Tuesday, September 6, 2011

బహుజన దార్శనికుడు ఉ.సా -కత్తి పద్మారావు Andhra Jyothi 02/20/2011


బహుజన దార్శనికుడు
-కత్తి పద్మారావు

ఉ.సా.కు అప్పుడే 60 ఏళ్లు పూర్తవుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. సమకాలీన సామాజిక ఉద్యమాలన్నింటా క్రియాశీల ఉద్యమకారుడిగా పాలుపంచుకొంటున్న తీరు చూస్తే అలా అనిపించదు. అరవై ఏళ్లలో నలభై ఏళ్ల సుదీర్ఘకాల ఉద్యమ జీవితం ఆయనది. ఉద్యమకారుడిగా, కవిగా, రచయితగా, సాంస్కృతికోద్యమకారుడిగా, ఆర్గనైజర్‌గా, రాజకీయ దార్శనికుడిగా, సామాజిక సిద్ధాంతకర్తగా ఒక్కమాటలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉ.సా. గుర్తింపు పొందారు.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన సామాజిక, సాంస్కృతి క, రాజకీయ పరిణామాలను వేగవంతం చేయడంలో కీలకపాత్ర వహించా డు. బి.సి.లలో మేధోరంగాన్ని పరిపుష్టం చేయటంలో కంచ ఐలయ్య, బి.ఎస్. రాములు, ప్రొ. చక్రధర్, ప్రొ. మనోహర్, ప్రొ. సింహాద్రి లాంటి వారు సమాజాన్ని చైతన్యపరిచే కృషి చేసినట్టే ఉ.సా. మేధోకృషి పాటు ఉద్యమకారుడిగా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని సమకూర్చే ఉద్యమ ఉపాధ్యాయుడిగా బహుముఖ కృషి చేశాడు. ఉ.సా.తో నా సాన్నిహిత్యానికి ఆయన పట్ల నా అభిమానానికి రెండు కారణాలున్నాయి.

ఒకటి హేతువాదం, మరొకటి దళిత బహుజనవాదం. ఉ.సా. గ్రామం బ్రహ్మణకోడూరు మా గ్రామానికి చాలా దగ్గర. మాది ఒకే మండలం. పొన్నూరు. మేమిద్దరం చార్వాక భౌతికవాద తాత్విక స్ఫూర్తితో రామకృష్ణ స్థాపించిన చార్వాక పీఠం పాఠశాల నుంచి వచ్చిన వాళ్లం. మార్క్స్, ఫూలే, అంబేడ్కర్ ఆలోచనా విధానాల్ని అధ్యయనం చేసినవాళ్లం. నేను హేతువాద శిబిరంలో పనిచేస్తున్నప్పుడే ఉ.సా. హేతువాదం నుంచి ఎం.ఎల్. విప్లవోద్యమంవైపు మళ్లాడు. అక్కడ కూడా కులవివక్ష ఉందని గ్రహించి, దళితమహాసభ మలుపు తిప్పిన కారంచేడు ఉద్యమంతో కనువిప్పు కలిగి కులవివక్షా వ్యతిరేక కులనిర్మూలనా పోరాటంవైపు వచ్చా డు. ఇద్దరం కులనిర్మూలనావాదులమే కనుక కారంచేడులో కలిశాం.

1985 జూలై 17న కారంచేడు సంఘటన జరిగిన రెండు నెలలకు అక్టోబర్ 6న విజయవాడ గాంధీ హైస్కూల్‌లో జరుగుతున్న దళిత మహాసభ మీద పోలీసులు లాఠీచార్జీ చేసి దళిత నాయకత్వాన్ని అరెస్టు చేశారు. ఈ లాఠీచార్జీని, అరెస్టులను ఖండించాలని తాము పనిచేస్తున్న విప్లవ సంస్థని ఉ.సా., పౌరహక్కుల సంఘాన్ని కంచ ఐలయ్య పట్టుబట్టారు. ఆయా సంస్థల అగ్రకుల నాయకులు అయిష్టంగా ఖండించినా 'కారంచేడు హరిజనులపై హరిజన నాయకులపై భూస్వాముల, పోలీసులదాడి' అని అగ్రకు ల దురహంకారాన్ని కప్పిపుచ్చి పక్షపాతం చూపారు.

ఆ రకంగా వారి కులాతీతవాదం బండారం బైటపడటంతో ఉ.సా., ఐలయ్య లాంటి వారెందరికో కారంచేడు కనువిప్పు కలిగించింది. గద్దర్ 'దళిత పులులమ్మ', గూడ అంజ య్య 'ఊరు మనది వాడ మనది', వంగపండు 'ఉందర్రామాలపేట' పాట లు రాశారు. ఉ.సా. 'దళితమాత' లాంటి పాటలతో పాటు 'దళిత రణన్నిదాదం' పేరిట 25 ఏళ్ల దళిత ఉద్యమ చరిత్ర రికార్ట్ చేశాడు. వీరంతా వర్గ-కుల దృక్పథం అర్థమయ్యేలా పాటలు రాశారు. దళిత మహాసభతో పాటు విప్లవ శిబిరంలోని ఉ.సా., కె.జి.సత్యమూర్తి, ఐలయ్య లాంటి వారి కృషి ఫలితంగా ఫూలే, అంబేడ్కర్ ఆలోచనా విధానం మార్క్సిస్టు శిబిరంలోకి బాగా విస్తరించింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమ చరిత్రలో వీరిది గొప్ప కంట్రిబ్యూషన్.

ఉ.సా. గొప్ప రచయిత. తెలుగు భాష మీద మంచి పట్టున్న వ్యాఖ్యాత, విశ్లేషకుడు. మార్క్సిజం మీదేగాక ఫూలే అంబేడ్కర్ ఆలోచనా విధానం మీద కూడా లోతైన అవగాహన ఉన్న మార్క్స్-ఫూలే-అంబేడ్కరైట్. ఫూలే శత వర్ధంతి (1990), డా. బి.ఆర్. అంబేడ్కర్ శతజయంతి (1991) సందర్భంగా ఉ.సా. రాసిన ఎదురీత సంపాదకీయమే అందుకు నిదర్శనం. ఉ.సా. మంచి వక్త. సంక్లిష్ట సిద్ధాంతాన్ని సైతం సరళమైన భాషలోకి అనువదించిన నినాదాలుగా మార్చి ప్రజలకందించగల ఉద్యమాల ఉపాధ్యాయుడు. మహానీయుల మాటల్ని తత్వవేత్తల తత్వాల్ని తనమాటల్లో, రాత ల్లో సమకాలీనం చేసే వర్తమాన తత్వవేత్త. అందుకే ఈ ఉద్యమాల ఉపాధ్యాయుడికి రాష్ట్రవ్యాప్తంగా శిష్యగణం ఉంది. ఆయన తన భావాలను విత్తనాల్లా అలా వెదజల్లుతూ వెళుతుంటే అవి మొలకెత్తుతూ పోతుంటాయి.

అలా మొలకెత్తిన ఒకానొక విత్తనమే వివ్లవ కిశోరం మారోజు వీరన్న. ఉ.సా.తో వీరన్నకు ఉన్న సిద్ధాంత సాన్నిహిత్యం చరిత్రాత్మకమైనది. వీరన్న నాతో కూడా చర్చించేవాడు. మార్క్సిజంతో పాటు ఫూలే-అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని విస్తృత ప్రజాశ్రేణులలోకి తీసుకెళ్లటం ద్వారానే ఇండియా లో సామాజిక ప్రజాస్వామ్య విప్లవం విజయవంతం అవుతుందని వీరన్న తో చర్చించేవాడ్ని. వీరన్న తన విప్లవ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసుకోవడానికి ఉ.సా., చార్వాక పీఠం రామకృష్ణ, కంచ ఐలయ్య, ఈ ముగ్గురితో ఎక్కువగా చర్చించేవాడు.

ఈ దేశంలో కుల నిర్మూలనా పోరాట 'ఎజెండా ని పక్కదారి పట్టించి ఎర్రజెండాని ముందుకు తీసుకువెళ్లలేరు' అని చాటి చెప్పిన ఉ.సా. గుణ 'పాఠాన్ని' బాగా వంట పట్టించుకొన్న వ్యక్తి వీరన్న. కనుకనే ఇండియా విప్లవాన్ని కుల-వర్గ బాట పట్టించడంలో చరిత్ర సృష్టించారు. అందుకే ఎం.ఎల్ మూవ్‌మెంట్‌లో కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి లాంటి వర్గవాద విప్లవనాయకుల కంటే మారోజు వీరన్న చాలా భిన్నమైన గొప్ప విప్లవనాయకుడు.

ఎం.ఎల్ విప్లవ శిబిరంలో ఫూలే-అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని విస్తరింపచేయడంలో ఆ శిబిరం కేడర్‌కు ఉ.సా. ఓ ఉపాధ్యాయుడు. అంతేకాదు కార్యాచరణకు మార్గం చూపే క్రియాశీల మార్గదర్శి. దశ, దిశ నిర్దేశక పరిణామక్రమాన్ని విశదీకరించి చెప్పే దార్శనికుడు. ఉ.సా. ఇంగ్లీషు మాద్యమంలోకి వెళ్లగలిగితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్త సిద్ధాంతకర్తగా గుర్తించబడేవారు. ఉపాధ్యాయుడికి, దార్శనికుడికి గాని దూరదృష్టి అవసరం. వర్తమాన కాలంతోపాటు భవిష్యత్ కాలానికి కూడా వర్తించేలా బౌద్ధ బోధనల్లా వారి బోధనలు ఉండాలి.

వాగ్గేయకారుడు తత్వవేత్త అయితే శాశ్వతత్వం ఉంటుంది. ఎక్కువ ఎక్కడ ఉద్యమం నిర్మించినా తన మాటలతో పాటు పాటలతో జనాదరణ పొందే ఉ.సా. గాని, ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌గాని వారి సిద్ధాంత తత్వాలకన్నా, వాగ్గేయ తత్వాన్నే ప్రజలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. వారి వాదనల్లో తల్లివేదన కనిపిస్తుంది. కొన్ని తత్వాలు బోధించనక్కరలేదు. జీవన గమనంలోనే అవి ప్రతిఫలిస్తాయి.

నేను ఖమ్మంలో ఓ సభకు ముందే వెళ్లి కూర్చున్నాను. అప్పుడు 'జోలా లీ పాడాలీ' అని ఒక పాట వినిపించింది. 'పొలం నుంచి రమ్మని', పాలిచ్చి పొమ్మనీ, అమ్మనీ రమ్మనీ, కాకితో.. కబురంపానూ.. ఆ కాకి చేరలేదో, నా కబురు అందలేదో కామందు పంపలేదో, మా అమ్మ రానేలేదూ.. ఆకలేసి గుక్కబడితే ఏం చెయ్యాలి? పాప ఎక్కి ఎక్కి ఏడిస్తే ఏం చెయ్యాలి? నేనేం చెయ్యాలి?' అనే పాట విన్నప్పుడు నా కళ్లు చమర్చాయి.

మా అమ్మ కూలిపనికి వెళ్లినపుడు మా చెల్లి మా చిన్న తమ్ముడ్ని ఎత్తుకొని ఆడించేటప్పుడు వాడు ఆకలేసి తల్లిపాల కోసం వెక్కివెక్కి ఏడ్చే ఘటన నా కళ్లముందు అలా కదులాడింది. ఉ.సా. రాసిన జోలాలి పాట విన్నప్పుడు ఈ దృశ్యం గుర్తొచ్చి నా హృదయం ద్రవించింది. శ్రామిక కులాల నుంచి వచ్చిన ఉ.సా. లాంటి వారు తప్ప శ్రమైక జీవనంతో సంబంధంలేని ఏ బ్రాహ్మణ కవీ ఇలాంటి పాట రాయలేదు, రాయలేడు. గద్దర్, వంగపండు, గోరటి వెంకన్న లాంటి వారు వివిధ దశల్లో సమాజాన్ని ఉత్తేజపరిచే పాటలు రాయటమేకాదు, ఆడి పాడే తాత్విక కళాకారులు, బోధకులు. వీరికున్నంత శిష్యగణం ముఖ్యమైన నాయకులకేలేదు.

తత్వశాస్త్రాన్ని విస్తృతం చేయడానికి, బ్రాహ్మణ సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలంటే సంత్ రవిదాస్‌లాగా, నారాయణ గురులాగా బోధకులు, తాత్వికులు శిష్యులతో కలిసి మెలసి సహపంక్తి భోజనం చేసే బౌద్ధ సమష్టి తత్వాన్ని అలవర్చుకోవాలి. బ్రాహ్మణేతర ప్రత్యామ్నాయ సంస్కృతిని విస్తృతం చేయడం కోసం బ్రాహ్మణిజాన్ని ఎదిరించి పోరాడిన చార్వాకం, బౌద్ధం, ఫూలే-అంబేడ్కర్ ఆలోచనా విధానాల్ని పెంపొదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనేక సందర్భాల్లో ఉ.సా. రాసిన వ్యాసాల్లో, నేను రాసిన వ్యాసాల్లో ఒకే తాత్విక భూమిక కనిపించేది. అదే చార్వక తాత్విక భూమిక. ఆ విషయాన్ని ఇరువురం గ్రహించి ఒకరికొకరం గుర్తు చేసుకొంటుటాం. నా పట్ల ఉ.సా.కు, ఉ.సా. పట్ల నాకు కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై నా, దళిత మహాసభ నాయకుడిగా, నూతన సామాజిక దళిత ఉద్యమానికి నాంది పలికి చరిత్ర సృష్టించిన వాడిగా నా ప్రస్తావనని తనమాటల్లో రాత ల్లో ఉ.సా. అనేకసార్లు కొనియాడేవాడు.

ఆ విషయాన్ని అనేకసార్లు నాతో మాట్లాడేవారు. నేను కూడా ఉ.సా. ఎడల అలాంటి విమర్శనాత్మక వైఖరినే ప్రదర్శిస్తూ అనేక విషయాలపై, అనేక సందర్భాల్లో సంభాషణ జరిపే మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నాను. దళిత బహుజన సంస్కృతి వర్ధిల్లడం కోసం బహుజన రాజకీయ ప్రత్యామ్నాయం ఫలించడం కోసం రాబోయే కాలంలో ఐక్యకార్యాచరణ చేపట్టే తరుణం ఆసన్నమైంది. ఇలాంటి రాజకీయ విప్లవ ఐక్యకార్యాచరణే నేటి సామాజిక ప్రజాస్వామ్య విప్లవ మార్గం. అందుకే ఉ.సా.తో మిత్రత్వం నేటి వర్తమాన చారిత్రక నిర్దేశం.
-కత్తి పద్మారావు
దళిత మహాసభ అధ్యక్షులు
(నేడు రవీంద్రభారతిలో ఉద్యమాల ఉపాధ్యాయుడు 'ఉ.సా. జీవిత సాఫల్య పురస్కార సభ' సందర్భంగా)

No comments:

Post a Comment