర పంక్తులను రాసి విసిరిన కవిగా పిల్లల చదువు గురించి మాట్లాడితే, ఇక ఆత్మబలిదానాలను ఆపుదాం అని మాట్లాడితే. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి అపవాదు ముద్రలను పట్టుకుని ఎక్కడంటిస్తారోనన్న బాధ కూడా లేకపోలేదు.

తెలంగాణలో ఆత్మబలిదానాలను ఆపాలని ఎన్నెన్నో బహిరంగ సభల్లో చెప్పటం జరిగింది. అందుకోసం కూడా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయకతప్పలేదు. "మనం ఆత్మబలిదానాలు కాదు చేసుకోవాల్సింది, ఈ నేల ఇచ్చిన పోరాట స్ఫూర్తితో తెలంగాణకు అడ్డుపడే శక్తుల్ని తన్నితరిమేద్దాం'' అని ఆగ్రహంగా చెప్పటం జరిగింది. అయినా కానీ ఆత్మబలిదానాలు ఆగలేదు. ఇవి ఉపన్యాసాలు చెబితే ఆగవు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆగుతాయని ఎదురు సమాధానం చెప్పారు.

ఇపుడు సకలజనుల సమ్మె సందర్భంగా తెలంగాణ 10 జిల్లాలలో పసికందులైన ఒకటో తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి ఉన్నత చదువులు చదివే పిల్లల వరకు తెలంగాణను స్తంభింపచేస్తూ దండోరా వేస్తున్నారు. రోడ్లమీద ఆ పాలబుగ్గల పిల్లలు సకలజనుల సమ్మెలో "జై తెలంగాణ'' అంటూ నినాదాలు చేస్తుంటే ఒళ్లంతా పులకరిస్తుంది. ఇంకో పక్క చూస్తే నా తెలంగాణ సకల పార్టీల నాయకులు ఇంత దౌర్భాగ్యులా అనిపించింది. ఇలాంటి సన్నివేశాలను చూస్తూ తెలంగాణ నాయకుల ఆ ఐదువేళ్ళు నోట్లోకి ఎలా పోతున్నాయా? గొంతులోకి ముద్ద ఎలా దిగుతోందో? అని ఆశ్చర్యమేసింది.

రాష్ట్రంలోని ఒక భాగంలో చదువులు జరుగుతున్నాయి. ఆఫీసులు పనిచేస్తున్నాయి. అక్కడ పరిశ్రమలు నడుస్తున్నాయి. అక్కడి ప్రాంతం పిల్లలు పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందుతున్నారు. అక్కడ పిల్లల్ని చేతులు పట్టుకుని తల్లిదండ్రులు బడిదాకా పంపించి వస్తున్నారు. మరిక్కడ తెలంగాణలో పిల్లలు ఒంటిపై పెట్రోలు పోసుకుని దహించుకుపోతున్నారు. ఇక్కడి పిల్లలు ఉరితాళ్ళకు వేలాడుతున్నారు. ఇక్కడ తల్లులు కలత నిద్రలో ఉలిక్కిపడిలేచి మడతపడ్డ తల్లిపేగు కదిలి తల్లడిల్లుతున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ తెలంగాణ విశ్వవిద్యాలయాల చుట్టూ ఇనుప కంచెలు కట్టి పోలీసులు పహారా కాస్తున్నారు. వరంగల్‌లో విద్యార్థులను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారు. సింగరేణి సైరన్ మోగటం లేదు. సింగరేణిలో పెల్ల కదలటం లేదు. ఇక్కడ బడులకు తాళాలు పడ్డాయి. తెలంగాణ నాలుగున్నర కోట్ల మంది జనం సకల జనుల సమ్మెలో పిడికిలి బిగించింది. ఆ ప్రాంత నాయకులు సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. మరి మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? అధికార కుర్చీల్లోంచి కదలరేం? తెలంగాణ పిల్లలు తమ పుస్తకాలను విసిరేసి రోడ్డుపైకి వచ్చి "జై తెలంగాణ'' నినాదాలు చేస్తుంటే మరి తెలంగాణ మంత్రులు తమ విధులను నిర్వహిస్తున్నారు.

భావితరం కళ్లముందే రోడ్లపైకి ఎక్కినినదిస్తుంటే తమ మంత్రి పదవుల కుర్చీల పనుల్లో కూర్చునే ప్రజాకంఠక నేతలు తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండరేమో! ఒక్క తెలంగాణలోనే ఆ సిత్రం చూడగలుగుతాం. తెలంగాణ ఒక పక్క త్యాగాలతో నెత్తురు ముద్దవుతూ వుంది. ఇంకోపక్క తెలంగాణకు చెందిన కొద్దిమంది నాయకులు పదవుల కోసం ఎంత ద్రోహానికైనా సిద్ధపడుతున్నారు.

తన ప్రజలు తమ కళ్లముందు విలవిలలాడుతున్నా పట్టించుకోని నాయకులు నాయకులేనా? ఇప్పటికే సకల జనుల సమ్మె మొదలై బడులు, సింగరేణి గనులు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. ఇక బస్సులు, రైళ్లు ఈ నేల మీద నడవని స్థితి రాబోతుంది.ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వైద్యులంతా సమ్మెకు జైకొట్టారు. అయినా తెలంగాణ అధికార ముద్రల నేతలు మాత్రం కదలటం లేదు. ఇది దౌర్భాగ్యం.

అన్ని రంగాలను శాసించగల, అన్ని రంగాలను ప్రభావితం చేయగల విద్యారంగం తెలంగాణలో కుప్పకూలే దశ కూడా లేకపోలేదు. చదువులు అటకెక్కటం జరిగితే ఆ ప్రభావం మొత్తం ఆ తరం మీదనే చూపుతుంది. ఇన్ని త్యాగాలు చేస్తున్న విద్యార్థులను, తమ వ్యక్తిత్వ వికాసాన్ని ఎడమకాలితో తన్ని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న విద్యార్థులను తెలంగాణలో పలు పార్టీల రాజకీయనాయకులు తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇన్ని త్యాగాలు చేస్తున్న విద్యార్థులపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న దొంగలు కూడా తెలంగాణలో ఉన్నారు.

ఈ నేల కోసం ఇంత గొప్ప సాహసాలు చేస్తున్న రేపటి తరం యోధుల్ని, సాంకేతిక మానవ సంపదని గొంతునులిమి చంపుతున్న తెలంగాణ నాయకులే ప్రథమ ద్రోహులుగా బోనెక్కక తప్పదు. తెలంగాణ కోసం భిన్న ప్రకటనలు చేస్తూ, వాళ్ల ఇష్టం వచ్చినప్పుడు ఉద్యమ రథాలను కదిలిస్తూ తమ కోటల నుంచే తెలంగాణ రథ చక్రాలు కదులుతూ వస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ, అర్థం పర్థం లేని డెడ్‌లైన్‌లను పెడుతూ విద్యార్థుల బలిదానాలకు కారకులౌతున్న తెలంగాణ నేతలు మానవ హక్కుల కోర్టులో బోనెక్కించక తప్పదు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే? ఏదో ఒకటి తేల్చాల్సిందే? అందుకు ఇంకెంత మంది విద్యార్థుల్ని బలిపెడతారు. ఇంకెన్ని విద్యా సంవత్సరాల్ని ధ్వంసం చేస్తారో తెలంగాణ నేతలే చెప్పాలి. ఇందుకు సమాధానం అన్ని పార్టీలు చెప్పాలి. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. అన్ని పార్టీలు బాధ్యులే. తెలంగాణ విద్యార్థి వీరుల ఆత్మబలిదానాలను చాటుకుంటూ తెలంగాణ రాజకీయనేతలు చేస్తున్నదేమిటో తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు.

గోసిగుడ్డల అవ్వల కోసం, అయ్యల కోసం తెలంగాణ కావాలి. దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాలు శిరసెత్తుకుని నిలిచేందుకు తెలంగాణ కావాలి. తెలంగాణలో విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరగకుండా, ఇక్కడ పిల్లల చదువులు దెబ్బతినకుండా, మానవ విధ్వంసం జరగకుండా ఉండాలంటే తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు వెంటనే ఒక్కటవ్వాలి.

ఇక రాజకీయ జెండాలు పక్కనబెట్టి తెలంగాణ జెండా పట్టాలి. ఓ తెలంగాణ నాయకులారా! మీకు తెలంగాణ కావాలా? మీ రాజకీయపార్టీల జెండాలు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే కుర్చీలు కావాలా? తేల్చుకోండి. సీమాంధ్ర నేతలు, గుప్పెడు మంది పెట్టుబడిదారుల ద్రోహం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణకు తెలంగాణ నేతలు చేస్తున్న ద్రోహమే అస్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాదిమంది విద్యార్థి యువత జీవితాలతో ఆడుకుంటున్న తెలంగాణ రాజకీయుల్ని కాళోజీ చెప్పిన విధంగా ఎక్కడ పాతరెయ్యాలో అందుకు కాలమే ఎదురు చూస్తుందనుకుంటా! ద్రోహాల్ని ద్రోహాలుగా చెప్పకపోవటం కూడా ద్రోహాతి ద్రోహమే.

- జూలూరు గౌరీశంకర్
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేదిక

No comments:

Post a Comment